Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
సైబర్‌ ప్రపంచ సంరక్షణ!

ఇటీవల ప్రపంచాన్ని గడగడలాడించిన ‘వాన్నక్రై’ రాన్సమ్‌ వేర్‌ గుర్తుందా? అంతర్జాల ఆధారిత వ్యాపార సంస్థలన్నీ అల్లాడి పోయాయి. ఎందుకు?
భారతదేశంపై గత మూడేళ్లలో దాదాపు లక్షన్నర సైబర్‌ దాడులు జరిగాయని ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటులో సంబంధిత మంత్రి ప్రకటించారు! ఈ దాడులు ఏంటి?
మన వివరాలన్నీ మనకే చెప్పి మనకొచ్చిన ఓటీపీని అడిగి తీసుకొనిమరీ మన సొమ్మంతా కొల్లగొట్టే మోసపూరిత ఫోన్‌ కాల్స్‌ గురించి మనం రోజూ వింటున్నాం! వీటిని తప్పించుకోవడం ఎలా?
ఈ వైరస్‌లు.. దాడులు.. మోసాలన్నీ సైబర్‌ ప్రమాదాలే!
ఒక పక్క ఇంటర్‌నెట్‌ వినియోగం ఎక్కువవుతుంటే దాంతో సమానంగా సైబర్‌ నేరాలు కూడా పెరుగుతున్నాయి.
వీటిని అరికట్టడంలో భాగంగా కొత్త కొత్త ఉద్యోగాలు, కోర్సులు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు సైబర్‌ ప్రపంచ సంరక్షణ సరికొత్త కీలక ఉద్యోగ బాధ్యతగా అభివృద్ధి చెందుతోంది!

