Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
రమ్మంటున్నాయి.. రక్షణ కొలువులు!

రక్షణ రంగంలో లక్షణమైన కొలువులకు ప్రకటనలు వెలువడ్డాయి. పది పాసైతే చాలు నేవీలో చేరిపోవచ్చు. ఇంటర్‌ లేదా డిప్లొమా ఉంటే ఎయిర్‌ ఫోర్స్‌ లోకి వెళ్లిపోవచ్చు. బీటెక్‌ విద్యార్థులైతే నౌకాదళంలో సబ్‌ లెఫ్టినెంట్‌ అవకాశం సొంతం చేసుకోవచ్చు. ఈ మూడు అర్హతలతోనూ మేటి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వీటికోసం పోటీపడవచ్చు.
బీటెక్‌తో... సబ్‌ లెఫ్టినెంట్‌
బీటెక్‌ చివరి సంవత్సరం, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ చివరి ఏడాది కోర్సులు చదువుతున్న విద్యార్థులకు భారతీయ నౌకాదళం ఆహ్వానం పలుకుతోంది. వివిధ ఇంజినీరింగ్‌ బ్రాంచీలవారికి ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ బ్రాంచీల్లో శాశ్వత, తాత్కాలిక కమిషన్‌ విధానంలో ఇండియన్‌ నేవీ ఉద్యోగాలు కల్పిస్తుంది. బీటెక్‌ లో అయిదో సెమిస్టర్‌ వరకు కనీసం 60 శాతం మార్కులు సాధించినవాళ్లు ఈ పోస్టులకు పోటీపడవచ్చు. బీటెక్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ చేపడుతుంది. ఎంపికైనవారిని శిక్షణలోకి తీసుకుంటారు. ఈ సమయంలో స్టైపెండ్‌ అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.
వయసు: జులై 2, 1995- జులై 1, 1998 మధ్య జన్మించివుండాలి. ఎత్తు: 157 సెం.మీ. మహిళలకు 152 సెం.మీ. తప్పనిసరి.
ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచి..
ఇందులో రెండు విభాగాలున్నాయి.
జనరల్‌ సర్వీస్‌ (ఎక్స్‌): బీఈ/ బీటెక్‌ ఏ బ్రాంచి విద్యార్థులైనా జనరల్‌ సర్వీస్‌ (ఎక్స్‌) ఉద్యోగానికి అర్హులు. అయితే పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పర్మనెంట్‌ కమిషన్‌, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ రెండు విభాగాల్లోనూ అవకాశాలు ఉంటాయి.
ఐటీ: కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఐటీ ఇంజినీరింగ్‌ చదివినవాళ్లు ఐటీ విభాగం పోస్టులకు అర్హులు. మహిళలకు అవకాశం లేదు. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌లో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
టెక్నికల్‌ బ్రాంచి..
ఇందులో మూడు విభాగాల్లోని పోస్టులను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భర్తీ చేస్తారు.
ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌: మెకానికల్‌, మెరైన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ప్రొడక్షన్‌, ఏరోనాటికల్‌, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, కంట్రోల్‌ ఇంజినీరింగ్‌, ఏరోస్పేస్‌, ఆటోమొబైల్స్‌, మెటలర్జీ, మెకట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌.. వీటిలో ఏ విభాగం విద్యార్థులైనా ఇంజినీరింగ్‌ బ్రాంచి పోస్టులకు అర్హులు. పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎల‌్రక్టికల్‌ బ్రాంచి: ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలి కమ్యూనికేషన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, పవర్‌ ఇంజినీరింగ్‌, కంట్రోల్‌ సిస్టమ్‌ ఇంజినీరింగ్‌, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏవియానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌ విభాగాల్లో ఎందులోనైనా ఇంజినీరింగ్‌ చదివినవాళ్లు అర్హులు. పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
నేవల్‌ ఆర్కిటెక్చర్‌ (ఎన్‌ఏ): మెకానికల్‌, సివిల్‌, ఏరోనాటికల్‌, ఏరోస్పేస్‌, మెటలర్జీ, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, ఓషన్‌, మెరైన్‌ ఇంజినీరింగ్‌, షిప్‌ టెక్నాలజీ, షిప్‌ బిల్డింగ్‌, షిప్‌ డిజైన్‌ విభాగాల్లో ఎందులోనైనా ఇంజినీరింగ్‌ చదివినవారు అర్హులు. మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం.. దరఖాస్తు చేసుకున్నవారిని బీటెక్‌ ఐదో సెమిస్టర్‌/ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఏడో సెమిస్టర్‌ వరకున్న మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వారికి నేవల్‌ క్యాంపస్‌ సెలక్షన్‌ టీం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైనవారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు చేపడుతుంది. విశాఖపట్నం, కోల్‌కతా, బెంగళూరు, భోపాల్‌, కోయంబత్తూరుల్లో డిసెంబరు-ఏప్రిల్‌ మధ్యలో ఇంటర్వ్యూలు ఉంటాయి.స్టేజ్‌-1 పరీక్షలో ఇంటెలిజెన్స్‌ టెస్టు, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్టు, గ్రూప్‌ డిస్కషన్‌ ఉంటాయి. అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 ఇంటర్వ్యూలు...అంటే సైకలాజికల్‌, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అర్హత సాధిస్తే వైద్య పరీక్షలుంటాయి. ఆపై అర్హులను ఉద్యోగానికి ఎంపికచేస్తారు.
