Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ప్రవేశాలు షురూ... సమస్యలొస్తే బేజారొద్దు

* కళాశాలలో ఇబ్బందులొస్తే ఫోన్‌ చేయచ్చు
* ఆన్‌లైన్‌లోనూ ఫిర్యాదుకు అవకాశం
* అండగా విశ్వవిద్యాలయాలు, యూజీసీ
* విద్యార్థులూ.. ధైర్యంగా ఎదుర్కోండి

ఈనాడు, హైదరాబాద్‌: అహోరాత్రులు శ్రమించారు.. ఎంసెట్‌లో ర్యాంకు సాధించారు..ఇంజినీరింగ్‌లో ఇష్టమైన కళాశాలలో.. ఆసక్తి ఉన్న బ్రాంచిలో సీటు సంపాదించారు. తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. మరి కళాశాలలో చేరిన కొద్ది రోజులకే ఏదో ఒక రూపంలో సమస్య ఎదురైతే మాత్రం కుంగిపోవద్దని అంటున్నారు నిపుణులు, అధికారులు. మీ సమస్యలను పరిష్కరించడానికి పలు ప్రభుత్వ విభాగాలున్నాయన్న సంగతి మరువొద్దని సూచిస్తున్నారు.
హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలలు అన్నీ జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ అనుబంధమే. వృత్తి విద్యా కళాశాలలు ఏదో ఒక విశ్వవిద్యాలయం నుంచి అనుబంధ గుర్తింపు పొందాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ విద్యార్థులు చదివే అధిక శాతం కళాశాలలు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోనే ఉన్నాయి. ఆ కళాశాలల్లో చదివినా విద్యార్థులకు ధ్రువపత్రాలు జేఎన్‌టీయూహెచ్‌ లేదా ఓయూ నుంచే వస్తాయి. ఈసారి ప్రభుత్వ కళాశాలలను పక్కన బెడితే తెలంగాణలో మొత్తం 231 కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అందులో ఓయూ, కేయూ అనుబంధంగా ఉన్నవి వరుసగా 10, 7 కళాశాలలు మాత్రమే. మిగతావన్నీ జేఎన్‌టీయూహెచ్‌కి చెందినవే. కళాశాలల్లో చేరిన తర్వాత విద్యార్థులకు పలు రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందులో సీనియర్ల నుంచి ర్యాగింగ్‌, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు అర్హత ఉన్నా ముందుగా సొంతగా ఫీజు చెల్లించమని యాజమాన్యాలు ఒత్తిడి తేవడం, హాజరులో అవకతవకలు తదితర ఎన్నో సమస్యలు వస్తాయి. అలాంటి వాటితో బెంబేలెత్తి పోకుండా సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకాలని నిపుణులు చెబుతున్నారు.
* పారాహుషార్‌...
అర్హులైన అధ్యాపకులు లేరని, చాలా కళాశాలలు బోగస్‌ అధ్యాపకులను తీసుకొచ్చి తనిఖీ బృందాలకు చూపాయన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. ఫలితంగా కొన్ని కళాశాలల్లో తరగతులు జరుగుతాయా అన్న సందేహాలూ ఉన్నాయి. మీరు అధ్యాపకులు, తరగతుల గురించి అడగక పోతే కళాశాలల యాజమాన్యాలూ ఏమీ పట్టించుకోవు. దానివల్ల నష్టపోయేది మీరేనని గుర్తుంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
* ర్యాగింగ్‌కు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్లు
కళాశాలలో చేరిన తర్వాత నూతన విద్యార్థులు ఎదుర్కొనే మొదటి సమస్య సీనియర్ల నుంచి ర్యాగింగ్‌. అది శ్రుతి మించితే కొందరు విద్యార్థులు చదువు మానుకోవడం...ఆత్మహత్య ప్రయత్నాలు చేయడం చేస్తుంటారు. ర్యాగింగ్‌ ఎక్కువైతే అధికారులు దృష్టికి తీసుకెళ్లవచ్చు. కళాశాలల్లో ప్రత్యేకంగా యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఉంటాయి. వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఆ కమిటీకి చెప్పినా స్పందించకుంటే జేఎన్‌టీయూహెచ్‌, యూజీసీలో యాంటీ ర్యాగింగ్‌కు హెల్ప్‌లైన్లు ఉన్నాయి. వాటి ద్వారా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఈ-మెయిల్‌ ద్వారా విశ్వవిద్యాలయం అధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.
* గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
