Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీపీటీ పోటీ..మీ సంసిద్ధత ఎంత?

సీఏ ప్రవేశపరీక్ష- కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (సీపీటీ) డిసెంబరు 18న జరగబోతోంది. ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాక, సీఏ కోర్సు ప్రారంభించటానికి వీలుంటుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా జరిగే ఈ సీపీటీకి సమగ్రంగా తయారయ్యే మెలకువలు... ఇవిగో!
ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది చదవటం వల్ల పరీక్షల్లో ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడున్న దాదాపు 28 రోజులకు సరిపడా ఒక టైమ్‌టేబుల్‌ తయారు చేసుకోవాలి. అంటే ఏ సమయంలో ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్‌ చదవాలి అని. ఇలా ఒక క్రమపద్ధతిలో సిద్ధమైతే సీపీటీ ఉత్తీర్ణత పెద్ద కష్టమేమీ కాదు.
ఇన్నాళ్ళూ సీపీటీకి సంబంధించిన పుస్తకాలూ, స్టడీ మెటీరియల్‌ను చదివివుంటే వాటినే మళ్ళీ మళ్ళీ చదవటం ఉత్తమం. కొత్త మెటీరియల్‌/పుస్తకాలూ మాత్రం చదవకూడదు. ఒకవేళ అలా చేస్తే తికమకకు ఆస్కారం ఉంటుంది. ఐసీఏఐ వారి స్టడీమెటీరియల్‌నే ప్రామాణికంగా తీసుకోవాలి.
సీపీటీలోని అకౌంట్స్‌, ఎం.లా సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవి. సీపీటీని మొదటి ప్రయత్నంలోనే నెగ్గాలంటే ఈ రెండు సబ్జెక్టుల మీద మంచి పట్టు పెంచుకోవాలి. సన్నద్ధత సమయంలో వాటికే సింహభాగం కేటాయించటం ముఖ్యం.

చదువుతూ కొట్టివేస్తూ...
రోజుకు 10-12 గంటలు సన్నద్ధతకు వెచ్చించటం మేలు. బాగా వచ్చిన బహుళైచ్ఛిక ప్రశ్నలను (ఎంసీక్యూ) కొట్టివేస్తూ వెళ్ళాలి. ఇలా చేస్తే వాటిని మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. వాటిని చూస్తే... ఆత్మస్థైర్యం కూడా ఏర్పడుతుంది.
* బహుళైచ్ఛిక ప్రశ్నలను బట్టీ పట్టకూడదు. వాటిలో కాన్సెప్టును అర్థం చేసుకుని చదవాలి. పేపర్‌ ఎలా వచ్చినా జవాబు గుర్తించటానికి సన్నద్ధంగా ఉండాలి. అందుకనే కాన్సెప్చువల్‌ తయారీ తప్పనిసరి.
* పుస్తకంలో మీరు కొట్టివేయని ప్రశ్నలను మొదటిసారి పునశ్చరణ (రివిజన్‌) చేయాలి. వాటిలో బాగా వచ్చినవాటినీ, ముఖ్యం కాదనుకున్నవాటినీ కొట్టివేయాలి. రెండో పునశ్చరణలో మరికొన్ని ప్రశ్నలను కొట్టివేస్తూ వెళ్ళాలి. ఇలా మూడు/నాలుగు పునశ్చరణలు చేసే సమయానికి దాదాపు 80-90 శాతం బహుళైచ్ఛిక ప్రశ్నలు కొట్టివేసుకోగలగాలి. పరీక్షకు ఒకటి రెండు రోజుల ముందు మిగిలిన ఆ 10 శాతం ప్రశ్నలమీద దృష్టిపెడితే సరిపోతుంది.

