Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆ ప్రశ్నల వెనక... సప్త సూత్రాలు!

పోటీ పరీక్షల తేదీ సమీపిస్తున్నపుడు చివరిరోజుల్లో ఎక్కువమంది చదివే విభాగం వర్తమాన అంశాలు (కరంట్‌ అఫైర్స్‌). ఒకవేళ కొంతమంది అభ్యర్థులు ప్రారంభంలో సిలబస్‌లో భాగంగా చదివినప్పటికీ- కొంతకాలం ఆపివేసి చివరిలో తాజా అంశాలన్నిటినీ క్రోడీకరించి చదవాలనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు గ్రూప్‌-2 విషయంలో అనుసరిస్తున్న సూత్రం ఇదే. వర్తమాన అంశాలను మార్కులుగా మల్చుకోవటానికి వేటిపై దృష్టిపెట్టాలో చూద్దాం!
పోటీ పరీక్షల్లో హార్డ్‌వర్క్‌ కంటే స్మార్ట్‌వర్క్‌ అవసరమని తరచూ వింటుంటాం కదా? ఈ స్మార్ట్‌స్టడీ- తెలివైన సన్నద్ధతను వర్తమాన అంశాలకు వర్తింపజేసి చూద్దాం.
కళ్ళాలు లేని కరంట్‌ అఫైర్స్‌కు పగ్గాలు వేసి ఒకచోట చేర్చి చదవడం ఎలా అని మథనపడటం కంటే కాస్త తెలివిగా అసలు ప్రశ్నపత్రాల రూపకర్తలు ఎలాంటి ప్రశ్నలు ఎంచుకుంటున్నారు? అనేకమైన వర్తమాన పరిణామాల్లో వారిని ఆకర్షిస్తున్న అంశాలేమిటి? పరీక్షల్లో వస్తున్న ప్రశ్నల ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి?... ఈ ప్రశ్నలు వేసుకుని ఇటీవలి ఏపీపీఎస్‌సీ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
ఈ కోణంలో ఏపీపీఎస్‌సీ ఇటీవలి కాలంలో నిర్వహించిన ఏఈఈ, ఏఈ కేటగిరి పరీక్షల వడపోత, ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల అధ్యయనం చేస్తే ప్రశ్నపత్రాల్లో ప్రత్యక్షమవుతున్న ప్రశ్నల వెనక ఏడు ప్రధాన ప్రాతిపదికలున్నట్లు స్పష్టమవుతోంది. వాటిని అర్థం చేసుకుంటే ఆ దిశగా సన్నద్ధం కావొచ్చు.
1. సాధారణ సమాచార ఆధారిత ప్రశ్నలు:
బాగా వార్తల్లో నలిగిన అంశాలపై మౌలిక సమాచారం తెలుసుకునేందుకు అడుగుతున్న ప్రశ్నలు ఈ వర్గానికి చెందినవి. ఈ తరహా ప్రశ్నలు దాదాపు ప్రతి పరీక్షలోనూ ఉంటాయి.
ప్రశ్న: జీఎస్‌టీ ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది?
జవాబు: 1 జులై 2017
ప్ర: కిందివాటిలో నీతి ఆయోగ్‌ సభ్యుడు ఎవరు?
జ: జవాబు రమేశ్‌చంద్‌. ఆయన వ్యవసాయరంగ నిపుణుడు.
* గత ఆర్నెల్ల ప్రాధాన్య అంశాలను జాబితాగా రాసుకుని వాటి ప్రాథమిక సమాచారాన్ని చదవాలి.
2. జన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన పరిణామాలు:
పరీక్ష జరగడానికి మూడు-నాలుగు నెలల ముందు ప్రజాజీవితాన్ని కుదిపేసిన సంఘటన/ నిర్ణయంపై ప్రశ్నలను సంధిస్తున్నారు. గ్రూప్‌-2 పరీక్షలో రాగల ఇలాంటి పరిణామం... పెద్దనోట్ల రద్దు. ఇప్పటికే దీనిపై ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో ప్రశ్నలు వచ్చాయి కూడా.
ప్ర: నవంబరు 2016లో పెద్దనోట్లను రద్దు చేయడానికి ముందు దేశ కరెన్సీలో చెలామణిలో ఉన్న రూ. 500, రూ.1000 నోట్ల శాతం ఎంత?