కళాశాలలో అధికంగా ఫీజులు వసూలు చేసినా... స్కాలర్‌షిప్‌లు రాకున్నా... పరీక్షలు సకాలంలో నిర్వహించకున్నా... రిజర్వేషన్‌ పాటించకుండా, అధ్యాపకుల కొరత తదితర ఎటువంటి సమస్యలు ఉన్నా యూజీసీ ఏర్పాటు చేసిన స్టూడెంట్‌ గ్రీవెన్స్‌ రెడ్రెస్సల్‌ పోర్టల్‌ ద్వారా విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. దీనికి విద్యార్థుల నుంచి ఇప్పటికే వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వీటిపై యూజీసీ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే 57 ఫిర్యాదులను పరిష్కరించినట్లు, ఇంకా మరో 700 పెండింగ్‌లో ఉన్నట్లు యూజీసీ తన వెబ్‌సైట్లో ఉంచింది. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందినవి 11, హెచ్‌సీయూ-3, ఓయూ, తెలుగు విశ్వవిద్యాలయం రెండు చొప్పున ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి.
* అర్హత ఉన్నా.. ఒత్తిడా..
విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వస్తుందో.. రాదో.. ధ్రువపత్రాల పరిశీలన రోజే నిర్ధారణ అవుతుంది. అయితే కొన్ని కళాశాలలు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఎప్పుడో వస్తుంది...మీరు సొంతగా ఫీజు చెల్లిస్తే ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఈసారి కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఇలాంటివి ఎంతో మంది విద్యార్థులకు అనుభవమే. ఇలాంటి సమస్యలు వస్తే జేఎన్‌టీయూహెచ్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఉన్నత విద్యామండలి అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
* తీవ్ర నేరంగా పరిగణిస్తారు - లక్ష్మణరావు, విద్యావేత్త
ర్యాగింగ్‌ను ప్రభుత్వాలు తీవ్ర నేరంగా పరిగణిస్తున్నాయి. ర్యాగింగ్‌ రుజువైతే 1997 ఏపీ చట్టం కింద రూ.50 వేల జరిమానా, ఆరేళ్ళ జైలు విధిస్తారు. అందుకే సీనియర్లు ర్యాగింగ్‌ జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. జూనియర్లకు ఆయా అంశాలపై అవగాహన కలిగించేందుకు యాంటీ ర్యాగింగ్‌ కమిటీ సభ్యులు, వారి నంబర్లు, పోలీసు అధికారులు, విశ్వవిద్యాలయం అధికారుల మొబైల్‌ నంబర్లు నోటీసు బోర్డుల్లో ఉంచుతున్నాం. యాంటీ ర్యాగింగ్‌ కమిటీలో ఒక సీనియర్‌ విద్యార్థిని, ఒక పేరెంట్‌ను కూడా సభ్యులుగా తీసుకుంటున్నాం. ర్యాగింగ్‌ జరగడానికి అవకాశం ఉన్న క్యాంటీన్‌, బస్సులు, క్రీడా మైదానం వద్ద విజిలెన్స్‌ స్క్వాడ్‌ పేరిట తనిఖీలు చేస్తుంటాం.
* హాజరు జాగ్రత్త...
మొదటి ఏడాది పరీక్షలు రాయాలంటే మొత్తంమీద 75 శాతం హాజరు ఉండాలి. అనారోగ్య కారణాలు ఉంటే 10 శాతం మినహాయింపు ఇస్తారు. తగిన హాజరు లేకుంటే తుది పరీక్షలు రాయడానికి వర్సిటీ నుంచి హాల్‌టిక్కెట్లు జారీ కావు. ఏటా సుమారు 5వేల మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు తాము తరగతులకు వచ్చినప్పటికీ హాజరు ఎందుకు తగ్గిందో అర్ధం కావడం లేదని ఆరోపిస్తుంటారు. అందుకే ప్రతినెలా హాజరును సరిచూసుకోవడం మంచిది. ఈ రగడ ఏటాతప్పక పోతుండటంతో ప్రతినెలా విద్యార్థుల హాజరును వర్సిటీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా తెప్పించుకుంటోంది.
ఫిర్యాదు చేయండి: ఆచార్య టి.కిషన్‌కుమార్‌ రెడ్డి, రెక్టార్‌, జేఎన్‌టీయూహెచ్‌
ర్యాగింగ్‌ సమస్య వస్తే ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేయడానికి జేఎన్‌టీయూహెచ్‌ హెల్ప్‌లైన్‌ నంబరు ఏర్పాటు చేసింది. వర్సిటీ హోం పేజీలోనే అది కనిపిస్తుంది. ఆ నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. అందుకు ముందుగా మీ కళాశాలల్లో అధికారులకు, ప్రత్యేకంగా ర్యాగింగ్‌ కమిటీకి ఫిర్యాదు చేయండి. దానిపై కమిటీ వేసి విచారణ జరుపుతాం. ర్యాగింగ్‌పై యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థుల ఫిర్యాదులను తేలిగ్గా తీసుకోవద్దు. నిర్లక్ష్యంగా వహిస్తే యాజమాన్యాలపైనా వర్సిటీ చర్యలు తీసుకుంటుంది.
* జేఎన్టీయూహెచ్ యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్: 18004251288
* ఈమెయిల్స్: ఉపకులపతి: vcjntu@jntuh.ac.in
* రెక్టార్: pa2rector@jntuh.ac.in
* రిజిస్ట్రార్: pa2registrar@jntuh.ac.in
* యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ హెల్ప్‌లైన్‌: 18001805522.

Posted on 05.08.2015