Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
తెలంగాణ‌ డిగ్రీ ప్రవేశాల‌కు 'దోస్త్‌'

* ఆన్‌లైన్‌లోనే అడ్మిష‌న్లు
* అందుబాటులో కోర్సులు, కాలేజీల స‌మ‌స్త‌ స‌మాచారం
తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2016-17) నుంచి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్లో (డిగ్రీ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా) చేప‌ట్టనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్ అడ్మిషన్లకు సంబంధించిన ఉమ్మడి షెడ్యూల్‌ను మే 16న‌ యూనివర్సిటీల వారీగా విడుదల చేశారు. రాష్ట్రంలోని దాదాపు 1,200 డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు చేప‌డ‌తారు. ఈ విధానం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ. బీసీఏ...మొద‌లైన అన్ని సాధార‌ణ డిగ్రీ కోర్సుల్లోనూ ప్రవేశం ల‌భిస్తుంది. ఇంట‌ర్‌లో ఏ గ్రూప్ చ‌దివిన‌వాళ్లు డిగ్రీలో ఏ కోర్సుల్లో చేర‌డానికి అర్హులో వివ‌రాల‌న్నీ దోస్త్ వెబ్‌సైట్లో ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థి తెలంగాణ రాష్ట్రంలో 171 యూజీ కోర్సుల్లో చేరొచ్చు. వీటిలో బీఏలో గ‌రిష్ఠంగా 129, బీఎస్సీలో 20, బీకాంలో 18, ఇత‌ర కోర్సుల్లో 4 ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీల‌వారీ కాంబినేష‌న్లతో కూడిన కోర్సుల వివ‌రాలు ఉన్నాయి.
యూజీలో అన్‌లైన్ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్లు ఆరు యూనివర్సిటీలలో విడివిడిగా విడుదల చేశారు. యూజీ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్లో WWW.DOST.CGG.GOV.IN (DOST-డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ) వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వివరాలు యూనివర్సిటీల వారీగా విద్యార్థులకు అందుబాటులో పెట్టారు. అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే తేదీల్లో అన్‌లైన్ వెబ్‌సైట్ పనిచేస్తుంది. రిజిస్ట్రేష‌న్ కోసం రూ.వంద ఫీజుగా చెల్లించాలి. ఒక యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఎన్ని కాలేజీల‌కైనా ప్రాధాన్యాన్ని అనుస‌రించి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఒక‌టి కంటే ఎక్కువ యూనివ‌ర్సిటీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే మాత్రం అద‌నంగా ఒక్కో యూనివ‌ర్సిటీకి రూ.వంద చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి త‌ప్పనిస‌రి...
డిగ్రీ అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ హాల్‌టిక్కెట్ నంబర్‌తో పాటు ఆధార్ కార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఫీజు చెల్లింపునకు క్రెడిట్ కార్డు/డెబిట్‌కార్డు/నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవ‌చ్చు. రిజిస్ట్రేషన్ కోసం కచ్చితమైన మొబైల్ నంబర్ తెలియజేయాలి. కులధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం సంఖ్య జ‌త‌ చేయాలి. స్పోర్ట్స్, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్యాప్, పీహెచ్ స్కాన్ చేసిన సర్టిఫికెట్లు జ‌త‌ చేయాలి. ఇతర రాష్ట్రాల‌ విద్యార్థులు కూడా పైన సూచించిన అన్ని సర్టిఫికెట్లు దాఖలు చేయాలి. అంతర్జాతీయ విద్యార్థులకు ఫారిన్ స్టూడెంట్ అడ్మిషన్ల విధానం అమలవుతుంది.
స‌హాయ కేంద్రాలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం యూనివర్సిటీల వారీ ప‌లు ప్రాంతాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాలమూరు వర్సిటీ పరిధిలో ఏడు, తెలంగాణ వర్సిటీ పరిధిలో ఆరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఏడు, కాకతీయ వర్సిటీ పరిధిలో పన్నెండు, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పదిహేను, శాతవాహన వర్సిటీ పరిధిలో ఆరు చొప్పున సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాల వారీ స‌హాయ కేంద్రాల వివ‌రాలు దోస్త్ వెబ్‌సైట్‌లో ల‌భిస్తాయి. విద్యార్థులు సంబంధిత స‌ర్టిఫికెట్లను ఆయా కేంద్రాల‌కు తీసుకెళ్లి ధృవీక‌రించుకోవాలి.
