Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉద్యోగాల క్లౌడ్

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్లు, అప్లికేషన్లు పుట్టుకొస్తున్నాయి. కంపెనీలు తమ డేటాను భద్రపరచుకోవడానికి అధిక పరిమాణంలో 'స్పేస్' అవసరమవుతోంది. అంత డేటాను ఒకే చోట ఉంచడం వల్ల సర్వర్ల పనితీరు మందగిస్తుంది. కొన్నిసార్లు ముఖ్యమైన సమాచారం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. తక్కువ స్పేస్ ఉపయోగించాలి.. కానీ ఎక్కువ సమాచారాన్ని భద్రపరచాలి, అది కూడా సురక్షితంగా ఉండాలి.. ఆర్థికంగా భారం కాకూడదు.. మరి ఎలా? వీటన్నింటికి పరిష్కారమే క్లౌడ్ కంప్యూటింగ్..!
క్లౌడ్ కంప్యూటింగ్ అంటే... స్టోరేజ్/ అప్లికేషన్‌లను సంస్థలు సులభంగా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేది. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే విద్యుత్‌ను ఎలా వినియోగించుకుంటామో అలా ఇంట్లో/ కార్యాలయంలో ప్రత్యేకమైన వ్యవస్థ ఏమీ ఏర్పాటు చేయకుండా కావాల్సిన సమాచారం/ అప్లికేషన్లను ఉపయోగించుకోవచ్చు.
* క్లయింట్లు తమ అవసరాలకు అనుగుణంగా సమాచారం ఉపయోగించుకునే అవకాశం ఉండటం క్లౌడ్ కంప్యూటింగ్‌లో ముఖ్యమైన సౌలభ్యం. దీనివల్ల కంపెనీలు/ క్లయింట్లు డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన పని ఉండదు. ఎంత వాడుకుంటే అంత వరకే చెల్లించాల్సి ఉండటం కంపెనీలకు ఆర్థికంగా కలిసి వచ్చే అంశం. దీంతో ఈ రంగం భారీగా విస్తరిస్తోంది. సంబంధిత నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

భవిష్యత్తు అంచనా...
* 2016 నాటికి ప్రపంచవ్యాప్త డిజిటల్ కంటెంట్‌లో మూడోవంతు క్లౌడ్‌లో నిక్షిప్తం కానుందని ఫోర్బ్స్, సిస్కో, ఫారెస్టర్, గార్టనర్ సంస్థల అంచనా. 2020 నాటికి ఎక్కువ మంది వినియోగదారులు వెబ్ ఆధారిత అప్లికేషన్ల వైపు మొగ్గు చూపుతారని ఫారెస్టర్ కంపెనీ అంచనా వేస్తోంది.
* డిజిటల్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వినియోగదారులను ఆకర్షించేందుకు అవసరమైన అత్యుత్తమ మార్గాలను క్లౌడ్ కంప్యూటింగ్ అందిస్తోంది. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్ కారణంగా సర్వర్లను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా కావాల్సిన సమాచారాన్ని చూసుకునే వీలుంది. ఈ పరిణామాలు డిజిటల్ మార్కెట్‌రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నాయి.
ఎందుకీ క్లౌడ్ కంప్యూటింగ్...?
వివిధ రకాల కంపెనీలు విభిన్న కారణాల వల్ల క్లౌడ్ కంప్యూటింగ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. అవేమిటంటే... అనేక రకాల పరికరాల్లో (డివైస్) ఉపయోగించుకోవడం వీలవడం, అదనపు భద్రత, తక్కువ ఖర్చు.
* క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పటికీ కొత్త అంశమే. కాబట్టి పోటీలో తట్టుకోవాలంటే క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఎంత ఎక్కువ వీలైతే అంత నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను వినియోగించుకోవడానికి వీలుగా ఇంటర్నెట్ మార్కెటింగ్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. లేదా కన్సల్టెంట్లను ఆశ్రయిస్తున్నాయి.

