Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
డిజిటల్‌ మీడియాలో దూసుకెళ్దాం!

     సృజనాత్మక కెరియర్‌ అయిన డిజిటల్‌ మీడియాలో విజయం సాధించాలని ఈ రంగంలో ప్రవేశించేవారందరూ అభిలషిస్తుంటారు. అందుకు వారు ఏయే అంశాలపై దృష్టి పెట్టాలో పరిశీలిద్దాం!
1. సునిశిత దృష్టి
చూసే ప్రతిదానినీ సునిశితంగా పరిశీలిస్తూ, దానిలోని లోతుపాతులను ఆకళింపు చేసుకోవాలి. ఇదే మిగతావారి కంటే ఎంతో ముందునిలబెట్టే అంశం. 2డి యానిమేషన్‌, 3డి యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, వెబ్‌ డిజైన్‌, గేమింగ్‌.. ఇలా ఏ విభాగానికి చెందిన సీజీ (కంప్యూటర్‌ గ్రాఫిక్‌) ఆర్టిస్టుకైనా ఇదే సూత్రం వర్తిసుంది. ఏ పనిలో నిమగ్నమైనా అందులోని సూక్ష్మ/ అతి సూక్ష్మ అంశాలను సైతం గ్రహించే సామర్థ్యాన్ని నిరంతరం పెంపొందించుకుంటూ పోవాలి. తమ ముందున్న పనిలో ఎంతగా లోతుల్ని తరచి చూడగలిగారనే దాన్నిబట్టి అంతగా నాణ్యతపై పట్టు వస్తుంది. లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరిచేసుకునే శక్తి వస్తుంది. తదుపరి దశలో మరింత ఉత్తమమైన ప్రతిభను ప్రదర్శించడం సాధ్యమవుతుంది.
ఉదాహరణకు ఈ కింది చిత్రాన్ని చూడండి...
దీన్ని పరిశీలిస్తే ఆ కళాకారుడు కేవలం ఒక పెన్సిల్‌తో కాగితమ్మీద ఓ ముదుసలికి అత్యద్భుతంగా ఎలా ప్రాణం పోసినదీ అర్థం చేసుకోవచ్చు. మన ముందున్న పనిపై అతి సూక్ష్మ పరిశీలన అవసరమన్నది అందుకే!
2. సృజనాత్మకతే అస్త్రం
క్రియేటివిటీ అనే ఆంగ్ల పదానికి గూగుల్‌లో వెతికితే వందల సంఖ్యలో అర్థాలు కనిపిస్తాయి. వాటిలో ఈ రంగానికి ఎంతగానో అన్వయించే ఉత్తమమైన ఓ అర్థాన్ని చూద్దాం.
* ఎవరూ చూడలేని దృక్కోణాన్ని చూడడం
* ఎవరూ ఆలోచించని విభిన్నమైన రీతిలో ఆలోచించడం
* ఎవరూ సాహసించని పనిని మనం చేయడం.
ఆపిల్‌ పండు చెట్టు నుంచి కింద పడడం కొన్ని కోట్లమంది చూసి ఉంటారు. కానీ న్యూటన్‌ ఒక్కడే అది ఆకాశంలోకి పోకుండా భూమి మీద ఎందుకు పడింది? దాన్నలా భూమి మీద పడేలా చేసిన శక్తి ఏమిటి? అని ఆలోచించాడు. విప్లవాత్మకమైన 'భూమ్యాకర్షణ' సిద్ధాంతాన్ని మన ముందుంచాడు. మిగతా వారికంటే భిన్నంగా, వినూత్నంగా ఆలోచించగలడమే డిజిటల్‌ కళాకారుడికి ఉండాల్సిన సృజనాత్మకత. 'ఏది ఎందుకు జరిగింది?', 'ఎలా జరిగింది?' అని తెలుసుకునే ఉత్సుకత, డిజిటల్‌ ఆర్టిస్టులో నిరంతరం రగులుతూ ఉండాలి. అప్పుడే సవాళ్లను అధిగమించి అత్యుత్తమ ఫలితాన్ని అందించగలుగుతారు.
వాస్తవానికి సృజనాత్మకత అనే పదాన్ని 'కళ'కు సంబంధించినదిగా అందరూ భావిస్తారు. కానీ పైన చెప్పుకున్న అర్థాన్ని సరిగా ఆకళింపు చేసుకుంటే, జీవితంలోని ప్రతి విషయంలో అది అవసరమన్నది బోధపడుతుంది.
3. సాంకేతికంగానూ ప్రజ్ఞ
డిజిటల్‌ మీడియాను వృత్తిగా ఎంచుకున్న ప్రతి ఒక్కరికీ తమ రంగానికి సంబంధించి అందుబాటులో ఉన్న సాఫ్ట్‌వేర్‌లన్నింటిపై గట్టి పట్టు ఉండడం తప్పనిసరి. నిరంతర సాధనతోనే ఆ పట్టు వస్తుంది. చేస్తున్న పనిని అత్యుత్తమ హంగులతో బయటికి తీసుకురావడానికి అందుబాటులో ఉన్న వివిధ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్ల సామర్థ్యాన్ని వినియోగించుకోగలిగితే ఈ రంగంలో తిరుగుండదు. అంటే ఏదో ఒక అప్లికేషన్‌కు పరిమితం కాకుండా వివిధ సాఫ్ట్‌వేర్లలోని ఉత్తమ అంశాలను వినియోగించగలిగే నైపుణ్యం పెరగాలన్నమాట. ఇదంతా ఒక ఎత్తయితే ఏ సాఫ్ట్‌వేర్‌ వాడినా దానిని గుడ్డిగా సాధన చేయడం కాకుండా షార్ట్‌కట్‌ కీలను తెలుసుకుని వాడడం నేర్చుకోవాలి. అప్పుడే అప్పగించిన పనిని తక్కువ సమయంలో పూర్తిచేయడం సాధ్యమవుతుంది.
