Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
డేటా శాస్త్రం.. అవకాశాల అస్త్రం!

* కెరియర్‌ గైడెన్స్‌ - డేటా సైన్స్‌

* ఆరేళ్ల కిందటే ‘హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ’ డేటా సైన్స్‌ను 21వ శతాబ్దపు ఆకర్షణీయ ఉద్యోగంగా పేర్కొంది.
* 2020 నాటికి డేటా సైంటిస్ట్‌లకు 28 శాతం వరకు డిమాండ్‌ పెరగనుందని, దాదాపు మూడు లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఐబీఎం అంచనా.
* ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యయనం ప్రకారం 2022కి 13.30 కోట్ల ఉద్యోగాలను కల్పించే 10 రంగాలు/కోర్సుల్లో డేటా సైన్స్‌ ఒకటి.

డ్రైవర్‌ లేని కారు.. పెనుతుపానులోనూ దారి తప్పకుండా గమ్యం చేరే విమానం.. ఎన్నికల్లో ఫలానా నాయకుడిదే విజయం.. అలాంటి టీవీ సీరియల్స్‌కే ఆదరణ, ఈ వస్తువులకే డిమాండ్‌.. అంటూ ముందే అంచనాలు వేసే శాస్త్రం అందుబాటులోకి వచ్చేసింది. అదే డేటా సైన్స్‌. దూరాలను, మలుపులను సరిగ్గా లెక్కలేసి సాగిపోతుంది కారు. వాతావరణ మార్పులను ముందే పసిగట్టి రూటు మార్చుకొని వెళ్లిపోతుంది విమానం. గత పోలింగ్‌లో తేడాలను కనిపెట్టి వ్యూహాలను మార్చి నేత గెలుపు సాధిస్తాడు. సీరియల్స్, వస్తువులకు కూడా అవే సూత్రాలను అనువర్తింపజేస్తారు. ఇదంతా డేటా సైన్స్‌ నిపుణుల మాయ. అన్ని రంగాలకు వీరి అవసరం వేగంగా పెరుగుతోంది.

ఆన్‌లైన్‌లోనే అన్ని పనులు జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, రవాణా, అమ్మకాలు-కొనుగోళ్లు, ఇంటి అవసరాలు, వైద్యం, పర్యటన, మార్కెటింగ్‌... ఇలా ప్రతిదీ ఆన్‌లైన్‌ ద్వారానే సాగిపోతోంది. దీంతో ఏ వస్తువులు, ఏయే సేవలు, చివరికి ఏ సీరియల్‌కు ఆదరణ ఎక్కువ ఉందో వంటి వివరాలు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. ఇది చాలా విలువైన డేటా. వినియోగదారుల అవసరాలు, అసౌకర్యాలను విశ్లేషించుకొని సంస్థలు తమ వస్తుసేవలను మెరుగుపరుచుకొని మార్కెట్‌లో విస్తరించడానికి ఉపయోగపడుతుంది. ఇందుకు డేటా సైన్స్‌ నిపుణులు అవసరం అవుతారు.

డేటా ఆధారంగా విశ్లేషణ!
డేటా సైన్స్‌ అంటే- టూల్స్‌ (సాధనాలు), అల్గారిథం, మెషిన్‌ లర్నింగ్‌ సిద్ధాంతాల కలయికతో ‘రా డేటా’లో దాగి ఉన్న పాటర్న్‌ను (విధానాన్ని) కనుక్కోవడం. డేటా హిస్టిరీని ప్రాసెస్‌ చేసి ఫలానా విషయాన్ని రాబట్టొచ్చో తెలియజేసే వాళ్లే డేటా అనలిస్ట్‌లు. దీంతోపాటు భవిష్యత్తులో ఈ సమాచారం ఆధారంగా ఎలాంటి కొత్త విధానాలను తీసుకురావచ్చో కూడా వివరిస్తారు. వీరినే డేటా సైంటిస్టులు అంటారు.
డేటా సైన్స్‌ ప్రాథమికంగా కొన్ని అంచనాలు, ఆలోచనలను మెషిన్‌ లర్నింగ్‌ ఆధారంగా విశ్లేషిస్తుంది. ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఒక వస్తువు కొనే ముందు ఎలాంటి అంశాలపై నెట్‌లో వెతుకుతున్నాడో డేటా సైన్స్‌ నిపుణులు తెలుసుకుంటారు. బ్రాండ్, నాణ్యత, ధర, ఆకారం, డిస్కౌంట్‌ మొదలైన వాటికి సంబంధించి మిగతా వాటితో ఏ విధంగా పోల్చుకుంటున్నాడో విశ్లేషిస్తారు. వినియోగదారులు వస్తువు కొనుగోలుకు ముందు ఏయో అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారో కంపెనీలకు తెలియజేస్తారు. ఆ సమాచారాన్ని కంపెనీలు తమ వస్తువుల డిమాండ్‌ పెంచుకోడానికి ఉపయోగించుకుంటాయి.