క్లౌడ్ విభాగాలు...
క్లౌడ్ కంప్యూటింగ్‌లో మూడు ప్రధానమైన సేవల విభాగాలు ఉంటాయి. మనం ఎలాంటి అప్లికేషన్లను ఉపయోగించాలనుకుంటున్నామనే దాన్ని బట్టి విభాగాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
* Software as a Service (SaaS): దీన్నే ఆన్ డిమాండ్ సాఫ్ట్‌వేర్ అని కూడా పిలుస్తున్నారు. ఈ పద్ధతిలో కంపెనీలకు అవసరమైన లైసెన్స్ సాఫ్ట్‌వేర్‌ను ప్రొవైడర్ అందిస్తారు. ఇది కంపెనీలకు చాలా మేలు చేస్తోంది. సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన అప్‌డేట్స్ గురించి, సిస్టమ్ రక్షణ (సెక్యూరిటీ) గురించి ఆందోళన చెందకుండా నిశ్చింతగా ఉండొచ్చు. అవన్నీ ప్రొవైడర్ బాధ్యత కాబట్టి ఆ సంస్థలో పని చేసే ఉద్యోగులకు పని భారం కూడా తగ్గుతుంది. క్లౌడ్ ఆధారిత సేవలు కావడంతో మొబైల్ అప్లికేషన్లతో అనుసంధానం కూడా చేసే వీలుంది.
* చిన్న కంపెనీలకు ఫేస్‌బుక్, ట్విటర్ లాంటి సమాచార మాధ్యమాలు, డ్రాప్‌బాక్స్ లేదా గూగుల్ డ్రైవ్ ద్వారా ఈ సేవలు లభిస్తాయి.
* క్లౌడ్ సర్వీసెస్‌లో Saas తోపాటు Infrastructure as a Service (IaaS), Plotform as a service (PaaS) అనే మరో రెండు సేవలు చాలా ప్రాచుర్యం పొందాయి.
* Iaas: ఇది హార్డ్‌వేర్ సంబంధిత వనరుల కొనుగోలుకు ఉపయోగపడుతుంది. అయితే చిన్న సంస్థలు ఎక్కువగా దీన్ని ఉపయోగించడం లేదు.
* PaaS: ఇది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌లో ప్రముఖమైంది, ఒక బృందం తాము రూపొందించిన అప్లికేషన్‌ను అవసరమైన వినియోగదారులకు అందుబాటులో ఉంచుతారు. ఆ అప్లికేషన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా కంప్యూటర్లను నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తారు. గూగుల్ యాప్ ఇంజిన్, ఫోర్స్.కామ్ దీనికి ఉదాహరణలు.

కొన్ని క్లౌడ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు
* ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ (అమెజాన్ వెబ్ సర్వీసెస్)
* గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ క్లౌడ్ అకాడెమీ
* మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సర్టిఫికేషన్స్
* ఐబీఎం సర్టిఫైడ్ సొల్యూషన్ అడ్వైజర్ - క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్
* ఐబీఎం సర్టిఫైడ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ - క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
* VMware సర్టిఫైడ్ ప్రొఫెషనల్ (వీసీపీ)
* సర్టిఫైడ్ క్లౌడ్ ప్రొఫెషనల్ (సీసీపీ)
* ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఉద్యోగంలో చేరాక లేదా సొంతంగా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నవారే. అయితే ఇప్పుడిది బహుళ ప్రాచుర్యం పొందడంతో ఆయా సంస్థలు సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేసినవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ రంగంలో మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతనం పొందాలంటే తాజా మార్పులను బట్టి కొత్త ప్రోగ్రామ్‌లను రూపొందించగలగాలి.
* ఇప్పుడున్న పోటీ యుగంలో క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలను అలవరచుకుంటే కెరియర్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. ట్రెయినింగ్, సర్టిఫికేషన్ ప్రోగ్రాముల ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్న ఐటీ విద్యార్థులకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఈ రంగంలో స్థిరపడాలంటే అందులో వచ్చే మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. కష్టపడే మనస్తత్వం, తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోరుకునే వారు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కెరియర్‌ను ఎంచుకోవచ్చు.

