Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
అల.. మేఘాలవీధిలో..!

* కెరియర్‌ గైడెన్స్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌

ఫేస్‌బుక్‌ స్టేటస్‌ మార్చారు.. వాట్సాప్‌ చూసి స్మైలీ పెట్టారు.. ఆన్‌లైన్‌లో వీడియో చూశారు.. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేశారు.. షాపింగ్‌ చేద్దామని కాసేపు వెబ్‌లో వెతికారు.. ఇలా ఏదో ఒకటి నిమిషానికో.. గంటకో.. కనీసం రోజులో ఒకసారో చేస్తూనే ఉంటారు. అంటే క్లౌడ్‌ టెక్నాలజీని వాడుతున్నట్లే. తెలియకుండానే చాలామంది ప్రతి రోజూ అలా మేఘాల్లోకి వెళ్లి అక్కడి సాంకేతిక సౌకర్యాలను వినియోగించుకొని వస్తుంటారు. ఇదంతా చూస్తే క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అందరి జీవితాల్లో ఎంత విడదీయలేని బంధంగా మారిపోయిందో అర్థమవుతుంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థనూ, ప్రజల జీవనశైలినీ, అధునాతన టెక్నాలజీల అభివృద్ధిక్రమాన్నీ ప్రభావితం చేస్తున్న ఈ రంగంలో ఇప్పుడు ఉద్యోగావకాశాలు వేగంగా పెరుగుతున్నాయి.

సంప్రదాయ పద్ధతిలో కంప్యూటర్‌లో ఉన్న డేటా లేదా ప్రోగ్రామ్‌ వంటి వనరులను భద్రపరచడానికి ఖరీదైన సర్వర్లు, కంప్యూటర్‌ వ్యవస్థ, నెట్‌వర్క్‌, సాఫ్ట్‌వేర్‌ అవసరమవుతాయి. అవేవీ లేకుండా, వినియోగదారులు ఈ వనరులన్నీ వాడుకోడానికి, వాడుకున్న మేరకే డబ్బులు చెల్లించడానికి ఒక సౌకర్యం అందుబాటులో ఉంది. ఆ సేవలను చౌక ధరలకే వేగంగా, సమర్థంగా పొందవచ్ఛు దీనితోపాటు, భద్రమైన మార్గాలలో డేటా దాచుకోవచ్ఛు కంప్యూటర్‌లో హార్డ్‌డిస్క్‌ అవసరమూ ఉండదు. ఇలాంటి వ్యవస్థనే ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ అంటారు.