ఎవరు నేర్చుకోవచ్చు!
ఈ రంగంలోకి బీటెక్, కంప్యూటర్‌సైన్స్, సోషల్‌సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ చేసినవారు ప్రవేశించవచ్చు.అయితే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, బీటెక్‌ చేసినవారికి ప్రాధాన్యం లభిస్తోంది. డేటాసైన్స్‌లో ఉండే ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన అంశాలను గ్రాడ్యుయేషన్‌లోనే కొంత తెలుసుకుని ఉండటమే ఇందుకు కారణం. ఇక వారు మోడలైజింగ్, విజువలైజేషన్‌ నేర్చుకుంటే సరిపోతుంది. ఏదైనా ఉద్యోగం చేస్తూ కూడా ఈ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నప్పుడే ఫైథాన్, ఆర్, ఆర్‌ స్టుడియోలాంటి ప్రోగ్రామ్స్‌నూ, కొన్ని టూల్స్‌నూ తెలుసుకోవడం ఇంకా మంచిది.

కావాల్సిన నైపుణ్యాలు
* మెషిన్‌ లర్నింగ్‌: ఇది డేటాసైన్స్‌లో భాగం. తప్పనిసరిగా నేర్చుకోవాలి.
* మోడలింగ్‌: మేథమెటికల్‌ మోడలింగ్‌కి సంబంధించిన అంశాలపై పట్టుండాలి.
* స్టాటిస్టిక్స్‌: అతిముఖ్యమైంది. డేటాను విశ్లేషించి కావాల్సిన సమాచారాన్ని రాబట్టి సత్ఫలితాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.
* కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌: పైౖథాన్, ఆర్‌ సాఫ్ట్‌వేర్లను నేర్చుకుని ఉండాలి. డేటాను ఎగ్జిక్యూట్‌ చేసి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో వీటిది కీలకపాత్ర.
* కమ్యూనికేషన్‌ డేటాబేసెస్‌: మెరుగైన ప్రశ్నలను అడగటానికి ఉపయోగపడుతుంది.

మరిన్ని స్కిల్స్, టూల్స్‌
డాటా అనాలసిస్‌ - స్కిల్స్‌: ఆర్, ఫైథాన్, స్టాటిస్టిక్స్‌; టూల్స్‌: ఎస్‌ఏఎస్, జిప్ట్‌ర్, ఆర్‌ స్టుడియో, మ్యాట్‌ల్యాబ్, ఎక్సెల్, ర్యాపిడ్‌ మైనర్‌
డాటా వేర్‌హౌసింగ్‌ - స్కిల్స్‌: ఈటీఎల్, ఎస్‌క్యూఎల్, హడూప్, అపాచే, స్పార్క్‌; టూల్స్‌: ఇన్ఫ్‌ర్మాటికా,/ట్యాలెండ్, ఏడబ్ల్యూఎస్‌ రెడ్‌షిఫ్ట్‌
డాటా విజువలైజేషన్‌ - స్కిల్స్‌: ఆర్, ఫైథాన్‌ లైబ్రరీస్‌; టూల్స్‌: జిప్ట్‌ర్, ట్యాబ్‌లే, కాగ్‌నాస్, ఆర్‌ఏడబ్ల్యూ
మెషీన్‌ లర్నింగ్‌ - స్కిల్స్‌: ఫైథాన్, ఆల్జీబ్రా, ఎంఎల్‌ అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్‌; టూల్స్‌: స్పార్క్‌ ఎంఎల్‌ఐబి, మహాట్‌ అపాచే, అజ్యూర్‌ ఎంఎల్‌ స్టుడియో
అదనపు సమాచారం కోసం కింది వెబ్‌సైట్‌ను చూడవచ్చు.https://www.kdnuggets.com/2018/05/simplilearn-9-must-have-skills-data-scientist.html

