Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఒకప్పటి డిగ్రీ కాదు గురూ!

డిగ్రీ అంటే... డిగ్రీనా అని పెదవి విరిచే రోజులకు కాలం చెల్లింది. మన డిగ్రీలన్నీ మారిపోతున్నాయ్‌. సంప్రదాయ రీతులను దాటి మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త రూపంలో ప్రొఫెషనల్‌ కోర్సులకు దీటుగా వస్తున్నాయి. బీఏలో టూరిజం, బీకామ్‌లో ఈకామర్స్‌, బీఎస్సీలో సెరీ కల్చర్‌, పౌల్ట్రీ సైన్స్‌, ఫారెస్ట్రీ వంటి విభిన్న కాంబినేషన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అందుకే నిపుణులు సైతం ‘ఒకప్పటి డిగ్రీ కాదు!’ అంటున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు పీజీ విద్యార్థులను కాదని... డిగ్రీ విద్యార్హత ఉన్నవారిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ (దోస్త్‌) ద్వారా డిగ్రీ కళాశాలల్లోకి పేర్ల నమోదు ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రూపుమారిన డిగ్రీ కోర్సుల గురించీ...ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించీ తెలుసుకుందామా?

ఎన్నో కొత్త కొత్త కోర్సులు వస్తున్నా...డిగ్రీ కోర్సులు తమ మనుగడను ఇప్పటికీ కాపాడుకుంటూనే ఉన్నాయి. ఇంటర్‌ పాసైన 70 శాతం విద్యార్థులు బీఏ, బీకాం, బీఎస్‌సీ కోర్సుల్లోనే ప్రవేశాలు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏటా 2.20 లక్షల మంది చేరుతున్నారు. ఒకప్పటి మాదిరిగా సబ్జెక్టుల కాంబినేషన్లు కాకుండా కాలానుగుణంగా మారిన...మార్కెట్లో గిరాకీ ఉన్నవాటిని ఎంచుకుంటే సాధారణ డిగ్రీతోనే మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.
కొద్ది సంవత్సరాల క్రితం బీఏ, బీకాం, బీఎస్‌సీలలో కేవలం అయిదారు...గరిష్ఠంగా పది లోపు కాంబినేషన్లు ఉండేవి. ఇప్పుడు ఒక్క బీఏలోనే 68 రకాల కోర్సులు వచ్చాయి. అంటే ఒక విద్యార్థి 68 రకాల్లో ఏ కోర్సులైనా ఎంచుకోవచ్చు. ఇక బీఎస్‌సీలో 73 రకాల కోర్సులు, బీకాంలో 13 రకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటితోపాటు బీబీఎం, బీబీఏ, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (బీఎస్‌డబ్ల్యూ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ (బ్యాంకింగ్‌- ఇన్సూరెన్స్‌; హాస్పిటాలిటీ- టూరిజం అడ్మినిస్ట్రేషన్‌) కోర్సులు ఆయా విశ్వవిద్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడైనా ప్రవేశం
మూడేళ్ల క్రితం ఎక్కడో మారుమూల విద్యార్థి హైదరాబాద్‌లో చేరాలంటే నగరానికి వచ్చి రూ.500 నుంచి రూ.1000 పెట్టి దరఖాస్తు కొనుగోలు చేసి సమర్పించాలి. ఒక్కో కళాశాలకు ఒక్కో దరఖాస్తు కొనాలి...వరంగల్‌లో చేరాలంటే అక్కడికి వెళ్లాలి. ఇప్పుడు కేవలం రూ.200తో రాష్ట్రంలోని ఏ కళాశాలకయినా దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు కారణం- డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌- తెలంగాణ (దోస్త్‌) అందుబాటులోకి రావడమే. డిగ్రీ ప్రవేశాలకు 2016-17 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.200 చెల్లించి దోస్త్‌ వెబ్‌సైట్‌ నుంచి ఎంసెట్‌ తరహాలో ఎన్ని కళాశాలలకైనా, కోర్సులకైనా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. దీనివల్ల ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన మారుమూల విద్యార్థులు హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక నిజాం, సిటీ కళాశాలల్లోనూ సీట్లు సాధిస్తున్నారు.
డిగ్రీలోనే పీజీ తరహా
ఒకప్పుడు కేవలం పీజీ చదువులోనే స్పెషలైజేషన్లు ఉండేవి. డిగ్రీ విద్యతోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలన్న లక్ష్యంతో పలు స్పెషలైజ్‌డ్‌, పరిశోధన తరహా సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నారు. పీజీ విద్యపై ఆసక్తి ఉంటే వెళ్లొచ్చు. లేదంటే డిగ్రీ పరిజ్ఞానంతో అవకాశాలను అందుకోవచ్చు..ఉదాహరణకు బీఎస్‌సీ ఎంపీసీలో గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, బైపీసీ విద్యార్థులకు అయితే వృక్ష, జంతు, రసాయనశాస్త్రాలు ఉండేవి. కాలానుగుణంగా పీజీలో ఉండే మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫుడ్‌ సైన్స్‌, పౌల్ట్రీ సైన్స్‌, ఫిషరీస్‌, సెరీకల్చర్‌ మొదలైనవి వచ్చి చేరాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరి అవుతుండటంతో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కూడా ప్రవేశపెట్టారు.