జ: 86 శాతం
ప్ర: ఎవరి సిఫార్సు మేరకు భారత ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసింది?
జ: ఇచ్చిన నాలుగు ఐచ్ఛికాల్లో ఆర్‌బీఐ సరైన జవాబు.
* ఇటీవలికాలంలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రధాన విషయాల సమాచారాన్ని ఆమూలాగ్రం చదవాలి.
3. అరుదైన విజయాలు:
జాతీయ అంతర్జాతీయ రంగాల్లో అరుదైన విజయాలు ఏవి జరిగినా వాటిపై ప్రశ్నలు ఎంపిక చేస్తున్నారు. ఉదాహరణకు- పంటల సాగులో ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం అధికమై ప్రజారోగ్యంపై ప్రభావం కలిగించడం నేటి సవాళ్ళలో ఒకటి. దీనికి ప్రతిగా సేంద్రియ వ్యవసాయాన్ని (రసాయన వినియోగం లేని సాగు) ప్రోత్సహిస్తున్నారు. దీనిపై సాధించిన ఓ విజయంపై ప్రశ్న వచ్చింది.
ప్ర: దేశంలో తొలి పూర్తి సేంద్రియ రాష్ట్రం?
జ: నాలుగు ఐచ్ఛికాల్లో సిక్కిం రాష్ట్రం సరైనది.
* ఈమధ్య కాలంలో భారతదేశం శాస్త్ర సాంకేతిక, పర్యావరణ, విపత్తు నిర్వహణ రంగాల్లో సాధించిన అరుదైన విజయాలను విధిగా చదవాలి.
విధిగా వచ్చే అంశాలు
‘ప్రశ్నలందు పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు వేరయా’ అన్నట్టు కొన్ని అంశాలపై విధిగా ప్రశ్నలు వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. ఇలాంటి అంశాలను ఒక జాబితాగా రాసుకుని వాటిని ఆమూలాగ్రం చదవాలి.
* పద్మ పురస్కారాలు * అమెరికా కొత్త అధ్యక్షుడు- తాజా పరిణామాలు * పెద్దనోట్ల రద్దు- డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ * జీఎస్‌టీ చట్టం * రియో-పారాలింపిక్స్‌ * 104వ సైన్స్‌ కాంగ్రెస్‌ * 14వ ప్రవాసీ భారతీయ దివస్‌.
ఇలా 2016 పరిణామాల నుంచి 50 అంశాలను గుర్తించగలిగితే సన్నద్ధత సులభతరమవుతుంది.
* ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5న (డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి) అని తెలుసు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జనవరి 3న (సావిత్రీబాయి ఫూలే జయంతి) నిర్వహిస్తున్నారు.
* ఒలింపిక్స్‌లో ఆశించిన పతకాలు సాధించలేదని ఆ క్రీడల్లో పాల్గొన్న బృందాన్ని 3 నెలలు గనుల్లో పనిచేయాలని ఏ దేశ అధ్యక్షుడు ఆదేశించాడు? ఉత్తర కొరియా
* గ్రహాంతర వాసుల అన్వేషణకు ప్రపంచంలోని అతి పెద్ద టెలిస్కోపును ప్రారంభించిన దేశం? చైనా
* ఎవరి అధ్యక్షతన 52వ జ్ఞాన్‌పీఠ్‌ అవార్డుకు బెంగాలీ రచయిత శంఖు ఘోష్‌ను ఎంపిక చేశారు? నామ్‌వర్‌ సింగ్‌ కమిటీ
* రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయమని సిఫారసు చేసిన కమిటీ? బిబేక్‌ దెబ్రాయ్‌
ఇలాంటి అంశాలు ప్రశ్నలుగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ తరహా పరిశీలన దృష్టితో సన్నద్ధం అయితే విజయం మీదే!
4. విశేషమైన విషయాలు
ఇవి ప్రశ్నపత్ర రూపకర్తలను ఆకర్షిస్తున్నాయి. అంటే ‘ఔరా’ అనిపించే విషయాలపై, సాధికారిక విజయాలు, పరిణామాలపై ప్రశ్నలు ఉంటున్నాయి.
ప్ర: నీటిపైన, నేలపైన ప్రయాణం చేయగల ఉభయచర విమానం ఎ.జి.-600 ఏ దేశానికి చెందినది?
