Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సీఆర్‌పీఎఫ్‌లో 2945 కానిస్టేబుల్ పోస్టులు

- ఏపీలో 137, తెలంగాణ‌లో వంద ఖాళీలు
- కొన్ని పోస్టుల‌కు మ‌హిళ‌లూ అర్హులే

సెంట్రల్ రిజ‌ర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్ (టెక్నిక‌ల్‌, ట్రేడ్స్‌మెన్‌) పోస్టుల‌కు ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత‌తో పాటు సంబంధిత విభాగాల్లో నైపుణ్యం ఉన్నవారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దేశ‌వ్యాప్తంగా 2945 ఖాళీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఏపీకి 137, తెలంగాణ‌కు వంద పోస్టులు కేటాయించారు. డ్రైవ‌ర్ విభాగంలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఏపీలో 75, తెలంగాణలో 50 డ్రైవ‌ర్ పోస్టులే . కొన్ని పోస్టుల‌కు మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ప్రక‌ట‌నకు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.

ఎంపిక విధానం:
ముందుగా శారీర‌క దారుఢ్య ( ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్టు(పీఎస్‌టీ)/ ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్టు (పీఈటీ) ) ప‌రీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన‌వారికి రాత‌ప‌రీక్ష ఉంటుంది. ఇందులో ఎంపికైన‌వాళ్లకు సంబంధిత ట్రేడ్ ప‌రీక్ష నిర్వహిస్తారు. అన్ని ద‌శ‌ల‌నూ దాటిన‌వారికి ఆరోగ్య ప‌రీక్షలు చేప‌ట్టి శిక్షణకు ఎంపిక చేస్తారు. విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు.

ఖాళీలున్న ట్రేడ్‌లు/ విభాగాలు:
డ్రైవ‌ర్, ఫిట్టర్‌, బ‌గ్లర్‌, కోబ్లర్‌, టైల‌ర్, గార్డెన‌ర్‌, పెయింట‌ర్, బ్రాస్‌బ్యాండ్‌, కుక్‌, వాట‌ర్ క్యారియ‌ర్‌, వాష‌ర్‌, స‌ఫాయీ క‌ర్మాచారీ, బార్బర్‌. వీటిలో కుక్‌, వాట‌ర్ క్యారియ‌ర్‌, వాష‌ర్‌, స‌ఫాయీ క‌ర్మాచారీ పోస్టుల‌కు మ‌హిళ‌లు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. మిగిలిన పోస్టుల‌కు పురుషులే అర్హులు.

విద్యార్హత‌:
ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నప్పటికీ ప‌దో త‌ర‌గ‌తిలో ఉత్తీర్ణత సాధించాలి. దీంతోపాటు కొన్ని పోస్టుల‌కు సంబంధిత విభాగంలో ప్రావీణ్యం గుర్తించ‌డానికి స‌ర్టిఫికెట్‌/ లైసెన్స్/ ఐటీఐ ఉండాలి. డ్రైవ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహిక‌ల్ లైసెన్స్ త‌ప్పనిస‌రి.

శారీర‌క ప్రమాణాలు:
పురుషులైతే 170 సెం.మీ., మ‌హిళ‌లు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులు ఊపిరి పీల్చిన త‌ర్వాత ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ., ఊపిరి వ‌దిలిన త‌ర్వాత 75 సెం.మీ. ఉండాలి.

వ‌యోప‌రిమితి:
డ్రైవ‌ర్ పోస్టుల‌కు జ‌న‌వ‌రి 1, 2017 నాటికి 21-27 ఏళ్లలోపువారే అర్హులు. అంటే జ‌న‌వ‌రి 2, 1990- జ‌న‌వ‌రి 1, 1996 మ‌ధ్య జ‌న్మించిన‌వారై ఉండాలి.. మిగిలిన అన్ని పోస్టుల‌కు 18-23 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సువాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు; ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి.

ఫిజిక‌ల్ టెస్టు:
డ్రైవ‌ర్‌, ఫిట్టర్, పీటీఆర్‌, కోబ్లర్‌, కార్పెంట‌ర్, టైల‌ర్‌, బ్రాస్‌బ్యాండ్‌, పైప్‌బ్యాండ్, మాలి, బ‌గ్లర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో చేరుకోవాలి. వీటిలో ఏదైనా పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌హిళా అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని 8.30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మిగిలిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న పురుష అభ్యర్థులు 1.6 కి.మీ. దూరాన్ని ప‌ది నిమిషాల్లో, అదే మ‌హిళలైతే 12 నిమిషాల్లో చేరుకోవాలి.

రాత ప‌రీక్ష ఇలా...
ఈ ప‌రీక్షను వంద మార్కుల‌కు నిర్వహిస్తారు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. మొద‌టి విభాగం అంద‌రికీ ఉమ్మడిగా ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి స్థాయిలో జ‌న‌ర‌ల్ అంశాల‌పై 40 ప్రశ్నలు అడుగుతారు. రెండో విభాగంలో సంబంధిత ట్రేడ్‌కు చెందిన ప్రశ్నలు 60 వ‌స్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప‌రీక్ష వ్యవ‌ధి 2 గంట‌లు. పార్ట్‌-1లో ఎలిమెంట‌రీ మ్యాథ‌మెటిక్స్‌, ఎన‌లిటికల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం త‌దిత‌ర అంశాల‌పై ప్రశ్నలు వ‌స్తాయి. ట్రేడ్ టెస్టు అభ్యర్థులు ఎంచుకున్న విభాగాన్ని బ‌ట్టి మారుతుంది. జ‌న‌ర‌ల్ అభ్యర్థులు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 33 శాతం మార్కులు సాధిస్తేనే అర్హుల‌వుతారు.

ఎంపికైతే: కొత్త పే స్కేల్ లెవెల్‌-3 ప్రకారం రూ.21,700-50,000 వ‌ర‌కు వేత‌నంగా అందుతుంది. దీంతోపాటు క‌ర‌వు భ‌త్యం చెల్లిస్తారు. ఉచిత వ‌స‌తి క‌ల్పిస్తారు. ఇవేకాకుండా ప‌లు ప్రోత్సాహ‌కాలు ల‌భిస్తాయి.

ద‌ర‌ఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-స‌ర్వీస్‌మెన్ కు ఫీజు నుంచి మిన‌హాయించారు. మిగిలిన‌వాళ్లు రూ.వంద చెల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: జ‌న‌వ‌రి 31 నుంచి
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: మార్చి 1
ప‌రీక్ష తేదీ: మే 14 (ఆదివారం)
వెబ్‌సైట్‌: www.crpfindia.com

నోటిఫికేష‌న్‌

Back..

Posted on 20-01-2017