Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కామర్స్‌ కోర్సుల మేలెంత?

ఉపాధికి బహుళ అవకాశాలిచ్చే కామర్స్‌ కోర్సులపై విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కొన్ని సందేహాలూ, అపోహలూ ఉన్నాయి. వాటిని తొలగించుకుని, వాస్తవాలు గ్రహించటం అవసరం. అందుకని ముఖ్యమైన సందేహాలను ఇక్కడ పరిశీలిద్దాం!

1. సీఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం కేవలం 2- 3 శాతమే అంటుంటారు. ఇది ఎంతవరకూ వాస్తవం?
జ: సీఏ కోర్సులో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంటుంది కానీ మరీ తక్కువేం కాదు. ఉదాహరణకి... సీఏ-సీపీటీ గత 3 పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని గమనిస్తే..
* 2016 జనవరి పరీక్ష ఫలితాల్లో 34.45% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
* 2016 జులై పరీక్ష ఫలితాల్లో 38.98% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
* 2017 జనవరి పరీక్ష ఫలితాల్లో 46.44% ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఐపీసీసీ విషయానికి వస్తే..
* 2017 జనవరి సీఏ-ఐపీసీసీ గ్రూప్‌-1లో 19% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
* 2017 జనవరి సీఏ-ఐపీసీసీ గ్రూప్‌-2లో 30% ఉత్తీర్ణత శాతం నమోదైంది.
ఇక 2017 జనవరి సీఏ- ఫైనల్‌ ఫలితాల్లో అయితే..
* 7000 మందికిపైగా విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇవి కేవలం జనవరి ఫలితాలు మాత్రమే. జులైలో మళ్లీ సీఏ ఫైనల్‌ ఫలితాలు విడుదలవుతాయి. అప్పుడు సుమారుగా మరో 7000 మంది ఉత్తీర్ణత సాధించే అవకాశముంది.
* సీఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులో ఏదో ఒక దశలో విద్యార్థి విఫలమైనా కూడా పట్టుదలతో, కొంచెం ఓపికతో మళ్లీ కృషిచేస్తే విజయం సాధించే అవకాశం 80% నుంచి 90% వరకు ఉంటుంది.
ఉదాహరణకు ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థి సీఏ కోర్సుని 4 సంవత్సరాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చు. అదే సీఏ కోర్సులోని ఏదైనా దశలో ఒకటి లేదా రెండుసార్లు విఫలమైనా కూడా మరో సంవత్సరం అంటే ఇంటర్‌ తరువాతి 5 సంవత్సరాల్లో సీఏ కోర్సును పూర్తిచేసుకోవచ్చు.

2. సీఏ కోర్సును చదువుతున్న విద్యార్థి దాన్ని పూర్తి చేయలేకపోతే అతడి పరిస్థితేంటి?
జ: సీఏ కోర్సులోని రెండో దశ అంటే సీఏ-ఐపీసీసీలోని గ్రూప్‌-1ను విద్యార్థి పూర్తిచేస్తే అతడికి ఏటీసీ (అకౌంటింగ్‌ టెక్నీషియన్‌ సర్టిఫికెట్‌) లభిస్తుంది. అంటే ఇంటర్‌ తరువాత కేవలం ఒకటిన్నర సంవత్సరాలు చదివి, సీఏ మధ్యలో ఆపేసినా ఈ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఈ సర్టిఫికెట్‌ పొందినవారికి రూ.25,000 నుంచి రూ.30,000 వరకు వేతనంతో ఉద్యోగం లభించే అవకాశముంది.
* ఒకవేళ సీఏ కోర్సు పూర్తిచేయలేనివారు సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదవవచ్చు. బీకాం, బీబీఏ, బీబీఎం లాంటి డిగ్రీ కోర్సులు చదివి ఎంబీఏ వంటి పీజీ కోర్సులు చదివి మంచి ఉద్యోగం సంపాదించవచ్చు. బ్యాంకు ఉద్యోగులుగా, లాయర్లుగా, అకౌంటెంట్లుగా రాణించవచ్చు. టాలీ, శాప్‌ లాంటి కోర్సులు నేర్చుకుని మంచి కార్పొరేట్‌ ఉద్యోగాలను సంపాదించవచ్చు. కాబట్టి సీఏ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు నిరభ్యంతరంగా దీన్ని అభ్యసించవచ్చు.

3. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు సీఏ కోర్సుని చదవగలరా?
జ: వాస్తవానికి సీఏ చదవాలనుకునే విద్యార్థి ఒక ప్రణాళిక ప్రకారం కోర్సులోకి ప్రవేశించాల్సి ఉంటుంది. పదో తరగతి పూర్తిచేసిన తరువాత ఇంటర్‌లో ఎంఈసీ కోర్సు తీసుకుని ఇంటర్‌తోపాటు సీఏ-సీపీటీ పూర్తిచేసిన తరువాత సీఏని పూర్తిచేయాలి. ఇలా చేయడంవల్ల సీఏకి కావాల్సిన బలమైన పునాది ఇంటర్‌లోనే పడుతుంది.
ఒకవేళ పదో తరగతి పూర్తిచేశాక సరైన ప్రణాళిక లేక ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ తీసుకున్నప్పటికీ ఇంటర్‌ తరువాత సీఏ కోర్సులోకి ప్రవేశించవచ్చు. ఎంపీసీ, బైపీసీతో పోలిస్తే సీఏకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. ఎంపీసీలోగానీ, బైపీసీలోగానీ కనీస మార్కులు వస్తే సరిపోదు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా వస్తేనే మంచి ఇంజినీరింగ్‌ లేదా మెడికల్‌ కళాశాలల్లో సీటు వస్తుంది. ఈ ర్యాంకుల హడావుడితో చాలామంది విద్యార్థులు వెనుకబడుతున్నారు. అదే సీఏ కోర్సులో అయితే ర్యాంకులతో సంబంధం లేకుండా కనీస మార్కులు సాధిస్తే చాలు. తరువాతి దశకు వెళ్లిపోవచ్చు. సీఏ కోర్సులో ర్యాంకులు ఉన్నప్పటికీ అవి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి మాత్రమే.

4. సీఏ పూర్తి చేసినవారికి విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయా?
జ: సీఏ పూర్తి చేసినవారికి మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ మంచి ఉద్యోగావకాశాలుంటాయి. ఇతర దేశాల్లో మన సీఏలు ఉద్యోగం చేయాలనుకుంటే మరే ఇతర పరీక్షనూ రాయాల్సిన అవసరంలేదు. అదే ఇతర దేశాల్లో సాధన చేయాలనుకుంటే అక్కడ దేశాల చట్టాల విధివిధానాలపై అవగాహన ఉండాలి. కాబట్టి అక్కడ ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ దేశాలకు సంబంధించిన సీఏ కోర్సుల్లోని కొన్ని పేపర్లలో మనదేశంలో సీఏ పూర్తిచేసినవారికి మినహాయింపు ఉంటుంది. అంటే మినహాయింపు పోగా మిగిలిన పేపర్లను రాయాలన్నమాట.
ఇతర కామర్స్‌ కోర్సులైన సీఎంఏ (ఐసీడబ్లు్యఏ), కంపెనీ సెక్రటరీ కోర్సులకు కూడా దాదాపు ఇవే అంశాలు వర్తిస్తాయి.

Back..

Posted on 11-04-2017