Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
వర్తమాన అంశలను ఒడిసిపట్టేదెలా?

పోటీ పరీక్షార్థులకు వర్తమాన అంశాలు (కరంట్‌ అఫైర్స్‌) ప్రీతిపాత్రమైన మాట. సివిల్‌ సర్వీసెస్‌ నుంచి కానిస్టేబుల్స్‌ వరకు ప్రతి పోటీపరీక్షలో ఇవి ఉండడమే ఇందుకు కారణం. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు రాబట్టాలంటే ఒక క్రమపద్ధతిలో, వ్యూహాత్మకంగా చదవాల్సివుంటుంది!
బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్‌, పోస్టల్‌శాఖ సార్టింగ్‌ అసిస్టెంట్స్‌ ఇలా ప్రతి నియామక పరీక్షలో సమకాలీన అంశాలు కీలకమే. పది, ఇంటర్‌ తర్వాత జరిగే విద్యా ప్రవేశపరీక్షలను మినహాయించి దేశంలోని కేంద్ర, రాష్ట్రస్థాయి... సమస్త ఎంపిక పరీక్షల్లో సమకాలీన అంశాలు అగ్నిపరీక్షగా నిలుస్తున్నాయి.
యూపీఎస్‌సీ, స్టాఫ్‌ సెలక్షన్‌, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎస్‌బీఐ, పోస్టల్‌, ఇన్సూరెన్స్‌ నుంచి రాష్ట్రస్థాయిలో టీఎస్‌పీఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, పోలీస్‌ తదితర పరీక్షల అభ్యర్థులు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సాయిల్లో ఏం జరుగుతోందో ఓ కన్నేసి ఉండాల్సి ఉంటుంది.

ప్రాముఖ్యం ఎందుకని?
చరిత్ర, భౌగోళికశాస్త్రం, జనరల్‌ సైన్స్‌, పాలిటీ, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌ ప్రశ్నలకు తేలికగా సమాధానాలు రాబట్టే పోటీ పరీక్షార్థుల్లో కొందరు.. కరెంట్‌ అఫైర్స్‌ దగ్గరకు వచ్చేసరికి మొహం చిట్లించి ‘ఇదంత అవసరమా’ అన్న అభిప్రాయంలో ఉంటారు.
కానీ ఒక బాధ్యతాయుత ఉద్యోగంలోకి తీసుకోబోతున్న అభ్యర్థికి మిగతా సబ్జెక్టుల్లో అవగాహనతోపాటు ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వ విధానాలు, అమలవుతున్న పథకాలు, న్యాయవ్యవస్థలో, రాజ్యాంగపరంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిణామాలు ప్రభావితం చేసే అంశాలు, ఆర్థిక వ్యవహారాల్లో సంభవిస్తున్న మార్పుల పట్ల అవగాహన ఉండాలని నియామక సంస్థ కోరుకోవడంలో తప్పులేదు.
ఉద్యోగిగా ఒక ‘విజ్ఞానగని’ని కూర్చోబెట్టాలని నియామక సంస్థ కోరుకోదు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించగలిగే ఉద్యోగి కావాలనే కాంక్షిస్తుంది. అందుకే కరెంట్‌ అఫైర్స్‌ అవసరం, అనివార్యం.
యూపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎంపిక ప్రక్రియలో ఈ విభాగాన్ని కరెంట్‌ అఫైర్స్‌ అంటున్నారు. బ్యాంకు, స్టాఫ్‌ సెలక్షన్‌, రైల్వే తదితర సంస్థలు నిర్వహించే పరీక్షల్లో దీన్ని జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌ అంటున్నారు. పేరు ఏదైనా వీటికి మూలం వర్తమానాంశాలే. శరవేగంగా మార్పులు సంభవించే జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఒడిసి పట్టుకోవడం ఎలా? అన్నదే ప్రశ్న. ఇందుకు కొన్ని సోపానాలున్నాయి.

