Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కంపెనీ సెక్రటరీ కావాలని ఉందా?

     ఉపాధిపరంగా ప్రాముఖ్యమున్న కోర్సు- కంపెనీ సెక్రటరీ. దీనిలో కాలానుగుణంగా మార్పులను చేయటంతో ఈ కోర్సుపై ఆసక్తి చూపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. దీని స్వరూప స్వభావాలూ, ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం!
మనదేశంలో వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు తగినంతమంది కంపెనీ సెక్రటరీలు లేరు. కంపెనీల చట్టం 2013 ప్రకారం మూలధనం రూ. 5 కోట్లు/ అంతకుమించి ఉండే సంస్థలు పూర్తిస్థాయి కంపెనీ సెక్రటరీని నియమించుకోవాల్సి ఉంటుంది. స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో నమోదయిన సంస్థల వార్షిక ఆర్థిక నివేదికలపై కంపెనీ సెక్రటరీల సంతకం తప్పనిసరి.
నేటి పోటీ ప్రపంచంలో వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు తమ సంస్థలతో సంబంధాలుండే వినియోగదారులతో, మదుపుదారులతో, రుణదాతలతో సత్సంబంధాలు పెంచుకోవడం ఆవశ్యకంగా మారింది. ఇటువంటి కీలక బాధ్యతలను యాజమాన్యం స్వయంగా నిర్వర్తించలేదు కాబట్టి ఈ బాధ్యతలను కంపెనీ సెక్రటరీలకు అప్పగిస్తారు. కంపెనీ సెక్రటరీలు నేర్పుతో వీటిని నిర్వర్తిస్తూ యజమానులకు తగిన సలహాలు, సూచనలు అందిస్తుంటారు.
ఎలాంటి లక్షణాలు?
కంపెనీ సెక్రటరీ కోర్సులో రాణించటానికి కుతూహలం, అవగాహన సామర్థ్యం, సంక్లిష్టమైన సాంకేతిక, న్యాయఅంశాల విశ్లేషణ, అన్వయం చేయగలిగే ప్రతిభాసంపత్తులు అవసరమవుతాయి. ఆర్థికశాస్త్రం, వాణిజ్యం, ఆర్థికపరమైన అంశాలపై సహజ ఆసక్తి ఉన్నవారికి ఈ కోర్సు సులువవుతుంది. సరికొత్త చట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవటం, ఆంగ్లంలో నైపుణ్యాలు అవసరం.
ఎలా చదవాలంటే...
సీఎస్‌ కోర్సును ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) నిర్వహిస్తుంది. ఇది పార్లమెంటు ద్వారా ఆమోదం పొందిన చట్టబద్ధమైన సంస్థ. ఈ కోర్సును ఫౌండేషన్‌ ప్రోగ్రామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ అనే 3 స్థాయుల్లో పూర్తిచేయవలసి ఉంటుంది.
* నమోదు (రిజిస్ట్రేషన్‌): సీఎస్‌ కోర్సులో ప్రతి దశకూ నమోదు తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే డీడీ రూపంలో ఫీజు చెల్లించాలి. డీడీ, దరఖాస్తు ఫారం రెండూ కలిపి ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా వారి ప్రాంతీయ కార్యాలయాల్లో/ చాప్టర్లలో అందజేసి నమోదు చేయించుకోవచ్చు. ఇపుడు సీఎస్‌ కోర్సులోని ఏ స్టేజికి అయినా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఐసీఎస్‌ఐ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవచ్చు. సీఎస్‌ పరీక్షలు ఏ దశకైనా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. జూన్‌లో ఒక పరీక్ష, డిసెంబర్‌లో మరో పరీక్ష జరుగుతుంది.
ఫౌండేషన్‌ పరీక్ష డిసెంబర్‌లో రాయాలనుకుంటే ఫౌండేషన్‌ కోర్సుకు మార్చి 31లోగా నమోదు, సెప్టెంబర్‌ చివరిలోగా పరీక్ష ఫీజును చెల్లించవలసి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ కోర్సుల్లో అన్ని మాడ్యూళ్లు కలిపి డిసెంబర్‌లో పరీక్ష రాయాలనుకుంటే ఫిబ్రవరి నెలాఖరులోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదే డిసెంబర్‌లో ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రాముల్లో కేవలం ఒక్క మాడ్యూల్‌ రాయాలనుకుంటే మే చివరిలోగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ ప్రోగ్రాములకు సంబంధించిన పరీక్షలను డిసెంబర్‌లో రాయాలనుకుంటే సెప్టెంబర్‌ నెలాఖరులోగా పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ పరీక్షలు జూన్‌లో (అన్ని మాడ్యూళ్లు) రాయాలనుకుంటే ఆగస్టు 31లోగా, అలాగే ఒక్క మాడ్యూల్‌ను జూన్‌లో రాయాలనుకుంటే నవంబర్‌ నెలాఖరులోగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎగ్జిక్యూటివ్‌, ప్రొఫెషనల్‌ పరీక్షలు జూన్‌లో రాయాలనుకుంటే మార్చి 25లోగా పరీక్ష ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
సీఎస్‌లోని అన్ని కోర్సుల రిజిస్ట్రేన్‌ల ఫీజు, పరీక్ష ఫీజు ఐసీఎస్‌ఐ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్‌ అయ్యి ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చు.
