Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొలువులిచ్చే చిప్‌లు!

* సెమీ కండక్టర్‌ రంగంలో డిప్లొమాలు, సర్టిఫికెట్‌ కోర్సులు

దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల, మొబైల్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతోంది. మరోపక్క ఐటీ, టెలికమ్యూనికేషన్‌ రంగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. పెరిగిన అవసరాలకు అనుగుణంగా సెమీ కండక్టర్‌ రంగం విస్తరిస్తోంది. ఈ రంగంలో కెరియర్‌ తీర్చిదిద్దుకుంటే భవితకు తిరుగుండదు! మరి ఈ సెమీ కండక్టర్‌ పరిశ్రమ అంటే ఏమిటి... దీంట్లో ఉద్యోగావకాశాలు ఎలా వస్తాయి. అందుకోసం ఏమేం చదవాలి? తెలుసుకుందాం!

మన దేశంలో వినియోగిస్తున్న మొబైల్‌ డేటా అమెరికా, చైనా దేశాల ఉమ్మడి వాడకం కంటే ఎక్కువ. అమెరికాకు చెందిన సెమీ కండక్టర్‌ సంస్థ ‘మైక్రాన్‌ టెక్నాలజీ ఇంక్‌’ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. కృత్రిమ మేధ, మెషిన్‌ లర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లలో మనదేశం గణనీయమైన ప్రగతిని సాధించింది. దీనికి సెమీ కండక్టర్స్‌ పరిశ్రమ వెన్నెముకగా నిలుస్తోంది. దేశీయ సెమీ కండక్టర్స్‌ పరిశ్రమకు హైదరాబాద్‌ కేంద్రంగా మారబోతోంది. సెమీ కండక్టర్లు, మెమరీకి సంబంధించి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ప్రస్తుతం 700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రానున్న రెండేళ్లలో వీరి సంఖ్య రెండు వేలకు చేరనుంది. ఈ గణాంకాలన్నీ సెమీ కండక్టర్‌ పరిశ్రమ ప్రాముఖ్యాన్ని చాటుతున్నాయి.

కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఐపాడ్స్‌, గేమింగ్‌ హార్డ్‌వేర్‌, గృహోపకరణాలు, మెడికల్‌, టెలికమ్యూనికేషన్స్‌, ఆటోమోటివ్‌, డిఫెన్స్‌, ఎయిరోస్పేస్‌, ఐటీ, ఆఫీస్‌ ఆటోమేషన్‌, ఆటోమొబైల్‌, అటానమస్‌ వెహికిల్స్‌, కృత్రిమ మేధ.. ఇతర రంగాల్లో సెమీ కండక్టర్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఉపయోగించే చిప్‌ల తయారీలో సెమీ కండక్టర్లు అవసరమవుతాయి. వీటికి ఉన్న ఇన్ని ప్రయోజనాల కారణంగానే వివిధ పరిశ్రమలు, సంస్థల్లో వీటి వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.

మనదేశంలో ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అంచనాల ప్రకారం భారత్‌లో ఏటా సుమారు రెండువేల చిప్‌లు తయారుచేస్తున్నారు. ఏటా ఇరవైవేల మందికిపైగా ఇంజినీర్లు చిప్‌లను రూపొందించడం, వాటి పనితీరును పరిశీలించడం... లాంటి దశల్లో పనిచేస్తున్నారు. పెరుగుతున్న గిరాకీ వల్ల భారత ప్రభుత్వమూ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమ అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరించింది. వివిధ సబ్సిడీలు, ప్రోత్సాహకాలను అందించి ఈ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ రంగంలో ఉద్యోగావకాశాలూ గణనీయంగా పెరగనున్నాయి.

ఎవరు అర్హులు?
బి.ఇ./ బి.టెక్‌ ఎలక్ట్రానిక్స్‌, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదివినవారు సెమీ కండక్టర్‌ రంగంలో ఉద్యోగాలను పొందవచ్చు. వి.ఎల్‌.ఎస్‌.ఐ.(వెరీ లార్జ్‌-స్కేల్‌ ఇంటిగ్రేషన్‌)లో ఎం.టెక్‌ చేసినవారూ ఈ రంగంలో పనిచేయడానికి అర్హులు. వి.ఎల్‌.ఎస్‌.ఐ.లో భాగంగా వేల ఎలక్ట్రానిక్‌ భాగాలను ఒకే చిప్‌ మీద అమర్చవలసి ఉంటుంది. బి.ఇ. తర్వాత వీఎల్‌ఎస్‌ఐ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ చేయడం ద్వారా తగిన అనుభవం సంపాదించవచ్చు.

ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ చదివిన తర్వాత సెమీకండక్టర్‌ రంగంలో ప్రవేశించడానికి డిప్లొమాలు, స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ముంబై)లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ‘సెమీకండక్టర్‌ టెక్నాలజీ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌’లో స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులను నిర్వహిస్తోంది. దేశంలోనే తొలిసారిగా స్వల్పకాలిక కోర్సులను ఇక్కడ మొదలుపెట్టారు. సెమీకండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ఆధునిక మార్పులకు సంబంధించి ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. విఎల్‌ఎస్‌ఐ అండ్‌ సెమీకండక్టర్‌ టెక్నాలజీ, ల్యాబ్‌ పరికరాలను ఉపయోగించడంలోనూ శిక్షణనిస్తారు. సెమీకండక్టర్‌ రంగంలో పనిచేస్తున్నవారు, రిసెర్చ్‌ సైంటిస్టులు, టెక్నికల్‌ స్టాఫ్‌, విద్యావేత్తలు, విద్యార్థులు ఈ కోర్సును పూర్తిచేయవచ్చు. కోర్సులో భాగంగా ఏడు రోజుల పాటు థియరీ, ప్రాక్టికల్‌ క్లాసులను నిర్వహిస్తారు. నవంబరు నెల మధ్యలో ఈ కోర్సు మొదలవుతుంది. సంవత్సరానికి రెండుసార్లు ఈ కోర్సులో ప్రవేశానికి అవకాశం ఉంటుంది. సైన్స్‌ లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా బ్యాచిలర్స్‌ డిగ్రీ చేసినవారు ఈ కోర్సులో చేరవచ్చు.

* సెమీ కండక్టర్‌ ఐసీ డిజైన్‌లో ఆన్‌లైన్‌ సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లూ అందుబాటులో ఉన్నాయి. ఇంజినీరింగ్‌ తర్వాత సెమీకండక్టర్‌ రంగంలో స్థిరపడాలనే ఆసక్తి ఉన్నవారు ఆ ఆన్‌లైన్‌ కోర్సులను పూర్తిచేయవచ్చు.

ఉద్యోగ అవకాశాలు
ఇన్‌టెల్‌ కార్పొరేషన్‌, మైక్రాన్‌ టెక్నాలజీ ఇంక్‌, క్వాల్కమ్‌ టెక్నాలజీస్‌ ఇంక్‌, సామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌, ఎస్‌కె. హైనిక్స్‌ ఇంక్‌- ఇవన్నీ అంతర్జాతీయంగా పేరొందిన సెమీ కండక్టర్‌ కంపెనీలు. చిప్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్న ఇన్‌టెల్‌ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగాలు పొందవచ్చు. అమెరికాకు చెందిన సెమీ కండక్టర్‌ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీ ఇంక్‌ హైదరాబాద్‌లో తన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించింది. భవిష్యత్తులో దీంట్లోనూ ఉద్యోగావకాశాలు ఉంటాయి.

ఇంకా సుమారు 120కి పైగా జాతీయ, అంతర్జాతీయ సెమీ కండక్టర్‌ కంపెనీలు మనదేశంలో ఉన్నాయి. యడ్రాయిట్‌ ఐసీ డిజైన్‌ (బెంగళూరు), ఇనెడ సిస్టమ్స్‌ (హైదరాబాద్‌), ఇన్‌ఫీనియన్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు), మసాబ్‌ ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్‌ (నొయిడా), సాంఖ్యా ల్యాబ్స్‌ (బెంగళూరు), సెమ్‌ట్రానిక్స్‌ మైక్రో సిస్టమ్స్‌ (బెంగళూరు), సిబ్రిజ్‌ టెక్నాలజీస్‌ (అహ్మదాబాద్‌), స్మార్ట్‌ప్లే టెక్నాలజీస్‌ (బెంగళూరు), టర్మినస్‌ సర్క్యూట్స్‌ (బెంగళూరు), వాసవ్యా ల్యాబ్స్‌ (బెంగళూరు) అలయన్స్‌ సెమీ కండక్టర్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు), అనలాగ్‌ డివైజెస్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు), అర్కస్‌ టెక్నాలజీ ప్రయివేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు), అస్టర్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌ (న్యూదిల్లీ), ఆప్లియన్‌ నెట్‌వర్క్స్‌ (నొయిడా), యాక్సెస్‌ టెక్నాలజీస్‌ (ఇండియా) ప్రయివేట్‌ లిమిటెడ్‌ (బెంగళూరు), అడ్వాన్స్‌డ్‌ సినర్జిక్‌ మైక్రో సిస్టమ్స్‌ లిమిటెడ్‌ (బెంగళూరు) ... ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాలను పొందవచ్చు.

జీతభత్యాలు: పనిచేసే సంస్థ, పని అనుభవాన్ని బట్టి వేతనం ఉంటుంది. ప్రిన్సిపల్‌ ఇంజినీర్‌, టెస్ట్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌, ప్రాసెస్‌ ఇంజినీర్‌, స్టాఫ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, సీనియర్‌ ప్రాడెక్ట్‌ ఇంజినీర్‌.. ఇలా కేటగిరీలను బట్టి వేతనం లభిస్తుంది.

Back..

Posted on 05-11-2019