అంతర్జాతీయ వ్యవస్థల నుంచి అతి సామాన్య వ్యక్తుల వరకు అందరూ సైబర్‌ ప్రమాదాల బారిన పడుతున్నారు. మన సమాచారాన్ని మనకు తెలియకుండానే దొంగిలిస్తున్నారు. అణుయుద్ధాల కంటే సైబర్‌ యుద్ధాలే ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తగిన రక్షణ వలయాలను ఏర్పాటు చేసుకోవడం కోసం అభివృద్ధి చెందుతున్న కెరియర్‌ సైబర్‌ సెక్యూరిటీ.
ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణ్వస్త్రాలే అవసరం లేదు. ఆ దేశ సమాచార వ్యవస్థపై సైబర్‌ దాడి చేసి ధ్వంసం చేస్తే చాలు. కొన్ని దశాబ్దాలపాటు కోలుకోలేని దెబ్బ తగులుతుంది.
హ్యాక్మగెడ్డాన్‌ అనే సంస్థ నివేదిక ప్రకారం డిసెంబరు 2017 వరకు జరిగిన ఆన్‌లైన్‌ నేరాల్లో 84.6 శాతం సమాచార చౌర్యానికి చెందినవే. 9.9 శాతం పోటీ పరిశ్రమల సైబర్‌ గూఢచర్యం చర్యలు. 4.4 శాతం హ్యాకింగ్‌ ప్రయత్నాలు. ఇక మిగిలిన 1.1 శాతం సైబర్‌ యుద్ధాల శకలాలు!
సైబర్‌ సెక్యూరిటీ అంటే ఏంటి?
సైబర్‌ నేరగాళ్ల సాంకేతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న వ్యవస్థను రూపొందించి, నిర్మించి, నిర్వహించి నెట్‌వర్క్‌ను భద్రంగా కాపాడుకోవడాన్ని సైబర్‌ సెక్యూరిటీ అని చెప్పవచ్చు. తద్వారా ఈ-కామర్స్‌ లావాదేవీలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేయడం దీని ప్రధాన లక్ష్యం.
సాధారణంగా కంప్యూటర్‌, నెట్‌వర్క్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ లక్ష్యంగా సైబర్‌ నేరాలు (వైరస్‌, ఎస్‌క్యూఎల్‌ ఇంజెక్షన్‌, డిస్ట్రిబ్యూటెడ్‌ డినయల్‌ ఆఫ్‌ సర్వీస్‌) జరుగుతుంటాయి. ప్రభుత్వం, కార్పొరేట్‌ సంస్థలు, ఇతర వ్యవస్థలు ఇందులో ప్రధాన బాధితులు. అందుకే ప్రోగ్రామింగ్‌, సురక్షితమైన, దుర్భేద్యమైన నెట్‌వర్క్‌ల అభివృధ్ధి ఇప్పుడు మేధావుల, ఉద్యోగుల ప్రధాన లక్ష్యంగా మారింది.
వేగంగా విస్తరణ
కమ్యూనికేషన్‌ వ్యవస్థ, కంప్యూటర్‌, నెట్‌వర్క్‌ రంగాల్లో జరుగుతున్న విప్లవాత్మక మార్పుల ఫలితంగా సమాచారం అందరికీ అందుబాటులో ఉండటం ఒక వరమైతే, అదే సమయంలో ఆ సమాచారానికి భద్రత లేకపోవడం ప్రమాదకరమైన విషయం. అందుకే ఆ భద్రత కల్పనలో భాగంగా నిపుణుల అవసరం రోజురోజుకీ పెరుగుతోంది. సమాచార లభ్యతతోపాటు సమగ్రత, గోప్యతలను కూడా ఎంతో అవసరమైన సేవలుగా వీరు అందించాల్సి ఉంటుంది.
ఐటీ రంగంలో పలు దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలంటే భౌతిక యుద్ధాలు అవసరం లేదు. వాటి సమాచార వ్యవస్థను ఛేదిస్తే చాలు. అందుకే రోజూ ఎన్నో రకాల సైబర్‌ దాడులు జరుగుతుంటాయి. మన దేశ భద్రతా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విధంగా అటు ప్రైవేటు ఇటు ప్రభుత్వ రంగాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి.
విద్యార్హతలు - ఇతర నైపుణ్యాలు
కనీసం ఏదైనా డిగ్రీ సరిపోతుంది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా పీజీ ఉంటే ప్రాధాన్యం ఉంటుంది. విచారించే తత్వం, విశ్లేషణ సామర్థ్యం అదనపు లక్షణాలు. భావప్రకటనపై పట్టు ఉండాలి. అభ్యర్థులకు సహనం చాలా అవసరం.
* పైథాన్‌, రూబీ, జావా స్క్రిప్ట్‌, బాష్‌ స్క్రిప్ట్‌, షెల్‌ స్క్రిప్ట్‌ బాగా వచ్చి ఉండాలి.
* వివిధ ఆపరేటింగ్‌ సిస్టంల పట్ల లోతైన, తార్కికమైన అవగాహన అవసరం.
* అల్గారిథమ్‌ అభివృద్ధి చేయగలగడం అదనపు అర్హత.
* రిపోర్ట్‌లు తయారు చేయడానికి రైటింగ్‌ స్కిల్స్‌ కావాలి.
* ఎథికల్‌ హ్యాకింగ్‌లో సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఇందులో వివిధ స్థాయుల్లో సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి.
* ఎథికల్‌ హ్యాకింగ్‌ శిక్షణలోని ‘కలి’ వంటి కొన్ని ముఖ్యమైన టూల్స్‌పై మంచి పట్టు ఉండాలి.
ఏయే స్థాయుల్లో ఎలాంటి ఉద్యోగాలు?
రోజురోజుకీ విస్తరిస్తున్న సైబర్‌ సెక్యూరిటీ రంగంలో వివిధ స్థాయుల్లో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి.
ఎంట్రీలెవెల్‌: కంప్యూటర్‌ నిపుణులు, పెనెట్రేషన్‌ టెస్టర్లు - ఎగ్జిక్యూటివ్‌ మేనేజర్‌ స్థాయిలో ఉండే ఉద్యోగాలివి. సంస్థ భద్రత వ్యవస్థ, మార్గదర్శకాలకు అనుగుణంగా రోజువారీ భద్రత బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