తెలంగాణ‌లోని యూనివ‌ర్సిటీల
ఉస్మానియా యూనివ‌ర్సిటీ
http://www.osmania.ac.in/
మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ
http://www.mguniversity.ac.in/
పాల‌మూరు యూనివ‌ర్సిటీ
http://www.palamuruuniversity.com/
శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ
http://www.satavahana.ac.in/
తెలంగాణ యూనివ‌ర్సిటీ
http://www.telanganauniversity.ac.in/
కాక‌తీయ యూనివ‌ర్సిటీ
http://www.kakatiya.ac.in/
ప్రవేశాలిక్కడ‌
అన్ని ర‌కాల డిగ్రీ కాలేజీల్లోనూ దోస్త్ ద్వారా ప్రవేశం ల‌భిస్తుంది. రాష్ట్రంలో యూజీ డిగ్రీ స్థాయి కోర్సుల‌ను.. యూనివ‌ర్సిటీ (అటాన‌మ‌స్‌), యూనివ‌ర్సిటీ కాలేజ్‌, గ‌వ‌ర్నమెంట్‌(అటాన‌మ‌స్‌), ప్రైవేట్ (ఎయిడెడ్‌), గ‌వ‌ర్నమెంట్ కాలేజ్‌, ప్రైవేట్ (అనెయిడెడ్‌), ప్రైవేట్ (అటాన‌మ‌స్‌) కాలేజీల ద్వారా అందిస్తున్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యాన్ని అనుస‌రించి యూనివ‌ర్సిటీల‌ వారీ, జిల్లా వారీ, కోర్సుల‌ వారీ, కాలేజీ వారీ ఇలా న‌చ్చిన విధంగా ఎంచుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు సైకాల‌జీలో ఆస‌క్తి ఉన్న విద్యార్థి కోర్సుల ట్యాబ్‌లో సైకాల‌జీని ఎంచుకుని సెర్చ్‌చేస్తే ఆ కోర్సు ఏయే కాలేజీల్లో ఉందో వివ‌రాలు ల‌భిస్తాయి. అలా కాకుండా ఫ‌లానా కాలేజీలో చ‌ద‌వాల‌ని భావిస్తే ఆ కాలేజీ పేరును కాలేజెస్ ట్యాబ్‌లో చేర్చి సెర్చ్ చేస్తే ఆ కాలేజీలో ఉన్న కోర్సులు, గ్రూపులు, సీట్లు, ఫీజు, ఏ మాధ్యమంలో బోధిస్తున్నారు...త‌దిత‌ర స‌మాచార‌మంతా ల‌భిస్తుంది.
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేష‌న్లు, వెబ్ ఆప్షన్లు- మే 20 నుంచి జూన్ 6 వ‌ర‌కు
రూ. 500 ఆల‌స్య ఫీజుతో- జూన్ 8 వ‌ర‌కు
తొలి విడ‌త సీట్ల కేటాయింపు - జూన్ 10
కాలేజీలో రిపోర్టింగ్ - జూన్ 20లోగా
రెండో విడ‌త వెబ్ ఆప్షన్లు జూన్ 21 నుంచి 23
రెండో విడ‌త సీట్ల కేటాయింపు జూన్ 25
కాలేజీలో రిపోర్టింగ్ జూన్ 30లోగా
చివ‌రి విడ‌త వెబ్ ఆప్షన్లు జూన్ 30 నుంచి జులై 1
ఆఖ‌రి విడ‌త సీట్ల కేటాయింపు జులై 3
కాలేజీలో రిపోర్టింగ్ జులై 7లోగా
వెబ్‌సైట్: http://dost.cgg.gov.in/
డిగ్రీ కళాశాలల ఫీజులు ఖరారు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లోని ఫీజులు ఖరారయ్యాయి. ఫీజుల వివరాలను అధికారులు డిగ్రీ ప్రవేశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆయా ఫీజులను చూసి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్ప యూనివర్సిటీల వారీగా ఏ కోర్సుకు ఎంత ఫీజు ఉందో తెలియకపోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. ఫీజుల వివరాలు సైటులో కనిపించేలా ఉంటే విద్యార్థులకు ప్రయోజనంగా ఉంటుందనే అభిప్రాయం నెలకొంది. కొన్ని ప్రైవేటు కాలేజీల్లో యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కంటే అదనంగా ఉంటాయనీ.. వాటి గురించి తెలుసుకున్న తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబ‌ర్స్‌మెంటును కేవలం యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజులకు మాత్రమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజుల కంటే అదనపు ఫీజును విద్యార్థులే భరించాల్సి ఉంటుంది. విద్యార్థులు దరఖాస్తు సమయంలో వీటిని గమనించాలని సూచించారు. కొన్ని కాలేజీలకు యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా రూ.10 వేలు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ జారీ చేసిన రూ.10 వేలను కూడా విద్యార్థులు అదనంగా భరించాలని... ప్రభుత్వం ఫీజు రీయింబ‌ర్స్‌మెంటుగా జారీ చేయదని అధికారులు తెలిపారు.
వర్సిటీల వారీగా కోర్సులు - ఫీజుల వివరాలు (రూపాయల్లో)