కెరియర్‌ అవకాశాలు
అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, ట్విటర్, మైక్రోసాఫ్ట్, ఉబర్‌ లాంటి పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలూ డేటాసైన్స్‌ వైపు మొగ్గుచూపుతున్నాయి. ‘రా డేటా’ మొదలు సమస్య పరిష్కారం తుది రూపందాల్చే వరకూ దీనిలో అనేకమంది పనిచేయాల్సి ఉంటుంది.
* డాటా సైంటిస్ట్‌: కంపెనీలో ఏర్పడే వివిధ సమస్యలను పరిష్కరిస్తాడు. ఈ ప్రక్రియలో భాగంగా సమస్యను విశ్లేషించి, దానికి సంబంధించిన పాత డేటాను స్వీకరించి, డేటాను క్రమపద్ధతిలో పెట్టి గణాంకాల ఆధారంగా పరిష్కారాన్ని కనుక్కుంటాడు.
* డేటా అనలిస్ట్‌/ బిజినెస్‌ అనలిస్ట్‌: డేటాను ఆధారంగా సమస్యను విశ్లేషించి పరిష్కరిస్తాడు. అనేక వనరుల నుంచి సమాచారాన్ని సేకరించి ట్రెండ్, ప్యాటర్న్‌లను అంచనా వేస్తాడు.
* డేటా ఇంజినీర్‌: డేటాసైంటిస్ట్‌ రూపొందించిన డేటాను సాఫ్ట్ట్‌వేర్‌ పరంగా డిజైన్‌ చేసి భద్రపరుస్తాడు.
* డేటా ఆర్కిటెక్ట్‌: ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను తెలుసుకుంటూ వ్యాపార అవసరాలకు తగ్గట్టు డేటాను రూపొందిస్తాడు.
వీరే కాకుండా డేటా అడ్మినిస్ట్రేటర్, రిసెర్చ్‌ సైంటిస్ట్, స్టాటిస్టిషియన్‌లు కూడా ఉంటారు. వీరి జీతభత్యాలు బాగుంటాయి. కెరియర్‌ ఆరంభంలోనే మంచి బృందంతో కలిసి పనిచేసేట్లు చూసుకుంటే విశ్లేషణావగాహన పెరుగుతుంది. కొత్తగా ఆలోచించగలుగుతారు.

