Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విద్య... విధానమూ ఒకటే...!

* డిగ్రీ విద్యలో గ్రేడింగ్
* కేంద్ర విధానంతో సమూల మార్పులు
* దేశవ్యాప్తంగా ఒకే మూల్యాంకనం

     ఈనాడు, అమరావతి: డిగ్రీ విద్యలో ఈ ఏడాది నుంచి సమూల మార్పులు రానున్నాయి. డిగ్రీలో సెమిస్టర్ పద్ధతిలో 'ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్(సీబీసీఎస్)'ను అమలు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) సంకల్పించింది. ఇప్పటివరకూ డిగ్రీ విద్యార్థులు చదువుకున్న విధానానికి స్వస్తి చెప్పి క్రెడిట్ బేస్డ్ గా.. ఎవరికి ఆసక్తి ఉన్న సబ్జెక్టులో వారు మరింత లోతుగా అధ్యయనం చేసేలా కోర్సులను రూపకల్పన చేశారు. దీనికి సంబంధించి యూజీసీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 241 డిగ్రీ కళాశాలల్లో విద్యావిధానం ఈ ఏడాది నుంచి పూర్తిగా మారాల్సి ఉంది. అయితే.. ఇప్పటివరకూ దీనికి సంబంధించిన విధివిధానాలపై కళాశాలలకు స్పష్టత రాలేదు. వసతులు సైతం లేవు. యూజీసీ మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఆదేశించింది.
కృష్ణా జిల్లాలో ఆంధ్ర లయోలా, సిద్థార్థ కళాశాలలు, గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాల వంటి ఒకటి రెండింటిలో సీబీసీఎస్ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. దేశమంతటా విద్యావ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనేదే సీబీసీఎస్ ప్రధాన ఉద్దేశం. నూతన విధానం వల్ల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మెరుగయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో చూస్తే ఉత్తీర్ణత 45-50శాతం ఉంటోంది. అదే సీబీసీఎస్ విధానం అమలు చేస్తున్న అటానమస్ కళాశాలల్లో 95శాతానికి పైగా ఉంటోంది. విద్యార్థులు ఇష్టపడి తీసుకుని చదివే కోర్సుల వల్ల వారికి సంపూర్ణంగా పరిజ్ఞానం అందించే వీలుంటుంది. అలాగే డిగ్రీలో వృత్తి విద్యకు సంబంధించి క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ స్కిల్ డెవలప్‌మెంట్(సీఎఫ్ఎస్‌డీ)ను యూజీసీ రూపొందించింది. 2015-16 నుంచి సీబీసీఎస్‌ను కచ్చితంగా అన్ని కళాశాలల్లోనూ అమలు జరపాలని, ఏప్రిల్ 25లోగా అన్ని యూనివర్సిటీలు దీనిపై తమ నిర్ణయాన్ని తెలపాలని, లేకుంటే అంగీకరించినట్టుగానే భావిస్తామని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మనదగ్గర ఇంతవరకూ కనీసం చర్చ కూడా జరగలేదు. తాజాగా మే 30న రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు విజయవాడలో సమావేశమై దీనిపై చర్చించనున్నారు.
* ప్రతి సబ్జెక్టులో మూడు కోర్సులు..
సీబీసీఎస్ విధానంలో ప్రధానంగా ప్రతి సబ్జెక్టులోనూ మూడు రకాల కోర్సులు ఉంటాయి. 1. కోర్(ప్రధాన కోర్సు), 2. మైనర్(ఎలక్టివ్), 3. స్కిల్‌బేస్డ్(నైపుణ్యాభివృద్ధి) కోర్సులుంటాయి. ఈ కోర్సుల ప్రాధాన్యాన్ని బట్టి వాటికి క్రెడిట్లను ఇస్తారు. ఓ విద్యార్థి బోటనీ సబ్జెక్టును ఎంచుకుంటే అందులో ప్రధాన కోర్సుగా.. ఆల్గే, ఫంగై, టెరిడోఫైటా, బయోఫైటా, సెల్‌బయాలజీ వంటివి ఉంటాయి. ఎలక్టివ్‌గా ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ వంటివి, నైపుణ్యాభివృద్ధిగా గ్రీన్‌హౌస్ మేనేజ్‌మెంట్, హార్టీకల్చర్, మెడిసినల్‌ప్లాంట్స్ వంటివి ఉంటాయి. ఈ మూడింటిలో 15 కోర్సులు ఇస్తే ఇందులో 12వరకూ ఎంచుకునే(ఛాయిస్) విధంగా అవకాశం కల్పిస్తారు. వీటిలో కోర్ కోర్సుకు క్రెడిట్లు ఉంటాయి. తర్వాత ఎలక్టివ్, నైపుణ్యాభివృద్ధికి క్రెడిట్లు తక్కువ ఉంటాయి. ఉదాహరణకు.. కోర్ కోర్సుకు నాలుగు క్రెడిట్లు ఉంటే.. మిగతా రెండింటికీ రెండేసి ఉంటాయి. ప్రాముఖ్యత కలిగిన సబ్జెక్టులో వచ్చే మార్కులకు ప్రాధాన్యం పెరుగుతుంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దశాబ్దంన్నరగా ఈ విధానం అమలులో ఉంది. సీబీసీఎస్ వల్ల విద్యార్థుల అభిరుచిని బట్టి కోర్సులను ఎంచుకునే వీలుంటుంది.
