Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఈ-ఆటలు ఆడుకో.. ఉద్యోగం అందుకో!

* కెరియర్‌ గైడెన్స్‌ ఈ-స్పోర్ట్స్‌

‘మొబైల్‌లో లేదా కంప్యూటర్‌లో కాసేపు ఆడుకుంటాం..’ అనగానే కళ్లెర్రజేసి ‘చదువుకో పో..’ అని పేరెంట్స్‌ కోపగించుకునే కాలం చెల్లుతోంది. ఆడినంత ఆడుకో.. ఉద్యోగం తెచ్చుకోమంటూ దగ్గరుండి ఆడించే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ-స్పోర్ట్స్‌ మంచి కెరియర్‌గా ఎదుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిస్తోంది. ఇందుకోసం ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లో రకరకాల కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని పూర్తిచేసి నైపుణ్యాలను పెంచుకుంటే కొలువులు సాధించుకోవచ్చు.

పబ్జీ, ఫోర్ట్‌నైట్‌, రమ్మీ, డోటా, ఫిపా, స్టార్‌ క్రాఫ్ట్‌కంబాట్స్‌, కౌంటర్‌ స్ట్రయిక్‌-గ్లోబల్‌ అఫెన్సివ్‌, అపెక్స్‌ లెజెండ్స్‌.. ఆన్‌లైన్‌లో ఆటలు ఆడేవారికి చాలా సుపరిచితమైన పేర్లు. ప్రయాణాల్లో, ఖాళీ సమయాల్లో మొబైల్‌ పట్టుకుని యుద్ధభూమిలోకి దూకినంత సీరియస్‌గా చాలామంది గేమ్‌లు ఆడేస్తుంటారు. మల్టీప్లేయర్‌ విధానమూ వీటిల్లో కనిపిస్తుంది. ఒకరికొకరు సాయపడుతూ, గ్రూపులుగా ఏర్పడుతూ అవతలివారిని ఓడించడం వంటివి చేస్తుంటారు. గెలిచినవారికి పాయింట్లు, రివార్డులు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగా ఆడుకునే సౌకర్యం. అందుకే ఆన్‌లైన్‌ గేమింగ్‌పై అందరికీ ఆసక్తి పెరుగుతోంది. పోటీలు నిర్వహించే స్థాయికి చేరింది. ఈ రంగాన్ని ఇప్పుడు ఈ-స్పోర్ట్స్‌/ ప్రొఫెషనల్‌ గేమింగ్‌గా పిలుస్తున్నారు.

తేడా ఉంది!
ఈ-స్పోర్ట్స్‌ అంటే గేమింగ్‌ అనే భావన ఉంది. కానీ రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. గేమింగ్‌ ఆహ్లాదం కోసం ఉపయోగించే సాధారణ ప్రక్రియ. ఈ-స్పోర్ట్స్‌కు కొన్ని నైపుణ్యాలు, శిక్షణ అవసరమవుతాయి. దీన్ని ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌గా పరిగణిస్తున్నారు. ఆడేవారికి జీతభత్యాలు, నగదు బహుమతులూ ఉంటాయి. ఈ-స్పోర్ట్స్‌ను వినోదంగానే భావించినప్పటికీ దీనిలో నిపుణులుగా మారడానికి ఆటగాళ్లు ఎంతో శ్రమ, అంకితభావం ప్రదర్శించాల్సి ఉంటుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి గంటల వ్యవధిని వెచ్చించాలి. ఏషియన్‌ గేమ్స్‌ వంటి అంతర్జాతీయ స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌లో వీటికి గుర్తింపు వచ్చింది. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లోనూ చోటివ్వాలనే ప్రతిపాదన ఉంది. 2024 ఒలింపిక్స్‌లో వీటిని చూడబోయే అవకాశం ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మనదేశంలో..!
ఈ-స్పోర్ట్స్‌ రంగం అవతరించి దశాబ్ద కాలమైంది. గత రెండు, మూడేళ్ల నుంచి మనదేశంలో దీనికి ఆదరణ పెరిగింది. డెవలపర్లతోపాటు ఇన్వెస్టర్లూ ఆసక్తి చూపుతున్నారు. ఈ పరిశ్రమకు సంబంధించి ప్రపంచంలో అయిదో స్థానంలో భారత్‌ ఉంది. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం 2010లో 25 సంస్థలు ఉండేవి. ఇప్పుడు 250కుపైగా గేమ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. మన గేమ్స్‌ మార్కెట్‌ విలువ 2020కి 1.1 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. పేటీఎం, అలీబాబా, టెన్సెంట్‌, నజారా వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు పెట్టుబడులు పెడుతున్నాయి. స్పాన్సర్‌షిప్‌లతో ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. మార్కెట్‌ సర్వే ప్రకారం గేమింగ్‌ మార్కెట్‌ ఏటా రెట్టింపు అవుతోంది.