మిడిల్‌ లెవెల్‌: మేనేజర్‌గా భద్రత వ్యవస్థ నిర్వహణ, డేటా రక్షణ, భద్రత విధానం నిర్మాణ-నిర్వహణలు, వ్యాపారాభివృద్ధి చేస్తారు. ప్రమాదాలు, విపత్తులు సంభవించి డేటాకు నష్టం వాటిల్లినప్పుడు దాని పునరుద్ధరణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తారు.
సీనియర్‌ లెవెల్‌:ఈ స్థాయిలో సమాచార వ్యవస్థ రూపకల్పన, రచన, నియంత్రణల అమలు, సమాచార భద్రత నిర్వహణ ముఖ్య బాధ్యతలుగా ఉంటాయి.
హయ్యర్‌ లెవెల్‌: భద్రత సలహాదారులు, ఆడిటర్లుగా ఉంటారు. సమాచార భద్రతకు సంబంధించిన వ్యవస్థల నిర్మాణం, విధివిధానాలు, రిస్కుల అంచనా, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాల అమలు లాంటి ముఖ్యమైన బాధ్యతలను నిర్వహిస్తారు.
మేనేజ్‌మెంట్‌ లెవెల్‌: ఈ స్థాయిలో ముఖ్య సమాచార అధికారి (చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ - సీఐవో)గా భవిష్యత్తులో సమాచార భద్రతకు పెట్టాల్సిన పెట్టుబడులపై సలహాలు, నిర్ణయాలు; ప్రస్తుత, భవిష్యత్తు పెట్టుబడుల హేతుబద్ధీకరణ వంటి ప్రధాన బాధ్యతలు ఉంటాయి.
ఈ ఉద్యోగాలు కింది విధంగా ఉంటాయి.
* సెక్యూరిటీ అనలిస్ట్‌
* సెక్యూరిటీ ఇంజినీర్‌
* సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌
* సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌
* సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌
* క్రిప్టోగ్రాఫర్‌
* క్రిప్టనలిస్ట్‌
* చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌
* సెక్యూరిటీ కన్సల్టెంట్‌
* ఇంట్రూజన్‌ డిటెక్షన్‌ స్పెషలిస్ట్‌
* పెనెట్రేషన్‌ టెస్టర్‌.
ఏ కోర్సులు ఎక్కడెక్కడ?
* ఐఐటీ-భువనేశ్వర్‌ 2018 విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్‌ స్థాయిలో నెట్‌వర్కింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఫోరెన్సిక్‌ స్పెషలైజేషన్‌తో కొత్త కోర్సును ప్రారంభించాలని నిర్ణయించింది.
* ఎన్‌ఐటీ-కురుక్షేత్ర రెండేళ్ల ఎంటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సును అందిస్తోంది.
* కేరళలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సు ఉంది.
* బీటెక్‌ స్థాయిలో డెహ్రాడూన్‌లోని యూపీఈఎస్‌ సైబర్‌ సెక్యూరిటీపై నాలుగేళ్ల కోర్సు అందిస్తోంది.
* చెన్నైలోని హిందుస్థాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లోని బీటెక్‌ (ఐటీ) కోర్సులో సైబర్‌ సెక్యూరిటీ స్పెషలైజేషన్‌ ఉంది.
* న్యూదిల్లీలోని ఇంటర్‌నేషనల్‌ కాలేజ్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌లో పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ ఉంది.
* పుణేలోని సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ రిసెర్చ్‌లో పీజీ డిప్లొమా ఇస్తున్నారు.
* సీడాక్‌లో ఆరు నెలల ఆన్‌లైన్‌ కోర్సు చేసుకోవచ్చు.
* ఎథికల్‌ హ్యాకింగ్‌లో హైదరాబాద్‌ మైత్రీవనంలోని ఎంటర్‌సాఫ్ట్‌ లాబ్స్‌ సంస్థ శిక్షణ ఇస్తోంది. అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థ సెర్టికాం సర్టిఫికేషన్‌కి సంసిద్ధులను చేస్తోంది. ఈ సంస్థ ఇంటర్న్‌షిప్‌లకు కూడా అవకాశం కల్పిస్తోంది.
* హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని అడెప్ట్‌ టెక్నాలజీస్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌లో శిక్షణ ఇస్తోంది.
* గుజరాత్‌ రాష్ట్రం సైబర్‌ సెక్యూరిటీ రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను అందిస్తోంది.
* పుణే, ముంబయి, దిల్లీల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెక్యూరిటీ పలు కోర్సులను ఆఫర్‌ చేస్తోంది.
* తిరుపతిలోని వేంకటేశ్వర యూనివర్సిటీలో సైబర్‌ సెక్యూరిటీ పదకొండు నెలల సర్టిఫికెట్‌ కోర్సు ఉంది.
ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడమే కాదు తర్వాత అభ్యాసం చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి తగినంత ల్యాబ్‌ సమయం ఇచ్చే సంస్థలను ఎన్నుకోవాలి. ఫీజులు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయి. తగిన నైపుణ్యాలను నేర్చుకొని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది.

నీల‌మేఘ‌శ్యామ్ దేశాయ్‌, ACE ఇంజినీరింగ్ క‌ళాశాల

Back..

Posted on 09-01-2018