* పోటీ పరీక్షల కోసం వర్తమాన అంశాలు
దాదాపు అన్ని పోటీ పరీక్షల్లోనూ వర్తమాన వ్యవహారాల నుంచి తప్పకుండా ప్రశ్నలు ఉంటాయి. తమ సబ్జెక్టులకే పరిమితం కాకుండా వివిధ రంగాల్లో తాజాగా సంభవిస్తున్న పరిణామాలనూ, వార్తల్లోకెక్కిన ప్రముఖ సంఘటనలనూ ఉద్యోగార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కీలక అంశాల్లోని తాజా చేర్పులపై నోట్సు రాసుకోవాలి. అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయుల్లో ఇటీవల చోటుచేసుకున్న ముఖ్యాంశాలను పరిశీలిద్దాం!
జాతీయం
అక్టోబరులో 8.5 శాతానికి నిరుద్యోగిత
* మన దేశంలో గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా 2019 అక్టోబరులో నిరుద్యోగిత 8.5 పెరిగినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తాజాగా వెల్లడించింది. 2016 ఆగస్టు తర్వాత గత నెలలోనే నిరుద్యోగిత అత్యధికంగా నమోదైనట్లు తెలిపింది.
* మరోవైపు 2018 సెప్టెంబరుతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో మౌలిక వసతుల ఉత్పాదన 5.2 శాతం క్షీణించిందని సంస్థ వెల్లడించింది. ఇందులో మొత్తం 8 ప్రధాన పరిశ్రమలుండగా వాటిలో ఏడింటి ఉత్పాదన తిరోగమనంలో ఉందని పేర్కొంది.
* 2011-12, 2017-18 మధ్య భారత్‌లో నిరుద్యోగిత గణనీయంగా పెరిగిందని ‘సుస్థిర ఉద్యోగిత కేంద్రం’ విడుదల చేసిన ఓ పరిశోధన పత్రం కూడా పేర్కొంది. ఆ కాలంలో 90 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. దేశ చరిత్రలో స్వల్ప వ్యవధిలో అత్యధిక ఉద్యోగాలు పోయిన కాలంగా దీన్ని వ్యాఖ్యానించింది.
76 వేలమంది డెంగీ బాధితులు
* కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2019 అక్టోబరు నాటికి దేశంలో 67 వేల డెంగీ కేసులు నమోదయ్యాయి. 13 వేల కేసులతో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, దాదాపు 8,500 కేసులతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దాదాపు 3 వేల కేసులు నమోదయ్యాయి.
* 1970కి ముందు కేవలం తొమ్మిది దేశాల్లో ఉన్న డెంగీ తీవ్రత ఇప్పుడు వందకు పైగా దేశాలకు వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్ తదితర దేశాల్లో డెంగీ కేసుల పరంపర కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తోన్న మొదటి 10 వ్యాధుల్లో డెంగీ కూడా చేరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోబోటిక్ సర్జరీ
* దేశ రాజధాని దిల్లీలోని ప్రతిష్ఠాత్మక సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సదుపాయాన్ని 2019 నవంబరు 2న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రారంభించారు. ప్రపంచస్థాయి సదుపాయాలను, నైపుణ్యాలను నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రిలో రోబోటిక్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి.
సీజేఐ జస్జిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ
* సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ 2019 నవంబరు 17న పదవీ విరమణ చేశారు. 2018 అక్టోబరు 3న సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
* దశాబ్దాల తరబడి నలుగుతున్న అయోధ్య భూ వివాదం కేసుపై తుది తీర్పు, శబరిమల ఆలయంలోని అన్ని వయసుల మహిళలకు ప్రవేశానుమతితోపాటు ముస్లిం, పార్శీ మహిళలకు సంబంధించిన మతపరమైన సమస్యలను విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని ఆదేశించడం, సొంత రాష్ట్రం అసోంలో జాతీయ పౌర పట్టికకు సంబంధించిన సమస్య పరిష్కారానికి చొరవ చూపడం, ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెస్తూనే న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడాలంటూ లక్ష్మణరేఖ గీయడం మొదలైన కీలక నిర్ణయాలను జస్టిస్ గొగోయ్ వెలువరించారు.
అంతర్జాతీయం
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగనున్న అమెరికా
* 2015లో కుదిరిన పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు 2019 నవంబరు 5న అమెరికా ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది. ఈ చరిత్రాత్మక పారిస్ ఒప్పందంపై భారత్ సహా 188 దేశాలు సంతకాలు చేశాయి. ఒప్పందం నుంచి ఏడాది తర్వాత అమెరికా వైదొలగవచ్చు.
