Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఒకప్పటి డిగ్రీ కాదు గురూ!

డిగ్రీ అంటే... డిగ్రీనా అని పెదవి విరిచే రోజులకు కాలం చెల్లింది. మన డిగ్రీలన్నీ మారిపోతున్నాయ్‌. సంప్రదాయ రీతులను దాటి మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త రూపంలో ప్రొఫెషనల్‌ కోర్సులకు దీటుగా వస్తున్నాయి. బీఏలో టూరిజం, బీకామ్‌లో ఈకామర్స్‌, బీఎస్సీలో సెరీ కల్చర్‌, పౌల్ట్రీ సైన్స్‌, ఫారెస్ట్రీ వంటి విభిన్న కాంబినేషన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే నిపుణులు సైతం ‘ఒకప్పటి డిగ్రీ కాదు!’ అంటున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు పీజీ విద్యార్థులను కాదని... డిగ్రీ విద్యార్హత ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ (దోస్త్‌) ద్వారా డిగ్రీ కళాశాలల్లోకి పేర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రూపుమారిన డిగ్రీ కోర్సుల గురించీ...ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించీ తెలుసుకుందామా?

ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన మెరుగుపడేలా ప్రత్యేక కోర్సులు డిగ్రీలో వస్తున్నాయి. పరిశ్రమల వారికి అనుకూలంగా ఉండేలా ఈ కోర్సులను తీర్చిదిద్దారు. డిగ్రీ కళాశాలలను పర్యవేక్షించే కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ కోర్సులకు భిన్నంగా వీటిని రూపొందించారు. గత విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో మార్కెట్ ఓరియంటెడ్ కోర్సులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 ప్రభుత్వ, స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలల్లో ప్రారంభించారు. పరిశ్రమల అవసరాలపై అధ్యయనం చేసిన అధ్యాపకుల బృందం వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలూ, చర్చల అనంతరం సబ్జెక్టులను తయారు చేసింది. నాలుగు, ఆరు సెమిస్టర్లలో ఆయా కంపెనీల్లో విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ చేసేలా ప్రణాళిక రూపొందించారు.
చివరి సంవత్సరంలో స్పెషలైజేషన్
డిగ్రీలో మూడేళ్లకు కలిపి ఆరు సెమిస్టర్లు ఉండగా చివరి సెమిస్టర్‌లో స్పెషలైజేషన్‌ను ఉన్నత విద్యామండలి ప్రవేశపెట్టింది. దీన్ని క్లస్టర్ ఎలక్టివ్‌గా పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా చివరి ఏడాది చదువుతున్నవారు ఎనిమిదో పేపర్ స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు బీఎస్సీ కంప్యూటర్ సైన్సు విద్యార్థికి కంప్యూటర్ సైన్స్, భౌతికశాస్త్రం, గణితం అధ్యయనాంశాలుంటే ఈ మూడింటిలో ఒక సబ్జెక్టును స్పెషలైజేషన్‌కు ఎంపిక చేసుకోవాలి. బీఎస్సీ కంప్యూటర్స్ ఎంపిక చేసుకుంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్, మల్టీమీడియా అంశాల్లో ఏదో ఒకదాంట్లో స్పెషలైజేషన్ సాధించాలి. ఉదాహరణకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తీసుకుంటే ఇందులో మూడు పేపర్లుంటాయి. వీటి అధ్యయనం వల్ల విద్యార్థి నైపుణ్యం సాధించేందుకు అవకాశం ఉంటుంది. జంతుశాస్త్రంలో ప్రత్యేక కోర్సుల కింద మత్స్య పరిశ్రమ(ఆక్వాకల్చర్), రోగ నిర్ధారణ పరీక్షలు (మెడికల్ డయాగ్నస్టిక్స్), పట్టు పరిశ్రమ (సెరికల్చర్)ను ప్రవేశపెట్టారు. విద్యార్థులు తమ ఇష్ట ప్రకారం వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
క్లస్టర్ ఎలక్టివ్ ఇలా..
క్లస్టర్ ఎలక్టివ్ కింద సబ్జెక్టులను విద్యార్థులు ఎంపిక చేసుకునే విధానంలో కొన్ని నిబంధనలు విధించారు. ఒక స్పెషలైజేషన్‌ను ఎంపిక చేసుకునే విద్యార్థుల సంఖ్య కనీసం పది ఉండాలి. ఒక గ్రూపులో ఉండే విద్యార్థులు ఎక్కువమంది ఒకే అంశాన్ని ఎంపిక చేసుకుంటే తక్కువ మంది ఉన్నవారికి పాఠాలు బోధించడం, పరీక్షల నిర్వహణ భారంగా మారుతుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు.
డిగ్రీతోపాటు ఉపాధి శిక్షణ, ఉద్యోగం
