Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భవితకు కామర్స్‌

సరైన ప్రణాళిక లేకుండా ఇంటర్మీడియట్లో ఏదో ఒక గ్రూపులో చేరితే తర్వాతి కాలంలో ఇబ్బందులు తప్పవు. అందుకే విద్యార్థులు వివిధ గ్రూపులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. దానిలో భాగంగా కామర్స్‌ కోర్సుల ప్రాముఖ్యం, ప్రత్యేకతలను పరిశీలిద్దాం!
దేశవ్యాప్తంగా వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లోకి వస్తున్న సందర్భంగా సీఏలకూ, ఇతర కామర్స్‌ వృత్తి నిపుణులకూ ఉపాధి అవకాశాలు పెద్దఎత్తున పెరగనున్నాయని అంచనా. వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించినదే కామర్స్‌ రంగం. ఆర్థిక కార్యకలాపాలను ముందుండి నడిపే ఈ రంగ నిపుణులకు అవకాశాలు విస్తృతమవుతున్నాయి. సరైన కామర్స్‌ కోర్సును ఎంచుకుని నేటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను పెంచుకుంటే వృత్తినిపుణులుగా ఎదగవచ్చు.
రాబోయే రోజుల్లో బ్యాంకింగ్‌లో ఉపాధి అవకాశాలు ఎన్నో రెట్లు పెరగనున్నాయి. ఆ రంగంలోని లావాదేవీల పట్ల కామర్స్‌ చదివినవారిలో చక్కని అవగాహన ఉంటుంది. ఈ రకంగా బ్యాంకింగ్‌ రంగంలోని ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడంలోనూ కామర్స్‌ విద్యార్థులు అందరికంటే ముందుంటారని చెప్పవచ్చు.
కామర్స్‌ కెరియర్‌ కోసం ఇంటర్లో ప్రధానంగా ఎంఈసీ, సీఈసీ గ్రూపులు చదవటం మంచిది. మిగిలిన గ్రూపులవారికి కూడా ఈ కెరియర్‌ స్వాగతం పలుకుతుంది.

ఎంఈసీ గ్రూపు ప్రాధాన్యం
సైన్స్‌ సబ్జెక్టు మ్యాథ్స్‌, కామర్స్‌ సబ్జెక్టులైన ఎకనామిక్స్‌, కామర్స్‌ లాంటి రెండు విభిన్న గ్రూపుల కలయికే ఎంఈసీ గ్రూపు. గణితం అంటే ఇష్టమైనా ఫిజిక్స్‌, కెమిస్ట్రీలంటే ఆసక్తి లేని విద్యార్థులు కొందరుంటారు. ఇలాంటివారు నిశ్చింతగా ఇంటర్లో ఎంఈసీ గ్రూపును తీసుకోవచ్చు. ఇంటర్లో ఎంఈసీ చదవటం వల్ల కెరియర్‌ను ఎలాగైనా మల్చుకోవచ్చు.
ఇంటర్లో ఎంఈసీ చదివి భవిష్యత్తులో సీఏ, సీఎంఏ, సీఎస్‌, లా వంటి వృత్తివిద్యాకోర్సులు చేయొచ్చు. బీఎస్‌సీ, బీఎస్‌సీ కంప్యూటర్స్‌, బీకాం, బీబీఎం వంటి డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఎంకాం, ఎంబీఏ, ఎంసీఏ లాంటి కోర్సుల్లోనూ ప్రవేశించవచ్చు.

సీఈసీ గ్రూపు ప్రాధాన్యం
సీఈసీ అంటే కామర్స్‌, ఎకనామిక్స్‌, సివిక్స్‌ల కలయిక. చాలామంది సైన్స్‌ గ్రూపువారికి ఉన్నన్ని ఉద్యోగ అవకాశాలు ఈ గ్రూపు చదివినవారికి ఉండవని భావిస్తుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇంటర్లో సీఈసీ చదివి డిగ్రీ పూర్తిచేసి అనేక రంగాల్లో ప్రవేశించవచ్చు. లా పూర్తిచేయడానికీ, సివిల్‌ సర్వీస్‌ రావడానికీ, అన్ని రకాల పోటీ పరీక్షలు రాయడానికీ సీఈసీ గ్రూపులోని సబ్జెక్టులే కీలకం. ఎక్కువశాతం జనరల్‌ నాలెడ్జ్‌; రాజ్యాంగానికీ, సమాజానికీ సంబంధించిన, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ అంశాలతో కామర్స్‌ను కూడా అనుసంధానం చేయడం వల్ల ఈ గ్రూపునకు ప్రాధాన్యం మరింతగా పెరిగింది.
కామర్స్‌ కెరియర్‌ కావాలి కానీ గణితం అంటే భయం అనుకునేవారు నిశ్చింతగా సీఈసీ గ్రూపును తీసుకోవచ్చు. ఆపై సీఏ, సీఎంఏ, సీఎస్‌ లాంటి వృత్తివిద్యాకోర్సులు పూర్తిచేయవచ్చు.

