Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీపీటీకి సరైన సన్నద్ధత!

సీఏ కోర్సుకు ప్రవేశపరీక్ష- కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు ఈ సీపీటీలో ఉత్తీర్ణులైతే సీఏ కోర్సు ప్రారంభించవచ్చు. సీపీటీకి మరో పాతిక రోజులకు పైగా సమయం ఉంది. దీనిలో మెరుగైన మార్కులు తెచ్చే మెలకువలను చూద్దాం!
సీపీటీలో ఉత్తీర్ణత పొందాలంటే పూర్తిగా 100 మార్కులే కాకుండా సబ్జెక్టు వారీగా కూడా 30% మార్కులు సాధించాలి. కాబట్టి అన్ని సబ్జెక్టులకూ సన్నద్ధతలో ప్రాధాన్యం అవసరం. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులను తగ్గిస్తారు.
సీపీటీ రెండు భాగాలుగా వందేసి మార్కులకు జరుగుతుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరిగే మొదటి సెషన్‌లో సబ్జెక్టులు- అకౌంట్స్‌ అండ్‌ మర్కంటైల్‌ లా. మధ్యాహ్నం 2- 4 గంటల మధ్య జరిగే రెండో సెషన్‌లో సబ్జెక్టులు- ఎకనామిక్స్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌.
ఎలా సిద్ధం అవ్వాలి?
1. ఉన్న వ్యవధికి సరిపడా టైమ్‌ టేబుల్‌ తయారుచేసుకోవాలి. అంటే ఏ సమయంలో ఏ సబ్జెక్టు, ఏ అధ్యాయం చదవాలనేది. ఎప్పుడుబడితే అప్పుడూ, ఏది పడితే అదీ కాకుండా ప్రణాళికాబద్ధంగా చదివితే సీపీటీ పాసవటం పెద్ద కష్టమేమీ కాదు.
2. ఇన్నాళ్ళూ పాఠ్యపుస్తకాలు, ఏదైనా స్టడీ మెటీరియల్‌ని చదివివుంటే వాటినే మళ్ళీ మళ్ళీ చదవాలి. కొత్తవి చదవకూడదు. అలా చెయ్యడం వల్ల తికమక పడే అవకాశం ఎక్కువ. ఉదాహరణకు మర్కంటైల్‌ లా సబ్జెక్టులోని కొన్ని కేస్‌స్టడీలు ఒక పుస్తకంలో ఒకలా, మరోదానిలో మరోలా ఉంటాయి. ఐసీఏఐ వాళ్ళ స్టడీ మెటీరియల్‌నే ప్రామాణికంగా తీసుకోవాలి.
3. కొంతమంది కొన్ని సబ్జెక్టుల్లోని అధ్యాయాలు అంత ముఖ్యమైనవి కావని వదిలేస్తుంటారు. ఇది సరి కాదు. పోటీ పరీక్షల్లో అన్నింటికీ అవసరమైన ప్రాముఖ్యం ఇవ్వవలసిందే.
4. రోజుకు 10 నుంచి 12 గంటలపాటు సన్నద్ధతకు కేటాయించండి.
5. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలకు ఎలా తయారవ్వాలంటే...
ఎ) ముందుగా కాన్సెప్టును అర్థం చేసుకొని తరువాతనే ఈ ప్రశ్నలు సాధన చేయాలి. చాలామంది ఇదేమీ లేకుండానే ప్రశ్నలను బట్టీ పడుతున్నారు. మొదటగా కాన్సెప్టుపై ఉన్న స్పష్టతతో ప్రశ్నను సాల్వ్‌ చేయాలి. తరువాత మెటీరియల్‌లో ఉన్న సమాధానాన్ని సరిచూసుకోవాలి. తప్పు సమాధానం గుర్తించివుంటే ఎందుకు, ఎక్కడ తప్పు చేశారో పరిశీలించుకోవాలి.
బి) సీపీటీ మెయిన్‌లో మీకు తెలిసిన మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలనే చిన్న చిన్న మార్పులు చేసి కొత్త పద్ధతిలో ప్రశ్నలుగా ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటివాటికి బట్టీ పద్ధతి పనికి రాదు. పేపరు ఎలా వచ్చినా రాయగలగాలంటే కాన్సెప్టుకు సంబంధించిన స్పష్టత తప్పనిసరి.