1. వర్గీకరణ
సమకాలీన పరిణామాల అనుసరణకు దినపత్రికలే ఆధారం అనుకుంటే.. వాటిలో ప్రతిరోజూ అసంఖ్యాకమైన వార్తలు, అత్యధిక సమాచారం వస్తుంది. ఇంత డేటాను బుర్రకెక్కించుకోవడం ఎలా అన్న సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే విషయ వర్గీకరణ అవసరం.
దినపత్రికలో వచ్చే ప్రతి సమాచారం పోటీపరీక్షల కోణంలో అవసరం ఉండదు. కాబట్టి వార్తాపత్రికల్లో వచ్చే విషయాలను వర్గీకరణ చేసుకోవాలి. వార్తలు, సమాచారం, వివాదాలు, చైతన్యం, అవగాహనగా విభజించుకోవచ్చు.
* భారతీయ క్రీడాకారిణి సింధు ఒలింపిక్స్‌లో బ్యాడ్‌మింటన్‌లో రజత పతకం సాధించింది. ఈ క్రీడలో పతకం సాధించిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది (సమాచారం పోటీపరీక్షలకు నేరుగా ఉపయోగకరం).
* 125 కోట్ల భారతదేశ జనాభాలో రెండే పతకాలతో మనం సరిపెట్టుకుంటే కేవలం 32 కోట్ల జనాభాగల అమెరికాకు 121 పతకాలు సొంతమయ్యాయి (చైతన్యం).
* భవిష్యత్తులో దేశం మరిన్ని ఒలింపిక్స్‌ పతకాలను సాధించడానికి పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహించేలా రాష్ట్రాల్లో క్రీడావిధానం ఉండాలి (చర్చ-అవగాహన).
ఈ చిన్న పేరాలో అన్ని అంశాలూ అవసరమయ్యేవే. అయితే నేరుగా కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఉపయోగపడే అంశం కొంతయితే మిగతావి బృంద చర్చ, మౌఖిక పరీక్షలకు ఉపయోగపడేవి.
వార్తాపత్రికల్లో వచ్చే కొన్ని సంఘటనలు, వార్తలకు పోటీపరీక్షలతో ఏమాత్రం సంబంధం ఉండకపోవచ్చు. ఎక్కడో రహదారిలో ప్రమాదం జరిగితే దానిని స్వీకరించాల్సిన పనిలేదు. అయితే అలా రహదారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటే వాటి నివారణకు ఏంచేయాలన్న ఆలోచన చేయడం మంచి అధికారి కాబోయే అభ్యర్థి లక్షణం.

2. నమోదు
పోటీపరీక్షల సన్నద్ధతలో ఉన్న అభ్యర్థి వర్తమాన అంశాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మంచి సాధన అవుతుంది కూడా. రోజూ పత్రికలను చదువుతూ, వాటిలో అవసరమైనవి నమోదు చేసుకోవాలి. సిద్ధంగా ఉండే ఈ నోట్సును ఏ పరీక్షకైనా వెళ్లబోయే చదువుకుంటే చాలు.
అయితే ఈ నమోదులో కూడా ఏది అవసరం? ఏది అనవసరం అన్న విచక్షణతో వ్యవహరించాలి. ఒకటి, రెండు పరీక్షలు రాస్తే ఈ అనుభవం వస్తుంది కానీ కాలం వృథా కాకుండా మరో మార్గం అనుసరించడం మేలు.
కొన్ని వెబ్‌ పోర్టల్స్‌లో దాదాపు అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటున్నాయి. వాటిని పరిశీలించడం ద్వారా ఏ విషయాలను రికార్డు చేసి ఉంచుకోవాలో అవగాహన తెచ్చుకోవచ్చు. ఏ రాతపరీక్షలోనైనా ఉండే అంతర్జాతీయ, జాతీయ, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగ, రాష్ట్రాల, క్రీడా అంశాలను వర్గీకరించుకుని నమోదు చేసుకుంటే చదివేటపుడు స్పష్టత ఉంటుంది.
* ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ప్రవేశపెట్టడానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది.
* దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఏడు దశాబ్దాల కాలంలో అతి ప్రధాన పరోక్ష పన్ను సంస్కరణగా భావించే జీఎస్‌టీ అమలుకోసం 122వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని రాజ్యసభ ఆగస్టు 3న ఆమోదించింది.
ఈ రెండు పాయింట్లలో మొదటి పాయింట్‌ నమోదుకు యోగ్యం కాదు.