మినహాయింపులు
సీఏ ఇంటర్‌, సీఏ ఫైనల్‌, సీఎంఏ ఇంటర్‌, సీఎంఏ ఫైనల్‌ పూర్తిచేసిన విద్యార్థులు, కామర్స్‌ కోర్సుల్లో మాస్టర్స్‌ డిగ్రీలు కలిగి ఉన్నవారు సీఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌, సీఎస్‌ ప్రొఫెషనల్‌ ప్రోగ్రాముల్లోని కొన్ని పేపర్లు రాయవలసిన అవసరం లేదు. మినహాయింపు వర్తించే పేపర్ల వివరాలు ఇన్‌స్టిట్యూట్‌ సహాయక ఫోన్‌ నంబర్లకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు.
ఎవరిని సంప్రదించాలి?
ఐసీఎస్‌ఐ ప్రాంతీయ కార్యాలయాలు తూర్పు ప్రాంతీయ కార్యాలయం కోల్‌కతాలో, ఉత్తర ప్రాంతీయ కార్యాలయం న్యూదిల్లీలో, దక్షిణ ప్రాంతీయ కార్యాలయం చెన్నైలో, పశ్చిమ ప్రాంతీయ కార్యాలయం ముంబయిలో ఉన్నాయి. సంస్థ బ్రాంచీలు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో వీరి బ్రాంచిలున్నాయి. సీఎస్‌ కోర్సు గురించిన సంపూర్ణ వివరాలకు సందర్శించాల్సిన వెబ్‌సైట్‌ www.icsi.edu
ఉద్యోగావకాశాలు, హోదాలు
మనదేశంలో ఒక మోస్తరు నుంచి భారీ స్థాయి సంస్థలు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు ఉన్నాయి. కానీ మనదేశంలో ఉన్న కంపెనీ సెక్రటరీల సంఖ్య 35 వేలలోపే. కాబట్టి సీఎస్‌ కోర్సు పూర్తిచేసినవారికి విస్తృత ఉపాధి అవకాశాలున్నాయని చెప్పవచ్చు. వీరు సొంత ప్రాక్టీసు పెట్టుకోవచ్చు/ ఉద్యోగమైనా చేయవచ్చు.
కంపెనీ సెక్రటరీలు చీఫ్‌ ఫైనాన్స్‌ ఆఫీసర్లుగా, బ్యాంకు మేనేజర్లుగా, ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్లుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా మంచి హోదాల్లో ఉద్యోగాలు పొందవచ్చు.
విదేశాల్లోనూ బాగా గిరాకీ ఉంది. భారత ప్రభుత్వం- సింగపూర్‌, మలేషియా, థాయ్‌లాండ్‌, మారిషస్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వంటి అనేక దేశాలతో ఆర్థిక వ్యవహారాల ద్వైపాక్షిక ఉమ్మడి పరస్పర సహకార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల కంపెనీ సెక్రటరీలకు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరిగాయి.
సీఎస్‌ కోర్సులోని దశలు
మొదటి దశ- ఫౌండేషన్‌
ఇంటర్‌/ తత్సమాన కోర్సును పూర్తిచేసినవారు ఎవరైనా (ఫైన్‌ ఆర్ట్స్‌ మినహాయిస్తే) ఈ ఫౌండేషన్‌ కోర్సు చదవడానికి అర్హులు. ఇంటర్‌ పూర్తి అయిన తరువాత రిజిస్ట్రేషన్‌ చేయించుకుని ఫౌండేషన్‌ కోర్సును చదవవలసి ఉంటుంది.
సీఎస్‌ ఫౌండేషన్‌ పరీక్షను కూడా సీఏ కోర్సులోని సీపీటీ పరీక్షలాగానే ప్రవేశపరీక్ష రూపంలో నిర్వహించబోతున్నారు. అంటే సీఎస్‌ ఫౌండేషన్‌ పరీక్షను కూడా మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలోకి మార్చారు. ఈ పరీక్ష మొత్తం 200 ప్రశ్నలతో 400 మార్కులకు ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నకూ 2 మార్కులన్నమాట. ఈ పరీక్ష ఒకే రోజు రెండు భాగాలుగా రెండు పూటలా జరుగుతుంది.
ఉత్తీర్ణతకు 50% (200 మార్కులు) అవసరం. ఈ ప్రవేశపరీక్ష కూడా సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది.
