Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఈ మెలకువలతో.. సీఎంఏ సులువు

మరో రెండున్నర నెలల్లో సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఇంటర్‌, సీఎంఏ ఫైనల్‌ పరీక్షలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో సీఎంఏ ఇంటర్‌, ఫైనల్‌ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఎలాంటి వ్యూహంతో పరీక్షలకు సన్నద్ధమవాలి? ఏయే సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మెలకువలు పాటించాలి?
సీఎంఏ కోర్సులోని అన్ని దశల్లో ఇంటర్మీడియట్‌ కోర్సు కీలకం. ప్రణాళికబద్ధంగా చదివితే తొలి ప్రయత్నంలోనే సులువుగా పూర్తిచేయవచ్చు. అభ్యర్థులు తరగతుల్లో వివరించే ఉదాహరణలూ, చార్టులూ తప్పకుండా రాసుకోవాలి. రన్నింగ్‌ నోట్స్‌ రాసుకుని, పునశ్చరణ సమయంలో అది చదవాలి.
కోచింగ్‌ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో సన్నద్ధత మొదలుపెట్టాలి. అన్ని సబ్జెక్టుల పుస్తకాలను ముందుగానే సమకూర్చుకోవాలి (ఉదా: పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు).
రోజుకి రెండు సబ్జెక్టులను చదివేలా ప్రణాళిక ఉండాలి. ఒకటి థియరీ, మరొకటి ప్రాబ్లమాటిక్‌ పేపర్‌ ఎంచుకోవడం మేలు. సన్నద్ధత సమయంలో ఇంకో నోట్‌బుక్‌లో కీలక పదాలు (కీ వర్డ్స్‌) రాసుకోవడం, మెటీరియల్‌లో అండర్‌లైన్‌ చేసుకోవడం అవసరం. దీనివల్ల పునశ్చరణ సులభమవుతుంది. మొదటి నుంచీ ఏ మెటీరియల్‌ చదువుతున్నారో చివరి వరకు అదే మెటీరియల్‌ చదవాలి. తరచూ మెటీరియళ్లను మార్చడం శ్రేయస్కరం కాదు.
ఏవైనా 4 సబ్జెక్టులపై ఎక్కువశాతం దృష్టిపెడితే వాటిల్లో ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది. కనీసం రెండు పేపర్లలో 60 కంటే ఎక్కువ మార్కులు సాధించడానికి కృషి చేయాలి.

ఏ సబ్జెక్టు ఎలా?
పేపర్‌-5 ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)
* ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కి ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి.
* స్టడీ మెటీరియల్‌, స్కానర్‌లోని అన్ని లెక్కలూ సాధన చేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో అలాంటివో అదే రకమైన లెక్కలో పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది.
పేపర్‌-6 లాస్‌, ఎథిక్స్‌ అండ్‌ గవర్నెన్స్‌ (100 మార్కులు)
* యాక్ట్‌లో ఉండే నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి.
* చదివిన నిబంధనలు ఎప్పటికప్పుడు చూడకుండా రాస్తే గుర్తుంటుంది.
* పరీక్ష రాసేటపుడు నిబంధనలు, ఉదాహరణలు, లాండ్‌ మార్క్‌ కేసులు కూడా మిళితం చేస్తే మిగతావారితో పోలిస్తే మీ పేపర్‌ ప్రత్యేకంగా ఉంటుంది. మంచి మార్కులూ వస్తాయి.
* పరీక్షల్లో సెక్షన్‌ నంబర్లు రాసేటపుడు కచ్చితత్వం ఉండాలి. ఇవి గుర్తులేకపోతే తప్పులు రాయడం కన్నా రాయకుండా ఉండడమే మేలు.
* కార్పొరేట్‌ లాకి సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ పుస్తకాన్ని తయారు చేసుకుని చదివితే పునశ్చరణ సులువవుతుంది.
* కంపనీ లా 2013 నిబంధనలు జాగ్రత్తగా చదవాలి. పరీక్షలకు ముందు 6 నెలల వరకు చేసిన సవరణలు పరీక్షల్లో వస్తాయి. వాటిపై దృష్టిపెట్టాలి.

పేపర్‌-7 డైరెక్ట్‌ టాక్సేషన్‌ (100 మార్కులు)
* ప్రతి అంశంపై లోతైన అవగాహన అవసరం.
* అసెస్‌మెంట్‌ ప్రొసీజర్స్‌, ఇంటర్నేషనల్‌ టాక్సేషన్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తే 25 మార్కులు సులువుగా సాధించవచ్చు.
* ప్రతి ప్రశ్ననూ చిన్న చిన్న ప్రశ్నలుగా విభజిస్తారు. ఆ ప్రశ్నలకు 2 లేదా 4 మార్కులుంటాయి. కాబట్టి ఎక్కువ అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
* డిసెంబర్‌ 2016 పరీక్షలకు ‘ఫైనాన్స్‌ యాక్ట్‌ 2015’ వర్తిస్తుంది (సవరణల పూర్తి సమాచారం కోసం icmai.in వెబ్‌సైట్‌ను సదర్శించవచ్చు).

