Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
మీ కోర్సుకు కొత్త విలువ

ఆసక్తి ఉన్న డిగ్రీ కోర్సుల్లోనో, వృత్తివిద్యల్లోనో చేరిన విద్యార్థులు యాంత్రికంగా కోర్సు పూర్తిచేయటం వల్ల ప్రయోజనం ఉండదు. తమ విద్యాభ్యాస కాలాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దృష్టిని ఏర్పరరచుకోవాలి. కొన్ని మెలకువలు పాటిస్తేనే అది సాధ్యమవుతుంది; ఉజ్వల భవితకు పునాది ఏర్పడుతుంది. అందుకు ఉపకరించే కథనమిది!
వితంలో ఉన్నతస్థానానికి చేరుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ, కొందరే ఈ ఆశయాన్ని సాధించగలరు. వీరి ప్రయాణంలో స్పష్టత, లక్ష్యసాధన దిశగా వేసుకున్న పటిష్ఠమైన ప్రణాళిక, అమలు ప్రధాన కారణాలుగా కనిపిస్తాయి.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో ప్రధానంగా 4 దశలుంటాయి. ఈ దశలు విడివిడిగా కాక పరస్పరం అంతస్సంబంధాలు కలిగివుంటాయి. అంటే మొదటిదశ ముగిసిన తరువాత తిరిగి ఆ దశకు వెళ్లే అవసరం రాదు అని కాదు. ఆచరణ తీరుతెన్నులను బట్టి మార్పులుండడం సహజం.
లక్ష్యాన్ని గుర్తించడం: జీవితంలో ఎన్నో ఆశయాలుంటాయి. అన్నింటినీ సాధించలేకపోవచ్చు. కాబట్టి ఆశయాలను లక్ష్యాలుగా గుర్తించాలి. ఇవి దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలుగా ఉంటాయి. స్థిరపడాలనే ఆశయం ఒక దీర్ఘకాలిక లక్ష్యం. అందులో మధ్యకాలిక లక్ష్యం ఉద్యోగం. దీనిని సాధించడానికి కావాల్సిన హ్రస్వకాలిక లక్ష్యం విద్యార్హతలు. కాబట్టి విద్యార్థిదశలో లక్ష్యం ఏర్పరచుకోవడం చాలా అవసరం.
ఉదా: ఒక ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి లక్ష్యం- గుర్తింపు గురించి చూస్తే..
* ఇంజినీరింగ్‌లో కనీసం 60- 65% మార్కులు ఉద్యోగానికి అర్హతనిస్తాయి. అంటే మొదటి లక్ష్యం... 60- 65%తో పాస్‌ అవ్వడమన్నమాట.
లక్ష్యాల అంతర్దశ విభజన: బీటెక్‌లో 65% సాధించాలంటే ప్రతి సెమిస్టర్‌లోనూ కనీస లక్ష్యం 65%గా గుర్తించడం. నాలుగేళ్ల కాలవ్యవధి ఉన్న ఇంజినీరింగ్‌లో చివరి సంవత్సరంలో 65% సంపాదించగలంలే అనుకోవడం అత్యాశే అవుతుంది. అంచెల్లో లక్ష్య నిర్దేశం జరగాలి.
ప్రణాళిక తయారీ: లక్ష్యాన్ని గుర్తించి, అందులోని అంతర్దశలను గుర్తించిన తరువాతి దశ లక్ష్యసాధనకు అవసరమైన ప్రణాళిక రచన. ఇంటర్మీడియట్‌ వరకు స్వయం ప్రణాళిక అనే అంశం ఎక్కువ శాతం విద్యార్థులకు తెలియకపోవచ్చు. అందువల్ల ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరంలో ప్రణాళిక కొంత కష్టమనిపించే అవకాశముంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంత స్వయంగానూ, మరికొంత ఇతరుల సహాయ సహకారాలతోనూ ప్రణాళిక తయారు చేసుకోవచ్చు.
ఎన్ని గంటలకు నిద్రలేస్తాం, కళాశాలల వేళలు, ప్రయాణానికి కావాల్సిన సమయం, ఇతర అవసరమైన పనులకు కావాల్సిన సమయాన్ని గుర్తించి, ఎంత వ్యవధి దొరుకుతుంది, ఎంత కేటాయించగలమనేవి గుర్తించాలి. ఈ సమయం కేవలం చదువుకోసమే కేటాయించాలి.
