Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

పది అర్హతతో పాడిపంటల కోర్సులు

* వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పాలిటెక్నిక్‌ డిప్లొమాలకు ప్రకటనలు విడుదల

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతితో చదువులు ఆపేసి పనులు వెతుక్కునే యువత ఎక్కువగానే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం ఇంకాస్త పెరుగుతుంది. ఇటువంటి వారికి వ్యవసాయ, దాని అనుబంధరంగాల్లోని పాలిటెక్నిక్‌ కోర్సులు ఎంతో ఉపయోగకరం. టెన్త్‌ అర్హతతో వీటిల్లోకి ప్రవేశం లభిస్తుంది. ఆ మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ కోర్సులు చేసి గ్రామాల్లోనే స్థిరపడవచ్చు.

వ్యవసాయ, అనుబంధ రంగాల్లో కింది స్థాయిలో నైపుణ్యం ఉన్న సిబ్బంది అవసరం పెరుగుతోంది. పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు ఈ అవసరాలను తీరుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ.. పదో తరగతి పూర్తికాగానే ఉన్నత చదువులకు వెళ్లలేని వారెందరో నైపుణ్య శిక్షణ పొందేందుకు ఇవి దోహదపడుతున్నాయి. స్థానికంగానే ఉంటూ స్వయం ఉపాధికి ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాయం, శ్రీ వేెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన యూనివర్సిటీ, తెలంగాణలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలు ప్రవేశాలకు ప్రకటనలు విడుదల చేశాయి. తెలంగాణలోని కొండా లక్ష్మణ్‌ హార్టీకల్చర్‌ యూనివర్సిటీ నుంచి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుంది.

రసాయన రహిత సేద్యం దిశగా ప్రపంచం అడుగేస్తోంది. సంపన్నులే కాకుండా మధ్యతరగతి వర్గాలు కూడా పురుగుమందుల్లేకుండా పండించే పంట ఉత్పత్తుల కొనుగోలుపై దృష్టి పెడుతున్నారు. వ్యవసాయంపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు సైతం ఈ రంగంలోకి వస్తున్నారు. అత్యధిక ఆదాయం, విదేశీ మారకద్రవ్యం మత్స్యరంగం నుంచి వస్తోంది. డెయిరీ, కోళ్ల పరిశ్రమలోనూ పెట్టుబడులు వస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సుల ప్రాధాన్యం పెరిగింది.

డిప్లొమా కోర్సులు ఎందుకు?
* పదో తరగతి తర్వాత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోడానికి ఉపయోగపడతాయి. వృత్తి నిపుణులుగా ఎదిగేందుకు దోహదపడతాయి.
* ప్రభుత్వేతర, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కింది స్థాయి సిబ్బంది కొరతను తీరుస్తాయి. ఎంపీఈఓగా చేరేందుకు కూడా ప్రభుత్వ విభాగాలు అవకాశమిస్తున్నాయి.
* కోర్సులు పూర్తి చేసినవారికి ఎరువులు, పురుగుమందుల సంస్థలు, పశువైద్య రంగంలోని ఫార్మాస్యూటికల్స్‌, డెయిరీలు, కోళ్లపరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
* పశు సంవర్థకంలో లైవ్‌స్టాక్‌ సహాయకులు, జూనియర్‌ వెటర్నరీ సహాయకులుగానూ అవకాశాలు ఉన్నాయి.
* వ్యవసాయ విశ్వవిద్యాలయాల పరిధిలో డిప్లొమా పూర్తిచేసిన వారికి లేటరల్‌ ఎంట్రీ విధానంలో బీఎస్సీ రెండో సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం కలిస్తున్నారు. వీరికి ప్రతి కళాశాలలో కొన్ని సీట్లు కేటాయించారు.
ఎవరు అర్హులు?
* పదోతరగతి ఉత్తీర్ణులైనవారు, ఇంటర్‌ తప్పినవారు ఇందులో చేరేందుకు అర్హులు.
* ఇంటర్‌, ఆపైన చదివినవారు అర్హులు కాదు.దీ పదేళ్ల విద్యాభ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా విద్యాభ్యాసం చేసి ఉండాలి.

మూడు విభాగాల్లో..
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో మూడు విభాగాల్లో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టారు. మొత్తం 100 కళాశాలలు ఉండగా.. ఇందులో 19 విశ్వవిద్యాలయ, 81 పైవేటు పాలిటెక్నిక్‌లు ఉన్నాయి.
* విశ్వవిద్యాలయ పరిధిలో గుంటూరు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపురంలో 25 సీట్లతో విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్‌ ఉంది. విశాఖపట్నం జిల్లా చింతపల్లిలో సేంద్రియ వ్యవసాయంలో కోర్సులు బోధిస్తున్నారు. అనకాపల్లి, కలికిరి ప్రాంతాల్లో వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. దరఖాస్తుకు ఆఖరు తేదీ జులై 4. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
రెండేళ్ల కోర్సులు: వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞాన, సేంద్రియ వ్యవసాయం
మూడేళ్ల కోర్సులు: అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌

రంగం విశ్వవిద్యాలయ ప్రైవేటు
వ్యవసాయం 510 2,420
విత్తన సాంకేతిక 25 440
సేంద్రియ 25 120
వ్యవసాయ ఇంజినీరింగ్‌ 60 450

ఉద్యాన విభాగంలో
డాక్టరు వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో కలికిరి, మడకశిర, నూజివీడు, రామచంద్రాపురంలలో 4 పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉద్యాన డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏడు ప్రైవేటు కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం సీట్లు 480. కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. దరఖాస్తుకు చివరితేదీ జూన్‌ 20.