ఎంపికైతే...
ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్‌ నేవల్‌ అకాడెమీ - ఎజిమాలలో వచ్చే ఏడాది జూన్‌ నుంచి శిక్షణ మొదలవుతుంది. అభ్యర్థులు శిక్షణలో చేరేటప్పటికి బీటెక్‌ లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అభ్యర్థులకు 22 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది. అనంతరం సంబంధిత కేంద్రాల్లో ట్రేడ్‌ శిక్షణ నిర్వహిస్తారు. జనరల్‌ సర్వీస్‌కి ఎంపికైనవారికి శిక్షణ వ్యవధి 44 వారాలు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. పర్మనెంట్‌ కమిషన్‌ విధానంలో ఎంపికైనవాళ్లు పదవీ విరమణ వయసు వచ్చేంత వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. అదే షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో ఎంపికైతే పదేళ్లు సర్వీసులో కొనసాగుతారు. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి ఒక్కో విడతలో రెండేళ్లు చొప్పున మరో నాలుగేళ్ల పాటు కొనసాగిస్తారు. అనంతరం ఖాళీలుండి, అభ్యర్థులు అన్నివిధాలా అర్హులుగా ఉంటే పర్మనెంట్‌ కమిషన్‌ విధానంలోకి తీసుకుంటారు. అన్నీ కలుపుకుని సీటీసీ విధానంలో నెలకు రూ.85 వేలకు పైగా వేతనంగా పొందవచ్చు. తక్కువ ధరలకు క్యాంటీన్‌, రైలు, విమాన ప్రయాణాల్లో రాయితీలు, పిల్లల చదువులకు ఆర్థిక ప్రోత్సాహం...ఇతర ప్రయోజనాలు దక్కుతాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హతలున్నవారు ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేయరాదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: జూన్‌ 30
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 30
ఇంటర్‌, డిప్లొమాలతో... ఎయిర్‌ మెన్‌
ఇంటర్‌, డిప్లొమా విద్యార్థులను ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఆహ్వానిస్తోంది. ఎంపికైనవారు ఎయిర్‌ఫోర్స్‌లో ఫిట్టర్‌, టెక్నీషియన్‌ హోదాలతో కెరియర్‌ ప్రారంభించి మంచి భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్ష, శారీరక సామర్థ్య, వైద్యపరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
విద్యార్హత: గ్రూప్‌- ఎక్స్‌: ఈ ఉద్యోగాలకు ఇంటర్‌ / ప్లస్‌ 2 మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌లోనూ 50 శాతం మార్కులు తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతో ఏదైనా మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తిచేసినవారు అర్హులే. డిప్లొమా ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరి. డిప్లొమాలో ఇంగ్లిష్‌ లేకపోతే ఇంటర్‌/ పదో తరగతి ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
గ్రూప్‌ - వై: ఈ ఉద్యోగాలకు ఇంటర్‌ ఏదైనా గ్రూప్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులుండాలి. ఈ గ్రూప్‌లో మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్‌ పోస్టులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్‌ లోనూ 50 శాతం మార్కులు తప్పనిసరి.
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ చదువుకున్నవారు గ్రూప్‌- ఎక్స్‌, వై రెండు ఉద్యోగాలకూ అర్హులే. వీరు ఎక్స్‌, వై ల్లో నచ్చిన గ్రూప్‌ కోసం దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసుకోవచ్చు లేదా రెండు గ్రూప్‌లకూ కలిపి నిర్వహించే పరీక్షనూ ఎంచుకోవచ్చు. ఈ అవకాశం ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసేప్పుడు ఉపయోగించుకోవాలి. డిప్లొమా విద్యార్థులు గ్రూప్‌ ఎక్స్‌ పోస్టులకు మాత్రమే అర్హులు.
ఎంపిక: ఫేజ్‌ 1, ఫేజ్‌ -2 పరీక్షల ద్వారా.
