Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరిష్కారం చెప్పండి.. పురస్కారం గెలవండి!

* విద్యార్థులకు సీఎస్‌ఐఆర్‌ ఆహ్వానం

మన చుట్టూ ఉండే సమాజంలో ఎన్నో సమస్యలు. వీటికి పరిష్కారాలను చూపించగలం అన్నవారికి సీఎస్‌ఐఆర్‌ అవకాశమిస్తోంది. అయితే ఈ అవకాశం విద్యార్థులకు మాత్రమే! పాఠశాల స్థాయి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రయత్నించవచ్చు. మంచి ఆలోచనలకు అవార్డులూ, నగదు బహుమతులూ దక్కుతాయి.

చదువుకునే లేత వయసులో ఎన్నో ఆలోచనలుంటాయి. చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చాలనే తపన ఉంటుంది. అందుకే విద్యార్థులు సామాజిక స్పృహతో నిత్యజీవిత సమస్యలకు సరికొత్త, ప్రభావవంతమైన పరిష్కారాలను సూచించగలరు. ఇదే ఉద్దేశంతో కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) ఇన్నొవేషన్‌ అవార్డ్స్‌ ఫర్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ (సీఐఏఎస్‌సీ)ను ప్రవేశపెట్టింది. సీఎస్‌ఐఆర్‌ దేశంలో శాస్త్రీయ, సాంకేతిక మానవ వనరులను అభివృద్ధి చేసే సంస్థ. బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, ఇతర బేసిక్‌ సైన్స్‌ అభివృద్ధికి సంస్థ కృషి చేస్తోంది.

సీఐఏఎస్‌సీ జాతీయస్థాయి పోటీ పరీక్ష. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు కొత్త పద్ధతులు, పరికరాలు, ఉపయోగించే తీరు.. ఏవిధంగా అయినా విద్యార్థులు పరిష్కారాలను సూచించవచ్చు. విద్యార్థుల్లో శాస్త్రీయ స్వభావం పెంచటానికి తోడ్పడటం, వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించడమే ఈ ప్రోగ్రామ్‌ ఉద్దేశం.

ఎవరు అర్హులు?
భారతీయ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి పన్నెండో తరగతి లేదా 18 ఏళ్లలోపు వారెవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. పోటీలో భాగంగా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సొంత టెక్నలాజికల్, డిజైన్‌ ఆలోచనలను ప్రతిపాదనల రూపంలో పోటీకి పంపాల్సి ఉంటుంది. డిజైన్‌ ఆధారిత ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఉంటుంది. బయోటెక్నాలజీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ డివైజ్‌/ డిజైన్‌ వంటి కేటగిరీలుగా ప్రతిపాదనలను తీసుకుంటారు.
పోటీలో భాగంగా ఇన్నొవేటివ్‌ ఐడియా/ క్రియేటివ్‌ డిజైన్‌/ పరిష్కారం ఏదైనా ఇంగ్లిష్‌ లేదా హిందీలో 5000 పదాలకు మించకుండా రాయాలి. ఇంటర్నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి, పంపితే వాటిని తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతరుల నుంచి సాయం/ మార్గదర్శకత్వం తీసుకోవచ్చు. దరఖాస్తుతోపాటు విద్యార్థి తాను చదువుతున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్‌/ హెడ్‌ మాస్టర్‌ నుంచి అథెంటికేషన్‌ సర్టిఫికెట్‌నూ జతచేయాలి. మెచ్చిన ఆలోచన డిజైన్‌కు అవార్డులు అందజేస్తారు.

ఉత్తమ ఆలోచనలకు అవార్డులు
ఉన్నతస్థాయి అవార్డ్‌ సెలక్షన్‌ కమిటీ విజేతలను నిర్ణయిస్తుంది. ఉత్తమంగా భావించిన మొదటి 15 ఆలోచనలకు అవార్డులు లభిస్తాయి.
* మొదటి బహుమతి రూ.లక్ష
* రెండో బహుమతి (ఇద్దరికి) ఒక్కొక్కరికి రూ.50,000
* మూడో బహుమతి (ముగ్గురికి) ఒక్కొక్కరికి రూ.30,000
* నాలుగో బహుమతి (నలుగురికి) ఒక్కొక్కరికి రూ.20,000
* అయిదో బహుమతి (అయిదుగురికి) ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున చెల్లిస్తారు.

దరఖాస్తు ఎలా?
* ప్రతిపాదనలను అథెంటికేషన్‌ లెటర్, ఇతర ధ్రువపత్రాలతోపాటుగా హార్డ్‌ కాపీ లేదా ఈ-మెయిల్‌ రెండు విధానాల్లో పంపొచ్చు.
* హార్డ్‌కాపీ ద్వారా దరఖాస్తులను పంపాల్సిన చిరునామా: హెడ్, సీఎస్‌ఐఆర్‌- ఇన్నొవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్, ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్‌ బిల్డింగ్, మూడో ఫ్లోర్, 14-సత్సంగ్‌ విహార్‌ మార్గ్, న్యూదిల్లీ- 110067 ఈ-మెయిల్‌: ciasc.ipu@niscair.res.in
* దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ జూన్‌ 30, 2020.
* వివరాలకు వెబ్‌సైట్‌: https://www.csir.res.in/ ను సందర్శించవచ్చు.

Back..

Posted on 10-06-2020