రంగం విశ్వవిద్యాలయ ప్రైవేటు
ఉద్యాన డిప్లొమా 200 280

పశువైద్య, మత్స్య రంగాల్లో
పశువైద్య, మత్స్య రంగంలో డెయిరీ, ఆక్వా ఉత్పత్తుల వృద్ధి ఏటా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా పాలిటెక్నిక్‌లను శ్రీ వేంక‌టేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ప్రవేశ పెట్టింది. తొలిసారిగా 1999లో చిత్తూరు జిల్లా పలమనేరులో పశు సంవర్థక పాలిటెక్నిక్‌ ఏర్పాటు చేశారు. మొత్తంగా విశ్వవిద్యాలయ పరిధిలో 7 పశు సంవర్థక పాలిటెక్నిక్‌లు, ఒక మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్‌ ఉంది. సంగం డెయిరీ ఆధ్వర్యంలో సంగం జాగర్లమూడిలో డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ ఉంది. ఇక్కడ 50 సీట్లు ఉన్నాయి.

రంగం విశ్వవిద్యాలయ ప్రైవేటు
పశుసంవర్థక 210 150+450*
మత్స్య 29 50+450*
డెయిరీ - 50

కోర్సు వ్యవధి: రెండేళ్లు
* పశు సంవర్థక రంగంలో 9, మత్స్య రంగంలో 6 చొప్పున కొత్త ప్రైవేటు కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సీట్ల సంఖ్య పెరగనుంది. దరఖాస్తుకు చివరితేదీ జులై 12.

తెలంగాణలో
తెలంగాణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో డిప్లొమా కోర్సులకు ప్రవేశాలు నిర్వహిస్తున్నారు.
వ్యవసాయంలో డిప్లొమా
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా పాలెంలో వ్యవసాయ డిప్లొమా పాలిటెక్నిక్‌ తొలిసారిగా ప్రారంభమైంది. విశ్వవిద్యాలయ పరిధిలోని 9 వ్యవసాయ, 1 విత్తన సాంకేతిక పరిజ్ఞాన, 1 వ్యవసాయ ఇంజినీరింగ్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. జోగిపేటలో బాలికలకు మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. బసంతపూర్‌, జమ్మికుంట, మాల్‌ తుమ్మెదలో బాలురకు ప్రవేశాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో 7 వ్యవసాయ, 1 విత్తన సాంకేతిక, 1 సేంద్రియ, 3 వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమా పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. వ్యవసాయ, విత్తనసాంకేతిక, సేంద్రియ డిప్లొమాలకు రెండేళ్లు, వ్యవసాయ ఇంజినీరింగ్‌ డిప్లొమాకు మూడేళ్ల పాటు కాలవ్యవధి నిర్ణయించారు.దరఖాస్తుకు చివరి తేదీ జులై 4.

రంగం విశ్వవిద్యాలయ ప్రైవేటు
వ్యవసాయం 200 420
విత్తన సాంకేతిక 20 60
సేంద్రియ - 60
వ్యవసాయ ఇంజినీరింగ్‌ 20 90

పశుసంవర్థకం, మత్స్యరంగాల్లో
మహబూబ్‌నగర్‌ పశు పోషణ కేంద్రంలో తొలిసారిగా 30 సీట్లతో పాలిటెక్నిక్‌ ప్రారంభమైంది. తర్వాత కరీంనగర్‌, మెదక్‌ జిల్లా సిద్దిపేట, వరంగల్‌ జిల్లా మూమునూరులో పాలిటెక్నిక్‌లు వచ్చాయి. తెలంగాణలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో పశుసంవర్థక, మత్స్య పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, సిద్దిపేటల్లో 30 చొప్పున, మామునూరులో 20 చొప్పున మొత్తం 110 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ పరిధిలోని కృష్ణా జిల్లా భావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్‌లో తెలంగాణకు 11 సీట్లు ఉన్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జులై 10.

ఉద్యాన రంగంలో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో రెండేళ్ల డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులు త్వరలో ఆహ్వానించనున్నారు.

(యూనివర్సిటీలు అందిస్తున్న పలు రకాల కోర్సులు, వాటి ఉపాధి అవకాశాల వివరాలను http://tinyurl.com/y5bdnh57 లింక్‌లో చూడవచ్చు.)

- వి. శ్రీనివాసరావు, ఈనాడు-అమరావతి


Back..

Posted on 19-06-2019