Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పిలుస్తున్నాయ్‌.. నింగీ నీరూ!

రక్షణ రంగంలో ఉద్యోగాలకు మూడు ప్రకటనలు వెలువడ్డాయి. డిగ్రీతో ఎయిర్‌ఫోర్స్‌, ఇంటర్‌తో నేవీలో సబ్‌లెఫ్టినెంట్‌లు, సెయిలర్‌లుగా చేరడానికి అవకాశాలు వచ్చాయి. మంచి వేతనం, ఇతర సౌకర్యాలతో సమాజంలో గౌరవనీయ హోదాను ఈ కొలువులు సమకూరుస్తాయి. ఎయిర్‌ఫోర్స్‌లో రూ.ఎనభైవేలకు పైగా వేతనం అందుతుంటే, నేవీ క్యాడెట్‌ ఎంట్రీ స్కీంలో ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అందిస్తారు.

ఏఎఫ్‌ క్యాట్‌
డిగ్రీ అర్హతతో ఉన్న మేటి కొలువుల్లో ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్టు (ఏఎఫ్‌ క్యాట్‌) ఒకటి. దీనిద్వారా భారత వైమానిక దళంలో ఫ్లయింగ్‌ (పైలట్‌), గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. విధుల్లో చేరినవారికి రూ. ఎనభై వేలకు పైగా వేతనంతోపాటు పలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ పోస్టులకు విద్యార్థినులూ దరఖాస్తు చేసుకోవచ్చు. తాజాగా 182 ఖాళీల భర్తీకి ఏఎఫ్‌ క్యాట్‌ ప్రకటన వెలువడింది.
ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌), ఎన్‌సీసీ స్సెషల్‌ ఎంట్రీ (ఫ్లయింగ్‌), మెటీరియాలజీ బ్రాంచ్‌ గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌ టెక్నికల్‌) ఖాళీల భర్తీకి భారత వైమానిక దళం ఏడాదికి రెండు సార్లు నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్షే... ఏఎఫ్‌ క్యాట్‌. ఏటా మే/జూన్‌, డిసెంబరుల్లో ఈ ప్రకటన వెలువడుతుంది. పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇదే లక్ష్యంగా సన్నద్ధమైతే ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు.
అభ్యర్థులు ఏఎఫ్‌ క్యాట్‌ ఎంట్రీ, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ, మెటీరియాలజీ ఎంట్రీ విభాగాల్లో ఉద్యోగాలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. తగు అర్హతలు ఉంటే మూడింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్లయింగ్‌ బ్రాంచి
* విద్యార్హత: ఈ విభాగంలోని పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంటర్‌ / +2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ చదివి ఉండాలి.
* వయసు: జులై 1, 2019 నాటికి 20 నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు: కనీసం 162.5 సెం.మీ ఉండాలి. ఎలాంటి దృష్టి దోషం ఉండకూడదు.
గ్రౌండ్‌ డ్యూటీ - టెక్నికల్‌ బ్రాంచి
* విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రానిక్స్‌)
* విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఎలక్ట్రానిక్స్‌ లేదా ఎలక్ట్రికల్‌ లేదా కమ్యూనికేషన్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌... తదితర విభాగాల్లో ఎందులోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్‌/ +2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
* విభాగం: ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)
* విద్యార్హత: 60 శాతం మార్కులతో ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ లేదా ఏరోస్పేస్‌ లేదా ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ మెయింటెనెన్స్‌ లేదా మెకానికల్‌ లేదా ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ వీటిలో ఏ విభాగంలోనైనా బీటెక్‌/ బీఈ పూర్తిచేసినవాళ్లు అర్హులు. ఇంటర్‌/+2లో ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
* వయసు: పై రెండు పోస్టులకు జులై 1, 2019 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎత్తు: పురుషులైతే 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ బ్రాంచి
* ఇందులో 4 విభాగాలున్నాయి. 1. అడ్మినిస్ట్రేషన్‌ 2. లాజిస్టిక్స్‌ 3. అకౌంట్స్‌ 4. ఎడ్యుకేషన్‌. అడ్మినిస్ట్రేషన్‌, లాజిస్టిక్స్‌: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
* అకౌంట్స్‌: 60 శాతం మార్కులతో బీకాం.
* ఎడ్యుకేషన్‌: ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పీజీలో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ఇంటర్నేషనల్‌ స్టడీస్‌, సైకాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, మేనేజ్‌మెంట్‌, మాస్‌ కమ్యూనికేషన్‌, జర్నలిజం, పబ్లిక్‌ రిలేషన్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ వీటిలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* వయసు: పై నాలుగు పోస్టులకు జులై 1, 2019 నాటికి 20 నుంచి 26 ఏళ్లలోపువాళ్లు అర్హులు. ఎత్తు: పురుషులు 157.5, మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ విభాగానికి ఎన్‌సీసీ సీనియర్‌ డివిజన్‌ సి సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు 10+2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ ల్లోనూ 60 శాతం తప్పనిసరి.
మెటీరియాలజీ బ్రాంచి: ఈ బ్రాంచి కూడా గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ విభాగంలోకే వస్తుంది. డిగ్రీలో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో సైన్స్‌ కోర్సుల్లో పీజీ పూర్తిచేసివవారు అర్హులు.
* దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో జూన్‌ 16 నుంచి జులై 15 వరకు.
* పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
* తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌
* వెబ్‌సైట్‌: https://afcat.cdac.in, http://careerairforce.nic.in
ఎంపిక ఇలా!
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అంటే ప్రశ్నపత్రం అన్ని విభాగాలకూ ఒక్కటే. టెక్నికల్‌ బ్రాంచి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా ఇంజినీరింగ్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌ (ఈకేటీ) రాయాల్సి ఉంటుంది. రాత పరీక్షలో వంద మార్కులకు బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, మిలటరీ ఆప్టిట్యూడ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్‌ -1లో చిన్న అసైన్‌మెంట్స్‌, పజిల్స్‌ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధో స్థాయిలను తెలుసుకుంటారు. ఇందులో అర్హత సాధించినవారే స్టేజ్‌ -2కి వెళ్తారు. స్టేజ్‌ -2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్‌ బ్రాంచికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలక్షన్‌ సిస్టం (సీపీఎస్‌ఎస్‌) పరీక్ష ఉంటుంది అన్ని పరీక్షలూ విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను శిక్షణలోకి తీసుకుంటారు.
నేవీలో సెయిలర్లు
ఇండియన్‌ నేవీ సెయిలర్‌ (సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి ఫిబ్రవరి, 2019 నుంచి శిక్షణ మొదలవుతుంది. విధుల్లోకి చేరిన తర్వాత రూ.35,000 - 42,000 వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. దీంతోపాటు పలు ప్రోత్సాహకాలు లభిస్తాయి. భవిష్యత్తులో చీఫ్‌ పెటీ ఆఫీసర్‌-1 హోదా వరకు చేరుకోవచ్చు. రెండు పోస్టులకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి.
* విద్యార్హత: ఇంటర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిల్లో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ రెండు పోస్టులకూ కేవలం పురుష అభ్యర్థులే అర్హులు.
* వయసు: ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు ఫిబ్రవరి 1, 1998 - జనవరి 31, 2002 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఏఏ పోస్టులకు ఫిబ్రవరి 1, 1999- జనవరి 31, 2002 మధ్య జన్మించినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంపిక విధానం: రెండు పోస్టులకు రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్టు (పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్టుల ద్వారా అర్హులను ఎంపికచేస్తారు. సెప్టెంబరు / అక్టోబరుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్దేశిత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. ఎస్‌ఎస్‌ఆర్‌ పోస్టులకు పరీక్ష జరిగిన రోజే ఫలితాలు వెలువడతాయి. ఇందులో ఎంపికైనవారికి పీఎఫ్‌టీ, మెడికల్‌ టెస్టులు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తిచేస్తారు. ఏఏ పోస్టులకు పరీక్ష అనంతరం రెండు వారాల తర్వాత ఫలితాలు వెలువడతాయి. రాత పరీక్షలో ప్రతిభ ప్రాతిపదికన 1200 మందిని తర్వాత దశ పరీక్షలకు ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15
* కాల్‌ లెటర్లు: ఆగస్టు చివరి నాటికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
* పరీక్షలు: సెప్టెంబరు / అక్టోబరులో ఉంటాయి.
* ఫలితాలు: డిసెంబరు 20 నాటికి నేవీ వెబ్‌ సైట్‌ లో అందుబాటులో ఉంటాయి.
* వెబ్‌ సైట్‌: www.joinindiannavy.gov.in
10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ
ఉచితంగా బీటెక్‌ చదువు, కోర్సు పూర్తికాగానే కొలువు కల్పిస్తోంది ఇండియన్‌ నేవీ. 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని అందుకోవచ్చు. ఎంపికైనవారు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ చదువుతారు. జేఎన్‌యూ, న్యూదిల్లీ బీటెక్‌ పట్టా అందిస్తుంది.
* విద్యార్హత: ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పదోతరగతి లేదా ఇంటర్‌ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి.
* ఇతర అర్హతలు: అభ్యర్థులు జేఈఈ మెయిన్‌ -2018లో అర్హత సాధించాలి. ఈ పోస్టులకు అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎత్తు కనీసం 157 సెం.మీ. ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు తప్పనిసరి.
* వయసు: జులై 2, 1999 - జనవరి 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు
* ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జేఈఈ-2018 మెయిన్‌లో సాధించిన ర్యాంకు ద్వారా షార్ట్‌లిస్టు చేస్తారు. సర్వీసెస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరు, భోపాల్‌, కోయంబత్తూరు, విశాఖపట్నంల్లో ఏదోఒక చోట జులై - అక్టోబరు మధ్య కాలంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ముఖాముఖి నిర్వహిస్తారు.
* శిక్షణ: ఎంపికైనవారికి శిక్షణ తరగతులు జనవరి 2019 నుంచి ప్రారంభవుతాయి. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)-న్యూదిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. * కోర్సు ఫీజు, భోజనం, వసతి, దుస్తులు తదితర ఖర్చులన్నీ నేవీ భరిస్తుంది. కోర్సు అనంతరం సబ్‌లెఫ్టినెంట్‌ హోదాతో నేవీలో విధుల్లోకి చేరతారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 21
* వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in



Back..

Posted on 06-06-2018