రాష్ట్రంలో 2018-19 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ విద్యార్థులకు చదువుతోపాటు ఉపాధినిచ్చే కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించనున్నారు. కమ్యూనిటీ కళాశాలల పేరుతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. సెంచూరియన్ వర్సిటీ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, కళాశాల విద్యాశాఖ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికే స్వయంప్రతిపత్తి కలిగిన ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కళాశాలలో రెండు కోర్సులను అమలు చేస్తున్నారు. ఇక్కడ బీఎస్సీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులకు ఎక్స్‌రే, ఆపరేషన్ థియేటర్, అనస్త్తీషియా టెక్నీషియన్ కోర్సులు అందిస్తున్నారు. రోజువారీ డిగ్రీ తరగతులకు ఆటంకం లేకుండా ప్రత్యేక సమయాల్లో విద్యార్థులకు ఈ ఉపాధి కోర్సులపై శిక్షణ ఇస్తారు. విద్యార్థి ఆసక్తికి అనుగుణంగానే కోర్సుల ఎంపిక ఉంటుంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో మొదటి విడతగా 30 కళాశాలల్లో అమలు చేయనున్నారు. ఒక్కో కోర్సులో బ్యాచ్‌కు 30 మంది ఉంటారు. విద్యార్థులకు ప్రతి సెమిస్టర్‌కు 30 గంటలపాటు శిక్షణ అందించనున్నారు.
బీఎస్సీ (ఎంపీసీ) వారికి యూనిట్ గేమింగ్ సాఫ్ట్‌వేర్, బీకాం వారికి ట్యాలీ-అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్, బీఎస్సీ(లైఫ్‌సైన్సు) వారికి ఎక్స్‌రే, కార్డియో, ఆపరేషన్ థియేటర్, అనస్తీషిియా టెక్నీషియన్, బీఏ వారికి బీపీవో, డేటా ఎంట్రీ తదితర కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. 30మంది విద్యార్థులకు ఒక బ్యాచ్ ఉంటుంది. మూడేళ్ల డిగ్రీలోనే మూడు నెలలపాటు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ల్యాబ్‌ల ఏర్పాటు, కోర్సులకు సంబంధించిన వ్యయం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు ఉచితంగానే అందిస్తారు.
గవర్నమెంట్, ఎయిడెడ్, అటానమస్ కళాశాలలకు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరి తేదీ: 25 మే, 2018. వెబ్‌సైట్: www.cceinfo.ap.gov.in
ప్రైవేటు కళాశాలలకు ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఆయా కాలేజీలను సంప్రదించాలి.
కసరత్తు చేశాకే.. కొత్త కోర్సులు - డి.గిరి, అకడమిక్ గైడెన్స్ అధికారి, కళాశాల విద్యా కమిషనరేట్
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సుల రాక అవసరం. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మార్కెట్ ఓరియంటెడ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టాం. గత ఏడాది 12 కళాశాలల్లో వీటిని అమలుచేశాం. నాలుగు, ఆరు సెమిస్టర్లలో కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ చేసేలా రూపొందించాం. నిపుణులతో పాఠాలు చెప్పించాలనే ఉద్దేశంతో మొదట స్వయంప్రతిపత్తి కళాశాలల్లోనే ప్రారంభించాం. బీఎస్సీలో 30 సీట్ల్ల వరకు ఉండగా.. బీఏలో ఆయా కోర్సులను అనుసరించి 30-50 వరకు సీట్లున్నాయి. ప్రస్తుతం ఈ సబ్జెక్టుల అమలు బాగానే ఉంది.
ఉపాధి అవకాశాలు లభించాలనే ఉద్దేశంతో కంపెనీల ప్రతినిధులతో చర్చించి, వారి సూచనలు, సలహాలను తీసుకొని ఈ సబ్జెక్టులను నిపుణులు రూపొందించారు. ప్రత్యేక కమిటీ ద్వారా అధ్యయనం చేయించారు. ఈ కమిటీ పరిశ్రమల వారితో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుంది. ప్రాంతాలవారీగా క్షేత్రస్థాయి అవసరాలపై అధ్యయనం చేసింది. మొదట 29 సబ్జెక్టులను గుర్తించగా.. వీటిల్లో 25 సబ్జెక్టులను ఉన్నత విద్యామండలి ఆమోదించింది.
కళాశాలలు, సీట్లు
ప్రభుత్వ కళాశాలలు: 146
ఎయిడెడ్ కళాశాలలు: 127
ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలు: 14
ఎయిడెడ్ స్వయంప్రతిపత్తి కళాశాలలు: 27
మొత్తం సీట్లు: 1,14,191
ప్రైవేటు కళాశాలు మొత్తం: 1,153
సీట్లు: 3,17,393

ఈ కోర్సులు అందుబాటులో ఉన్న కళాశాలలు..
* డాక్టర్ వీఎస్ కృష్ణా, విశాఖపట్నం
* పీఆర్ కళాశాల, కాకినాడ
* ఏఎస్‌డీ (మహిళా), కాకినాడ
* జీడీసీ (ఏ) రాజమండ్రి
* ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్, విజయవాడ
* జీడీసీ (మహిళా), గుంటూరు
* డీకేడబ్ల్యూ, నెల్లూరు
* జీడీసీ (పురుష), కడప
* జీడీసీ (మహిళా), కడప,
* జీడీసీ (పురుష), అనంతపురం
* కేవీఆర్ (మహిళా) కర్నూలు
* సిల్వర్‌జూబ్లీ, కర్నూలు


Back..

Posted on 23-05-2018