Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఎంఏలో దూసుకుపోదాం!

* వెయిటేజీ ప్రకారమే ప్రశ్నలు
* అన్ని అంశాల పునశ్చరణ అవసరం

సైన్స్‌ విభాగంలోని ప్రొఫెషనల్‌ కోర్సులతో సమానంగా ఆదరణ ఉన్న సీఎంఏ పరీక్షలు వచ్చే వారం జరగనున్నాయి. వీటికి జాతీయ స్థాయిలో అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఈ దశలో వారు ఎలాంటి మెలకువలు పాటించాలి? ఏయే ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి.. తెలుసుకుందాం!

ఒకప్పటి ఐసీడబ్ల్యూఏ, నేటి కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సీఎంఏ) చదవడం అంటే విద్యార్థులు కొంత ఆందోళనకు గురయ్యేవారు. కానీ సాధారణ పరిజ్ఞానం ఉన్న విద్యార్థి కూడా సిలబస్‌ను, ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించుకొని తగిన అధ్యయన ప్రణాళికను రూపొందించుకుంటే ఉత్తీర్ణత సులభసాధ్యమే అంటున్నారు నిపుణులు.

సీఎంఏ ఇంటర్మీడియట్‌ (ప్రతి పేపర్‌ 100 మార్కులకు)
పేపర్‌-5:
ఫైనాన్సియల్‌ అకౌంటింగ్‌
* ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి.
* స్టడీ మెటీరియల్‌, స్కానర్‌లోని అన్ని లెక్కలు సాధన చేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో అలాంటివో, అవే రకమైనవో పరీక్షల్లో ఇచ్చే అవకాశముంది.
* ఈ పేపర్లో విద్యార్థి పరీక్ష రాసే విధానాన్ని బట్టి మార్కులు వచ్చే అవకాశముంది. పరీక్షలో తుది జవాబుకు మాత్రమే కాకుండా ప్రశ్నలోని అన్ని దశలకూ మార్కులుంటాయి. అందుకే వీలైనంత వివరంగా సమాధానాన్ని రాస్తే మంచిది.

పేపర్‌-6:
లాస్‌, ఎథిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌
* యాక్ట్‌లో ఉండే నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి.
* పరీక్ష రాసేటపుడు నిబంధనలు, ఉదాహరణలు, లాండ్‌ మార్క్‌ కేసులను కూడా మిళితం చేస్తే బాగుంటుంది. ఇలాచేస్తే పరీక్ష రాసే మిగతావారితో పోలిస్తే విద్యార్థి పేపర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. దానివల్ల మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
* కంపెనీ లా 2013కి సంబంధించిన నిబంధనలను కూడా జాగ్రత్తగా చదవాలి. పరీక్షలకు ముందు ఆరు నెలల వరకు చేసిన సవరణలు పరీక్షల్లో వస్తాయి. వాటిపై విద్యార్థులు ఎక్కువ దృష్టిపెట్టాలి.

పేపర్‌-7:
డైరెక్ట్‌ టాక్సేషన్‌
* అసెస్‌మెంట్‌ ప్రొసీజర్స్‌, ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే 25 మార్కులను సులువుగా సాధించవచ్చు.
* డిసెంబరు 2017 పరీక్షలకు ‘ఫైనాన్స్‌ యాక్ట్‌ 2016’ వర్తిస్తుంది (సవరణల పూర్తి సమాచారానికి icmai.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు).

పేపర్‌-8:
కాస్ట్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌
* కాస్ట్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ రెండు విభాగాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది.
* కాస్ట్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. పరీక్షల్లో వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. ఈ పేపర్‌లో థియరీకి కూడా ప్రాధాన్యమివ్వాలి.
* ముఖ్యమైన సూత్రాలు, సైడ్‌ హెడ్డింగ్‌లను ముందుగానే రాసి ఉంచుకుంటే పరీక్ష ముందురోజు సబ్జెక్టు మొత్తాన్ని సులువుగా పునశ్చరణ చేసుకోవడానికి వీలుంటుంది.

పేపర్‌-9:
ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌
సెక్షన్‌-ఎ: ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి.. థియరీ, ప్రాబ్లమ్స్‌కు సమాన ప్రాధాన్యమివ్వాలి. ప్రాబ్లమ్స్‌కు సంబంధించి పబ్లిక్‌ పరీక్షల్లో తరచుగా అడిగిన మోడళ్లను అధ్యయనం చేయాలి.
* సమస్యలకు సరైన, ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది.
* పబ్లిక్‌ పరీక్షల్లో ప్రత్యామ్నాయ సమాధానాలు, వర్కింగ్‌ నోట్స్‌ను సమాధానంలో భాగంగా రాయాలి.
సెక్షన్‌-బి: ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌కు సంబంధించిన నిర్వచనాలు, సైడ్‌ హెడ్డింగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.
* సైడ్‌ హెడ్డింగ్‌లను గుర్తుంచుకోవడానికి నిమోనిక్‌ కోడ్స్‌ (ధారణానుకూలాలు) తయారు చేసుకుంటే సాయపడతాయి.

పేపర్‌-10:
కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ
* స్టడీ మెటీరియల్‌లో ఉండే ఉదాహరణలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
* కాస్ట్‌ రికార్డ్‌ & కాస్ట్‌ ఆడిట్‌ విభాగంపై అశ్రద్ధ తగదు. దాని నుంచి 20 మార్కులను సులువుగా సాధించవచ్చు.
* గత 3 పరీక్షలకు సంబంధించిన ఎంఆర్‌టీపీస్‌, ఆర్‌టీపీస్‌ చదివితే మంచిది.
* కాస్ట్‌ అకౌంట్‌ రికార్డ్స్‌, కాస్ట్‌ ఆడిట్‌ వంటి అంశాల పట్ల జాగ్రత్త వహించాలి.