క్లౌడ్ కంప్యూటింగ్‌లో దిగ్గజాలు
అమెజాన్ వెబ్:
* అమెజాన్ సంస్థ 'అమెజాన్ వెబ్ సర్వీసెస్' (ఏడబ్ల్యూఎస్) పేరుతో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తోంది. ఈ సంస్థ 2006 లోనే క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అమెజాన్ అమ్మకాల్లో 9 శాతం వాటా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలదే.
* అమెజాన్ అందించే సేవల విస్తృతి, బిల్లు చెల్లింపులో ఉన్న వెసులుబాటు వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని సంస్థలు వాటిని వినియోగించుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ఎక్స్‌పీడియా, ఎడోబ్ లాంటి సంస్థలు అమెజాన్ వెబ్ సర్వీసెస్‌ను ఉపయోగిస్తున్నవే. చిన్న సంస్థలకు తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన సేవలు పొందే అవకాశం కల్పిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్లౌడ్ ప్రొవైడర్లలో అత్యంత ఆదరణ పొందుతోంది.
* మైక్రోసాఫ్ట్ అజ్యూర్: మైక్రోసాఫ్ట్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తోంది. గతేడాది అజ్యూర్ క్లౌడ్ కంప్యూటింగ్ వ్యాపారం 100 శాతం పెరిగింది. ఈ సంస్థకు చెందిన ఆఫీస్ 365, దాని అప్లికేషన్లు వ్యాపార రంగంలో ఉన్న అన్ని సంస్థలకు సుపరిచితమైనవే.
* 3M, బోయింగ్‌తో సహా ఫార్ఛ్యూన్ 500 సంస్థల్లో దాదాపు 80 శాతం సంస్థలు అజ్యూర్‌ను వినియోగిస్తున్నాయి. ఎయిర్‌క్రాఫ్ట్‌ల నిర్వహణ, ఇంధన వినియోగాన్ని తగ్గించడం లాంటి అవసరాల కోసం బోయింగ్ అజ్యూర్ సేవలను ఉపయోగించుకుంటోంది. బీఎండబ్ల్యూ, హెయిన్‌కెన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ప్రచార అవసరాల కోసం అజ్యూర్‌ను వినియోగిస్తున్నాయి.
* గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్: అంతర్జాలంలో అతి పెద్ద సెర్చ్ ఇంజిన్‌గా పేరొందిన గూగుల్ విస్తృతమైన క్లౌడ్ సంబంధిత సేవలు అందిస్తోంది. అయితే, క్లౌడ్ కంప్యూటింగ్ సేవల విషయంలో మాత్రం అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో పోలిస్తే పోటీలో కొంత వెనకబడిందనే చెప్పాలి!

క్లౌడ్‌కంప్యూటింగ్ నిపుణులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న సంస్థలు ఇవే...
* అమెజాన్
* మైక్రోసాఫ్ట్
* డెలాయిట్
* లాక్‌హీడ్‌మార్టిన్
* నార్త్‌రాప్ గ్రూమన్
* ఎక్స్‌పిన్‌ఫో
* సీఎస్‌సీ
* జనరల్ డైనమిక్స్
* ఐబీఎం
* జేపీ మోర్గాన్ చేజ్
* డెల్
* ఏటీ అండ్ టీ
* ఇంటెల్
* యాపిల్
* లీడోస్

గత అయిదేళ్లలో బ్యాంకింగ్, కమ్యూనికేషన్, ఇన్సూరెన్స్, రిటైల్, తదితర రంగాల్లో క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. సంబంధిత పరిశోధన సంస్థల అంచనా ప్రకారం వివిధ రంగాల్లో సగటున ఏటా ఉద్యోగ అవకాశాలు పెరిగిన తీరు (శాతాల్లో) ...
బ్యాంకింగ్- 27.4
కమ్యూనికేషన్/ మీడియా- 31.6
మాన్యుఫ్యాక్చరింగ్- 28.8
ఎడ్యుకేషన్- 29
ప్రభుత్వం- 26.3
హెల్త్‌కేర్- 26.3
ఇన్సూరెన్స్- 27.7
ప్రాసెస్‌మాన్యుఫ్యాక్చరింగ్- 25.9
రిసోర్స్ ఇండస్ట్రీస్- 32.7
రిటైల్- 24.2

- వీర్ఆంజనేయ నాగరాజు (సీఈఓ, హదూప్ కన్సల్టెంట్ అండ్ కోచ్)


Back..

Posted on 24-11-2016