పేపర్‌-8 కాస్ట్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)
* రెండు విభాగాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
* కాస్ట్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్‌పై దృష్టిపెట్టాలి. వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశముంటుంది.
* సీఎంఏ ఇంటర్మీడియట్‌ కోర్సులో ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాథమికాంశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి సులువుగా 40 మార్కులు సాధించవచ్చు.

పేపర్‌-9 ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (100 మార్కులు)
* ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ విషయంలో థియరీ, ప్రాబ్లమ్స్‌కు సమాన ప్రాధాన్యమివ్వాలి. ప్రాబ్లమ్స్‌కు సంబంధించి పరీక్షల్లో తరచుగా అడిగిన మోడళ్లను అధ్యయనం చేయాలి.
* ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌లో గణిత ఆధారిత సమస్యలుంటాయి. సులువుగా మంచి మార్కులు వస్తాయి.
* సమస్యలకు సరైన, ఆమోదయోగ్యమైన పద్ధతుల్లో సమాధానం రాయాల్సివుంటుంది.
* పరీక్షల్లో ప్రత్యామ్నాయ సమాధానాలు, పని గమనికలు (వర్కింగ్‌ నోట్స్‌)ను సమాధానంలో భాగంగా రాయాలి.
* సెక్షన్‌-బి ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో అశ్రద్ధ పనికిరాదు. నిర్వచనాలు, సైడ్‌ హెడ్డింగ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. సైడ్‌ హెడ్డింగ్స్‌ గుర్తు పెట్టుకోవడానికి నిమోనిక్‌ కోడ్స్‌ను తయారుచేసుకుంటే తేలికవుతుంది.

పేపర్‌-10 కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ (100 మార్కులు)
* స్టడీ మెటీరియల్‌లో ఉండే ఉదాహరణలను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి.
* కాస్ట్‌ రికార్డ్‌, కాస్ట్‌ ఆడిట్‌ విభాగంపై అశ్రద్ధ పనికిరాదు. దాని నుంచి 20 మార్కులు సులువుగా సాధించవచ్చు.

పేపర్‌-11 ఇన్‌డైరెక్ట్‌ టాక్సేషన్‌ (100 మార్కులు)
* భావనలు (కాన్సెప్ట్స్‌), విధానాలు అర్థం చేసుకోవాలి. స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను అధ్యయనం చేయాలి.
* సమస్యాపూరిత ప్రశ్నలకు సూచించిన/ వర్తించే చట్టప్రకారం సమాధానమివ్వాలి.
* డిసెంబర్‌ 2016 పరీక్షలకు ‘ఫైనాన్స్‌ యాక్ట్‌ 2015’ వర్తిస్తుంది.
* సమాధానం మొదలుపెట్టేముందు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదవాలి.
* సర్వీస్‌ టాక్స్‌, సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
* వాల్యుయేషన్‌ రూల్స్‌, ఇంటర్‌నేషనల్‌ టాక్సేషన్‌, ట్రాన్స్‌ఫర్‌ ప్రైజింగ్‌ విషయాలు ప్రధానమైనవి.

పేపర్‌-12 కంపనీ అకౌంట్స్‌ అండ్‌ ఆడిట్‌ (100 మార్కులు)
* ఈ పేపర్‌లో అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి.
* షెడ్యూల్‌ 3 (ఫార్మాట్‌ ఆఫ్‌ బ్యాలన్స్‌ షీట్‌ అండ్‌ ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌)పై దృష్టి పెట్టాలి. ప్రాబ్లమ్స్‌ సాధన చేయాలి.
* ఆడిటింగ్‌ థియరీ సబ్జెక్టు. దీనిలో నేరుగా వచ్చే ప్రశ్నలను ముందుగానే ­హించవచ్చు. స్కానర్‌లో ఉండే ప్రశ్నలను పరీక్షల్లో నేరుగా ఇచ్చే అవకాశముంది. నిబంధనలు, వర్తించే చట్టాలు, అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌, స్టాండర్డ్స్‌ ఆన్‌ ఆడిటింగ్‌, విధానాలు, ప్రక్రియలపై దృష్టి పెట్టాలి.