ఎలాంటి ఉద్యోగాలు?
క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో ప్రధానంగా ఈ కిింది ఉద్యోగావకాశాలు ఉంటాయి.
క్లౌడ్‌ అడ్మినిస్ట్రేటర్‌: సిస్టమ్‌ మేనేజ్‌మెంట్‌, సమస్యల పరిష్కారం (ట్రబుల్‌ షూటింగ్‌), వాస్తవీకరణ (వర్చువలైజేషన్‌) వంటి అంశాలపై పట్టు అవసరం. లైనక్స్‌ లాంటి ఆపరేటింగ్‌ సిస్టంలపై అవగాహన ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజిలో ప్రవేశం ఉంటే మంచిది. సిస్టం అడ్మినిస్ట్రేషన్‌, నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ టూల్స్‌ బాగా తెలిసుండాలి. కనీసం అయిదు సంవత్సరాల అనుభవం ఉండాలి. మానవ సంబంధాల నిర్వహణ సామర్థ్యం అవసరం.
క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌: ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాల రచన, ఆకృతీకరణ (కాన్ఫిగరేషన్‌) వీరి ప్రధాన బాధ్యత. క్లౌడ్‌ నేపథ్యంలో సంస్థల ప్రస్తుత అవసరాలు, భవిష్య ప్రణాళికల పట్ల దూరదృష్టి, అందుకు తగిన రచన, నిర్మాణ బాధ్యతలను గుర్తించి నిర్వహించగలగాలి. రాబోయే టెక్నాలజీల ఆవిష్కరణలు, వ్యాపార, వ్యవస్థలపై వాటి ప్రభావాన్ని ముందస్తుగానే ఊహించి, అంచనా వేయగలిగే సామర్థ్యం ఉండాలి. కనీసం పది సంవత్సరాల అనుభవం మీద లభించే స్థాయి ఉద్యోగమిది.
క్లౌడ్‌ ఇంజినీర్‌: క్లౌడ్‌ వ్యవస్థలోని సాంకేతికపరమైన అంశాలకు వీరు బాధ్యులు. స్క్రిప్టింగ్‌ లాంగ్వేజీలు, ఓపెన్‌ సోర్స్‌ టెక్నాలజీల్లో అనుభవం, బహుళ-క్లౌడ్‌ల వాతావరణంలో ప్రావీణ్యం, క్లౌడ్‌ మూల వనరులు, ఆటోమేషన్‌, ఏపీఐ, అప్లికేషన్‌ల సముచిత కూర్పు, డేటాబేస్‌, డెవ్‌ఆప్స్‌ ఉపయోగానుభవం, వీటిలో మెలకువలు అవసరం. మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారి స్థాయి ఉద్యోగమిది.
క్లౌడ్‌ సెక్యూరిటీ మేనేజర్‌: సేవలు అందించేవారికీ, పొందేవారికీ సమాచార భద్రత చాలా అవసరం. అవసరమైన వేళల్లో, అవసరమైన స్థాయిలో, అవసరమైన సమాచారం మాత్రమే అందుబాటులోకి వచ్చేవిధంగా సమాచార భద్రతా వ్యవస్థలను నెలకొల్పడం వీరి ప్రధాన బాధ్యత. ముఖ్యంగా క్లౌడ్‌ నేపథ్యంలో డేటా భద్రతపై అనుమానాలుండటం సహజమే. ఈ విషయంపై దృష్టి సారించడం వీరి విధి. ఈ ఉద్యోగాలకు విక్రేత-తటస్థ (వెండర్‌ న్యూట్రల్‌) సర్టిఫికేషన్‌ ఉండడం ముఖ్యం. అదనంగా సమాచార భద్రతకు సంబంధించిన ప్రమాణాలు, ఐటీ చట్టం పట్ల సమగ్ర అవగాహన అవసరం. వివిధ ఆపరేటింగ్‌ సిస్టంలు, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంల నిర్మాణం గురించి క్షుణ్ణంగా తెలిసివుండాలి.
క్లౌడ్‌ అప్లికేషన్‌ డెవలపర్‌: క్లౌడ్‌ సేవల సంస్థలు, అవి పనిచేసే విధానాన్ని అవగాహన చేసుకోవటంతో పాటు తక్కువ సమయంలో నాణ్యమైన, స్వయం సమృద్ధ క్లౌడ్‌ ఆధారిత అప్లికేషన్ల అభివృద్ధి వీరి ప్రధాన బాధ్యత. డెవ్‌ఆప్స్‌ వంటి సాఫ్ట్‌వేర్‌, జెన్‌కిన్స్‌, టీమ్‌సిటి, బంబూ, జిట్‌లాబ్‌ వంటి సీిఐ/సీడీ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ సహాయంతో ఈ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలి. అనుభవం లేకపోయినా సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ పొంది కెరియర్‌ను ఈ ఉద్యోగంతో మొదలుపెట్టవచ్ఛు
క్లౌడ్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌: మొత్తం క్లౌడ్‌ వ్యవస్థ ఆకృతీకరణ, అమలు, నిర్వహణ, సపోర్ట్‌ వీరి భుజస్కంధాలపై ఉంటుంది. హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లే కాకుండా నెట్‌వర్కింగ్‌పైనా మంచి అవగాహన ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజీలో ప్రవేశం అదనపు అర్హత. సీసీఎన్‌ఏ, క్లౌడ్‌ నిర్వహణలలో సర్టిఫికేషన్‌ కనీస అవసరం.
క్లౌడ్‌ ఆటోమేషన్‌ ఇంజినీర్‌: క్లౌడ్‌ వాతావరణంలో జరిగే లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపే పాత్ర ఆటోమేషన్‌ ఇంజినీర్లది. ప్రోగ్రామర్లు పెంపొందించిన అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌లను క్లౌడ్‌కి అన్వయించి, ఆటోమేట్‌ చేసి, క్లౌడ్‌ వ్యవస్థకు సమగ్రంగా అనుసంధానం చేయడం వీరి బాధ్యత. ఐటీ మౌలిక వ్యవస్థలు, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, డేటా సెంటర్‌ మొదలైన వైవిధ్య అంశాల్లో విశేష ప్రవేశం ఉండాలి. ఆటోమేషన్‌ ఇంజినీర్లు క్లౌడ్‌ ఇన్‌ఫ్రా.స్ట్రక్చర్‌లను అమలుపరచడమే కాకుండా వాటిని అనుకూలపరిచే బాధ్యతనూ నిర్వహిస్తారు.