* భాషా విభాగానికి దెబ్బ..
సీబీసీఎస్ విధానం బాగున్నప్పటికీ భాషా విభాగాలకు నష్టం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న డిగ్రీ విధానంలో ఫస్ట్‌లాంగ్వేజ్‌గా ఆంగ్లం ఎంచుకున్నాక, సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు, హిందీ, సంస్కృతం ఎంచుకునే అవకాశం ఉంది. సీబీసీఎస్‌లో ఇంగ్లిష్, తెలుగు, మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్, ఎన్విరాన్‌మెంటల్ కోర్సులలో ఏదో ఒకటి మాత్రమే లాంగ్వేజ్‌గా ఎంచుకోవాలి. దీనివల్ల లాంగ్వేజ్ అధ్యాపకులకు నష్టం జరుగుతోంది. ప్రస్తుతం ప్రతి కోర్సులోనూ ఇద్దరు లాంగ్వేజీ అధ్యాపకులు ఉండగా.. సీబీసీఎస్‌లో ఒకరికే స్థానం ఉంది. డిగ్రీ ఆర్ట్స్‌లోనూ ఇప్పటివరకూ మూడు సబ్జెక్టులను చదువుకోగా ఇప్పుడు రెండే ఉంటున్నాయి. బీఏలో హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు. దీనివల్ల విద్యార్థులు ఈ మూడు సబ్జెక్టుల్లో ఏదో ఒక పీజీలో చేరేవారు. సీబీసీఎస్‌లో హిస్టరీ, ఎనమిక్స్ లేక.. హిస్టరీ, పొలిటికల్‌సైన్స్ రెండే సబ్జెక్టులు ఉన్నాయి. దీనివల్ల ఉన్నత విద్యలో ఒక సబ్జెక్టుకు పీజీ చేసే అవకాశం విద్యార్థులకు దూరమవుతోంది. అధ్యాపకులు సైతం ముగ్గురుండగా.. ఇద్దరికే స్థానం ఉంది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలలో రెండు సబ్జెక్టుల విధానమే ఉండగా.. మన దగ్గర మాత్రం మూడు ప్రధాన సబ్జెక్టుల విధానం 1988 నుంచి అమలు జరుగుతోంది.
* సమయం ఆసన్నమవుతోంది..
కొత్త విద్యాసంవత్సరానికి సమయం ఆసన్నమైంది. ఇంత తక్కువ సమయంలో సీబీసీఎస్‌ను అమలు జరపాలంటే ఇప్పుడున్న అరకొర వసతులు చాలవు. ఈ నేపథ్యంలో యూజీసీ ఆదేశాలను బేఖాతరు చేస్తే.. ఏటా వచ్చే నిధులకు గండిపడుతుంది. పైపెచ్చు విశ్వవిద్యాలయాలకే నేరుగా యూజీసీ మార్గదర్శకాలు అందాయి. దీంతో అమలు తప్పనిసరి. ప్రస్తుత విద్యావిధానం వల్ల డిగ్రీ విద్యార్థులు సరైన పరిజ్ఞానం లేకుండానే సమాజంలోకి వస్తున్నారు. దీనికి తోడు దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విద్యావిధానం అమలులో ఉండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నింటికీ పరిష్కారంగానే సీబీసీఎస్ విధానాన్ని యూజీసీ ప్రవేశపెట్టింది.
* రెండు జిల్లాల్లో కళాశాలలు..
కృష్ణా జిల్లాలో...