ర్యాంకు రావాలంటే...
అఖిల భారత ర్యాంకు తెచ్చుకోదల్చినవారు రకరకాల పుస్తకాలు చదవటం కాదు చేయాల్సింది. ఐసీఏఐ స్టడీమెటీరియల్‌ను రిఫర్‌ చేయాలి. చదివిన మెటీరియల్‌ను పదేపదే చదవాలి. తెలిసిన ప్రశ్నలను మార్చి అడిగినా జవాబు గుర్తించగలగాలి. అప్పుడు మంచి మార్కులు తప్పకుండా వస్తాయి. 200 మార్కులకు కనీసం 186 మార్కులు సాధించగలిగితే టాప్‌ 10 ర్యాంకుల్లో ఒక ర్యాంకు తెచ్చుకోవచ్చు. ఒకే మార్కులు ఎంతమందికి వచ్చినా అంతమందికీ అదే ర్యాంకును ఇస్తారు.
* సమస్యాత్మక పేపర్లలో మీకేదైనా ముఖ్యం అనిపిస్తే మెటీరియల్‌లో /నోట్‌బుక్స్‌లో హైలైట్‌ చేసుకోవాలి. అలాగే దాని సొల్యూషన్‌లో ఆ ఇంపాక్ట్‌ ఎక్కడ వస్తుందో హైలైట్‌ చేయాలి. ప్రతి సబ్జెక్టు నుంచీ ‘ఐడెంటిఫై కరక్ట్‌ స్టేట్‌మెంట్‌/ ఐడెంటిఫై ఇన్‌కరక్ట్‌ స్టేట్‌మెంట్‌’ అనే ప్రశ్న ఇస్తారు. ఇటువంటి ఎంసీక్యూలనే ముఖ్యమైనవిగా పరిగణించాలి. అలాంటివి జవాబు గుర్తించేముందు ఒకటికి రెండు సార్లు ప్రశ్నలను చదివి, తర్వాత జవాబును గుర్తించాలి.
* ఒక ‘డౌట్స్‌ బుక్‌’ను పెట్టుకోండి. మీకొచ్చిన సందేహాలన్నీ దానిలో రాయండి. మీరేదైనా ఇన్‌స్టిట్యూట్లో చదువుతుంటే అక్కడి బోధన సిబ్బందిని అడిగి వాటిని నివృత్తి చేసుకోవాలి. సొంతంగా సిద్ధమవుతుంటే చదివిన పుస్తకాలు/స్టడీ మెటీరియల్‌ చూసుకుని, సందేహాలను తీర్చుకోవచ్చు.
కష్టమైనదైతే అధిక సమయం
ఏ సబ్జెక్టు మీకు కష్టమనిపిస్తుందో దాన్ని ఎక్కువసేపు చదవాలి. అంతేగానీ వచ్చిన/ ఇష్టమైన సబ్జెక్టునే చదువుతూపోతే రాని సబ్జెక్టును చదవటానికి సమయం మీకు సరిపోదు. మెయిన్‌ పరీక్షలో ఉత్తీర్ణత పొందాలంటే పూర్తిగా వంద మార్కులే కాకుండా సబ్జెక్టువారీగా కూడా 30 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే ఉత్తీర్ణత అయినట్టు పరిగణిస్తారు. కాబట్టి అన్ని సబ్జెక్టులకూ ప్రాతినిథ్యం ఇవ్వాలి.
* పాఠ్యపుస్తకాల్లో గానీ, ఐసీఏఐ వారి నమూనా టెస్ట్‌ పేపర్లలో ఉన్న ఎంసీక్యూల పక్కన కీ (జవాబు) రాయకండి. అలా చేస్తే పునశ్చరణ సమయంలో జవాబు పక్కనే ఉండటం వల్ల ఆ ప్రశ్నను విశ్లేషించటానికి వీలుండదు. దానిపై దృష్టిపెట్టలేరు.
* కాల్‌క్యులేటర్‌ను వేగంగా ఉపయోగించేలా టైపింగ్‌ సాధన చేయండి. చిన్నసైజుది కాకుండా... మంచి కంపెనీ కాల్‌క్యులేటర్‌ను ముందే కొని, రోజుకు అరగంటసేపైనా సాధన చేయటం మంచిది. పరీక్షల్లో దాన్నే వాడండి. సీపీటీ పరీక్షలో ఎలక్ట్రానిక్‌ కాల్‌క్యులేటర్‌ను వాడకూడదు.
* చదివే పుస్తకాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. చదివేటపుడు కొంత రన్నింగ్‌ నోట్సు తయారుచేసుకునివుంటారు. అవి పోతే మళ్ళీ ఆ నోట్సు రాసుకోవడం కష్టం. చివరి నిమిషంలో ఇబ్బంది పడతారు. అంతే కాక కొత్త పుస్తకాలు చదవటం వల్ల కాన్సెప్టులను కూడా మరిచిపోయే ప్రమాదముంది.
* కంబైన్డ్‌ స్టడీ వల్ల సమయం వృథా తప్ప మేలు జరగకపోవచ్చు. తప్పనిసరిగా చేయాల్సివస్తే ఒకరు లేదా ఇద్దరితో మాత్రమే చేయటం శ్రేయస్కరం.
* ఐసీఏఐ వారు నిర్వహించే మాక్‌ టెస్టుకు తప్పనిసరిగా హాజరు కండి. దీనివల్ల సమయ నిర్వహణ అలవాటవుతుంది. దగ్గర్లోని ఐసీఏఐ చాప్టర్‌ కార్యాలయంలో సంప్రదిస్తే మాక్‌ టెస్ట్‌ తేదీ తెలుస్తుంది. ఇది రాసి ఏ స్థాయిలో ఉన్నదీ ముందుగానే అంచనా వేసుకుని, పరీక్షకు మరింత జాగ్రత్తగా సిద్ధం కావొచ్చు. తప్పులను కూడా సరిచేసుకోవచ్చు.
* అన్నిటికంటే ముఖ్యం... సానుకూల దృక్పథం. ఏదైనా సబ్జెక్టు/ చాప్టర్‌ అర్థం కానపుడు డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. అలాంటి సమయంలో మీలో ఉన్న అనుకూలాంశాలను గుర్తు చేసుకుని, నిరాశను దూరం చేసుకోండి. కష్టపడి చదవండి.
* సమాధానం తెలియని ప్రశ్నల జోలికి వెళ్ళకూడదు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కులు తగ్గిస్తారు. అదే తెలియని ప్రశ్నకు సమాధానం గుర్తించకపోతే ఎలాంటి నెగిటివ్‌ మార్కూ ఉండదు.
అఖిలభారత ర్యాంకు తెచ్చుకోదల్చినవారు రకరకాల పుస్తకాలు కాకుండా ఐసీఏఐ స్టడీమెటీరియల్‌ చదవాలి. మెటీరియల్‌ పునశ్చరణ ఎక్కువ జరగాలి. తెలిసిన ప్రశ్నలను మార్చి అడిగినా జవాబు గుర్తించగలగాలి.
సీపీటీని మొదటి ప్రయత్నంలోనే నెగ్గాలంటే అకౌంట్స్‌, ఎం.లా.. సబ్జెక్టుల మీద మంచి పట్టు పెంచుకోవాలి. సన్నద్ధత సమయంలో వాటికే సింహభాగం కేటాయించటం అవసరం.

Back..

Posted on 21-11-2016