Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆధునిక నైపుణ్యాలతో ఆదాయం!

     ఉదయాన్నే అల్పాహారంలో కొందరు నూడుల్స్‌ తింటుంటారు కదా? దాని పాకెట్‌మీద గమనించండి... తయారీ విధానం క్లుప్తంగా, స్పష్టంగా, ఆకర్షణీయంగా కనపడుతుంది- దాన్ని రాసేది కంటెంట్‌ రైటర్లు! ఇదే కాదు; ఇలాంటివి మరెన్నో విధులు ఈ వృత్తిలో భాగం. ఈ కెరియర్‌ గురించి తెలుసుకుందామా?
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ ప్రతి నిమిషం మనం సమాచారం (కంటెంట్‌)తోనే ఉంటాం. దీన్ని రాసేవారికి గిరాకీ పెరుగుతోంది. సుమారు పది సంవత్సరాల క్రితం కంటెంట్‌ రైటర్‌ అంటే వార్తాపత్రికలు, మ్యాగజీన్ల కోసం వ్యాసాలు రాసేవాళ్లు అనే అర్థముండేది. నేడు వారి ప్రొఫైల్‌ మారిపోయింది. కేవలం వ్యాసాలు రాసేవాళ్లే కాదు; బ్లాగు పోస్టులు, ఈ-పుస్తకాలు, ఉత్పత్తులపై సమీక్షలు, సామాజిక మాధ్యమాల్లో తాజా అంశాలు, పీఎల్‌ఆర్‌ పాకేజీలు, ఎస్‌ఈఓ వెబ్‌ కంటెంట్‌... ఇవన్నీ రాసేవారిని కంటెంట్‌ రైటర్‌గా వ్యవహరిస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాలాన్ని (ఇంటర్నెట్‌) వాడేవారు తక్కువగా ఉండేవారు. కానీ నేడు డెస్క్‌టాప్‌ల నుంచే కాకుండా లాప్‌టాప్‌లు, టాబ్లెట్స్‌, అలాగే మొబైళ్ల నుంచి కూడా అంతర్జాలాన్ని వాడుతున్నారు. దీనివల్ల రోజురోజుకూ అంతర్జాలాన్ని వాడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతిరోజు అంతర్జాలంలో లక్షల సంఖ్యలో వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటికీ సమాచారం అవసరమే.
అందుకే కంటెంట్‌ రైటర్లకు గిరాకీ ఉంది. అందుకు తగినంతమంది రచయితలు అందుబాటులో లేరు.
చాలామంది ఉద్యోగార్థులు ఐటీ, బ్యాంకింగ్‌ రంగాలు, ప్రభుత్వ ఉద్యోగాలపై దృష్టిసారిస్తున్నారు. కొందరు సంవత్సరాల తరబడి ఆయా ఉద్యోగాలకు ప్రయత్నించి నిరుద్యోగులుగానూ మిగిలిపోతున్నవారున్నారు. ఇలాంటివారు కంటెంట్‌ రైటింగ్‌ను కూడా ఒక అవకాశంగా గుర్తించటం మేలు. ఎందుకంటే విద్యార్థులందరికీ సాధారణంగా రాసే నైపుణ్యాలుంటాయి. విద్యాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణత పొందటానికి రాత నైపుణ్యాలను ఉపయోగిస్తూనే ఉంటారు కదా!
ఏమేం అవసరం?
కంటెంట్‌ రైటింగ్‌ రంగంలో విజయవంతంగా రాణించడానికి మూడు ప్రధాన నైపుణ్యాలు అవసరమవుతాయి. అవి:
* భాషా నైపుణ్యాలు
* అంతర్జాల నైపుణ్యాలు
* ఫార్మాటింగ్‌ & లేఅవుట్‌ నైపుణ్యాలు
భాషా నైపుణ్యాల్లో వ్యాకరణం, అక్షర క్రమం, విరామ చిహ్నాలు, వాక్య నిర్మాణం, పదజాలాలుంటాయి.
కంటెంట్‌ రైటర్‌ కావడానికి దాదాపు 1000 పదాలు తెలిస్తే సరిపోతుందని మీకు తెలుసా? కానీ చాలామంది తమకు తగినంత పదజాలం/ వ్యాకరణ పరిజ్ఞానం లేదని భావిస్తుంటారు. కానీ మన దేశంలో పదో తరగతి ఉత్తీర్ణులైనవారికి ఈ వృత్తికి అవసరమైన పదజాలం, వ్యాకరణ పరిజ్ఞానం ఉంటాయని రుజువైంది.