సమయం, నేర్చుకోవాలనే తపన ఉన్న ఎవరైనా (ఫీజు కట్టగలిగే శక్తీ ఉండాలనుకోండి) వివిధ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లను నేర్చుకోగలుగుతారు. కానీ అలా అందుబాటులో ఉన్న టూల్స్‌ గురించి నేర్చుకునేటపుడు దృష్టి అంతా వాటిని కళాత్మకంగా ఎలా వాడుకోవచ్చనే అంశంపైనే ఉండాలి. ఉదాహరణకు 'ఫొటోషాప్‌' నేర్చుకుంటుంటే.. 'ఇమేజ్‌ ఎడిటింగ్‌'ను ఎంత కళాత్మకంగా చేయవచ్చు అనే దానిపైనే దృష్టి ఉండాలి. అలాగే 'అడోబ్‌ ప్రీమియర్‌' నేర్చుకునేటపుడు ఎడిటింగ్‌పై దృష్టి కేంద్రీకరించాలి. ప్రెజెంట్‌ చేసే విషయం అందరినీ కట్టిపడేసే రీతిలో ఉండాలి మరి.
అడోబ్‌, ఆటోడెస్క్‌, కోరల్‌ అందించే సాఫ్ట్‌వేర్‌లను నేర్చుకునేటపుడు ఓ కళాకారుడిగా వాటిపై మనసు నిమగ్నం చేయాలి. 'ఏదో టూల్స్‌ను సాధన చేశాంలే' అన్నట్లుగా కాకుండా వాటిని కళాత్మకంగా ఎలా వాడుకోవాలనే దానిపైనే దృష్టిపెట్టాలి. ఒక్కసారి 'ఫొటోషాప్‌' నేర్చుకోవడం పూర్తయిందంటే అత్యుత్తమ 'ఇమేజ్‌ ఎడిటర్‌'గా మారాలి కానీ, సాధారణ ఫొటోషాప్‌ ఆపరేటర్‌గా కాదు! ఆ తేడాను గుర్తించడంలోనే విజయ రహస్యం దాగుంటుంది.
4. ఆ నైపుణ్యం నేర్చుకోవాలి
'నైపుణ్యం' అంటే... క్లిష్టమైన పనులను అలవోకగా పూర్తిచేసే సామర్థ్యాన్ని ఉద్దేశపూర్వకంగా, నిర్దిష్ట పద్ధతిలో, నిర్విరామ కృషితో నేర్చుకోవడం. ఆ క్లిష్టమైన పనులనేవి 'ఐడియాస్‌' (గ్రాహ్య నైపుణ్యాలు), 'థింగ్స్‌' (సాంకేతిక నైపుణ్యాలు), 'పీపుల్‌' (సమాచార మార్పిడి నైపుణ్యాలు) అనే మూడు అంశాలతో ముడిపడి ఉంటాయి. అంటే వీటన్నింటిలో నైపుణ్యం సాధించి, చేసే పనిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నమాట!
అన్నికంటే ముఖ్యమైనది- 'కమ్యూనికేషన్‌ స్కిల్‌' (భావప్రసరణ నైపుణ్యం). అంటే- చెప్పాలనుకునే సమాచారాన్ని విస్పష్టంగా అవతలివారికి చేరవేయగలగడం. ఈ విషయంలో ఆంగ్లభాష అనేది ప్రధానం కాదు. ఇంగ్లిష్‌ అనే కాదు.. అసలు ఫలానా భాష అని చెప్పే పనేలేదు. అయితే బహుళజాతి సంస్థలు, కార్పొరేట్‌ ఆఫీసుల్లో విధులు నిర్వర్తించాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడడం, రాయడం తప్పనిసరి.
చాలామంది తెలుగు మాధ్యమంలో చదివివచ్చిన వారి మనసుల్లో ఇంగ్లిష్‌ మాట్లాడడం నేర్చుకునేటపుడు ఏదో తెలియని భయం వెన్నాడుతూ ఉంటుంది. గ్రామాల నుంచి, చిన్న చిన్న పట్టణాల నుంచి వస్తున్న ఎంతోమంది 3 నుంచి 6 నెలల సమయంలో ఇంగ్లిష్‌ నేర్చుకుని తమ భావప్రసరణ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటున్నారు. ప్రముఖ సంస్థల్లో ఇంటర్వ్యూలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, తమ కలల ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు కూడా. అందువల్ల డిజిటల్‌ మీడియా రంగంలో మంచి కెరియర్‌ సొంతం కావాలంటే ఇంగ్లిష్‌లో మాట్లాడగలగడం తప్పనిసరి.
ఈ రకంగా సునిశిత దృష్టి, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, ఆంగ్లభాష నైపుణ్యం- ఈ నాలుగు అస్త్రాలనూ అమ్ముల పొదిలో చేర్చుకోగలిగిన డిజిటల్‌ ఆర్టిస్టుకు ఈ రంగంలో అత్యుత్తమ విజయాలను సాధించడం చాలా తేలిక.

posted on 30.06.2015; 8pm