మొత్తం 122 డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో అవనిగడ్డ, మొవ్వ, పామర్రు, బంటుమిల్లి, కైకలూరు, మైలవరం, తిరువూరు, విజయవాడ ఎస్ఆర్ఆర్, కంచికచర్ల సోషల్ వెల్ఫేర్ కలిపి 9 ప్రభుత్వ కళాశాలలున్నాయి. ఎయిడెడ్ కళాశాలలు 25 ఉండగా వాటిలో గుడ్లవల్లేరు, ఎస్‌జీఎల్, చిట్టుగూడురు కళాశాలలు మూతబడ్డాయి. ప్రస్తుతం 22 ఉన్నాయి. వీటిలో ఆంధ్ర లయోలా, సిద్ధార్థ, కె.బి.ఎన్., సిద్ధార్థ మహిళా, మారిస్‌స్టెల్లా, మచిలీపట్నంలోని నోబుల్‌లు అటానమస్ కళాశాలలు. మిగతా 88 ప్రైవేటు కళాశాలలున్నాయి. వీటన్నింటిలోనూ యూజీసీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం సీబీసీఎస్ విధానాన్ని అమలు చేయాల్సి ఉందని ఎస్ఆర్ఆర్ ఐడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రవి పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతానికి కొన్ని ఇబ్బందులు తలెత్తినా భవిష్యత్తులో మంచి ఫలితాలొస్తాయన్నారు.
గుంటూరు జిల్లాలో...
గుంటూరు జిల్లాలో మొత్తం 119 కళాశాలలున్నాయి. వీటిలో బాపట్ల, వినుకొండ, మాచర్ల, చేబ్రోలు, రేపల్లె, గుంటూరు మహిళా కళాశాలలు 6 మాత్రమే ప్రభుత్వ కళాశాలలు. ఎయిడెడ్ కళాశాలలు 33 ఉన్నాయి. వీటిలో గుంటూరు ప్రభుత్వ మహిళా, జేకేసీ, తెనాలి జేఎంజే, వీఎస్ఆర్ అండ్ ఎన్‌వీఆర్, నగరం ఎస్‌వీఆర్ఎంలు అటానమస్ డిగ్రీ కళాశాలలు. గుంటూరులో గత ఏడాది నుంచి తమ ప్రభుత్వ మహిళా కళాశాలలో సీబీసీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నామని ఐడీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్.శశిబాల వెల్లడించారు. ఇవికాకుండా 80 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి.
* మార్కుల లెక్క ఇలా
ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సబ్జెక్టుకు, తక్కువ ఉన్న దానినీ ఒకే గాటన కట్టేస్తున్నారు. ఏడాది చివరిలో ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు నిర్వహించి వచ్చిన మార్కులన్నింటినీ కలిపి ఎంత శాతం వచ్చిందో చూస్తారు. దీనివల్ల సబ్జెక్టులో 100కు వంద వచ్చి, ప్రాక్టికల్స్‌లో 40 వచ్చిన వ్యక్తికి మొత్తం 140 మార్కులు వచ్చినట్టుగా లెక్కిస్తారు. అలాగే.. ప్రాక్టికల్స్‌లో 100కు వంద వచ్చి సబ్జెక్టులో 40 వచ్చిన వ్యక్తికి సైతం 140 మార్కులు వస్తాయి. వీరిద్దరికీ ఒకే రకమైన ప్రాధాన్యం ఉంది. కానీ.. సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రాధాన్యం తక్కువ ఉన్న సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులకు ప్రాధాన్యం తక్కువ ఉండేలా క్రెడిట్లను ఇచ్చేలా సీబీసీఎస్ విధానాన్ని రూపొందించారు. దీనిలో థియరీకి నాలుగు క్రెడిట్లు ఉంటే, ప్రాక్టికల్స్‌కు రెండు క్రెడిట్లను ఉండేలా చూస్తారు. సబ్జెక్టుల ప్రాధాన్యం ఆధారంగా వాటికీ క్రెడిట్లను ఇస్తారు. ఒక ఏడాదిలో ఆరు నెలలకు ఓసారి చొప్పున రెండు సెమిస్టర్లు నిర్వహించి అందులో వచ్చిన క్రెడిట్లను గ్రేడింగ్‌గా మార్చి దాని ఆధారంగా ఉన్నత విద్యకు ప్రాధాన్యం ఇస్తారు. నగరంలోని లయోలా వంటి అటానమస్ కళాశాలల్లో ఈ విధానాన్నే చాలా ఏళ్లుగా అమలు చేస్తున్నారు.