కోర్సులు - అందిస్తున్న సంస్థలు
డేటా సైన్స్‌ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. అవసరానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు కోర్సులను ప్రారంభించాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలిసారిగా ఆన్‌లైన్‌లో ‘పీజీ డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌’ కోర్సును త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బీటెక్‌ పూర్తి చేసినవారు ఇందులో ప్రవేశాలు పొందొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఈ కోర్సులో చేరొచ్చు.
* పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌: రెండేళ్ల కోర్సు. మూడు సెమిస్టర్లు థియరిటికల్, ఒక సెమిస్టర్‌ ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. స్టాటిస్టిక్స్, డేటా సైన్స్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్, అప్లికేషన్స్‌ ఇన్‌ ఫంక్షనల్‌ ఏరియాస్‌ గురించి వివరంగా ఉంటుంది. ప్లేస్‌మెంట్‌ అవకాశాలు ఉంటాయి. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎం కలకత్తా, ఐఎస్‌ఐ కోల్‌కతా సంయుక్తంగా ప్రవేశ అవకాశాలు కల్పిస్తున్నాయి. అర్హత, ప్రవేశ వివరాల కోసం http://www.iitkgp.ac.in/pgdba/ ను చూడవచ్చు.
* పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ బిజినెస్‌ ఇంటెలిజన్స్‌ (గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌): ఒక సంవత్సరం. క్లాస్‌రూం, ఆన్‌లైన్‌ తరగతులు రెండూ ఉంటాయి. భారత్‌లోని ఆరు ప్రాంతాలు చెన్నై, బెంగళూరు, గుర్‌గావ్, హైదరాబాద్, ముంబయి, పుణేలో అందుబాటులో ఉంది. బిజినెస్‌ ఫండమెంటల్స్, స్టాటిస్టిక్స్, అనలిటిక్స్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్‌కి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇది డ్యూయల్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌. ఇల్లినాయస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, షికాగో (యూఎస్‌ఏ), గ్రేట్‌ లేక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నుంచి సర్టిఫికెట్స్‌ను పొందుతారు. వెబ్‌సైట్‌: https://www.greatlearning.in/pg-program-business-analytics
* సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌ -ఐఎస్‌బీ: పదిహేను నెలల ప్రోగ్రామ్‌. క్లాస్‌రూమ్, ఆన్‌లైన్‌ రెండిటిలో అందుబాటులో ఉంది. అనలిటిక్స్‌ టూల్స్‌ అండ్‌ టెక్నిక్స్, బిజినెస్‌ ఫండమెంటల్‌ కాన్సెప్ట్స్, ఫోర్‌కాస్టింగ్, ప్రైసింగ్, కస్ట్‌మర్‌ , ఫినాన్షియల్‌ అండ్‌ రిటైల్‌ అండ్‌ సప్లై చైన్‌ అనలిటిక్స్‌ గురించి తెలుసుకుంటారు. కోర్సు ఐఎస్‌బీ హైదరాబాద్, మొహాలీలో అందుబాటులో ఉంది. వెబ్‌సైట్‌: https://www.isb.edu/cba/programme-overview
* బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఇంటిలెజన్స్‌-ఐఐఎంబీ: 12 నెలల కోర్సు. బిజినెస్‌ అనెలిటిక్స్, టెక్నిక్స్, వాటి అప్లికేషన్స్‌ గురించి విస్తారంగా తెలుసుకుంటారు. వెబ్‌సైట్‌: https://iimb.ac.in/eep/product/259/Business-Analytics-Intelligence
* పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ డేటా సైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ బిగ్‌ డేటా (ఐబీఎం - ఎంఎస్‌ఐబీ బకోనీ): పదినెలల ప్రోగ్రామ్‌. అనలిటిక్స్‌ రంగంలో నాయకత్వ లక్షణాలను పెంపొందిచుకోవాలనుకునే పని చేస్తున్న ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వెబ్‌సైట్‌: https://www.muniversity.mobi/program/Weekend-EPGP-DataScience
* పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌: కాలవ్యవధి ఒక సంవత్సరం. ఐసీఐసీ బ్యాంక్, పీడబ్ల్యూసీ కలిపి ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాయి. నాలుగు ట్రైమిస్టర్స్‌ ఉంటాయి. నాలుగో ట్రైమిస్టర్‌లో ఏదైనా ఒక సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయాలి. ప్లేస్‌మెంట్లు ఉంటాయి. వెబ్‌సైట్‌: http://praxis.ac.in/Programs/business-analytics/
* పీజీ డిప్లొమా ఇన్‌ డేటా సైన్స్‌: 11 నెలల ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌. ఈ కోర్సు ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుంది. స్టాటిస్టిక్స్, మెషిన్‌ లర్నింగ్, ఇంట్రడక్షన్‌ టు బిగ్‌ డేటా గురించి తెలుసుకుంటారు. వెబ్‌సైట్‌ : https://www.upgrad.com/data-science/
* పీజీడీఎం ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌: సంవత్సరం పాటు వారాంతపు ప్రోగ్రామ్‌. మూడు ట్రైమిస్టర్స్‌ ఉంటాయి. వెబ్‌సైట్‌: https://race.reva.edu.in/programs/pgdm-mba-in-business-analytics/
* పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ డేటాసైన్స్, బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ బిగ్‌ డేటా: పదకొండు నెలల ప్రోగ్రామ్‌. బిగ్‌ డేటా, బిజినెస్‌ అనలిటిక్స్, ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్, ఎన్‌ఎల్‌పీ, ఎంఎల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ కంప్యూటింగ్‌ గురించి తెలుసుకుంటారు. వెబ్‌సైట్‌: https://www.muniversity.mobi/program/PGP-DataScience
* ఆన్‌లైన్‌లో: కోర్సెరా (coursera), ఉడెమీ (udemy), సింప్లిలర్‌ (simplilearn), ఉడాసిటీ (udacity), సాస్‌ (sas), ఎడెక్స్‌ (edx), కిట్స్‌ (kits), ఎడ్యురెకా (edureka) మొదలైన సంస్థలు ఆన్‌లైన్‌ డేటాసైన్స్‌ కోర్సులను అందిస్తున్నాయి.