వ్యాకరణంలాగానే అక్షరక్రమం, విరామచిహ్నాలు కూడా ముఖ్యమే. ఎందుకంటే కొన్ని పెద్ద సంస్థల్లో చాలా SOPలు (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌) లిఖితపూర్వకంగా జాగ్రత్త చేసే ప్రక్రియ ఉంటుంది. అక్షర క్రమం, విరామచిహ్నాల్లో దొర్లే చిన్న తప్పులు వాక్యం అర్థాన్ని పూర్తిగా మార్చేసే ప్రమాదముంది.
కంటెంట్‌ రైటర్‌ కావాలంటే భాషా నైపుణ్యాలతోపాటు అంతర్జాల నైపుణ్యాలనూ పెంపొందించుకోవాలి. ఎందుకంటే కంటెంట్‌ రైటర్‌గా సమాచారం రాయడానికి ఆన్‌లైన్‌లో బ్లాగులు, వెబ్‌సైట్లలో ఉంచిన సమాచారంపై పరిశోధన చేయాల్సివుంటుంది. సమాచారం రాసే ఈ బుక్‌లు, వెబ్‌సైట్ల కోసం లోగోలతోపాటు కవర్‌ పేజీ డిజైన్‌లను చేయాల్సిరావొచ్చు. WORDPRESS వంటి కంటెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ (CMS)పై సమర్థంగా పనిచేయగలగాలి. నేడు చాలా బ్లాగులు, వెబ్‌సైట్లు WORDPRESS పైనే నడుస్తున్నాయి. అంతర్జాల నైపుణ్యాల్లో భాగంగా SEO (సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌) నైపుణ్యాలను నేర్చుకోవాలి. ఆన్‌లైన్‌లో ఉపయోగించడానికి కావాల్సిన సమాచారమంతా SEOకు అనుకూలంగా ఉండాలి కాబట్టి!
ఫార్మాటింగ్‌, లేఅవుట్‌ నైపుణ్యాల్లో భాగంగా సమాచారాన్ని వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా నిర్దిష్ట రూపంలో ఎలా సంపాదించాలో తెలుసుండాలి. కంటెంట్‌ ఫార్మాట్‌ల్లో చాలా రకాలున్నాయి. వాటిలో కొన్ని- వ్యాసాలు, విద్యాసమాచారం, బ్లాగు పోస్టులు, పిల్లల కథానికలు, సొంతంగా ప్రయత్నించగల గైడ్‌లు, ఈ- బుక్స్‌, ఎడిటింగ్‌ & ప్రూఫ్‌ రీడింగ్‌, ఈ- లెర్నింగ్‌ మాడ్యూళ్లు, కాల్పనిక రచనలు, గ్రాంట్‌ ప్రపోజల్స్‌, న్యూస్‌ లెటర్లు, PLR (ప్రైవేట్‌ లేబుల్‌ రైట్స్‌) వ్యాసాలు, పత్రికా ప్రకటనలు, ఉత్పత్తుల సమాచారం, వాటి సమీక్షలు, ప్రశ్నల నిధులు, రెజ్యుమెలు & కవర్‌ లెటర్లతో కూడిన సీవీలు, SEO వెబ్‌ కంటెంట్‌, స్టడీ మెటీరియల్‌, టెక్నికల్‌ గైడ్స్‌ & మాన్యువల్స్‌, ట్యుటోరియల్స్‌, వర్క్‌ బుక్స్‌ మొదలైనవి.
నచ్చిన ధోరణిలో- సంభాషణాత్మకంగా, వర్ణనాత్మకంగా, వివరణలతో/ ప్రోత్సాహకంగా... అవసరానికి అనుగుణంగా రాయగలిగే విధానాన్ని ఇందులో నేర్చుకోవాల్సివుంటుంది.
అవకాశాలు
ఏదైనా ఒక ఉద్యోగ సంబంధిత వెబ్‌సైట్‌కు వెళ్లి సెర్చ్‌ బాక్సులో కంటెంట్‌ రైటర్‌/ డెవలపర్‌ అనే కీవర్డ్‌ కొట్టండి. టైమ్స్‌జాబ్స్‌, నౌకరీ, మాన్‌స్టర్‌ ఇండియా, షైన్‌లలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కనపడతాయి. ఫుల్‌టైం, పార్ట్‌టైంగా, ఫ్రీలాన్స్‌ కంటెంట్‌ రైటర్‌గా కూడా అవకాశాలు దొరుకుతాయి.
