Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
డిజైన్‌కు జై కొడతారా?

* కోర్సుల్లో ప్రవేశానికి వివిధ సంస్థల ప్రకటనలు

ప్రపంచ వ్యాప్తంగా డిజైనర్లకు గిరాకీ పెరుగుతోంది. డిజైన్‌ విభాగంలో ఏ స్పెషలైజేషన్‌ చదివినా ఉపాధి పరంగా ఢోకా ఉండదు. సృజన, డ్రాయింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారు ఈ రంగంలో బాగా రాణించవచ్చు. ఎన్‌ఐడీ, నిఫ్ట్‌, ఐఐటీల్లాంటి మేటి సంస్థల్లో చదువుకున్నవారిని బహుళజాతి కంపెనీలు, దేశీయ సంస్థలు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఆకర్షణీయమైన వేతనాలతో అవకాశం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం విభిన్న డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు వివిధ సంస్థలు ప్రకటనలు వెలువరించాయి!

డిజైన్‌ కోర్సులపై ఆసక్తి ఉన్నవారు ఇంటర్‌ తర్వాత ఆ దిశగా అడుగులేయవచ్చు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు డిజైన్‌ కోర్సులను డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఐఐటీ బాంబే నిర్వహించే యూసీడ్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ నిర్వహించే డాట్‌, నిఫ్ట్‌ నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (గాట్‌) ముఖ్యమైనవి. వీటిలో సాధించిన స్కోరుతో ఇతర సంస్థలు కూడా ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ పరీక్షల ద్వారా ఆర్ట్స్‌, ఒకేషనల్‌, డిప్లొమా విద్యార్థులు డిజైన్‌ కోర్సులు చదువుకోవడానికి అవకాశం లభిస్తోంది. డిగ్రీ కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. ప్రవేశ పరీక్షల్లో రాణించడానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. అయితే డ్రాయింగ్‌, డిజైన్‌ బాగా ప్రాక్టీస్‌ చేయాలి. సృజన మెరుగుపరుచుకుంటే పరీక్షల్లో, కెరియర్‌లోనూ రాణించడానికి వీలవుతుంది.

ప్రవేశ మార్గాలు
* యూసీడ్‌: ఐఐటీ బాంబే నిర్వహించే అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌)తో ఐఐబీ-బాంబే, గువాహటి, హైదరాబాద్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌ల్లో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులతోపాటు రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా చదివినవారు ఈ పరీక్షను రాసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బి.డిస్‌) కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ స్కోరుతో దేశవ్యాప్తంగా ఇతర సంస్థలూ ప్రవేశం కల్పిస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి యూసీడ్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు నవంబరు 9లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

* డాట్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (నిడ్‌)లో బ్యాచిలర్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి డిజైన్‌ ఆప్టిట్యూట్‌ టెస్టు (డాట్‌) నిర్వహిస్తున్నారు. నిడ్‌ ప్రధాన క్యాంపస్‌ అహ్మదాబాద్‌లో ఉంది. ఇక్కడ బీడిజైన్‌ కోర్సు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ (విజయవాడ), హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల వ్యవధితో గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ డిజైన్‌ (జీడీపీడీ) కోర్సు అందిస్తున్నారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది. ప్రకటన వెలువడింది. నవంబరు 7లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌ పూర్తయినవారు, ద్వితీయ సంవత్సర విద్యార్థులు అర్హులు.

* గాట్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)ల్లో ఫ్యాషన్‌ టెక్నాలజీతో పాటు డిజైన్‌ కోర్సులు సైతం అందిస్తున్నారు. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (గాట్‌) ద్వారా వీటిలో ప్రవేశం లభిస్తుంది. ఇంటర్‌, డిప్లొమా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన మరికొద్ది రోజుల్లో వెలువడుతుంది. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి.

మరికొన్ని మేటి సంస్థలు: శ్రేష్ఠ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్ట్‌, డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ; పెర్ల్‌ అకాడెమీ, యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, విట్‌ యూనివర్సిటీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, రాంచీ యూనివర్సిటీ, అమిటీ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, గాల్గోటియా యూనివర్సిటీ.

