Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
దూరవిద్యలో దగ్గరి దారులు

మార్కెట్‌ అవసరాలకు తగ్గ నైపుణ్యాలు ఉన్నవారికే ఏ రంగంలోనైనా ఉపాధికి హామీ లభిస్తుంది. అందుకే సమకాలీన ప్రపంచంలో నైపుణ్య ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం! దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) ఈ విషయంలో ముందంజలో ఉంది. 2018 జనవరి ప్రవేశాలకు ప్రకటన వెలువడిన సందర్భంగా ఇగ్నో, హైదరాబాద్‌ అందిస్తున్న నైపుణ్య కోర్సుల్లో ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుందాం!
సంప్రదాయ కోర్సులతో పాటు ఉద్యోగం, స్వయం ఉపాధి కల్పనలు ధ్యేయంగా ఇగ్నో సరికొత్త కోర్సులను అందిస్తోంది. దీనిలో భాగంగా .. దేశంలోని అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని శిక్షణను కూడా అందిస్తోంది. ఉన్నత విద్యను పొందాలనుకునే నిరుద్యోగులు, చిరుద్యోగులు, ఉద్యోగులు, గృహిణులు, ఖైదీలు, ట్రాన్స్‌జెండర్స్‌.. ఇలా ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా ఈ కోర్సుల్లో చేరవచ్చు. ఇగ్నో తమ డిగ్రీ కోర్సులక్కూడా నైపుణ్యాధారిత పేపర్లను జోడిస్తోంది. వీటి ద్వారా డిగ్రీ పూర్తయ్యేనాటికి విద్యార్థి వేరే అంశంలోనూ నిపుణుడై ఉండాలనేది ఉద్దేశం. విద్యార్థులు అదనపు నైపుణ్యాలను పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన జాతీయ నైపుణ్యాభివృద్ధి పథకం ఆధారంగా ఇగ్నో ఈ విధానాన్ని అవలంబిస్తోంది.
ఆరునెలలు... రెండేళ్ళు
నైపుణ్య ఆధారిత కోర్సులను ఆరు నెలల వ్యవధిగల స్వల్పకాలిక కోర్సులుగా చదవొచ్చు. గరిష్ఠంగా వీటిని రెండేళ్ల వ్యవధిలో పూర్తిచేయవచ్చు.
దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో నివాసముంటున్నా, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నవారికైనా ఇగ్నో విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశంలోని ఏ ప్రాంతంలో ప్రవేశం పొందినప్పటికీ ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది. అంతేకాకుండా విద్యార్థి తనకు నచ్చిన ప్రాంతంలో పరీక్ష రాసుకునే అవకాశాన్నీ ఇగ్నో కల్పిస్తోంది.
తెలుగులోనూ: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాలు సంయుక్తంగా ప్రోగ్రామ్‌లను తెలుగులోకి అనువదించి అందిస్తున్నాయిు. డిప్లొమా ఇన్‌ డెయిరీ టెక్నాలజీ, సర్టిఫికెట్‌ ఇన్‌ పౌల్ట్రీ ఫామింగ్‌, బ్యాచిలర్‌ ప్రిపరేటరీ పోగ్రాం వీటిల్లో ఉన్నాయి. ఇవేకాకుండా మరో 5-10 ప్రోగ్రామ్‌లను తెలుగులోకి అనువదించడానికి కసరత్తు ప్రారంభించారు.
చేరేది ఎలా?
2018 జనవరి సెషన్‌లో ప్రవేశం పొందాలనుకునేవారి నుంచి ఇగ్నో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. వీటిని ఆన్‌లైన్‌లో ‌ignou.ac.in వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. ఇందుకు యూజర్‌ ఐడీని క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
2018 జనవరి సెషన్‌ గడువు: 31.12.2017
వివరాలకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ఇగ్నో కార్యాలయాన్ని లేదా http://rehyderabad.ignou.nic.in ను సంప్రదించవచ్చు.
సర్టిఫికెట్‌ ఇన్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌
దీనికి ప్రత్యేక విద్యార్హతలంటూ ఏమీ లేవు. కోర్సు ఫీజు- రూ.1600. హాస్పిటళ్లలో క్లినికల్‌ డైటిక్ట్స్‌, న్యూట్రిషన్లుగా చేయవచ్చు. వివిధ సంస్థల్లో ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ మేనేజర్‌, ఫుడ్‌ ఆర్గనైజర్‌ వంటి ఉద్యోగాలనూ పొందవచ్చు. వీరికి శిశు సంక్షేమ కేంద్రాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి. స్వయం ఉపాధి అవకాశాలూ పెంపొందించుకోవచ్చు.
సర్టిఫికెట్‌ ఇన్‌ బిజినెస్‌ స్కిల్స్‌
10+2 లేదా తత్సమానం చదివినవారు అర్హులు. కోర్సు ఫీజు- రూ.3200. ఈ కోర్సు చేసినవారు అకౌంటెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, అడ్మినిస్ట్రేటర్‌, బ్యాంకింగ్‌, కమోడిటీస్‌ రంగాల్లోనూ, కంప్యూటర్‌ ఆపరేషన్స్‌, కన్సల్టెంట్‌, క్రెడిట్‌ అనలిస్ట్‌ మొదలైన ఉద్యోగాలను పొందవచ్చు.
సర్టిఫికెట్‌ ఇన్‌ ఫంక్షనల్‌ ఇంగ్లిష్‌
10+2తోపాటు కనీసం ఆరు సంవత్సరాలపాటు అకడమిక్‌లో ఇంగ్లిష్‌ను సబ్జెక్టుగా కలిగివుండాలి. కోర్సు ఫీజు- రూ.2000. జర్నలిజం, బుక్‌ పబ్లిషింగ్‌, టీచింగ్‌, స్క్రిప్ట్‌ రైటింగ్‌, ట్రాన్స్‌లేషన్‌, బోధన, అడ్వర్టైజింగ్‌, రిసెర్చ్‌ విభాగాల్లో వీరికి ఉపాధి లభిస్తుంది.
సర్టిఫికెట్‌ ఇన్‌ హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌
10+2 లేదా తత్సమానం; ఇగ్నో నుంచి బీపీపీ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన మెట్రిక్యులేషన్‌ అర్హత ఉండాలి. కోర్సు ఫీజు- రూ.2000. వీరికి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో హెల్త్‌ కౌన్సెలర్‌, హెచ్‌ఐవీ కౌన్సెలర్‌, మెంటల్‌ హెల్త్‌ కౌన్సెలర్లుగా అవకాశాలుంటాయి.
సర్టిఫికెట్‌ ఇన్‌ టూరిజం స్టడీస్‌
10+2/ తత్సమానం లేదా ఇగ్నో నుంచి బీపీపీ పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు ఫీజు- రూ.2000. పర్యటక రంగంలో ఆసక్తి ఉండి, దానిని కెరియర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ చేసినవారికి పర్యటకం, హోటల్‌ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఏర్‌లైన్స్‌, ట్రావెల్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థల్లోనూ వీరికి అవకాశాలుంటాయి.
సర్టిఫికెట్‌ ఇన్‌ న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌
10+2 లేదా తత్సమాన కోర్సుగానీ ఇగ్నోలో బీపీపీగానీ పూర్తిచేసినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ఫీజు- రూ.2000. శిశు సంక్షేమ కేంద్రాల్లో లేదా ప్లేస్కూల్స్‌, ప్రీప్రైమరీ పాఠశాలల్లో ఉద్యోగాలను పొందొచ్చు. సొంతంగానూ ప్రైమరీ, ప్లేస్కూళ్లను స్థాపించుకోవచ్చు.
దూరవిద్య అనేది కేవలం డిగ్రీల కోసం కాదు; ఆ చదువు వారికి ఉపాధి అవకాశాలను కల్పించడంతోపాటుగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకూ మార్గదర్శకంగా ఉండాలి. అందుకే నాణ్యమైన ఉన్నత విద్య ద్వారా ఉద్యోగం, స్వయం ఉపాధి అందించటమే ఇగ్నో లక్ష్యంగా పెట్టుకుంది. ఇగ్నో హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం దేశంలోనే మొదటి ప్రాంతీయ కేంద్రంగా 1989లో ఆరంభమైంది. ఇప్పటివరకూ ఈ కేంద్రం నుంచి 2.50 లక్షలమందికి ఉన్నతవిద్యను అందించాము.