అన్ని పనులకూ కలిపి సమయం కేటాయించిన తరువాత మూడు గంటల సమయం మిగిలింది అనుకుందాం. ఈ మూడు గంటల వ్యవధికే ప్రణాళిక ముసాయిదా తయారు చేసుకోవడం మొదటి గెలుపు, మానసిక స్థైర్యాలకు ప్రేరకంగా పనిచేస్తుంది.
ప్రణాళిక ఆచరణ: మొదటి దశ నుంచి మూడోదశ వరకు ప్రమేయ ప్రమాణం క్రమంగా పెరుగుతూ ఉండడం గమనించవచ్చు. అయితే అన్ని దశల్లోకీ ఈ నాలుగోదశ అయిన ఆచరణ కష్టమైనదిగా భావించవచ్చు. పై మూడు దశలకు సంబంధించిన పని ఎక్కువభాగం మానసిక స్థితిగతులకు సంబంధముండి, తక్కువ భాగం భౌతిక శ్రమతో కూడుకున్నదిగా ఉంటుంది.
కానీ ఎక్కువభాగం భౌతికంగా ప్రమేయం కలిగి ఉండడం, దాదాపు సమాన పాళ్లలో మేథాశ్రమతో కూడుకున్నది కావడం ఈ దశకు ప్రత్యేకం. అందుకే ఈ దశలో విద్యార్థికి మనోనిబ్బరం అవసరమవుతుంది. కొంత కాలం శ్రమను ఓరిమితో తట్టుకుంటే జీవితకాలం ఆనందంగా ఉండవచ్చనే ఏకైక అంశం ఉత్ప్రేరకం కావాలి.

లక్ష్యసాధనకు సూచనలు
లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికబద్ధంగా అమలు చేస్తున్నపుడు కొన్ని సందిగ్ధతలు, అనుమానాలు, చిక్కులు ఎదుర్కొనవచ్చు. ఉదాహరణకు- ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి అనే అంశం ఉందనుకుందాం. ఆలస్యంగా నిద్రలేచే వారి విషయంలో ఇది ఒక చిక్కుగామారి, సరైన దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే నిరాశ, నిస్పృహలకు లోనై లక్ష్యసాధనకు దూరమయ్యే అవకాశం ఉంది.
ఉదయం 7 గం.లకు లేచే అలవాటు ఉంటే ఒకేసారి 5 గంటలకు లేచే లక్ష్యంకన్నా దశలవారీగా సమయాన్ని పెంచి మొదట 6 గంటలకు, తరువాత 5.30 గంటలకు, తుది దశలో 5 గంటల లక్ష్యంగా ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో ఈ దశకు చేరుకోవడమనే మార్గం తెలుసుకోవాలి. లేకపోతే ఈ మార్గాన్ని సిఫారసు చేయగలిగిన వారి నుంచి సలహా అయినా తీసుకోవాలి.

చిన్నచిన్న జాగ్రత్తలు
నిర్దిష్టమైన లక్ష్యం ఏర్పరచుకుని దానిని తూచ తప్పకుండా అమలు చేయడం అవసరం. విద్యార్థి దశలో అందునా మొదటి సంవత్సర స్థాయిలోనే అంటే కొంత అస్పష్టత, ఆత్మవిశ్వాస లోపం వంటివి ఉండొచ్చు. ప్రత్యేకించి ఇంటర్మీడియట్‌ వరకు ఇతరులు రచించిన ప్రణాళిక, లక్ష్యాల్లో అంతర్భాగంగా పనిచేసినపుడు ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బంది. అయినా దీర్ఘకాలంలో లభించే సత్ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ధైర్యంతో తొలి అడుగువేయాలి. లక్ష్యం ఏర్పాటు నాందిగా ఫలవంతమైన భవిష్యత్తుకు ప్రయాణం మొదలుపెట్టడం అవసరం. కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.
* విద్యార్థి తన శక్తిసామర్థ్యాలను అతిగానూ, తక్కువగానూ అంచనా వేసుకోకూడదు. ఈ విషయంలో తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు, స్నేహితులు, అధ్యాపకులు సరిగా అంచనా వేయడానికి అవసరమవుతారు. లక్ష్యం గురించి సేకరించిన సమాచారం వీరితో చర్చించి, ఒక స్పష్టతను ఏర్పరచుకోవాలి.