వెయిటేజీని అనుసరిస్తే మేలు
* సిలబస్‌లోని అన్ని అంశాల గురించి పూర్తి అవగాహన కల్పించుకుని, చాప్టర్‌ వెయిటేజీని చూసుకోవాలి. ప్రతి చాప్టర్‌ మొదటి పేజీలో ఈ వెయిటేజీ తాలూకు వివరాలున్నాయి. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ప్రశ్నపత్రాన్ని తయారు చేసేటప్పుడు కచ్చితంగా ఈ వెయిటేజీని అనుసరిస్తారు. ప్రతి విద్యార్థీ ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకునేప్పుడు ఆ చాప్టర్‌కున్న వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవాలి.
* ఇంతకు ముందులా ప్రతి పేపర్‌లోనూ అంశాలవారీగా కాకుండా విభాగాలవారీగా వెయిటేజీ ఉండేలా మార్పు చేశారు. కాబట్టి ప్రతి విద్యార్థీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశించిన సబ్జెక్టుల్లోనే సన్నద్ధమవడం మానుకోవాలి. ప్రతి అంశంపై వారికి అవగాహన తప్పనిసరి.
* విద్యార్థి గడిచిన రెండు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ప్రతి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలను అడుగుతున్నారో (ఆబ్జెక్టివ్‌/ డిస్క్రిప్టివ్‌/ ప్రాక్టికల్‌...) విశ్లేషించుకుని తదనుగుణంగా సన్నద్ధం కావాలి. ఈవిధంగా చేయడం వల్ల ప్రశ్నపత్రాల తీరును ముందుగానే విశ్లేషించుకోవచ్చు.
* స్కానర్‌ను (గత ప్రశ్నపత్రాలు) విశ్లేషించుకోవడానికి తగిన సమయాన్ని కేటాయించుకోవాలి.
* ఆర్‌టీపీ (రివిజన్‌ టెస్ట్‌ పేపర్‌)-2 అటెంప్ట్స్‌, ఎంటీపీస్‌ (మోడల్‌ టెస్ట్‌ పేపర్స్‌), పీటీపీస్‌ (ప్రాక్టీస్‌ టెస్ట్‌ పేపర్స్‌)ను తప్పకుండా పునశ్చరణ చేసుకోవాలి. కచ్చితంగా ఇలా చేస్తే కనీసం 60% మార్కులను పొందవచ్చు (వీటిని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు).
* సన్నద్ధత సమయంలో తప్పకుండా ప్రతి అంశానికీ ప్రాముఖ్యమివ్వాలి. అన్ని అంశాలూ పునశ్చరణ సమయంలో చేయగలిగారో లేదో చూసుకోవాలి.
* పరీక్షకు ముందు సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారి మెటీరియల్‌ ప్రశ్నలు, కంపోడియం, గత 3 పరీక్షల ఆర్‌టీపీస్‌, ఎంటీపీస్‌లను కనీసం ఒక్కసారైనా చదవడం మంచిది.

విశ్లేషణ
పేపర్‌-11:
ఇన్‌డైరెక్ట్‌ టాక్సేషన్‌
* భావనలు, విధానాలను అర్థం చేసుకోవాలి. స్టడీమెటీరియల్‌లోని ప్రశ్నలను సాధన చేయాలి.
* సమస్యాపూరితమైన ప్రశ్నలను సూచించిన/ వర్తించిన చట్టప్రకారం సమాధానం ఇవ్వాలి.
* డిసెంబరు 2017 పరీక్షలకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2016 వర్తిస్తుంది (సవరణల పూర్తి సమాచారానికి icmai.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు).
* సమాధానం మొదలుపెట్టే ముందు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాలి.
* విద్యార్థులు మంచి మార్కుల కోసం సర్వీస్‌ టాక్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
* వాల్యుయేషన్‌ రూల్స్‌, ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రైజింగ్‌ విషయాలను చూసుకోవాలి.

పేపర్‌-12:
కంపెనీ అకౌంట్స్‌ అండ్‌ ఆడిట్‌
* ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి.
* షెడ్యూల్‌ 3 (ఫార్మాట్‌ ఆఫ్‌ బాలెన్స్‌షీట్‌ అండ్‌ ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌)పై దృష్టిపెట్టాలి, ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి.
* ఆడిటింగ్‌ థియరీ సబ్జెకులో నేరుగా వచ్చే ప్రశ్నలను ముందుగానే వూహించవచ్చు. స్కానర్‌లో ఉండే ప్రశ్నలను పరీక్షల్లో నేరుగా ఇచ్చే అవకాశం ఉంది. నిబంధనలు, వర్తించే చట్టాలు, అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌, స్టాండర్డ్స్‌ ఆన్‌ ఆడిటింగ్‌, విధానాలు, ప్రక్రియలపై దృష్టిసారించాలి.

పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం!
చాలామంది విద్యార్థులు కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ (సీఎంఏ) కోర్సులో కూడా సీఏలోలాగా ఉత్తీర్ణత శాతం తక్కువ ఉంటుందని భావిస్తుంటారు. కానీ 2017 జూన్‌లో జరిగిన పరీక్ష ఫలితాల్లో.. సీఎంఏ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతా శాతం 32.36గా నమోదైంది. సీఎంఏ ఫైనల్‌లో 25.12% నమోదైంది.


Posted on 06-12-2017

Back..