సీఎంఏ ఫైనల్‌
శిక్షణ తీసుకునే సమయంలో ఏవైనా రెండు పేపర్లను రోజువారీ పద్ధతిలో పునశ్చరణ చేసుకోవాలి.
* సొంతంగా ఫాస్ట్‌ ట్రాక్‌ నోట్స్‌ సిద్ధం చేసుకోవడం మేలు.
* ప్రాబ్లమ్స్‌ సాధన చేస్తున్నపుడే అనవసరం అనుకున్న లెక్కలను తీసివేస్తూవెళ్తే పునశ్చరణ సులువుగా, వేగంగా పూర్తవుతుంది.
* ఫార్ములాలన్నింటిని నోట్‌బుక్‌లో రాసుకోవాలి.
* ఫ్లోచార్ట్స్‌ను కూడా వేసుకుంటే మంచిది.
* గత 5 సంవత్సరాలుగా ఇస్తున్న పాత ప్రశ్నపత్రాలను అభ్యాసం చేయడం ప్రయోజనకరం.
* స్టడీ మెటీరియల్‌ ఆర్‌టీపీ, ఎంటీపీ, పీటీపీలోని ప్రాబ్లమ్స్‌ అన్నీ సాధన చేయాలి.
* ఇటీవలే చేసిన సవరణలు తప్పనిసరిగా చదవాలి.
* ఉన్న 8 సబ్జెక్టుల్లో ఏవైనా 4 సబ్జెక్టులపై ఎక్కువ శాతం దృష్టి పెడితే వాటిలో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు.
* స్టడీ మెటీరియల్‌, ఆర్‌టీపీ, ఎంటీపీ, పీటీపీల్లోని ప్రశ్నలకు జవాబులు ఎలా సూచించారో నిశితంగా పరిశీలించాలి.
ఇంతకు పూర్వంలా ప్రతి పేపర్‌లోనూ టాపిక్‌ల వారీగా వెయిటేజీ కాకుండా సెక్షన్లవారీ వెయిటేజీకి మార్చారు. నిర్దేశించిన కొన్ని సబ్జెక్టుల్లోనే (సెలక్టివ్‌ స్టడీ) సన్నద్ధమవకుండా, ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి.

అగ్రశ్రేణిలో నిలవాలంటే..
సీఎంఏ ఇంటర్‌, ఫైనల్‌ల కోసం కొన్ని సాధారణ సూచనలు చూద్దాం.
* సిలబస్‌ పూర్తి అంశాలపై అవగాహన కల్పించుకోవాలి. చాప్టర్ల వెయిటేజీని చూసుకోవాలి. ప్రతి చాప్టర్‌ మొదటి పేజీల్లో ఈ వివరాలున్నాయి. సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు ప్రశ్నపత్రం తయారు చేసేటపుడు కచ్చితంగా దీన్ని అనుసరిస్తారు. అందుకని పఠన ప్రణాళిక తయారు చేసుకునేటపుడు ఆ చాప్టర్‌ వెయిటేజీని పరిగణనలోకి తీసుకోవాలి.
* ఇంతకుపూర్వంలా ప్రతి పేపర్‌లోనూ టాపిక్‌ల వారీగా వెయిటేజీ కాకుండా సెక్షన్లవారీ వెయిటేజీకి మార్చారు. నిర్దేశించిన కొన్ని సబ్జెక్టుల్లోనే (సెలక్టివ్‌ స్టడీ) సన్నద్ధమవకుండా, ప్రతి అంశంపై అవగాహన పెంచుకోవాలి.
* గడిచిన రెండు పరీక్షల ప్రశ్నపత్రాలను కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ప్రతి పరీక్షలో ఏవిధమైన ప్రశ్నలను అడుగుతున్నదీ (ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌, ప్రాక్టికల్‌, థియరీ...) గమనించాలి.
* స్కానర్‌ (ఇంతకుముందు పరీక్షల ప్రశ్నపత్రాలు)ను విశ్లేషించుకోవడానికి సమయాన్ని కేటాయించాలి.
* ఆర్‌టీపీ (రివిజన్‌ టెస్ట్‌ పేపర్‌)- 2 అటెంప్ట్స్‌, ఎంటీపీఎస్‌ (మోడల్‌ టెస్ట్‌ పేపర్‌), పీటీపీ (ప్రాక్టీస్‌ టెస్ట్‌ పేపర్‌)లను తప్పకుండా పునశ్చరణ చేసుకోవాలి. కచ్చితంగా ఇలా చేస్తే కనీసం 60% మార్కులు పొందవచ్చు (వీటిని ఇన్‌స్టిట్యూట్‌ వెబ్‌సైట్‌ www.icmai.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు).
* అన్ని అంశాలూ పునశ్చరణ చేయగలిగారో లేదో సరిచూసుకోవాలి.


Back..

Posted on 26-09-2016