* ఆసక్తిని బట్టి..
ఇప్పటివరకూ బీఎస్సీ విద్యార్థులు కేవలం సైన్స్ సబ్జెక్టులే చదువుతున్నారు. సీబీసీఎస్‌లో కోర్ కోర్సులో సైన్స్ సబ్జెక్టులు తీసుకుని, ఎలక్టివ్‌లో ఆర్ట్స్ కోర్సులను ఎంచుకునే వీలుంది. సైన్స్ స్టూడెంట్ ఆసక్తి ఉంటే ఎలక్టివ్‌లో సేల్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, మోడ్రన్‌హిస్టరీ, ఫిల్మ్అండ్ అడ్వర్‌టైజ్‌మెంట్, టీవీప్రొడక్షన్, జర్నలిజం వంటి సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. అలాగే ఆర్ట్స్ విద్యార్థులు ఆసక్తి ఉంటే సైన్స్ సబ్జెక్టులను ఎలక్టివ్‌లో ఎంచుకోవచ్చు. అయితే గ్రేడ్లు మాత్రం కోర్ సబ్జెక్టులకే ఎక్కువ ఉంటాయి. ఎలక్టివ్ కోర్సులకు గ్రేడ్లు తక్కువ ఉంటాయి. సబ్జెక్టు మాత్రం విద్యార్థులు చదువుకునే అవకాశం కలుగుతోంది. బీఎస్సీ బోటనీ చదువుకుని మార్కెటింగ్ వృత్తిలోకి వెళ్తే డిగ్రీలో చదువుకున్న ఎలక్టివ్ కోర్సు ఉపకరిస్తుంది.
* హానర్స్ అవకాశమిస్తారా..
దేశమంతటా ఒకే విద్యావిధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతోనే ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ రెండు రకాల కోర్సులను యూజీసీ అందిస్తోంది. ఒకటి పాస్ కోర్సులు, రెండోవి హానర్స్ కోర్సులు. మన దగ్గర ఉన్నవన్నీ పాస్ కోర్సులే ఉన్నాయి. పాస్ కోర్సుకు మొత్తం 120 క్రెడిట్లు చేయాలి. అంటే బీఎస్సీలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఉంటుంది. హానర్స్‌లో 160 క్రెడిట్లు చేయాలి. దీనిలో ఒకే సబ్జెక్టు ఉంటుంది. బీఎస్సీ బోటనీ హానర్స్ అంటే.. బోటనీ మాత్రమే చదువుతారు. 14 పేపర్లు ఉంటే.. అన్నీ బోటనీ సబ్జెక్టులే ఉంటాయి. ఇలా బీఎస్సీ జువాలజీ హానర్స్, బీఎస్సీ కెమిస్ట్రీ హానర్స్ ఇలా ఒకే సబ్జెక్టుపై ఉంటుంది. ఒకే సబ్జెక్టులో విద్యార్థులు తిరుగులేని విధంగా తయారవుతారు. ప్రస్తుతం మన దగ్గర లేని ఈ కోర్సులను ఇక్కడ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు విశ్వవిద్యాలయాలు అనుమతి ఇస్తా..? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇచ్చినా ఇంతతక్కువ సమయంలో ఈ ఏడాది అమలు చేయడానికి అవకాశం ఉందా? అనేది అనుమానమే. గతంలో కేవలం మూడు పేపర్లు చెప్పిన అధ్యాపకులు ఇప్పుడు 14 పేపర్లు చెప్పాలి, 14 ల్యాబ్ కోర్సులు తీసుకు రావాలి. ఇవన్నీ నిర్వహించేందుకు వసతులు ఎంతున్నాయనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందేహాలన్నింటిపై చర్చించేందుకు అన్ని యూనివర్శిటీల పరిధిలోని కళాశాలలు కలిసి మే 30న విజయవాడలో సమావేశమై చర్చించనున్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
* డిగ్రీలో కీలక మలుపు.. - మాథ్యూ శ్రీరంగం, ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులు
సీబీసీఎస్ విధానం వల్ల ఈ ఏడాది నుంచి డిగ్రీ విద్యావిధానం కీలక మలుపు తిరగనుంది. విద్యార్థుల నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే.. దీనిపై అధ్యాపకులు, విద్యార్థులకు సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి. వీటిన్నింటిపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

posted on 26.5.2015