స్పెషలైజేషన్లు...
డిజైన్‌ కోర్సుల్లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని బ్యాచిలర్‌ స్థాయిలోనే చదువుకోవచ్చు. పలు సంస్థల్లో మొదటి ఏడాది సిలబస్‌ ఉమ్మడిగా ఉంటుంది. ప్రథమ సంవత్సరం కోర్సులో చూపిన ప్రతిభ, ఆసక్తికి అనుగుణంగా రెండో ఏడాది నుంచి నచ్చిన స్పెషలైజేషన్‌లో చదువుకోవచ్చు. యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్‌ మొదలైన కోర్సులను ఎన్నో సంస్థలు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో అందిస్తున్నాయి.

పీజీ తర్వాత పీహెచ్‌డీ చేసినవారు డిజైన్‌ సంస్థల్లో బోధకులుగా, పరిశ్రమల్లో పరిశోధకులుగా రాణించవచ్చు.

* ఇండస్ట్రియల్ డిజైన్‌: ఇండస్ట్రియల్ డిజైన్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు తయారీ సంస్థల్లో వస్తువు, ఉత్పత్తిని డిజైన్‌ చేస్తారు. ఫర్నిచర్‌, ఇంటీరియర్‌, ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్స్‌, సిస్టమ్స్‌, కన్జూమర్‌ గూడ్స్‌, క్రాఫ్ట్‌ బేస్డ్‌ ప్రొడక్ట్స్‌, యాక్సెసరీస్‌, పర్సనల్‌ యూజర్‌ ప్రొడక్ట్స్‌, కిచెన్‌ టూల్స్‌ అండ్‌ అప్లయన్సెస్‌, కొత్త తరం ఎల‌్రక్టానిక్స్‌, ఐటీ తదితర సంస్థల్లో పనిచేయవచ్చు. ఇండస్ట్రియల్ డిజైన్‌లో ప్రొడక్ట్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ అండ్‌ ఇంటీరియర్‌ డిజైన్‌, సిరామిక్‌ అండ్‌ గ్లాస్‌ డిజైన్‌ స్పెషలైజేషన్లు ఎంచుకోవచ్చు.

* టెక్స్‌టైల్‌ డిజైన్‌: ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అవసరాల్లో దుస్తులు ఒకటి. ఒక్కొక్కరూ ఒక్కో తరహా వస్త్రధారణను ఇష్టపడతారు. వేసుకున్న దుస్తుల్లో తమ ప్రత్యేకత కనిపించాలని ఆశిస్తారు. వీరందరి అవసరాలను పరిగణనలోకి తీసుకుని టెక్స్‌టైల్‌ డిజైనర్లు వస్త్రాలను రూపొందిస్తారు. సౌకర్యవంతంగా ఉంటూనే, ఆకర్షణీయంగా ఉండేలా వస్త్రాన్ని తీర్చిదిద్దుతారు. వీరికి టెక్స్‌టైల్‌ పరిశ్రమలు, రెడీమేడ్‌ దుస్తుల కంపెనీలు, రిటైల్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి.

* లెదర్‌ డిజైన్‌: పాదరక్షలు, బెల్టులు, బ్యాగులు వీటికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఈ విభాగాల్లో దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి సంస్థలెన్నో ఉత్పత్తులను రూపొందిస్తున్నాయి. సోఫాలతోపాటు వివిధ వస్తువుల తయారీలో లెదర్‌ వినియోగం పెరిగింది. జంతువుల తోలుతో ఆకర్షణీయమైన వస్తువులను రూపొందించడం లెదర్‌ డిజైనర్ల విధి. వీరికి ఎక్కువగా అపారెల్‌ తయారీ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. నిడ్‌, నిఫ్ట్‌లతోపాటు ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఈ స్పెషలైజేషన్‌ అందుబాటులో ఉంది.

* వీడియో ఫిల్మ్‌ డిజైన్‌: వీరు ఫిల్మ్‌, టెలివిజన్‌, అడ్వర్టైజింగ్‌ పరిశ్రమల్లో ప్రొడ్యుసర్లు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, డైరెక్టర్లు, సినిమాటోగ్రాఫర్‌, ఎడిటర్ల్లుగా పనిచేయవచ్చు. ప్రస్తుతం ఎక్కువమంది వీడియో ఫిల్మ్‌ డిజైనర్లు ఆన్‌లైన్‌ మీడియాలో పనిచేస్తున్నారు. సొంతంగానూ వీడియో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవచ్చు. వివాహాలే కాకుండా పుట్టినరోజు, గృహప్రవేశాలు...ఇలా ప్రతి సందర్భంలోనూ వీడియో షూట్‌ తప్పనిసరిగా మారింది. కాబట్టి నైపుణ్యం ఉన్నవారు సొంతంగానే చేతినిండా పని పొందవచ్చు.