సి) ఈ కొద్దిరోజుల్లో చేయవలసినది... బాగా వచ్చిన ప్రశ్నలను కొట్టేస్తూ రావటం (స్ట్రైక్‌ ఆఫ్‌). పునశ్చరణ చేసిన ప్రశ్నల్లో సులువుగా సమాధానం చేయగలిగివాటినీ, అంత ముఖ్యం కాదు అనుకుంటున్నవాటినీ కొట్టేసెయ్యాలి. రెండో పునశ్చరణలో మరికొన్ని ప్రశ్నలను అలా చేయాలి. మూడు/ నాలుగు పునశ్చరణలు చేసే సమయానికి 80- 90% ప్రశ్నలను కొట్టివేయగలిగితే చాలు! పరీక్షకు ఒకటి రెండు రోజుల ముందు మిగిలిన ఆ 10% ప్రశ్నలపై దృష్టి కేంద్రీకరిస్తే సరిపోతుంది.
6. ఐసీఏఐ స్టడీమెటీరియల్‌ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలను (ఎంసీక్యూ) తయారు చేసుకోవాలి. సీపీటీలో ఎక్కువ ప్రశ్నలను ఐసీఏఐ స్టడీమెటీరియల్‌లో ఇచ్చిన ప్రశ్నలను ఆధారం చేసుకొని తయారు చేస్తారు.
7. ఒక సందేహాల పుస్తకం పెట్టుకోవాలి. వచ్చిన అనుమానాలను దానిలో రాస్తుండాలి. అధ్యాపకులను అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. సొంతగా తయారవుతుంటే చదివిన పాఠ్యపుస్తకాలు/ స్టడీ మెటీరియల్‌ ద్వారా సందేహాలు తొలగించుకోవాలి. సీపీటీ మెయిన్‌ పరీక్షకు ముందురోజో, 2 రోజులు ముందుగానో సందేహాల పుస్తకాన్ని ఒకసారి సరిచూసుకుంటే మంచిది.
8. కష్టం అనిపించే సబ్జెక్టును ఎక్కువసేపు చదవాలి. అంతేగానీ వచ్చిన సబ్జెక్టునే చదువుతూపోతే రానిదాన్ని చదవటానికి సమయం సరిపోదు.
9. చదివే పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. చదివేటప్పుడు రన్నింగ్‌ నోట్సు తయారుచేసుకొని వుంటారు. పొరపాటున ఆ పుస్తకాలు పోతే మళ్ళీ నోట్సు రాసుకోవడం కష్టం. విలువైన సమయమంతా కొత్త నోట్సుకే సరిపోతుంది. చివరి నిమిషంలో ఇబ్బంది పడతారు.
10. మంచి కంపెనీకి సంబంధించిన కాల్‌క్యులేటర్‌ను ముందే కొని, రోజుకు అరగంటైనా వేగంగా టైపింగ్‌ సాధన చేయాలి. దీన్నే పరీక్షలో ఉపయోగించాలి. చిన్నసైజువి వాడవద్దు. ఫింగరింగ్‌ సరిగ్గా రాదు. సమయం వృథా! సీపీటీలో ఎలక్ట్రానిక్‌ కాల్‌క్యులేటర్‌ను వాడరాదు.
11. ప్రతి సబ్జెక్టు నుంచీ Identify Correct Statement or Identify incorrect Statement అనే ప్రశ్నలను ఇస్తారు. ముఖ్యమైనవిగా వీటిని పరిగణించాలి. అలాంటి ప్రశ్నలకు జవాబు గుర్తించేముందు ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి జవాబు రాయాలి.
12. ఐ.సి.ఎ.ఐ. వారు నిర్వహించే నమూనా పరీక్షకు తప్పనిసరిగా హాజరవ్వాలి. పరీక్ష ముందు మాక్‌ టెస్ట్‌ రాస్తే పరీక్షలో సమయ నిర్వహణ అలవాటు అవుతుంది. దగ్గరలోని ఐసీఏఐ చాప్టర్‌ కార్యాలయంలో సంప్రదిస్తే ఈ నమూనా పరీక్ష తేదీ తెలుస్తుంది. ఇవి రాయడం వల్ల ప్రతిభను ముందుగానే అంచనా వేసుకొని పరీక్షకు జాగ్రత్తగా సిద్ధం అవ్వవచ్చు. తప్పులను కూడా సరిచేసుకోవచ్చు.
