Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దివ్యాంగులకు చేయూతనిచ్చే కోర్సులు

వైకల్యం వ్యథను మిగిల్చినా.. సాటివారితో సమానంగా సమాజంలో సంపూర్ణ వ్యక్తులుగా జీవించేందుకు సాయపడే కొన్ని కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. వాటిలో చేరిన వారు దివ్యాంగులకు ఉపయోగపడే పరికరాల తయారీలో శిక్షణ పొందుతారు. మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడే వారు వేగంగా కోలుకోవడానికి చేయూతనిస్తారు. ఈ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ప్రకటన వెలువడింది.

భారతదేశంలో సుమారు 2.68 కోట్ల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారని ఒక అంచనా. ఏటా ప్రమాదాలబారిన పడుతూ అనేకమంది వికలాంగులవుతుంటే..మరికొంతమంది పుట్టుకతోనే దివ్యాంగులు. వీరంతా సమాజంలో ఇతర వ్యక్తుల్లా సౌకర్యంగా జీవించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎనిమిది డిజేబిలిటీ, రిహేబిలిటేషన్‌ కళాశాలలను ఏర్పాటుచేసింది. ఈ కళాశాలలు దివ్యాంగులకు అవసరమైన సహాయం అందించే మానవవనరులకు శిక్షణ ఇస్తున్నాయి. కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటార్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఎల్‌డీ), ఒడిశాలోని స్వామి వివేకానంద రిహేబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌ (ఎన్‌ఐఈపీఎండీ) మానవ కృత్రిమ శరీర భాగాలు, విరిగిన అవయవాలకు ఊతానిచ్చేలా పరికరాల తయారీలో శిక్షణ కోర్సులను నిర్వహిస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు, వైకల్యంతో బాధపడేవారికి సహాయంగా ఉంటూ వారు కోలుకునేలా చికిత్స అందించడం, ఫిజియోథెరపీ కోర్సులూ ఉన్నాయి. వీటికి సంబంధించి యూజీలో ప్రవేేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సెట్‌) -2019 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పరీక్షను ఎన్‌ఐఎల్‌డీ నిర్వహించనుంది.

కోర్సులు - అర్హత
బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (బీపీవో): ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ) లేదా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ (పీసీఎం) సబ్జెక్టులుగా 50శాతం మార్కులతో ఉత్తీర్ణత.
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) / బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ): ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్‌ సబ్జెక్టుగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ/ బోటనీ/ జువాలజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
* 1999 జనవరి 01 నుంచి 2002 డిసెంబరు 31 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలను రెండు భాగాలుగా మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. మొదటి భాగం జనరల్‌ ఎబిలిటీ, జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పది ప్రశ్నలు ఉంటాయి. వీటికి పది మార్కులు. రెండో భాగంలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ (జువాలజీ, (బోటనీ) లేదా మ్యాథమెటిక్స్‌కి సంబంధించి 90 ప్రశ్నలు, 90 మార్కులకు ఉంటాయి. ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షను విజయవాడ, సికింద్రాబాద్‌ కేంద్రాల్లో నిర్వహిస్తారు.

ఉద్యోగ అవకాశాలు
కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయి. అనేక ఆసుపత్రులు, రిహేబిలిటేషన్‌, ట్రామా సెంటర్లు, విద్యాసంస్థలు, క్రీడారంగం, వృద్ధాశ్రమాల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సొంతంగా ఫిజియోథెరపీ సెంటర్‌ను కూడా నిర్వహించుకోవచ్చు. అలాంటి వారికి బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు అందిస్తున్నాయి.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్
చివరితేది: మే 24
పరీక్ష తేది: జూన్‌ 09
వెబ్‌సైట్‌: http://www.niohkol.nic.in


Back..

Posted on 23-04-2019