వర్సిటీ బీఎస్సీ బీఎస్సీ (స్టాటిస్టిక్స్) బీజెడ్సీ బీకాం (జనరల్) బీకామ్ (కంప్యూటర్స్)
తెలంగాణ 13,600 13,600 13,600 11,600 12,400
ఉస్మానియా 11,090 11,090 11,400 9,100 11,090
కాకతీయ 11,270 12,170 11,270 10,870 11,770
పాలమూరు 11,400 11,400 11,400 9,400 11,400
మహాత్మాగాంధీ 13,015 13,015 11,015 9,015 11,015
శాతవాహన 12,300 12,300 12,300 10,100 12,300

http://dost.cgg.gov.in/

‘డిగ్రీ కోర్సుల్లో మార్పు’నకు 17 వరకు అవకాశం
ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో కోర్సులు మార్పు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ తెలంగాణ కళాశాల విద్య కమిషనరేట్‌ జూన్ 8న ప్రకటన విడుదల చేసింది. వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలో వేర్వేరు కొత్త కోర్సులు వచ్చి చేరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. మాద్యమం, కోర్సు ఎంపిక, రద్దు వంటి పలు అవకాశాలను అభ్యర్థులు జూన్‌ 17వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉస్మానియా వర్సిటీ పరిధిలో సేవా కేంద్రాల సంఖ్య పెంచామని.. సేవా కేంద్రాలతోపాటు ఇతర వివరాలకు డిగ్రీ ప్రవేశాల వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
http://dost.cgg.gov.in/

డిగ్రీ ఆన్‌లైన్‌ వివరాల్లో మార్పులకు అవకాశం
డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు తాము ఇచ్చిన వివరాల్లో మార్పులు ఉంటే చేసుకోవచ్చని తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ వాణీప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు దోస్త్‌ వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచామని, ఏవైనా ధ్రువపత్రాలు అప్‌లోడ్‌ చేయకపోయినా ఇప్పుడు చేసుకోవచ్చని ఆమె సూచించారు. ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో చేరేది లేదని గతంలో కోర్టును ఆశ్రయించిన హైదరాబాద్‌లోని ఏవీ కళాశాలలను యాజమాన్యం వినతి మేరకు ఆన్‌లైన్‌లో చేర్చామని తెలిపారు. జిల్లాల్లోని సహాయ కేంద్రాల మధ్య సమన్వయం కోసం జిల్లాకు ఒకరిని ముఖ్య సమన్వయ అధికారిని నియమించామని చెప్పారు. సహాయ కేంద్రాల సిబ్బంది స్పందించకుంటే విద్యార్థులు వారికి ఫోన్‌ చేయవచ్చని సూచించారు. వారి పేర్లు, ఫోన్‌ నెంబర్లను దోస్త్‌ వెబ్‌సైట్లో ఉంచుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 9 వరకు 1,21,376 మంది ప్రవేశాలు పొందేందుకు నమోదు చేసుకున్నారని చెప్పారు.
http://dost.cgg.gov.in/

అదనపు సీట్లకు ఎవరు అనుమతిచ్చారు?
* విశ్వవిద్యాలయాలను వివరణ కోరిన ఉన్నత విద్యామండలి
ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ కళాశాలల్లో అనుమతుల పరిమితి దాటి విద్యార్థులకు ప్రవేశాలు ఇస్తున్న వైనంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆరా తీస్తోంది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాలను వివరణ కోరింది. నిబంధనల ప్రకారం డిగ్రీ కళాశాలల్లో ఒక్కో విభాగానికి గరిష్ఠంగా రెండు సెక్షన్లకు అనుమతిస్తారు. ఆర్ట్స్‌ విభాగంలో ఒక్కో సెక్షన్‌కు 60, సైన్స్‌ గ్రూపుల్లో ఒక్కో సెక్షన్‌కు 50 సీట్ల భర్తీకి మాత్రమే అనుమతి ఉందని ఉన్నత విద్యామండలి చెబుతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కొన్ని కళాశాలల్లో అంతకంటే ఎక్కువ సీట్లు భర్తీ చేస్తున్నట్టు కళాశాల విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వర్సిటీలకు లేఖ రాసింది.

Back..

Posted on 17-05-2016