జ: సమాధానాల్లో పొందుపరిచిన చైనా సరైన జవాబు. (ఇదొక విశేష అంశం. నిజానికి విమానాలు నేలపైన మాత్రమే కొంతదూరం ప్రయాణించి ఆపై నింగిలోకి చేరతాయి. అయితే ఉభయచర వాహనాన్ని తీసుకురావడం విశేష అంశం అయినందున దీనిపై ప్రశ్న వచ్చింది.)
ప్ర: రైల్వే యూనివర్సిటీని ఎక్కడ నెలకొల్పుతారు?
జ: వడోదర. (సాధారణ యూనివర్సిటీలు ఎన్నో ఉంటాయి. కానీ రైల్వే వ్యవస్థ అవసరాలకు ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పడం విశేషం. కాబట్టి దీనిపై ప్రశ్న సంధించారు.)
* ఇలాంటి అంశాల ఎంపికపై తగిన జాగ్రత్త వహించాలి. ఈ కేటగిరిలో నమ్మూ నమ్మకపో, జిజ్ఞాస కోసం వచ్చే వార్తాంశాల జోలికి పోకూడదు.
5. ప్రముఖుల జయంత్యుత్సవాలు
వీటిపై విధిగా ప్రశ్నలు వస్తున్నాయి. ఉదాహరణకు డా. అంబేడ్కర్‌ 125 జయంత్యుత్సవ సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమంపై ప్రశ్న అడిగారు.
ప్ర: ‘గ్రామ్‌ ఉదయ్‌సే భారత్‌ ఉదయ్‌ అభియాన్‌’ ఎవరి జన్మదినం నాడు ప్రారంభమైన కార్యక్రమం?
జ: డా. బీఆర్‌ అంబేడ్కర్‌ 125 జయంతిని పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని ఆయన స్వగ్రామం మౌలో ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
* అక్టోబరు 15 మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి. ఆ రోజును రీడింగ్‌ డే గా పాటించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా ప్రశ్నలు ప్రశ్నపత్ర రూపకర్తలను ఆకర్షించే అవకాశం ఉంది.
6. ప్రముఖుల ప్రసంగాలు- గ్రంథాలు
సహజంగానే ప్రముఖుల పుస్తకాలు కొంతకాలం వార్తల్లో ఉంటాయి. వాటిలోని అంశాల రీత్యా మననం కూడా కావొచ్చు. అందువల్ల వాటిపై ప్రశ్నలు వస్తున్నాయి.
ప్ర: కల్లోల సంవత్సరాలు (టర్బులెంట్‌ ఇయర్స్‌ 1980-1996) అనే పుస్తకం ఎవరి జ్ఞాపకాలు?
జ: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన పుస్తకం ఇది.
ప్ర: పౌరుడు- సమాజం పుస్తక రచయిత?
జ: ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ
* ఈ కేటగిరిలో రాజకీయ, క్రీడా, వినోద రంగ ప్రముఖులు రాసిన పుస్తకాల గురించి తెలుసుకోవాలి.
7. సమాజంలో నూతన ధోరణులు
ఈ కొత్త ధోరణులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నపుడు వాటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. నేటితరంలో ఆహార అలవాట్ల కారణంగా వూబకాయుల శాతం పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని-
ప్ర: ఏ రాష్ట్రం వూబకాయ (ఫ్యాట్‌) పన్నును చిరుతిళ్ళపై విధించింది? జ: కేరళ.
వరదల నివారణకూ, పర్యావరణ పరిరక్షణకూ అడవులు కీలకం. అయితే ఇటీవలికాలంలో అడవుల నరకివేత ఎక్కువవుతోంది. దీనిపై-
ప్ర: అడవులను నరకడాన్ని నిషేధించిన మొదటి దేశం? జ: నార్వే
* ఏపీపీఎస్‌సీ/టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల్లో వర్తమాన పరిణామాల్లో ఏ కోణం నుంచి ప్రశ్నల ఎంపిక జరుగుతోంది? ముఖ్యంగా ప్రశ్నల ఎంపిక ప్రాతిపదికలు ఏమిటి? అనేవి పరిశీలించినపుడు వెల్లడైన ఈ అంశాలపై దృష్టిపెట్టటం అవసరం. అప్పుడే మెరుగైన మార్కులకు మార్గం సుగమమవుతుంది.


Back..

Posted on 20-02-2017