Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
డిప్లొమా బాటలో వ్యవసాయ డిగ్రీ!

ఎంసెట్‌లో 10 వేల లోపు ర్యాంకులు సాధించినా లభించని వ్యవసాయ, ఉద్యాన శాస్త్రాల సీట్లు తక్కువ పోటీతో సాధించుకునే సదవకాశం ఆయా కోర్సుల్లో డిప్లొమాల ద్వారా సాధ్యమవుతోంది. ఈ డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు ఎంసెట్‌తో సంబంధం లేకుండా వ్యవసాయ, ఉద్యాన శాస్త్రాల్లో నేరుగా డిగ్రీలోకి ప్రవేశించవచ్చు!

వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కళాశాలల్లో లభించే సీట్లలో 15 శాతాన్ని డిప్ల్లొమా విద్యార్థుల కోసం కేటాయిస్తున్నాయి. గత ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా అనుమతించిన ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో సైతం సీట్లు కేటాయించడంతో విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఆయా విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించి వ్యవసాయ, ఉద్యాన శాస్త్ర డిగ్రీల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారి కోసం అగ్రిసెట్ ప్రకటన విడుదలయ్యింది. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన డిప్లొమా పూర్తిచేసినవారి కోసం హార్టీసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది.
అగ్రి సెట్- 2018
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిసెట్-2018 ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో 112 సీట్లు అందుబాటులో ఉండగా (వ్యవసాయ డిప్ల్లొమా 97, విత్తన పరిజ్ఞాన డిప్ల్లొమాకు 13, సేంద్రియ వ్యవసాయం డిప్లొమాకు రెండు), వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో 72 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 25 వరకు అవకాశం కల్పించారు.
తిరుపతి, బాపట్ల, నైరా వ్యవసాయ కళాశాలల్లో జులై 29న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. డిప్ల్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు నిర్ణీత రుసుములు చెల్లించిన రశీదుతో కూడిన దరఖాస్తును కన్వీనర్, అగ్రిసెట్-2018, ఆఫీస్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, తిరుపతి- 517502 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.
అగ్రిసెట్‌లో ఉత్తీర్ణులైన, అర్హులైన అభ్యర్థులకు నాలుగు సంవత్సరాల వ్యవసాయశాస్త్ర డిగ్రీలోకి ప్రవేశం కల్పిస్తారు. అగ్రిసెట్‌ను 120 మార్కులకు నిర్వహిస్తారు. ఓఎంఆర్ పత్రంలో గంటన్నర సమయంలో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఈ సెట్‌కు సిద్ధం అవుతున్న విద్యార్థులకు ప్రత్యేకించి సిలబస్ ఏమీ లేదు. డిప్లొమాలో ఉన్న కోర్సుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అన్ని సబ్జెక్టులనూ క్షుణ్ణంగా చదివితే చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అగ్రానమీ, వృక్ష ప్రజనన శాస్త్రం, మృత్తికాశాస్త్రం, కీటకశాస్త్రం, తెగుళ్ల శాస్త్రం, ఉద్యాన శాస్త్రం వంటి కష్టమైన సబ్జెక్టులపై బాగా అవగాహన పెంపొందించుకుంటే మార్కులు సాధించవచ్చు. ఈ ఏడాది సుమారు ఐదు వేల మంది అగ్రిసెట్‌కు దరఖాస్తు చేసే అవకాశముంది.

హార్టీ సెట్- 2018
పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టీసెట్ 2018 ప్రకటనను విడుదల చేసింది. ఉద్యాన శాస్త్రంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు, ప్రస్తుతం రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని నిర్ణీత రుసుములు చెల్లించి పూర్తిచేసిన దరఖాస్తును, రుసుము చెల్లింపు రశీదును జత చేసి రిజిస్ట్రార్, వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా- 534101 అనే చిరుమానాకు పోస్టు ద్వారా, వ్యక్తిగతంగా చేర్చాల్సి ఉంటుంది.
జులై 18న విశ్వవిద్యాలయ కేంద్రమైన వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. తెలుగు మాధ్యమంలో 200 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. రెండు గంటల సమయంలో ఓఎంఆర్ సమాధానం పత్రం ద్వారా సమాధానాలు గుర్తించాలి. ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఉద్యానశాస్త్ర డిగ్రీలో డిప్ల్లొమా అభ్యర్థుల కోసం 83 సీట్లు కేటాయించారు. డిప్లొమా సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే పరీక్షలో ఉండడంతో అన్ని సబ్జెక్టులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది రెండు నుంచి మూడు వేల దరఖాస్తులు అందవచ్చని అధికారులు భావిస్తున్నారు.
                                                        - పసుపులేటి వేణుగోపాల్, న్యూస్‌టుడే, తిరుపతి

Back..

Posted on 19-06-2018