మెలకువల సోపానాలు
క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగంలో ఉద్యోగానికి ఈ మెలకువలు అవసరమవుతాయి.
* మెషిన్‌ లర్నింగ్‌/ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌
* డేటాబేస్‌ - ఎస్‌క్యూఎల్‌ (SQL)
* పైథాన్‌, జావా, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజి
* రుబి, జావా స్క్రిప్టింగ్‌, ఆంగులర్‌ జె (Ruby, Java, Angular J)
* సర్టిఫికేషన్‌
* డెవ్‌ఆప్స్‌ (DevAps)
* ఎక్స్‌ఎంఎల్‌- జావా ప్రోగ్రామింగ్‌ (XML with JAVA Programming)
* డాట్‌నెట్‌
గ్రేట్‌ లర్నింగ్‌ అనే సంస్థ నివేదిక ప్రకారం 2022 నాటికి పది లక్షలకు పైగా కొత్త ఉద్యోగావకాశాలు క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో వస్తాయి. కాస్త శ్రమ పడితే ఈ రంగంలో ప్రవేశించి నిలదొక్కుకోవచ్ఛు

సేవలు భద్రంగా.. సురక్షితంగా!
ప్రతి ఇంటిలోనూ బావి ఉండే రోజులను దాటి ఇప్పుడు కుళాయి తిప్పితే నీరు వచ్చేలా చేసుకున్నాం. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ఇలాంటిదే. నీటి కోసం కుళాయి విప్పడం లేదా కట్టేయడం చేసినట్లు మన అవసరానికి తగినట్లు క్లౌడ్‌ సేవలను వాడుకోవచ్చు లేదా నిలిపేయవచ్ఛు నీటి పంపిణీ సవ్యంగా జరగడానికి ఉద్యోగులు ఉన్నట్లే క్లౌడ్‌ వ్యవస్థ నియంత్రణ, పరిపాలనలకు నిపుణుల బృందం ఉంటుంది. వీరు కౌడ్‌ సేవలు భద్రంగా.. సురక్షితంగా అందించడానికి కృషి చేస్తారు.

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటే?
సొంతంగా సర్వర్‌లు, సాఫ్ట్‌వేర్‌లు, హార్డ్‌డిస్క్‌లు, నెట్‌వర్క్‌లు లేకుండా.. అవి అందించే సేవలన్నింటికీ వాడుకున్నంత మేరకు మాత్రమే చెల్లించగలిగిన వెసులుబాటు ఇచ్చే వ్యవస్థను ‘క్లౌడ్‌ కంప్యూటింగ్‌’ అంటారు.

సర్టిఫికేషన్లు - ప్రయోజనాలు
క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో స్థిరంగా ఉండాలనుకున్నా, ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నా, నిత్యం నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవడం, నాణ్యమైన సర్టిఫికేషన్లు పొందడం చాలా అవసరం. క్లౌడ్‌ రంగంలో ముఖ్యంగా ఈ సర్టిఫికేషన్లను పరిశ్రమలు ప్రామాణికంగా గుర్తిస్తున్నాయి. ఇవి ఉన్నవారికి ఉద్యోగావకాశాలు సులభంగా దొరుకుతున్నాయి.
అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సర్టిఫికేషన్‌ (ఏడబ్ల్యూఎస్‌): ఇందులో ప్రవేశస్థాయిలో మూడు, ప్రావీణ్య స్థాయిలో రెండు రకాల సర్టిఫికేషన్లు ఉంటాయి. అభిరుచి, ప్రావీణ్యాలను బట్టి తగిన సర్టిఫికేషన్‌ కోర్సు చేయవచ్ఛు
* గూగుల్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్‌
* మైౖక్రోసాఫ్ట్‌ అజ్యూర్‌ సర్టిఫికేషన్‌
* అలీబాబా సర్టిఫికేషన్‌
* ఐబీఎం సర్టిఫికేషన్‌
* వీఎంవేర్‌ హొరైజన్‌ క్లౌడ్‌ (వాస్తవీకరణ- వర్చువలైజేషన్‌)
* ఐఓటీ సర్టిఫికేషన్‌
* సేల్స్‌ఫోర్స్‌ అడ్మిన్‌ సర్టిఫికేషన్‌
ఇవే కాకుండా ఇంకా ఎన్నో పబ్లిక్‌ క్లౌడ్‌ సర్టిఫికేషన్‌లు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్‌ల వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. త్వరగా ఉన్నత స్థాయికి చేరడానికి సాయపడతాయి. ఎక్కువ జీతాన్ని అందిస్తాయి. కాకపోతే ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి ట్రెయినింగ్‌ తీసుకునే ముందు అన్ని విధాలుగా విచారించి, నమ్మకం కుదిరిన తర్వాతే శిక్షణ సంస్థల్లో చేరడం మంచిది.

Back..

Posted on 28-01-2020