Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీపీటీకి సన్నద్ధత!

సీఏ కోర్సుకి ప్రవేశపరీక్ష అయిన కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) జూన్ 17న జరగబోతోంది. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తరువాత సీఏ కోర్సు ప్రారంభించవచ్చు. సీపీటీకి సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఈ కొద్ది రోజులూ సన్నద్ధతను ఎలా కొనసాగించాలో చూద్దామా?

సీపీటీని రెండు భాగాలుగా ఒకేరోజు నిర్వహిస్తారు.
ఉదయం 10 గం. నుంచి మధ్యాహ్నం 12.30 గం. వరకు: అకౌంట్స్ (60 మార్కులకు) ఎం.లా (40 మార్కులకు)
మధ్యాహ్నం 2.00 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు: ఎకనామిక్స్ (50 మార్కులకు) మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (50 మార్కులకు)
అంటే.. ఒకేరోజు 200 మార్కులకు ప్రవేశపరీక్షను నిర్వహిస్తారన్నమాట.

తుదిదశకు ఇలా సిద్ధమవుదాం!
అకౌంట్స్: 60 మార్కులు
సీపీటీలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు సాధించగలిగిన సబ్జెక్టు ఇది. అకౌంట్స్ సబ్జెక్టును ఎప్పుడూ చూసి చదివినట్టుగా సిద్ధమవకూడదు. అలా చూసినపుడు అన్ని ప్రశ్నలకూ, సమస్యలకూ సమాధానాలు వచ్చినట్లే ఉంటాయి. కానీ సబ్జెక్టుపై పట్టురాదు. అకౌంట్స్ సబ్జెక్టులోని సమస్యలను ఎంత సాధన చేస్తే అంత మంచిది.
ఎంట్రీస్ విషయంలో విద్యార్థులు తప్పుగా సమాధానం గుర్తించే అవకాశం ఉంది. పరీక్షలో ప్రతి ప్రశ్ననూ ఒకటికి రెండుసార్లు చదివిన తరువాతే సమాధానం చేయాలి. జర్నల్ ఎంట్రీస్ అన్నీ పుస్తకంలో ఒకేచోట రాసుకోగలిగితే పరీక్షలకు సన్నద్ధమవుతున్నపుడు పునశ్చరణ తేలికవుతుంది. అకౌంట్స్‌లోని ఏ అంశాన్నీ బట్టీ పట్టొద్దు. ప్రతి అంశంపట్ల తార్కిక ఆలోచనా దృక్పథాన్ని అలవరచుకోవాలి.

ఎం.లా: 40 మార్కులు
ఇది ఇంటర్ చదివిన అన్ని గ్రూపులవారికీ కొత్త సబ్జెక్టే. పరీక్షల్లో ప్రతి ప్రశ్ననూ ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా నేరుగా అడుగుతారు. సబ్జెక్టుపరంగా వివాదాస్పద అంశాలు ఎక్కువ. కాబట్టి అప్పటికే చదువుతున్న పుస్తకం తప్ప వేరే మెటీరియల్‌గానీ, పుస్తకాన్ని కానీ పరీక్షల ముందు చదవొద్దు. పలు టెక్స్ట్ పుస్తకాలను రిఫర్ చేయొద్దు.
ఈ సబ్జెక్టులోని ప్రతి అంశంలోనూ విద్యార్థి అర్థ వివరణ నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సీపీటీ పాస్/ ఫెయిల్ అని నిర్ధారించే సబ్జెక్టుగా ఎం.లాను చెప్పుకోవచ్చు.

ఎకనామిక్స్: 50 మార్కులు
అన్ని చాప్టర్లకీ సమాన ప్రాధాన్యమిచ్చి చదవాలి. డయాగ్రమ్‌లు, డెఫినిషన్లు, ఆథర్ పేర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మైక్రో ఎకనామిక్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తే తికమక పడకుండా ఒకటికి రెండుసార్లు ప్రశ్నను చదివి, సమాధానం గుర్తించాలి. మైక్రో ఎకనామిక్స్‌లోని డయగ్రమ్‌ను అనలైజ్ చేయగలగాలి. మాక్రో ఎకనామిక్స్‌లో ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్ (సంవత్సరాలు, శాతాలకు సంబంధించిన డేటా) చాలా ముఖ్యం.

మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: 50 మార్కులు
మేథమేటిక్స్: ఈ సబ్జెక్టులో ఫార్ములాలు చాలా ముఖ్యం. సీఈసీ విద్యార్థులు తప్పకుండా ఎంసీక్యూలను ఎక్కువసార్లు సాధన చేయాలి. దీనిలోని ఎంసీక్యూలు చాలా నిడివితో ఉంటాయి. కాబట్టి పునశ్చరణ సమయంలో ఎక్కువసార్లు ఈ తరహా వాటిని సాధన చేయాలి. అన్ని చాప్టర్లకూ సమ ప్రాధాన్యం ఇవ్వాలి. నిడివిగా ఉన్న లెక్కలను మొదట చేయడానికి ప్రయత్నించొద్దు. తెలిసినప్పటికీ ఆ ప్రశ్నలు మూడు సబ్జెక్టులు పూర్తి చేసుకున్నాకే ఆలోచించాలి.