* సమయ వినిమయంలో వేసుకున్న ప్రణాళిక అమలులో కచ్చితత్వం పాటించి తీరాలి. ఈ విషయంలో వైఫల్యాలకు సాకులు చూపించుకోరాదు. సరైన కారణాలు వెతికి వాటిని సన్నిహితుల సాయంతో విశ్లేషించి, అవసరమైతే తగిన మార్పులు చేసుకుని ఇనుమడించిన ఉత్సాహంతో అమలుపరచాలి. ప్రణాళిక తయారు చేయడంలోని నిబద్ధతను అమలులో కూడా కొనసాగించాలి.
* యాంత్రికంగా అనిపించినా ఏ సమయానికి ఏం చేయాలనుకున్నారో అది చేయడం అలవరచుకోవాలి. మొదట కష్టంగా అనిపించినా పోనుపోనూ అలవాటుగా మారుతుంది. సమయానుకూలంగా చేయకపోవడం బలహీనంగా మారాలి. అదే బలమవుతుంది. అపుడే సమయ వినిమయం విషయంలో బలవంతులైనట్లు అనుకోవాలి.
* చేయాల్సిన పనులను చిన్నవిగా, సూక్ష్మంగా అర్థమయ్యేలా రాసుకోవాలి. దీనికి అధ్యాపకుల, సీనియర్‌ విద్యార్థుల సలహా అవసరమవుతుంది.
* ప్రతిరోజూ నిద్రకు ముందు ఆరోజు చేయాలనుకున్న పనులు, పూర్తిచేసినవీ, చేయలేకపోయినవీ, వాటికి కారణాలూ, వాటిని పూర్తిచేయడానికి కావాల్సిన అదనపు సమయం కేటాయింపు వంటివి మదింపు చేసుకోవాలి. దీనివల్ల రుజు సమయవినిమయం గురించి తెలుస్తుంది. పైగా ప్రణాళికలోని లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు మొదటి నుంచే లక్ష్య నిర్ణయం, కార్యాచరణపై దృష్టిపెట్టాలి. ఉన్నత ప్రమాణాలతో కూడిన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి!

5 లక్షణాలున్నాయా?
ఎన్నో లక్ష్యాలున్నా.. వాటికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని గుర్తించి, అవగతం చేసుకుని, అమలుపరిస్తే మంచిది. ఈ చర్య ద్వారా అవసరమైన లక్ష్యాలు; ఉపరితల లక్ష్యాల మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా లక్ష్యాలకు 5 లక్షణాలుండాలి.
ఈ ఐదు లక్షణాలనూ ఆంగ్లంలో SMART లక్షణాలుగా వ్యవహరిస్తారు. ఈ పదంలో ఒక్కో అక్షరం ఒక్కో పదానికి సంక్షిప్త సూచిక. Specific, Measurable, Attainable (Action oriented), Realistic, Timely.
నిర్దిష్టమైనవి: ఏర్పరచుకునే లక్ష్యం ఒక స్పష్టమైన ఫలితాన్ని ఆశించినదై ఉండాలి. దీనినే నిర్దిష్టతగా వ్యవహరిస్తారు. ఉదాహరణకు- డిగ్రీ తరువాత ఏం చేయాలనే విషయంలో ఒక విస్పష్టత ఉండాలి. డిగ్రీ తరువాత ఉద్యోగమనే లక్ష్యం ఉంటే ఏ రంగంలో, ఏయే పరిశ్రమలున్నాయి, వాటిలో ప్రవేశస్థాయిలో నియామకాలు ఎలా జరుపుతారు, శిక్షణ కాలం ఎంత ఉంటుంది, ఏయే అదనపు నైపుణ్యాలు నేర్చుకోవాలి అన్న విషయంలో స్పష్టతతోకూడిన విషయ సేకరణ జరిగితే ఉద్యోగమనే లక్ష్యం నిర్దిష్టమైనదిగా ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగమనే లక్ష్యం నిర్దిష్టమైనదే అయినా కొంత మేరకు స్పష్టత లోపించింది. ఎందుకంటే ప్రభుత్వ నియామకాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రకటన కోసం ఎదురుచూపులు చూడవలసి ఉంటుంది.