ఏమేం పాటించాలి?
పఠనం, పునశ్చరణల్లో భయానికీ/ మానసిక ఒత్తిడికీ లోనవ్వకూడదు. దీనికిగాను రోజుకి 15 నిమిషాలపాటు మెడిటేషన్‌ చెయ్యాలి. మానసిక ఉల్లాసానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
హాల్‌టికెట్‌ను ఐ.సి.ఎ.ఐ. వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ : www.icai.nic.in . పేరు, ఎస్‌.ఆర్‌.ఓ. నెంబర్‌, ఇంకా ఇతర వివరాలు సరిగా ఉన్నాయో లేదో హాల్‌టికెట్‌లో సరిచూసుకోవాలి.
ఒకవేళ ప్రశ్నపత్రం కష్టంగా వస్తే...?
* మొదట చేయాల్సింది కంగారుపడటం/భయపడటం చేయకూడదు. ఎంత కష్టంగా వచ్చినా పాస్‌ అవ్వగలిగే ప్రశ్నలుంటాయి.
* ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం కేటాయించకూడదు.
* ఏ ప్రశ్నపత్రంలో కూడా అన్ని సబ్జెక్టుల తాలూకు ప్రశ్నలు ఒకేసారి కష్టంగా ఎప్పుడూ రావు. కష్టమైన వాటిల్లో మార్కులు పోయినా తేలిగ్గా ఉన్న సబ్జెక్టుల్లో మార్కులు సాధించడానికి ప్రయత్నించాలి.
* ఒక సబ్జెక్టు సరిగ్గా రాయకపోయినా మరో సబ్జెక్టుపై దాని ప్రభావం పడనీయవద్దు.
* మధ్యాహ్నం విరామంలో ప్రశ్నపత్రంపై చర్చలు చేయవద్దు.
ఈ సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే సీపీటీలో మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావొచ్చు!
ఏ సబ్జెక్టుకి ఎలాంటి ప్రాధాన్యం?
అకౌంట్స్‌ : 60 మార్కులు
* అకౌంట్సు సబ్జెక్టులో Journal entries చాలా ముఖ్యమైనవి. ప్రతి అధ్యాయంలోనూ ఇవి ఉంటాయి.
* ఎంట్రీస్‌ విషయంలో తప్పుగా జవాబు గుర్తించే ప్రమాదముంది. పరీక్షలో ప్రతి ప్రశ్ననూ ఒకటికి రెండుసార్లు చదివిన తరువాతే జవాబు గుర్తించాలి.
* ఈ సబ్జెక్టు సి.పి.టి.లోనే కాక, ఐ.పి.సి.సి., సి.ఎ. ఫైనల్‌లో కూడా చాలా ముఖ్యమైనది.
* చాలామంది థియరీ భాగంమీదనే ఎక్కువగా దృష్టిపెట్టి ప్రాబ్లమాటిక్‌ భాగాన్ని వదిలేస్తున్నారు. అలా చెయ్యకుండా సమాన ప్రాముఖ్యం ఇవ్వాలి.
* ముఖ్యమైన అధ్యాయాలు Final Accounts-I, Consignment Accounts, Partnership Accounts, Company Accounts and Accounting an Introduction. ఈ ఐదు అధ్యాయాల నుంచే 40- 45 మార్కులు రావొచ్చు.
* ఎక్కువ మార్కులున్న ఈ అకౌంట్స్‌ని సీపీటీ ఉత్తీర్ణతను నిర్థారించే సబ్జెక్టుగా చెప్పుకోవచ్చు.
మర్కంటైల్‌ లా : 40 మార్కులు
* దీనిలోని 40 మార్కులకు 30- 35 మార్కులు తేలికగానే తెచ్చుకోవచ్చు.
* Controversiesతో కూడుకున్న సబ్జెక్టు. అందుకని ప్రతి ప్రశ్ననూ లోతుగా విశ్లేషించి జవాబు గుర్తించాలి.