డేటా సైన్స్‌.. ప్రపంచ భవిష్యత్తు!
ఈ మధ్య జాబ్‌ మార్కెట్‌లో ఎక్కువగా వినపడుతున్న పదం డాటాసైన్స్‌. ప్రపంచంలోని 90%కి పైగా డేటా గత 2 రెండేళ్లలో సేకరించిందే. అందువల్లనే ఇప్పుడు డాటా సైన్స్‌ ప్రపంచ భవిష్యత్తు. ప్రతి ఒక్కరిలో ఒక డాటా సైంటిస్ట్‌ దాగి ఉంటాడు. ఎందుకంటే మన మెదడు నిక్షిప్తం చేసే సమాచారం, గత అనుభవాల ఆధారంగా మన ప్రస్తుత నిర్ణయాలు ఉంటాయి. అదే పనిని మనం ఈ ఉద్యోగంలోనూ చేయాల్సి ఉంటుంది. దాన్నే డాటా సైన్స్‌ అని క్లుప్తంగా అనొచ్చు.

ఈ రంగంలో ప్రిసిషన్‌ మెడిసిన్, డ్రైవర్‌లేకుండా స్వతంత్రంగా కారు నడపడం లాంటి అనేక ఆసక్తికరమైన అప్లికేషన్లు ప్రపంచగతిని మార్చేయగలవు. డాటాసైంటిస్ట్‌గా స్థిరపడటానికి కావాల్సిన నైపుణ్యాలకోసం కంప్యూటర్‌ సైన్స్, మ్యాథ్స్‌/ స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్‌/ మాస్టర్స్‌ చేస్తే ఉపయోగకరం. అలాగే ఆర్‌ ప్రోగ్రామింగ్, పైథాన్, డాటాబేస్‌ కోడింగ్‌ (ఎస్‌క్యూఎల్, హడూప్, ఎన్‌ఓఎస్‌క్యూఎల్‌)ను డాటా విజువలైజేషన్‌ టూల్‌ (ట్యాబులా లాంటివి)తో పాటు నేర్చుకుంటే డాటాసైన్స్‌లో రంగంలో పనిచేయడం సులభంగా ఉంటుంది. ఇది ఎప్పటికీ అభివృద్ధిచెందుతూ ఉండే రంగం కాబట్టి దీనికి సంబంధించి మార్కెట్‌లోకి వచ్చే కొత్త పద్ధతులను, సాంకేతికతలను నిరంతరం నేర్చుకుంటూ, మెరుగుపరచుకుంటూ ఉండాలి. డాటాసైన్స్‌కు సంబంధించి https://www.datasciencecentral.com/, kaggle.com లాంటి కొన్ని వెబ్‌సైట్‌లు ఉపయోగపడతాయి.

- కాకమాడ శిరీష, ఇన్‌ఫర్మాటిక్స్‌ డేటా అనలిస్ట్‌
అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ క్లినికల్‌ అంకాలజీ (cancerLinQ)


Back..

Posted on 20-02-2019