3. ఒకే చోటుకి చేర్చడం
వేగంగా సంభవిస్తున్న పరిణామాలను ఎప్పటికపుడు నమోదు చేయడం ఒకెత్తయితే, కొంతకాలం తరువాత సంబంధిత అంశాలన్నింటినీ ఒకే చోటుకు తీసుకురావడం పరీక్ష సన్నద్ధతకు బాగా ఉపకరిస్తుంది. ఉదా:కు ఇటీవల వివిధ జీవన రంగాలపై అంతర్జాతీయ సూచీలు (ఇండెక్స్‌) వెల్లడయ్యాయి. వాటిలో భారతదేశ ర్యాంకులపై అన్ని పరీక్షల్లో 1-2ప్రశ్నలు వస్తుంటాయి.
మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 135, శాంతి సూచీలో 141, పత్రికా స్వేచ్ఛలో 133, సంతోషంలో 118 స్థానం ఇలా 15 అంశాలపై సూచీలు వెలువడ్డాయి. వీటన్నింటినీ క్రోడీకరించి ఒకేచోట జాబితాగా రాసుకుంటే చక్కగా గుర్తుండిపోతాయి. ఇదేవిధంగా త్వరలో నోబెల్‌కు సంబంధించి వివిధ రంగాలపై రోజుకొకటి చొప్పున బహుమతి పొందినవారి పేర్లు వెల్లడవుతాయి. వాటిని రోజూ రాసుకుంటూనే ఒకచోట ఉండేలా చూసుకోవాలి. ఫోర్బ్స్‌ పత్రిక జాబితాలు ఇదే కోవకు వస్తాయి. వీటిని గత సంవత్సరంతో పోల్చి చూసుకోవడం కూడా మంచిదే.

4. జిజ్ఞాస, సేకరణ
వర్తమాన అంశాలను ఆసక్తితో చదవాలి. నిజానికి మనచుట్టూ జరుగుతున్న సంఘటనలు కాబట్టి ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తాయి. వాటి పూర్వాపరాలు తెలుసుకోవాలన్న కుతూహలాన్ని పెంచుకోవాలి.
ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండే పతకాలు వచ్చాయి. అయితే గత సంవత్సరం ఎన్ని వచ్చాయి? అసలు మనకు స్వర్ణపతకం ఎపుడైనా వచ్చిందా? ఈసారి పతకాలు సాధించిన సింధు, సాక్షి రెండు విభాగాల్లో పతకాలు సాధించిన తొలి భారతీయ వనితలుగా నిలిచారు. అయితే ఈ సందర్భంగా కరణం మల్లేశ్వరి పేరు వినిపించింది. ఆమెకు ఒలింపిక్స్‌లో ఏ విభాగంలో పతకం వచ్చింది? అసలు భారత్‌ ఎప్పటి నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. వాటికి జవాబులు అన్వేషించి, సేకరించి నోట్‌ చేసుకోవచ్చు.
వార్తల్లో బాగా ప్రాధాన్యం పొందిన అంశం నుంచి అంతగా ప్రాధాన్యం లేని విషయాలపై ప్రశ్న సంధిస్తున్నారు. ఇలాంటి అన్వేషణ ప్రవృత్తిగల అభ్యర్థి అటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు గుర్తించగలుగుతాడు.

5. కొత్తవి చేర్చడం
భారత శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఎప్పటికపుడు కొత్త ప్రయోగాలు, ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రోదసీ రంగంలో సంచలన విజయాలు సాధిస్తున్నాం. వీటిని నిశితంగా గమనిస్తూ, అనుసరించాలి.
2008లో ఇస్రో, పీఎస్‌ఎల్‌వీ- సి 9 రాకెట్‌ ద్వారా ఒకేసారి 10 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇది ఒక రికార్డు. ఈ ఏడాది జూన్‌ 22న ఇస్రో పీఎస్‌ఎల్‌వి- సీ34 రాకెట్‌ ద్వారా ఒకేసారి 20 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు మనం ప్రపంచలోనే అత్యధిక శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిన దేశాల్లో రష్యా, అమెరికా తరువాతి స్థానంలో ఉన్నాం. ఇలా వర్తమాన అంశాల్లో నిరంతరం తాజా పరిణామాలు వస్తుంటాయి. ఎప్పటికపుడు అప్‌డేట్‌ చేసుకుంటుండాలి. ఈ ఐదు సోపానాలను పోటీ పరీక్షార్థి క్రమేపీ అధిరోహించగలిగితే వర్తమాన అంశాలపై పట్టు దొరుకుతుంది.
వర్తమాన అంశాలను కేవలం ప్రశ్న కోణంలోనే చూడకుండా మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక వివాదం /చర్చనీయాంశంపై వేర్వేరు కోణాలు తెలుసుకోవాలి.