ఇంటర్నెట్ వేగంలో దక్షిణ కొరియా అగ్రస్థానం
* బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ విశ్లేషణ సంస్థ ఊక్లా 2019 నవంబరు 4న వెల్లడించిన గణాంకాల ప్రకారం మొబైల్ ఇంటర్నెట్ వేగంలో, సగటు డౌన్లోడ్, అప్లోడ్ వేగంలో దక్షిణకొరియా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయంలో భారత్‌కు 128వ ర్యాంకు లభించింది. ఫిక్స్డ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ 72వ స్థానంలో నిలిచింది.
ఆన్లైన్ గేమ్స్‌పై కర్ఫ్యూ
* ఆన్లైన్ గేమ్స్‌కు చిన్నారులు బానిసలు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న చైనా ఈ తరహా ఆటలపై వారు గడిపే సమయాన్ని కట్టడి చేయడానికి కర్ఫ్యూ విధించింది. దీనిప్రకారం చిన్నారులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటలలోపు ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి వీల్లేదు.
రాష్ట్రీయం-ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎస్‌గా నీలం సాహ్ని
* 2019 నవంబరు 14న వెలగపూడి సచివాలయంలో నీలం సాహ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రానికి నీలం సాహ్ని తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.
‘మనబడి నాడు-నేడు’
* 2019 నవంబరు 14న ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
* ప్రతి పాఠశాలను ఇంగ్లిష్ మీడియం చేయబోతున్నట్లు వచ్చే ఏడాది ఒకటి నుంచి ఆరో తరగతి వరకు, ఆ తర్వాతి ఏడాది నుంచి ఏడాది ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ పోతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
* రాష్ట్రంలో 45 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయనీ, వీటిని మూడేళ్లలో మూడు దశల్లో బాగు చేసే కార్యక్రమం చేస్తున్నట్లు, తొలి దశను నవంబరు 14నే ప్రారంభిస్తున్నట్లు సీఏం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచేందుకు రూ.12వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, వీటన్నింటినీ స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీతో అనుసంధానం చేస్తామని ప్రకటించారు.
పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ
* రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుగానీ ఆరోగ్యశ్రీ కార్డుగానీ ఉన్నవారు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు పొందే అవకాశాన్ని 2019 నవంబరు 1న సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో 73, బెంగళూరులో 35, చెన్నైలో 23 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందవచ్చు.
రాష్ట్రీయం- తెలంగాణ
జ్యోతి గౌడ్‌కు ‘బెస్ట్ బ్రెయిలీ’ అవార్డు
* హైదరాబాద్‌లోని ‘దేవనార్ ఫౌండేషన్ ఫర్ ది బ్లైండ్’ కరస్పాండెంట్ ఎ. జ్యోతిగౌడ్‌కు కేంద్రప్రభుత్వం ‘బెస్ట్ బ్రెయిలీ ప్రింటింగ్ ఇన్ ది కంట్రీ-2019’ పురస్కారాన్ని ప్రకటించింది.
* సాధారణ చిన్నారులతో సమానంగా అంధ విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ఈమె వేల సంఖ్యలో బ్రెయిలీ లిపిలో పుస్తకాల ప్రచురణ చేశారు. గత 27 ఏళ్లుగా పాఠ్యపుస్తకాలతోపాటు ఆధ్యాత్మిక గ్రంథాలు, సందేశాత్మక, మహనీయుల చరిత్రలనూ బ్రెయిలీ లిపిలో అందించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అంధులకు ఈ పుస్తకాలను ఉచితంగా అందించారు.
* అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా 2019 డిసెంబరు 3న దిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈమెకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.
నిర్మల్ జిల్లాకు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు
* రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అందించే ప్రతిష్ఠాత్మక ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్- 2019’ పురస్కారం లభించింది.
* నిర్మల్ జిల్లాలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు ప్రవేశపెట్టిన రైతు యంత్ర యాప్ విజయవంతం కావడంతో ఈ పురస్కారం దక్కింది.
డబ్ల్యూటీవో సదస్సులో పిట్ట రాములు
* మొట్టమొదటి అంతర్జాతీయ నూలు దినోత్సవ సందర్భంగా 2019 అక్టోబరు 7న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) జెనీవా నగరంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ సదస్సులో వరంగల్ కొత్తవాడ చేనేత కార్మికుడు పిట్ట రాములు పాల్గొన్నారు.
* రాములు ఈ సదస్సులో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సమక్షంలో నూలు తయారీ విధానాన్ని ప్రదర్శించారు. అనంతరం స్మృతి ఇరానీ రాములు సాయంతో నూలు వడికారు. 2015లో రాములు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి ఉత్తమ జాతీయ హ్యాండ్లూమ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు.
ఇతరాలు
పాకిస్థాన్‌లో ఆజాదీ మార్చ్
* పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఆ దేశంలో భారీ స్థాయిలో ‘ఆజాదీ మార్చ్ (స్వేచ్ఛా ప్రదర్శన)’ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
* ఇమ్రాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోందని నిరసనకారుల ప్రధాన ఆరోపణ. కరడుగట్టిన ఇస్లామిక్వాది మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ నేతృత్వంలోని జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఈ ప్రదర్శనలకు నేతృత్వం వహించింది.