* వివిధ రకాల పాఠ్యపుస్తకాలను చదవకూడదు.
* సీపీటీ పరిధిలో సెక్షన్‌ నంబర్స్‌, కేస్‌ స్టడీస్‌, రచయితల పేర్లు, నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోగలిగితే సరే, కానీ తప్పనిసరి కాదు.
* ఈ సబ్జెక్టులో ముఖ్యమైనవి Indian Partnership Act and Sale of Goods Act. ఈ రెండిటి నుంచే సుమారు 20 నుంచి 25 మార్కులు దాకా వస్తాయి.
ఎకనామిక్స్‌: 50 మార్కులు
* మైక్రో ఎకనామిక్స్‌లో కూడా కొన్ని సమస్యలుంటాయి. అలాంటి వాటిని జాగ్రత్తగా చూడాలి.
* వీటిలో సమస్యలు వస్తే తికమకపడకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి సమాధానం పెట్టండి.
* మైక్రో ఎకనామిక్స్‌లో డయాగ్రమ్స్‌ ఉన్నాయి. వీటిని విశ్లేషించగలగాలి.
* ముఖ్యమైనవి Theory of Consumer Behaviour, Cost Analysis, Production Analysis, Price and Out put Determination.
* మాక్రో ఎకనామిక్స్‌లో facts & figures (Years and Percentagesకు సంబంధించిన Data) చాలా ముఖ్యమైనవి. వీటిని ప్రతిరోజూ చూసుకుంటూవుంటే పరీక్షలో మంచి మార్కులు వస్తాయి.
క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (మ్యాథ్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌): 50 మార్కులు
గణితం: ఫార్ములాలు చాలా ముఖ్యమైనవి. అన్ని అధ్యాయాల్లో ఉన్నవాటిని పుస్తకంలో రాసుకొని ప్రతిరోజూ 15 నిమిషాలు పాటు చూసుకోవడం మంచిది.
* సి.ఇ.సి. విద్యార్థులు తప్పకుండా ప్రశ్నలను ఎక్కువసార్లు సాధన చేసుకోవాలి.
* ఈ సబ్జెక్టులో చాలా ప్రశ్నలు నిడివితో ఉంటాయి. అందుకని పునశ్చరణ సమయంలో ఎక్కువసార్లు ఈ తరహా ప్రశ్నలను అభ్యాసం చెయ్యాలి.
* ఈ సబ్జెక్టులో ముఖ్యమైనవి Derivaties, Ingrations, Permutations and Combinations, Mathematics of Finance.
* ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులు నోట్స్‌లో సొల్యూషన్స్‌ చూసుకొని తమకు వచ్చులే అని ధీమాతో పరీక్షలకు హాజరు అవుతున్నారు. సరైన సాధన లేకపోవడం వల్ల మార్కులు కోల్పోవుతున్నారు. ఈ రెండు గ్రూపుల విద్యార్థులూ అతి విశ్వాసం లేకుండా ముఖ్యమైన MCQs అన్నీ అభ్యాసం చేసి పరీక్షకు హాజరు అవ్వడం మంచిది.
స్టాటిస్టిక్స్‌: ఈ సబ్జెక్టులో ఫార్ములాలు చాలా ముఖ్యమైనవి. అన్నీ దగ్గరగా పోలి ఉంటాయి. తికమకపడే అవకాశం ఎక్కువ. ఎన్నోసార్లు పునశ్చరణ చేస్తే తప్ప తేడాను కనిపెట్టలేరు.
* చాలా సందర్భాల్లో విద్యార్థులు ఒక ఫార్ములాకు బదులుగా వేరేది వాడుతూ మార్కులు పోగొట్టుకుంటున్నారు.
* అన్ని అధ్యాయాల్లోని ఫార్ములాలు ఒక పుస్తకంలో రాసుకొని ప్రతిరోజూ 15 నిమిషాలు పునశ్చరణ చేసుకోవడం ప్రయోజనకరం.
* ప్రశ్నలు కఠినంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
* దీనిలో ముఖ్యమైనవి Probability, Theoritical Distributions, Sampling, Statistical Distribution of Data.


Back..

Posted on 24-05-2016