క్లిష్టతరం కాదు.. ఉభయతారకం
కరెంట్‌ అఫైర్స్‌ విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన రెండు అంశాలున్నాయి.
ఒకటి- వివిధ పోటీపరీక్షల్లో మిగిలిన విభాగాలు అన్నీ దాదాపు స్థిరమైనవే కాబట్టి ఒకటి, రెండు పరీక్షలకు చదవడంతో ఆ సబ్జెక్టులపై కాస్త పట్టు వస్తుంది. సమకాలీన అంశాలు మాత్రం ఎప్పటికపుడు మారుతుంటాయి. కాబట్టి మళ్లీ మళ్లీ చదవాల్సి రావడంతో ఈ విభాగాన్ని క్లిష్టంగా భావిస్తారు.
రెండు- సాధారణంగా పోటీ పరీక్షల్లో స్థిరమైన సబ్జెక్టులపై ఎక్కువమంది అభ్యర్థులు మంచి మార్కులు సాధిస్తారు కాబట్టి వర్తమాన అంశాల విభాగం అభ్యర్థి జయాపజయాలను నిర్ణయించేదిగా నిలుస్తోంది. నిజానికి ఇదో ప్రత్యేక విభాగంగా భావించకుండా రోజువారీ సన్నద్ధతలో భాగం చేసుకుంటే దీనివల్ల ఇతర ఉపయోగాలున్నాయి.
* సివిల్స్‌, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే సిలబస్‌లలో ఉండే ఎకానమీ, పాలిటీ, జనరల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌, విపత్తు నిర్వహణ వంటి విభాగాల్లో తాజా అంశాలపై కూడ ప్రశ్నలుంటాయి. వాటిని కరెంట్‌ అఫైర్స్‌ పఠనం ద్వారానే సేకరించగలుగుతాం. ఆయా విభాగాల్లో సబ్జెక్టుతో సంబంధమున్న ప్రశ్నలు చాలామంది రాయగలుగుతారు. కానీ అందరికీ క్లిష్టంగా ఉండే ప్రశ్నలు వర్తమాన అంశాల అనుసంధానం ఉండేవే. కరెంట్‌ అఫైర్స్‌లో అవగాహన కలిగిన అభ్యర్థికి అది ఆ విభాగాల్లో అనుకూలత (ప్లస్‌ పాయింట్‌) అవుతుంది.
* రాతపరీక్ష తదుపరి ఇంటర్వ్యూ, బృందచర్చ రౌండ్లు ఉండే ఎంపిక పరీక్షల్లో వర్తమాన అంశాలే ప్రాధాన్యం వహిస్తాయి.

ఇలా చేయడం మేలు
ఏ పరీక్షకు సన్నద్ధమవుతున్నా వర్తమాన అంశాల కోసం కొంత సమయాన్ని కేటాయించాలి. సమాచార సేకరణ వనరులుగా దినపత్రికలు, టెలివిజన్‌, ఇంటర్నెట్‌, ఆర్థిక, సామాజిక వ్యవహార పత్రికలు, రేడియోలను పరిగణించవచ్చు. ఇంటర్నెట్‌ విషయంలో సాధ్యమైనంతవరకూ అధికారిక వెబ్‌సైట్లు అనుసరిస్తే మంచిది. వివిధ కేంద్రప్రభుత్వ మంత్రిత్వశాఖలకు వేర్వేరుగా వెబ్‌సైట్లు ఉన్నాయి.
* దినపత్రికలు అనుసరించేటపుడు ఒకసారి అన్ని పేజీలూ ఆసాంతం తిరగేయాలి. పరీక్షల కోణం దృష్ట్యా ముఖ్యమైన పాఠ్యాంశాలను గుర్తించి ఆపై విషయసేకరణ చేయాలి.
* అంశాలను కేవలం ప్రశ్నకోణంలోనే చూడకుండా మొదట అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఒక వివాదం/ చర్చనీయాంశంపై వేర్వేరు కోణాలు తెలుసుకోవాలి.
* ప్రతి ప్రధాన అంశం మంచి చెడులను విశ్లేషణ దృక్పథంతో పరిశీలించాలి. ఆపై ఆ అంశంపై సొంత అభిప్రాయాన్ని రూపొందించుకోవాలి.
* సివిల్స్‌, గ్రూప్‌-1 వంటి ఉన్నతస్థాయి పరీక్షల్లో అభ్యర్థికి సమకాలీన అంశాలపై ఉన్న దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యం ఏమేరకు ఉందో పరిశీలిస్తారు.
* వర్తమాన అంశాలపై పరస్పర అభిప్రాయాలు వ్యక్తీకరించుకోవడానికి ఎంపికలో జాగ్రత్త వహించి వాట్సాప్‌ గ్రూప్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్లలో చేరడమూ ప్రయోజనకరమే!


Back..

Posted on 30-08-2016