మెక్సికో అడవుల్లో ‘ఫాజోలిసిన్’
* మొక్కలు, మనుషుల్లో బ్యాక్టీరియా కారక ఇన్ఫెక్షన్లను నిరోధించగల సహజ సూక్ష్మనాశకాన్ని (యాంటీ బయాటిక్) అమెరికాలోని రట్జర్స్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల మెక్సికోలోని లాస్టక్స్ట్లస్ అడవుల్లో కనుక్కున్నారు.
* ఈ అడవుల్లో పెరిగే ‘ఫెజల్ వల్లరిస్’ అనే చిక్కుడు జాతిమొక్క వేరు కణుపుల్లో ఈ సూక్ష్మజీవ నాశకం కొలువై ఉంటుందని పరిశోధనల్లో గుర్తించారు. ఈ యాంటీ బయాటిక్‌కు ‘ఫాజోలిసిన్’ అనే పేరు పెట్టారు.
భారత హాకీ జట్లకు ఒలింపిక్ బెర్తులు
* భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. రెండు మ్యాచ్‌ల క్వాలిఫయర్స్ పోరులో రష్యాను 11-3 (రెôడు మ్యాచ్‌ల్లో గోల్స్)తో ఓడించిన పురుషుల జట్టు, అమెరికాను 6-5తో ఒడించిన మహిళల జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశాన్ని సంపాదించాయి.
* ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం పురుషుల జట్టుకు ఇది 21వసారి. అమ్మాయిలకు మూడోసారి మాత్రమే.
జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లు
* వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 2019 అక్టోబరులో రూ.95,380 కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది.
* ఏడాది క్రితం ఇదే నెలలో ఇవి రూ.1,00,710 కోట్లుగా ఉన్నాయి.
* జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్ల దిగువన నమోదు కావడం ఇది వరుసగా మూడో నెల. 2019 సెప్టెంబరులో జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లుగా నమోదయ్యాయి.
రజనీకాంత్‌కు ‘ఇఫీ’ పురస్కారం
* భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) - 2019ని పురస్కరించుకుని ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్‌కు కేంద్రప్రభుత్వం స్వర్ణోత్సవ దిగ్గజ పురస్కారాన్ని ప్రకటించింది.
* ఈ ఏడాది ‘ఇఫీ’ 50వ వసంతం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ తొలిసారిగా ఈ పురస్కారాన్ని ఏర్పాటుచేసింది.
* భారతీయ సినిమా రంగానికి కొన్ని దశాబ్దాలుగా రజనీకాంత్ చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనకు ‘ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జాబ్లీ ఆఫ్ ‘ఇఫీ - 2019’ పురస్కారాన్ని ప్రకటించారు.
* గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరగబోయే ‘ఇఫీ’ చిత్రోత్సవాల్లో రజనీ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
* ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హుప్పెర్ట్కి ‘ఇఫీ’ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు.
ఏంజెలా మెర్కెల్ భారత పర్యటన
* రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 2019 నవంబరు 1న దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఐదో అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల భేటీకి ఇద్దరు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో సహకారం, పట్టణాల్లో హరిత రవాణా వ్యవస్థ, కృత్రిమ మేధస్సు, 5జీ లాంటి రంగాల్లో పరిశోధనల కోసం ఐదు ఉమ్మడి ప్రకటనలు ఖరారయ్యాయి.
* రెండు దేశాలు అంతరిక్షం, పౌర విమానయానం, సముద్ర పరిజ్ఞానం, విద్య, వైద్యం, కృత్రిమమేధ, సైబర్ సెక్యూరిటీ లాంటి 17 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత నగరాల్లో హరిత రవాణా వ్యవస్థల కోసం 100 కోట్ల యూరోల ఆర్థిక సాయాన్ని అందించడానికి జర్మనీ సమ్మతించింది.
టోక్యోలో ‘ఇండియా హౌజ్’
* 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లబోయే భారత బృందం కోసం అక్కడ ‘ఇండియా హౌజ్’ను నిర్మించేందుకు ఇటీవల జిందాల్ సౌత్‌వెస్ట్ (జీఎస్డబ్ల్యూ) గ్రూప్ భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.
* ఒలింపిక్స్ ఆతిథ్య నగరాల్లో అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి హౌజ్‌లను నిర్మించుకోవడం సహజం. కానీ భారత్ మాత్రం ఇలాంటి అధునాతన సౌకర్యాలతో హౌజ్‌ను నిర్మించుకోవడం ఇదే మొదటిసారి. ఈ హౌజ్‌లో భారత క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులూ ఉంటాయి.
Posted on 18-11-2019