బీఎస్‌సీ, బీకాంలోనే కాదు...బీఏలోనూ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఒక సబ్జెక్టుగా చేరింది. బీఏలో గత ఆరేడు సంవత్సరాలుగా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కాంబినేషన్‌ కేవలం ప్రైవేట్‌ కళాశాలల్లోనే ఉండగా ఇప్పుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనూ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఇప్పుడు డిగ్రీ విద్యార్థులకూ ఉద్యోగావకాశాలు పెరిగాయి. సివిల్‌ సర్వీసెస్‌ విధానాన్ని 2014 నుంచి మార్చటంతో హైదరాబాద్‌లోని కొన్ని కళాశాలలు డిగ్రీతోపాటు సివిల్స్‌ శిక్షణ ఇస్తున్నాయని విద్యార్థులు బీఏ కోర్సుల్లో చేరుతున్నారని అడ్వాంటా డిగ్రీ కళాశాల ఛైర్మన్‌ బైరెడ్డి లక్ష్మారెడ్డి చెప్పారు.
ఏ స్పెషలైజేషన్‌ ఎక్కడో...
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1049 డిగ్రీ కళాశాలల్లో దోస్త్‌ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో సీట్లను భర్తీ చేస్తున్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు, సబ్జెక్టుల కాంబినేషన్లను దోస్త్‌ (dost.cgg.gov.in) వెబ్‌సైట్లోకి వెళ్లి కుడి వైపున ఉన్న సెర్చ్‌ బై కాలేజీ/కోర్సెస్‌ వద్ద క్లిక్‌ చేస్తే కళాశాలలోని కోర్సు, కాంబినేషన్లు, సీట్ల సంఖ్య, రుసుముల వివరాలు ప్రత్యక్షమవుతాయి. సైన్స్‌ కోర్సులకు ప్రయోగశాలలు చాలా ముఖ్యం. కళాశాలలను ఎంచుకునేటప్పుడు అక్కడ అవి ఉన్నాయో, లేవో తెలుసుకోవడం ముఖ్యం. దోస్త్‌ ద్వారా కాకుండా మరో 42 కళాశాలలు సొంతగా ప్రవేశాలు నిర్వహించుకుంటున్నాయి. వాటిల్లో ఒకటీ రెండు తప్ప మిగిలినవి హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వాటిల్లో పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 9 వేల సీట్లున్నాయి.
డిగ్రీ వాళ్లు చాలు!
ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని పరిశ్రమలు తమ ఉద్యోగులు అందరికీ పీజీలు అవసరమని కోరుకోవడం లేదు. కొంత ఆంగ్ల నైపుణ్యం, సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్న డిగ్రీ విద్యార్థులూ చాలంటున్నాయి. వారిని తమ అవసరాలకు తగ్గట్లు మార్చుకోవచ్చని భావిస్తున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో పలు ఐటీ, ఫైనాన్స్‌ కంపెనీలు నేరుగా డిగ్రీ కళాశాలలకే వచ్చి ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీలు సైతం ముఖ్యంగా బీకాం, బీబీఏ విద్యార్థులను భారీగా నియమించుకుంటున్నాయి. మూడేళ్లలోనే కోర్సు పూర్తవుతుంది. రూ.14 వేల వేతనంతో ఉద్యోగాలు దక్కుతున్నాయి. దాంతోపాటు ఈ కోర్సులు చదివితే గ్రూపు, సివిల్స్‌ రాయడానికి ప్రయోజనకరంగా ఉంటుందని విద్యార్థులు భావిస్తున్నారని హన్మకొండలోని చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పురుషోత్తంరెడ్డి చెప్పారు. బీకాం, బీబీఏ చదువుతూనే మరోవైపు సీఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను పూర్తి చేస్తున్నారని భద్రుకా కళాశాల ప్రిన్సిపల్‌ సోమేశ్వర్‌రావు చెప్పారు. రెడ్డీస్‌ లాంటి కొన్ని ఫార్మా పరిశ్రమలు ఇప్పుడు బీఎస్‌సీ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి.
గడువు కొద్దిరోజులే..
* మే 26: రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లకు తుది గడువు
* మే 27-29 తేదీ వరకు: రూ.400 ఆలస్య రుసుంతో రిజిస్ట్రేషన్లకు గడువు
* జూన్‌ 4: మొదటి విడత సీట్ల కేటాయింపు
* జూన్‌ 5-14: రెండో విడత వెబ్‌ ఆప్షన్లు (మొదటి విడతలో పాల్గొన్నవారు సీట్లు మారేందుకు)