* ఫ్యాషన్‌ డిజైన్‌: ఈ కోర్సులు చదివినవారికి దుస్తులు తయారుచేసే కంపెనీల్లో మేటి అవకాశాలు లభిస్తాయి. సొంతంగానూ అవుట్‌లెట్‌ ఏర్పాటుచేసుకోవచ్చు. కొంత అనుభవంతో డిజైన్‌ కన్సల్టెంట్లు, స్టైలిస్ట్, కస్టమర్‌ డిజైనర్లు, ఫ్యాషన్‌ ఫోర్‌కాస్టర్లు, ఇలస్ట్రేటర్లు, అంత్రప్రెన్యూర్లు, అకడమీషియన్లు, ఫ్యాషన్‌ మర్చండైజర్లు, బయ్యర్లుగా వీరు కొనసాగవచ్చు.

* యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌: వీరు అడ్వర్టైజింగ్‌ , ఎక్స్‌పరిమెంటల్‌ యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, 2డి, 3డి యానిమేషన్, ప్రి ప్రొడక్షన్, బుల్లితెర, వెండితెర, మార్కెటింగ్, ఇ కంటెంట్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల్లో పనిచేయవచ్చు.

* కమ్యూనికేషన్‌ డిజైన్‌: యానిమేషన్‌ అండ్‌ ఫిల్మ్‌ డిజైన్, ఎగ్జిబిషన్‌ డిజైన్, ఫిల్మ్‌ అండ్‌ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్‌ డిజైన్‌ ఇందులో భాగంగా ఉంటాయి. ప్రకటన, ఆన్‌లైన్‌ మీడియా, వినోద పరిశ్రమల్లో అవకాశాలు లభిస్తాయి.

* గ్రాఫిక్‌ డిజైన్‌: ఈ కోర్సు పూర్తిచేసుకున్నవారు గ్రాఫిక్‌ డిజైనర్ల్లుగా, బ్రాండ్‌ ఐడెంటిటీ డెవలపర్లుగా, లోగో డిజైనర్లుగా, విజువల్‌ ఇమేజ్‌ డెవలపర్లుగా, మల్టీమీడియా డెవలపర్లుగా, పబ్లికేషన్‌ డిజైనర్లుగా పనిచేయవచ్చు. బహుళజాతి కంపెనీలు, అడ్వర్టైజింగ్, ఆన్‌లైన్‌ మీడియా, టీవీ, వినోద పరిశ్రమల్లో వీరికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి.

* ప్రొడక్ట్‌ డిజైన్‌: పరిశ్రమ అవసరాలు, దైనందిన జీవితంలో ఉపయోగపడే వస్తువులు, ఇంట్లో, కార్యాలయాల్లో ఉపయోగించే పరికరాలు, ఆసుపత్రుల్లో వినియోగించేవి.. ఒకటేమిటి ప్రతిచోటా ఉపయోగిస్తున్న వస్తువులన్నీ ప్రొడక్ట్‌ డిజైన్‌ విభాగంలోకి వస్తాయి. ప్రొడక్ట్‌ డిజైనర్లు పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలపై దష్టి పెడతారు. మరింత సులువుగా ఉపయోగించేలా, మన్నిక ఎక్కువగా ఉండేలా, నిర్వహణ భారం లేకుండా, తక్కువ పరిమాణంలో ఉండేలా, కొద్ది మొత్తంతోనే తయారయ్యేలా ఆ ఉత్పత్తిని రూపొందించడంపై పరిశోధిస్తారు. ఆపై దాన్ని తయారుచేసి జన బాహుళ్యంలోకి అందుబాటులోకి తీసుకొస్తారు. వీరికి అన్నిరకాల వస్తు తయారీ పరిశ్రమల్లోనూ అవకాశాలు లభిస్తాయి.

* యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ డిజైన్‌: యూఈడీ కోర్సులు చేసినవారికి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, ఆన్‌లైన్‌ మీడియా సంస్థల్లో ఎక్కువ అవకాశాలుంటాయి.


Back..

Posted on 14-10-2019