చార్టర్డ్‌ అకౌంటెన్సీకి ఆదరణ
కామర్స్‌ కోర్సుల్లో అత్యంత ఆదరణ ఉన్న కోర్సు సీఏ. ఒకప్పుడు డిగ్రీ తర్వాత గానీ, ఇంటర్‌ తర్వాత కానీ సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పదో తరగతి పూర్తవగానే సీఏ కోర్సులోకి ప్రవేశించే అవకాశాన్ని సీఏ ఇన్‌స్టిట్యూట్‌ వారు కల్పించారు.
ఇంటర్లో ఏ గ్రూపువారైనా సీఏ కోర్సు చదవొచ్చు. అయితే చాలామంది విద్యార్థులు ఇంటర్లో ఎంఈసీ గ్రూపుతో పాటే సీఏ కూడా ఏకకాలంలో చదవటానికే సుముఖత చూపిస్తున్నారు.
ఎంఈసీ/సీఈసీ గ్రూపు తీసుకుని ఇంటర్‌తో పాటు సీపీటీని సమాంతరంగా పూర్తిచేయవచ్చు. ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలు ఇంటర్‌తో పాటు లాంగ్‌టర్మ్‌ సీపీటీ శిక్షణ అందిస్తున్నాయి.
సీఏలాంటి వృత్తివిద్యా కోర్సులో ఏదో ఒక దశలో విఫలమైనా పట్టుదలతో, కొంచెం ఓపికతో కృషి చేస్తే విజయం సాధించే అవకాశం 80 శాతం నుంచి 90 శాతం వరకూ ఉంటుంది.
సీఏ, సీఎంఏ, సీఎస్‌ కోర్సులే కాకుండా మిగతా కామర్స్‌ సంబంధిత కోర్సులైన ఎం.కామ్‌, ఎంబీఏ చేసినవారికి కూడా మంచి అవకాశాలు ఎదురుచూస్తుంటాయి. సరైన కోర్సును ఎంచుకుని సరైన మార్గదర్శకత్వంలో కామర్స్‌ చదివితే భవిత గొప్పగా రూపొందుతుంది.
ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూపు విద్యార్థులైనా భవిష్యత్తులో విద్య, ఉద్యోగ అవకాశాల పరంగా సబ్జెక్టు నైపుణ్యాలతో పాటు ఆవశ్యకంగా పెంపొందించుకోవాల్సిన అంశాలు:
* ఆంగ్ల పరిజ్ఞానం * సానుకూల దృక్పథం * ఆచరణాత్మంగా థియరీని అనువర్తనం చేయటం * బృందంలో పనిచేసే లక్షణం

సీఏ: కష్టానికి తగిన ఫలితం
ఒక సంస్థ బాలెన్స్‌షీట్‌ సర్టిఫై చేసే అధికారం ఒక్క సీఏ చదివినవారికే ఉంటుంది. బాలెన్స్‌షీటుపై ఈ ధ్రువీకరణ లేకపోతే దానికి చట్టబద్ధ గుర్తింపు ఉండదు. సీఏ మిగతా కోర్సుల్లా కాకుండా పూర్తయిన వెంటనే ఉద్యోగాలు లభించేలా చేసే సామర్థ్యమున్న కోర్సు. ఆర్థికమాంద్యంలో కూడా అవకాశాలకు ఢోకా లేని కెరియర్‌ ఇది. 21 ఏళ్లకే సీఏ చేసి, దేశ విదేశాల్లోని కార్పొరేట్‌ సంస్థల్లో స్థిరపడవచ్చు.
సీఏ ప్రాక్టీసు చేసేవారికి జీఎస్‌టీ మంచి అవకాశంగా మారనుంది. దేశమంతా ఒకే పన్ను విధానం కావడంతో ఇతర రాష్ట్రాల వ్యవహారాలను కూడా చూసే అవకాశం ఉంది.
కష్టం అంటారు కదా! సీఏ చేయడం కష్టమని విద్యార్థులు భావిస్తుంటారు. ప్రతి అంశాన్ని ఇష్టపడి చదవాలి. దాంతోపాటు కష్టపడి చదవగలిగే శక్తి ఉన్నవారే ఈ కోర్సులో అడుగుపెడితే మంచిది. ఆషామాషీగా చదివేస్తే సీఏ పూర్తిచేయడం చాలా కష్టం. దీంతోపాటు విశ్లేషణాత్మక ఆలోచన విధానం, రోజుకు 12 నుంచి 15 గంటలు కష్టపడగలిగే శక్తి ఉండాలి.
మొదటినుంచీ ఆంగ్ల మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఈ కోర్సు ఉత్తమం. ఎందుకంటే పరీక్ష రాయాల్సింది ఆంగ్లంలోనే. భావప్రకటన నైపుణ్యాలతోపాటు పరీక్ష రాసేటప్పుడు ప్రదర్శన నైపుణ్యాలు బాగుంటేనే ఈ కోర్సు పూర్తవుతుంది.
ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టడమే సీఏల పని. ఆర్థిక లావాదేవీలు లేకపోతే ప్రపంచంలో ఏ సంస్థా నడవదు. రంగం ఏదైనా కానీ, వాటిల్లో సీఏ పాత్ర ప్రముఖం. సంస్థ చిన్నదైనా పెద్దదైనా వీరి అవసరం తప్పనిసరి. బహుళజాతి సంస్థనుంచి చిన్న పార్ట్‌నర్‌షిప్‌ సంస్థల వరకు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ల అవసరం ఉంటుంది. అందుకే ఈ కోర్సు పూర్తిచేసినవారు వేగంగా ఉద్యోగం పొందగలుగుతున్నారు.