రెండో దశ- ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌
సీఎస్‌ ఫౌండేషన్‌లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష రాయవచ్చు. సీఏ- సీపీటీ పాసైనవారు/ సీఎంఏ ఫౌండేషన్‌ పాసైనవారు/ డిగ్రీ పూర్తిచేసినవారు సీఎస్‌ ఫౌండేషన్‌తో అవసరం లేకుండా నేరుగా ఈ పరీక్ష రాయవచ్చు.
దీనిలో మొత్తం 7 పేపర్లను 2 మాడ్యూళ్లుగా విభజించారు. మాడ్యూల్‌-1లో 4పేపర్లు, మాడ్యూల్‌-2లో 4 పేపర్లుంటాయి. విద్యార్థి వీలును బట్టి రెండు మాడ్యూళ్లు అంటే 7 పేపర్లు ఒకేసారి లేదా ఒక్కో మాడ్యూల్‌ను విడివిడిగాగానీ 6 నెలల తేడాతో రాయవచ్చు. ప్రతి పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పేపర్‌లో 100 మార్కులకుగానూ కనీసం 40 మార్కులు, మాడ్యూల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50% సగటు మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కూడా జూన్‌లో, డిసెంబర్‌లో సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు.
మేనేజ్‌మెంట్‌ శిక్షణ
ఎగ్జిక్యూటివ్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారు 15 నెలలపాటు మేనేజ్‌మెంట్‌ శిక్షణ, మరో మూడు నెలలపాటు ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకోవాల్సివుంటుంది. దీన్ని ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ పూర్తిచేశాక కూడా తీసుకోవచ్చు. సీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా నమోదు చేయించుకుని ఆ తరువాత ఇన్‌స్టిట్యూట్‌ ప్రతిపాదించిన/ అనుమతించిన సంస్థలోకానీ కంపెనీ సెక్రటరీల వద్దగానీ శిక్షణ తీసుకోవచ్చు. ఈ సమయంలో విద్యార్థులకు రూ. 2000- రూ. 5000 వరకు ఉపకారవేతనం లభిస్తుంది.
మూడో దశ- ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌
ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లో ఉత్తీర్ణత సాధించినవారు/ ఉత్తీర్ణత సాధించి మేనేజ్‌మెంట్‌ శిక్షణ పూర్తిచేసుకున్నవారు ఈ ప్రోగ్రామ్‌ చదవడానికి అర్హులు. ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష రాసిన సంవత్సరం తరువాత ఈ పరీక్ష రాయవలసి ఉంటుంది. మొత్తం 9 పేపర్లు 3 మాడ్యూళ్లుగా విభజించారు. విద్యార్థి వీలునుబట్టి 9 పేపర్లు అంటే మూడు మాడ్యూళ్లు ఒకేసారి/ ఒక్కో మాడ్యూల్‌ ఒక్కోసారి విడివిడిగా ఆరు నెలల తేడాతో రాయవచ్చు. 100 మార్కులకు ఉండే ప్రతి పేపర్‌లో కనీసం 40 మార్కులు, మాడ్యుల్‌/ మాడ్యుల్స్‌లోని అన్ని పేపర్లలో కలిపి 50% సగటు మార్కులను సాధిస్తే విద్యార్థి మాడ్యూల్‌/ ప్రొఫెషనరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటిస్తారు.
ఓరల్‌ కోచింగ్‌/ ఈ-ట్రైనింగ్‌/ ఆన్‌లైన్‌ కోచింగ్‌
సీఎస్‌ సంస్థ ప్రాంతీయ కార్యాలయాల్లో, చాప్టర్‌లలో ఓరల్‌ కోచింగ్‌ అందుబాటులో ఉంది. అదనంగా కావాలంటే ప్రైవేటు కేంద్రాల్లో శిక్షణ తీసుకోవచ్చు. సీఎస్‌ కోర్సు చదవాలనుకునే దేశంలోని అన్ని ప్రాంతాల, గ్రామాల విద్యార్థుల సౌకర్యార్థం ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీ ఆఫ్‌ ఇండియా ఈ-లెర్నింగ్‌ ప్రోగ్రామ్‌ అనే ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
సీఎస్‌: ఫీజు వివరాలు
రిజిస్ట్రేషన్‌ కోసం...
ఫౌండేషన్‌ ప్రోగాం : రూ.4,500
ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాం : రూ.9,000 (కామర్స్‌
ప్రొఫెషనల్‌ ప్రోగాం : రూ.12,000
పరీక్ష కోసం...
ఫౌండేషన్‌కు : రూ.1200
ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రాం : రూ.1200 (ఒక్కో మాడ్యూల్‌కు)
ప్రొఫెషనల్‌ ప్రోగ్రాం : రూ.1200 (ఒక్కో మాడ్యూల్‌కు)

posted on 28.07.2015