కొలబద్ధమైనవి: లక్ష్యం పురోగతి, తిరోగతిపరంగా కొలవగలిగేవిగా ఉండాలి. ఉదాహరణకు- చదువుకు కేటాయించే సమయం ఎక్కువా లేక తక్కువా? ఏవైనా మార్పులు అవసరమా అని అంచనా వేయగలిగి ఉండాలి. దీనికి కేటాయించిన సమయంలో ఎంత పురోగతిని సాధించారు? ఎంత సాధించాల్సింది, వీటి మధ్య వ్యత్యాసమెంత అనే అంశాల్లో కొలవగలగాలి. దీనిని బట్టి దిద్దుబాటు చర్యలకు అవకాశం ఉంటుంది.
కార్యాచరణ యోగ్యమైనవి: నిర్దేశించుకున్న లక్ష్యం కార్యాచరణ రూపం దాల్చడానికి వీలైనదిగా ఉండాలి. పరీక్షలకు ఒక నెల ముందుగానో లేక అంతకంటే తక్కువకాలంలోనే చేయగలంలే అనుకోవడం మితిమీరిన ఆత్మవిశ్వాసానికి సంకేతం. చివరి నెలలో పునశ్చరణకు మాత్రమే అవకాశం ఉంటుందనేది కార్యసాధకతకు సంకేతం. ఆర్భాటంగా, లక్ష్యం పెట్టుకుని సాధించలేక చివర్లో ఆత్మన్యూనత అనే అవలక్షణాన్ని సంపాదించుకోవటం వ్యర్థం. దానికన్నా చిన్న చిన్న లక్ష్యాలను ఆచరణలోపెట్టి, సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగలగాలి.
వాస్తవికమైనవి: లక్ష్యం గుదిబండగా మారకూడదు. అలా కాకుండా ఉండాలంటే ఏర్పరచుకున్న లక్ష్యం శక్తిసామర్థ్యాలు, అవకాశాలు, స్వీయలోపాలను సరిగా అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా రూపొందించుకున్నవై ఉండాలి. ఒక విద్యార్థికి భావప్రకటన సామర్థ్య లోపం ఉందనుకుందాం. దానికి అనుగుణంగా ఆ విద్యార్థి లక్ష్యంలో భాగంగా ఈ అంశంలో అభివృద్ధికి అదనపు శిక్షణ ఒక అవసరంగా గుర్తించాలి. ఈ వాస్తవిక దృక్పథం చాలా ఉపయోగకరం.
సమయానుకూలత: బీటెక్‌ మొదటి సంవత్సరంలో ఉన్న విద్యార్థి గణిత, భౌతిక, రసాయనిక శాస్త్రం వంటి మౌలికాలను అభ్యాసం చేసి ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడం సమయానుకూలతను సూచిస్తుంది. అలాగే ఆప్టిట్యూడ్‌, కమ్యూనికేషన్‌ వంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాల అభ్యాస లక్ష్యం కూడా దీన్నే సూచిస్తుంది. కానీ ఇటువంటి వ్యక్తిత్వ అంశాల్లో నాలుగో సంవత్సరంలో విద్యార్థి లక్ష్యం ఏర్పరచుకోవడం సమయానుకూలతను సూచించదు.
వ్యక్తిత్వ వికాస శిక్షణ అభ్యాసాలు అంచెలంచెలుగా, మొదటి సంవత్సరం నుంచే అభ్యాసం చేయడం, తగిన, అవసరమైన వనరుల గుర్తింపు, ఉపయోగం చాలా అవసరం. అవసరమనుకుంటే అదనపు శిక్షణలను గుర్తించడం కూడా ఒక లక్ష్యమే.

కార్యాచరణకు ఇదిగో నమూనా!
ఒక విద్యార్థి ఇంజినీరింగ్‌ తరువాత అమెరికాలో ఎంఎస్‌ చేయాలనుకునే లక్ష్యంతో ఉన్నాడనుకుందాం. ఆ విద్యార్థి మొదటి సంవత్సరం నుంచే ఎంఎస్‌ గురించి ఏ సమాచారం సేకరించవచ్చో చూద్దాం!