- డా. ఎస్‌. ఫయాజ్‌ అహ్మద్‌, ఇగ్నో, ప్రాంతీయ సంచాలకులు

సర్టిఫికెట్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఇగ్నో నుంచి బీపీపీ లేదా మైక్రోసాఫ్ట్‌ నుంచి డీఎల్‌సీ పూర్తిచేసినవారు అర్హులు. కోర్సు ఫీజు- రూ.5000. ఈ పట్టా పొందినవారు ఐటీ కన్సల్టెంట్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌, కంప్యూటర్‌ ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటర్‌, ఐటీ స్పెషలిస్ట్‌, మొబైల్‌ అప్లికేషన్‌ డెవలపర్‌, వెబ్‌ డెవలపర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మొదలైన ఉద్యోగాలకు ప్రయత్నించుకోవచ్చు.
సర్టిఫికెట్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌
దీనికి బ్యాచిలర్‌ డిగ్రీ చదివినవారు అర్హులు. కోర్సు ఫీజు- రూ.2000. ప్రభుత్వ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఎన్‌జీఓల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ప్రభుత్వ విభాగంలో రూరల్‌ మేనేజర్‌, విలేజ్‌ డెవలపింగ్‌ ఆఫీసర్‌ అవకాశాలుంటాయి. సొంతంగా ఎన్‌జీవోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. రూరల్‌ కోఆపరేటివ్‌, అగ్రి బిజినెస్‌, అగ్రి మార్కెటింగ్‌ రంగాల్లోనూ ఉపాధి లభిస్తుంది.
ఉపాధికి ఉపకరించేలా...
విద్యాసంస్థలకు వెళ్ళి చదువుకోలేని వారికోసం రూపొందించిన దూరవిద్య ఇప్పుడు తన పరిధిని బాగా విస్తృతం చేసుకుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. భిన్న నేపథ్యాలున్న విద్యార్థులకు ప్రయోజనం కల్పించే వైవిధ్యభరిత కోర్సులు ఈ విద్యావిధానంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా ఉపాధి కల్పనకు ఉపకరించే కోర్సులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.


Back..

Posted on 28-12-2017