* జూన్‌ 19: రెండో విడత సీట్ల కేటాయింపు
* జూన్‌ 20-27: ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారితోపాటు కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
భిన్నమైన కోర్సులు.. బోలెడు అవకాశాలు - డాక్టర్‌ నీరజ, అకడమిక్‌ ఆఫీసర్‌, కళాశాల విద్యాశాఖ
ఇటీవలికాలంలో విద్యార్థులకు...అందులోనూ ప్రధానంగా సైన్స్‌ విద్యార్థులకు విభిన్నమైన కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌ వంటివీ, బైపీసీ విద్యార్థులకు సంప్రదాయ సబ్జెక్టులతోపాటు మైక్రో బయాలజీ, బయో టెక్నాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ లాంటి అధునాతన కోర్సులనూ కళాశాలలు అందిస్తున్నాయి. మెడికల్‌ మైక్రో బయాలజీ, ఫుడ్‌ మైక్రో బయాలజీ, ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, క్లినికల్‌ రిసెర్చ్‌, మాలిక్యులర్‌ బయాలజీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌ , హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, సౌందర్య సాధనాల తయారీ రంగాల్లో ఉపాధి అవకాశాలున్నాయి. గణాంకశాస్త్రం (స్టాటిస్టిక్స్‌)లో డిగ్రీ ఉన్న అభ్యర్థుల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో విస్తృత అవకాశాలున్నాయి. ఎన్నో రుగ్మతలకు ఆహారపు అలవాట్లు , జీవన విధానంలో మార్పులే నివారణ మార్గమని భారతీయులు గుర్తిస్తున్నారు. అందుకే హోం సైన్స్‌లో అంతర్భాగంగా ఉండే న్యూట్రిషన్‌, డైటెటి¨క్స్‌ వంటి కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. కెరియర్‌లో ఉన్నతంగా స్థిరపడాలనుకునే విద్యార్థులు మాత్రం డిగ్రీతో సరిపెట్టుకోకుండా పీజీ చదువుకోవడం తప్పదు.
విభిన్న సబ్జెక్టుల కాంబినేషన్లు
బీఏలో..
* కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌ + కంప్యూటర్‌ అప్లికేషన్లు + ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌
* ఆర్థికశాస్త్రం + ఆఫీస్‌ మేనేజ్‌మెంట్‌ + కంప్యూటర్‌ అప్లికేషన్లు
* చరిత ్ర+ కంప్యూటర్‌ అప్లికేషన్లు + టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
* చరిత్ర + రాజకీయ శాస్త్రం + టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
* గణితం + ఆర్థికశాస్త్రం + కంప్యూటర్‌ అప్లికేషన్లు
బీకాంలో..
* అడ్వర్‌టైజింగ్‌- సేల్స్‌ ప్రమోషన్‌- సేల్స్‌ మేనేజ్‌మెంట్‌
* బ్యాంకింగ్‌ - ఇన్సూరెన్స్‌- కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
* ఈ-కామర్స్‌ * టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
* ఫారెన్‌ ట్రేడ్‌ ప్రాక్టీసెస్‌ అండ్‌ ప్రొసీజర్స్‌
బీఎస్‌సీలో..
* అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ + వృక్షశాస్త్రం + రసాయనశాస్త్రం
* బయోటెక్నాలజీ + రసాయనశాస్త్రం + కంప్యూటర్‌ అప్లికేషన్లు
* బయోటెక్నాలజీ + రసాయనశాస్త్రం + ఫోరెన్సిక్‌ సైన్స్‌
* బయోటెక్నాలజీ +జంతుశాస్త్రం + కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
* బయోటెక్నాలజీ + మైక్రోబయాలజీ + కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
* వృక్షశాస్త్రం+ ఫారెస్ట్రీ+ రసాయనశాస్త్రం
* వృక్షశాస్త్రం + రసాయనశాస్త్రం + ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌
* బయోటెక్నాలజీ + రసాయనశాస్త్రం+ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ కంట్రోల్‌
* జన్యుశాస్త్రం అండ్‌ బయోటెక్నాలజీ+ వృక్షశాస్త్రం + బయలాజికల్‌ కెమిస్ట్రీ
* ఇండస్ట్రియల్‌ మైక్రోబయాలజీ +జంతుశాస్త్రం + రసాయనశాస్త్రం
* మైక్రోబయాలజీ + అప్లైడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ + రసాయనశాస్త్రం
* పౌల్ట్రీ సైన్స్‌ + జంతుశాస్త్రం + రసాయనశాస్త్రం
* సెరీ కల్చర్‌ + వృక్షశాస్త్రం + జంతుశాస్త్రం
* న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌ + జుంతుశాస్త్రం + రసాయన శాస్త్రం

- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు- హైదరాబాద్‌

Back..

Posted on 23-05-2018