ఫేజ్‌ -1 పరీక్ష ఇలా... ఈ పరీక్షను ఆన్‌లైన్‌ లో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే వస్తాయి. https://airmenselection.cdac.in లో మాక్‌పరీక్షను రాసుకోవచ్చు.
ఫేజ్‌ -2లో... ఫేజ్‌ -1 లో అర్హత సాధించినవారి సర్టిఫికెట్లను నిర్దేశిత ఎయిర్‌ మెన్‌ సెలక్షన్‌ సెంటర్‌లో పరిశీలిస్తారు. అభ్యర్థులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలుంటాయి.
ఎంపికైతే..: ఎంపికైనవారికి శిక్షణలో రూ.14600 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరినవారికి గ్రేడ్‌ పేతో కలుపుకుని గ్రూప్‌ ఎక్స్‌లో అయితే రూ.33100, గ్రూప్‌ వై లో రూ. 26900 మూలవేతనం లభిస్తుంది. శిక్షణ అనంతరం అభ్యర్థులను సంబంధిత ట్రేడ్‌ శిక్షణ కేంద్రాలకు పంపుతారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. గ్రూప్‌ ఎక్స్‌లో ఎంపికైనవారు ఫిట్టర్‌గా, గ్రూప్‌ వైలో చేరినవారు టెక్నీషియన్‌గా సేవలు అందిస్త్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: జులై 3
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 24
ఆన్‌లైన్‌ పరీక్షలు: సెప్టెంబరు 13 నుంచి 16 వరకు నిర్వహిస్తారు.
అడ్మిట్‌ కార్డులు: ఆగస్టులో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
పరీక్ష ఫీజు: రూ. 250
వయసు: జులై 14, 1998 - జూన్‌ 26, 2002 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎత్తు: కనీసం 152.5 సెం.మీ. ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. తప్పనిసరి. దృష్టిదోషం ఉండరాదు. వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి.
పదితో... నేవీలో చెెఫ్‌, స్టివార్డ్స్‌, హైజీనిస్టులు
చెఫ్‌, స్టివార్డ్స్‌, హైజీనిస్ట్‌ పోస్టుల భర్తీకి ఇండియన్‌ నేవీ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి అర్హత ఉంటే చాలు. రాత, దేహదార్ఢ్య, వైద్య పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. పరీక్షలో ఎంపికై, విజయవంతంగా శిక్షణ ముగించుకుని విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.35,000 వేతనం రూపంలో పొందవచ్చు.
పరీక్ష ఇలా..: ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు ఉంటాయి. సైన్సు, మ్యాథమేటిక్స్‌ ఒక విభాగంలో; జనరల్‌ నాలెడ్జ్‌ మరో విభాగంలో అడుగుతారు. అభ్యర్థులు రెండు సెక్షన్లలోనూ అర్హత సాధించడం తప్పనిసరి. సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రం ఇండియన్‌ నేవీ వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
రాత పరీక్షలో అర్హత సాధించినవారికి దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహించి, అర్హత సాధిస్తే వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ విజయవంతమైతే రాతపరీక్షలో చూపిన ప్రతిభ ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు.
ఎంపికైతే: అన్ని దశలూ విజయవంతంగా పూర్తిచేసుకుని ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కలో మరోసారి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి ఏప్రిల్‌, 2019 నుంచి అక్కడే 15 వారాల ప్రాథమిక శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం నేవీ శిక్షణ కేంద్రాల్లో వృత్తి సంబంధిత శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో రూ.14600 స్టైపెండ్‌ గా చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని విధుల్లోకి తీసుకుంటారు. చెఫ్‌గా ఎంపికైనవారు విధుల్లో భాగంగా ఆహారాన్ని వండాలి. ఆహార పదార్థాల స్టోర్‌ నిర్వహణ బాధ్యతను చూసుకోవాలి. స్టివార్డ్‌గా విధులు నిర్వహించేవారు వడ్డన బాధ్యతలు తీసుకుంటారు. భోజన తయారీలోనూ వీరు పాలుపంచుకుంటారు. వీరు వెయిటర్‌గానూ వ్యవహరించాలి. హైజీనిస్ట్‌గా ఎంపికైనవారు గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. విధుల్లో చేరిన మొదటి నెల నుంచి అలవెన్సులతో కలిపి రూ. 35,000కు పైగా వేతనం రూపంలో లభిస్తుంది.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
వయసు: ఏప్రిల్‌ 1, 1998 - మార్చి 31, 2002 మధ్య జన్మించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 1
ప్రవేశ పత్రాలు: ఆగస్టులో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
పరీక్ష: సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తారు
ఫలితాలు: ఫిబ్రవరి 21, 2019న ప్రకటిస్తారు.

Back..

Posted on 25-06-2018