* తన శాఖకు సంబంధించిన సబ్జెక్టుల్లో ఎంఎస్‌ స్థాయిలో ఏయే ప్రత్యేక సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి?
* ఏయే విశ్వవిద్యాలయాలు ఆయా కోర్సులను అందిస్తున్నాయి?
* వాటిలో ప్రముఖమైనవి ఏవి?
* ఆ విశ్వవిద్యాలయాల్లో పేరొందిన ప్రొఫెసర్లు ఎవరు? వారు చేస్తున్న పరిశోధనలేమిటి? ఏ సంస్థల ఆర్థిక సహకారంతో చేస్తున్నారు?
* ఆ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి కావాల్సిన విద్యాప్రమాణాల్లో (బీటెక్‌లో ఉత్తీర్ణత శాతం), ఆంగ్లభాష పరీక్ష (టోఫెల్‌ వంటివి) కావాల్సిన స్కోరు, జీఆర్‌ఈ స్కోరు, విద్యార్థులకు రుసుముల్లో ఇచ్చే రాయితీలు, ఉపకార వేతనాల వివరాల వంటివి మొదటి సంవత్సరంలోనే సేకరించవచ్చు. అదనంగా అమెరికా కాకుండా జర్మనీ, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో కూడా ఇటువంటి కోర్సుల వివరాలు సేకరించవచ్చు.
రెండో సంవత్సరంలో తమకు ఇష్టమైన రంగంలో ఉన్న కోర్సుల వివరాలు, భవిష్యత్తులో అవకాశాలు.. ఇంకా ఆంగ్లభాషకు సంబంధించిన కోర్సులకు శిక్షణ, పరీక్షలో ఉత్తీర్ణత వంటి అంశాలపై దృష్టి సారించాలి.
మూడో సంవత్సరంలో జీఆర్‌ఈ, ఇంకా జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో జరిగే సదస్సుల్లో, పోటీల్లో పాల్గొనటం, తనకు సంబంధించిన విద్యారంగంలో రీసర్చ్‌ పేపర్ల ప్రచురణ, బీటెక్‌లో ఉత్తీర్ణత శాతం అభివృద్ధి వంటి సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టాలి. రీసర్చ్‌ పేపర్ల ప్రచురణకు అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉన్నత విద్యా ప్రమాణాలు పాటించే విశ్వవిద్యాలయాలు అత్యంత ప్రాధాన్యాన్నిస్తాయి. అయితే ఈ ప్రచురణలు మౌలికమై ఉండాలి కానీ, ఇతరుల ప్రచురణల నకలు కాకూడదు (ఒరిజినల్‌ వర్క్‌ డన్‌ బై ది స్టూడెంట్‌).
నాలుగో సంవత్సరంలో అతి ముఖ్యమైనది ప్రాజెక్టు. దీన్ని నిబద్ధతతో చేయాలి. ఇది కూడా ఎంఎస్‌ ప్రవేశంలో ప్రభావం చూపుతుంది. విద్యార్థి గుర్తించిన విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లతో పరిచయం, మంతనాలు, ఈ-మెయిల్‌ ద్వారా వీరిలో సంప్రదింపులు, ప్రాజెక్టులో వారి అమూల్యమైన అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పొందడం ఎంతో ఉపయోగం.
ప్రొఫెసర్లు చాలా స్నేహశీలురు. వారు విద్యార్థులను ఎంతో ప్రోత్సహిస్తారు. చాలామందికి ఈ విషయం తెలియక ఈ మంచి అవకాశాన్ని వృథా చేసుకుంటారు. పైగా ప్రొఫెసర్లు తాము చేస్తున్న ప్రాజెక్టుల్లో ఆర్థికసాయంతో కూడిన సహకారం అందించి రీసర్చ్‌కి కూడా అవకాశం కలిగిస్తారు.
ఆఖరిగా ఇంజినీరింగ్‌తోపాటు సాంకేతికపరమైన ఏయే ఇతర కోర్సులు చేస్తే ఉపయోగం ఉంటుందనేది కూడా తెలుసుకోవాలి. వాటిలో ప్రావీణ్యతా సర్టిఫికెట్‌ కోర్సులు చేయటం ఎంతో ఉత్తమం.


Back..

Posted on 06-09-2016