గత 4- 5 సంవత్సరాల్లో ఫ్రీలాన్సింగ్‌ తరహా ఉద్యోగాలకు గిరాకీ రానురానూ పెరుగుతోంది. అంటే వీరు ఏ సంస్థకీ/ యజమానికీ పరిమితమై ఉండరు. కంటెంట్‌ రైటింగ్‌ ప్రాజెక్టుల్లో ఎవరికైనా పనిచేసి పెట్టవచ్చు. ఇక్కడ లాభదాయకమైన విషయమేమిటంటే- పనిచేసిన ప్రతి గంటకీ డబ్బు చెల్లిస్తారు. అంతేకాకుండా ఒకే సమయంలో నచ్చినన్ని ప్రాజెక్టులు చేయవచ్చు. అయితే అననుకూలమైన విషయం... కొన్నిసార్లు తగినంత పని కూడా దొరకకపోవచ్చు. నాణ్యమైన సేవలను అందించినంతకాలం సంస్థలు ఎంచుకుంటాయి, పనిని అప్పజెబుతాయి.
మొదలు పెట్టడమెలా?
ముందుగా మీకు సొంతంగా ఉచితంగా www.blogger.com, www.wordpress.com, www.typepad.com మొదలైనవాటిల్లో ఒక సైట్‌ను తయారు చేసుకోండి. నచ్చిన అంశంపై చిన్న చిన్న వ్యాసాలను రాయండి. ఆ వ్యాసాలు రాష్ట్రంలోని, ప్రపంచలోని తాజా పరిణామాలపై ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు- తాజాగా జరిగిన ప్రపంచకప్‌ మీద రాయవచ్చు. ఐపీఎల్‌ మ్యాచ్‌లపైనా రాయవచ్చు. ప్రతిరోజూ చూసిన ఆటపై 350- 400 పదాల్లో బ్లాగులో చిన్న సారాంశాన్ని రాయండి. పుస్తకాలు, సినిమాలపై అభిప్రాయాలను రాయవచ్చు, ఆ విధంగా పాఠకులనూ సంపాదించుకోవచ్చు.
ప్లస్‌ టూ (ఇంటర్‌/ 10+2)చదువుతున్నపుడు మొదలుపెడితే డిగ్రీ/ పీజీ, చదువు పూర్తయ్యేనాటికి కంటెంట్‌ రైటర్‌కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. దాంతో సులభంగా మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి పేరున్న సంస్థల్లో పనిచేసే అవకాశం పొందవచ్చు.
కోర్సులు: దేశంలోని ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు లేఖనం, జర్నలిజం/ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఏదేమైనా, ఈ కోర్సులన్నీ ప్రధానంగా సిద్ధాంతపరమైన సమాచారం/ ప్రింట్‌ మీడియాపై దృష్టిసారిస్తాయి. కంటెంట్‌ రైటర్‌ అవ్వాలనుకునే అభ్యర్థికి అవసరమైన అన్ని అంశాలనూ, నైపుణ్యాలనూ అందివ్వలేకపోవచ్చు.
ప్రత్యామ్నాయంగా కంటెంట్‌ రైటింగ్‌ సేవలను అందించే సంస్థల్లో శిక్షణ నిమిత్తం చేరవచ్చు. తద్వారా ఆచరణాత్మకంగానూ నేర్చుకోవచ్చు, అనుభవమూ సంపాదించుకున్నట్లవుతుంది.
వేతనం ఎంత?: కంటెంట్‌ రైటర్‌ ఫుల్‌టైం జాబ్‌ చేసేవారికి ప్రవేశ స్థాయిలో రూ.8000- రూ.10,000పైగా ఉంటుంది. అనుభవం, నైపుణ్యం, పని చేస్తున్న సంస్థనుబట్టి నెలకు లక్ష రూపాయల వరకూ పొందే అవకాశముంది.
పార్ట్‌టైం/ ఫ్రీలాన్స్‌ కంటెంట్‌ రైటర్‌లకు పదాల సంఖ్య/ గంటల చొప్పున చెల్లిస్తారు. సాధారణంగా వారికి ప్రతి 500 పదాలకు రూ. 350- రూ.500 చొప్పున; గంటల చొప్పున అయితే గంటకు రూ.500- రూ.1000 చొప్పున చెల్లిస్తారు.

posted on 27.05.2015;">