చదువుతూనే సంపాదన
సీఏ చదువుతున్న కాలంలోనే స్టైపెండ్‌ రూపంలో నెలకు రూ.4000 పారితోషికం అందుకోవచ్చు. కోర్సు చేస్తున్న కాలంలో సీఏ వద్ద విద్యార్థి 3 సంవత్సరాలు ఆర్టికల్‌ క్లర్క్‌గా చేయాలి. ఈ సమయంలో ప్రతి విద్యార్థికీ ఆచరణాత్మక పరిజ్ఞానంతోపాటు స్టైపెండ్‌ కూడా అందుతుంది.
ఇంటర్మీడియట్‌ నుంచి సీపీటీ ప్రవేశపరీక్ష ఉండటం వల్ల, డిగ్రీ 3 సంవత్సరాలు చదవకముందే ఈ కోర్సులో ప్రవేశించవచ్చు. దీనివల్ల విద్యార్థులకు మూడేళ్ల సమయం కలిసివస్తుంది. ఇప్పటికే డిగ్రీ మొదటి, రెండు సంవత్సరాల్లో చేరిన విద్యార్థులు తమ పరీక్షలు అయిపోయాక మార్చి/ ఏప్రిల్‌ల్లో ప్రారంభమయ్యే సీపీటీ కోర్సులో చేరటం మేలు. డిసెంబరులో పరీక్షరాసి, పాసై మిగిలిన రెండు సంవత్సరాల సమయాన్ని వృథా చేసుకోకుండా చూసుకోవచ్చు. దానివల్ల 21 ఏళ్లలో డిగ్రీతోపాటు సీఏ పూర్తిచేసి జీవితంలో స్థిరపడవచ్చు.
ప్రస్తుతం డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్న, పీజీ చదువుతున్నవారు 3 సంవత్సరాల కాలవ్యవధి కోల్పోతున్నారని భావించి ఐసీఏఐవారు డిగ్రీ (కామర్స్‌ 55%, నాన్‌ కామర్స్‌ 60%) ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీపీటీ అవసరం లేకుండానే నేరుగా ఐపీసీసీ చేయడానికి అవకాశం కల్పించారు.

ఏయే ఉద్యోగాలు?
అగ్రశ్రేణి సంస్థలు సీఏలకు మంచి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. బిజినెస్‌ అప్లికేషన్స్‌, ఇన్‌పుట్‌ ఫంక్షన్స్‌ విభాగాల్లో అవకాశాలున్నాయి. ఫైనాన్స్‌ సంబంధిత ఉద్యోగాలు ఎక్కువ. వ్యాపార సంస్థలు, పరిశ్రమల్లో సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ చీఫ్‌ అకౌంటెంట్‌ లాంటి కీలక స్థానాల్లో చోటు సంపాదించుకోవచ్చు. ప్రాజెక్టు నివేదికల తయారీ, ఫీజబిలిటీ స్టడీస్‌, మార్కెట్‌ రిసర్చ్‌, డిమాండ్‌ స్టడీస్‌, బడ్జెటింగ్‌, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌, వర్కింగ్‌ కాపిటల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ పాలసీ, కార్పొరేట్‌ ప్లానింగ్‌, ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌, బిహేవియర్‌, డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌, వ్యాపార సలహాదారుగా సంస్థలకు ఫైనాన్షియల్‌ రిపోర్ట్‌ తయారీ, రుణాల మంజూరీ, ఆర్థిక లాభాల ప్రొజెక్షన్‌లో సలహాలు అందించి పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తారు. టాక్స్‌ నిబంధనల నిపుణుడిగా వ్యక్తులకూ, సంస్థలకూ సేవలందిస్తారు. ఆడిట్‌ ప్రాక్టీషనర్లుగా స్వయంగా ప్రాక్టీస్‌ ప్రారంభించవచ్చు. ఇన్‌కంటాక్స్‌, సర్వీస్‌ టాక్స్‌, ఇతర పన్నుల విషయంలో సీఏలకే ప్రాముఖ్యం. కంప్యూటర్లు, ఐటీతో పరిచయం ఉండటంతో అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ అభి వృద్ధిలోనూ అవకాశం లభిస్తుంది.


Back..

Posted on 22-05-2017