స్టాటిస్టిక్స్: ఈ సబ్జెక్టులోని ఫార్ములాలన్నీ దగ్గరగా పోలి ఉంటాయి. ఎన్నోసార్లు పునశ్చరణ చేస్తే తప్ప తేడాలను కనిపెట్టడం కష్టం. చాలామంది పరీక్షలో సరైన ఫార్ములా గుర్తురాక మార్కులు పోగొట్టుకుంటున్నారు. ఈ సబ్జెక్టులో ప్రాబ్లమ్స్‌కే కాకుండా థియరీకి కూడా సమ ప్రాధాన్యమివ్వాలి. ఇంటర్‌లో మేథ్స్ సబ్జెక్టు చదవనివారికి సీపీటీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్టు చాలా కీలకం.

* తెలియని అంశాలను వదిలేసి, తెలిసినవాటినే చూసుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన అంశాలను ఒక కాగితంపై రాసుకుంటూ ప్రతిరోజూ దాన్ని చూసుకోవాలి.
* నమూనా పరీక్ష రాసిన తరువాత మొదట తెలిసిన ప్రశ్నలు ఎన్నింటికి తప్పు సమాధానాలు గుర్తించారో గమనించాలి. వాటిని తరువాతి పరీక్షలో పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. తెలియని ప్రశ్నల్లోనూ సులువుగా నేర్చుకోగలవి ఏమున్నాయో తెలుసుని, వాటిని అభ్యాసం చేయాలి. మైండ్ మ్యాప్స్ తయారు చేసుకుని పునశ్చరణకు ఉపయోగించాలి.
* వివాదాస్పద ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఇలాంటి ప్రశ్నలకు అధ్యాపకులు ఏ సమాధానాన్ని బలపర్చారో దాన్ని అదేవిధంగా తీసుకోవడం మేలు. ప్రశ్నలోని నాలుగు సమాధానాలను సరిగా చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ప్రశ్నను పూర్తిచేయడానికి కాలపరిమితి విధించుకోవాలి. అలా సాధన చేస్తూ వేగం పెంచుకోవాలి.
* ఐసీఏఐ వారు నిర్వహించే మాక్ పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాలి. మెయిన్ ఎగ్జామ్ రాసేముందు ఒక మాదిరి పరీక్షను రాయడం వల్ల పరీక్షలో సమయపాలన అలవాటు అవుతుంది. దగ్గర్లోని ఐసీఏఐ చాప్టర్ ఆఫీస్‌లో సంప్రదిస్తే మాక్ పరీక్ష తేదీ తెలుస్తుంది. మాదిరి పరీక్షలు రాయడం వల్ల విద్యార్థి తన ప్రదర్శనను అంచనా వేసుకుని మెయిన్ పరీక్షకు మరింత జాగ్రత్తగా సన్నద్ధమవ్వొచ్చు. తప్పులను సరిచేసుకునే అవకాశమూ లభిస్తుంది.
* అన్నింటికన్నా ముఖ్యంగా స్వీయ ప్రేరణ, సానుకూలంగా ఆలోచించడం వంటివి చేయాలి. ఏదైనా సబ్జెక్టు లేదా చాప్టర్ అర్థం కానపుడు ఒత్తిడికి గురికావొద్దు. అలాంటి సమయంలో విద్యార్థి తనలోని సానుకూల అంశాలను గుర్తుచేసుకోవాలి. సమస్యలోనే పరిష్కారం ఉంటుంది. నిజాయతీతో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుంది.
* ఓఎంఆర్ మీద బబ్లింగ్ చేయడానికి హెచ్‌బీ పెన్సిల్‌ను ఎంచుకోవాలి. బబ్లింగ్ సరిగా చేయకపోయినా, డార్క్‌గా చేయకపోయినా గణన సమయంలో కంప్యూటర్ మీరు చేసిన బబ్లింగ్‌ను గుర్తించకపోవచ్చు. తద్వారా సమాధానాన్ని సరిగా గుర్తించినా మార్కులు పడవు. బ్లాక్ పెన్‌తో చేస్తే ఇంకా మంచిది.
* సమాధానం తెలియని ప్రశ్నల జోలికి వెళ్లొద్దు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కులున్నాయి. ప్రశ్నను వదిలేస్తే ఎలాంటి మార్కులూ ఉండవు.
ఈ ముఖ్య సూచనలు పాటిస్తే సీపీటీలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు!

Back..

Posted on 15-06-2018