ఎలా ప్రవేశించవచ్చు?
* మనదేశంలో ఈ-స్పోర్ట్స్‌కు సంబంధించి డిగ్రీలు లేవు. విదేశాల్లో.. ముఖ్యంగా యూకే, యూఎస్‌ల్లో కొన్ని కళాశాలలు ప్రొఫెషనల్‌ డిగ్రీలను అందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ స్టాఫర్డ్‌షైర్‌ (యూకే); బెకర్‌ కాలేజ్‌ ఇన్‌ మసాచ్యుసెట్స్‌ (యూఎస్‌) ఈ-స్పోర్ట్స్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి.
* ఆన్‌లైన్‌లో ఈ-స్పోర్ట్స్‌ అథ్లెట్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఉడెమి అందిస్తోంది. వీటి కాలవ్యవధి గంటల్లో ఉంటుంది. సాధారణంగా 3 నుంచి 5 గంటల వ్యవధితో కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఈ-స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును కోర్స్‌ఎరా అందిస్తోంది. కాలవ్యవధి రెండు నెలలు.

కోర్సులు అందిస్తున్న కొన్ని సంస్థలు
* జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ యూనివర్సిటీతో ఎంఓయూ చేసుకున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు
* ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గేమింగ్‌ అండ్‌ యానిమేషన్‌, బెంగళూరు
* ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నొవేషన్‌, హైదరాబాద్‌, పుణె, దిల్లీ, ముంబయి
* డీఎస్‌కే సుప్‌ఇన్ఫోకామ్‌
* సీమ్‌లెస్‌ ఎడ్యుకేషన్‌ అకాడమీ
* భారతీయ విద్యాపీఠ్‌ యూనివర్సిటీ, పుణె
* మాయా అకాడమీ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ సినిమాటిక్‌, ముంబయి
* ఎరీనా యానిమేషన్స్‌, న్యూదిల్లీ
* జీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌, బెంగళూరు
* ఐపిక్సియో యానిమేషన్‌ కాలేజీ, బెంగళూరు
* అకాడమీ ఆఫ్‌ యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌, నోయిడా

గేమ్‌ డిజైనింగ్‌, డెవలప్‌మెంట్‌లపై ఆసక్తి ఉంటే?
సర్టిఫికెట్‌ స్థాయి: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ గేమింగ్‌, సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ గేమ్‌ ఆర్ట్స్‌, డిజైన్‌ కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి ఆరు నెలలు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పూర్తిచేసినవారు అర్హులు.
డిప్లొమా: డిప్లొమా ఇన్‌ గేమ్‌ డిజైన్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌, ప్రొఫెషనల్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ ఆర్ట్‌, డిప్లొమా ఇన్‌ యానిమేషన్‌, గేమింగ్‌ అండ్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ ఆర్ట్స్‌ అండ్‌ 3డి గేమ్‌ కంటెంట్‌ క్రియేషన్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ ప్రోగ్రామింగ్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా ఇన్‌ గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అప్లికేషన్‌ మొదలైన కోర్సులున్నాయి. కాలవ్యవధి ఏడాది. డిప్లొమాలకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు. అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాలను డిప్లొమా పూర్తిచేసినవారు చేయవచ్ఛు
డిగ్రీ: బీఎస్‌సీ, బీఎఫ్‌ఏ, బి.డిజైన్‌ (గేమ్‌ డిజైనింగ్‌), బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ గేమ్‌ డెవలప్‌మెంట్‌) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.
పీజీ: ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్‌సీ (మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌ విత్‌ గేమ్‌ ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌) ఎంఎస్‌సీ (గేమింగ్‌; గేమ్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌; మల్టీమీడియా అండ్‌ యానిమేషన్‌), ఎం.డిజైన్‌ (డిజిటల్‌ గేమ్‌ డిజైన్‌) కోర్సులు ఉన్నాయి. కాలవ్యవధి రెండేళ్లు. టెక్నికల్‌ విభాగంలో డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.
వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు సాధారణంగా ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య విడుదలవుతాయి. డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌లు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. చాలావరకూ సంస్థలు ప్రవేశపరీక్షలను నిర్వహించి తీసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ప్రవేశపరీక్షలతోపాటు గ్రూప్‌ డిస్కషన్‌, వ్యక్తిగత ఇంటర్వ్యూలతో అడ్మిషన్లు ఇస్తున్నాయి. చాలా తక్కువ సంస్థలు మాత్రం మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ఉద్యోగావకాశాలు
ఆన్‌లైన్‌ గేమింగ్‌ అయినప్పటికీ.. సాఫ్ట్‌వేర్‌తోపాటు ఇతర విభాగాల వారికీ అవకాశాలున్నాయి.
గేమ్‌ డిజైన్‌/ యానిమేటర్‌: యూజర్‌ అనుభవానికి తగినట్లుగా గేమ్‌ను నిర్మించడం, నిర్వహించటం వీరి బాధ్యతలు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు యానిమేషన్‌, గేమింగ్‌లపై పరిజ్ఞానం ఉండాలి.
మోషన్‌ కాప్చర్‌ ఆర్టిస్ట్‌: వీరు యానిమేషన్‌ టీమ్‌తో కలిసి పనిచేస్తారు. గేమ్స్‌లో డేటా ప్రాసెసింగ్‌ చేస్తారు. యానిమేషన్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ అర్హతతోపాటు స్క్రిప్టింగ్‌ తెలిసి ఉండాలి.
సోషల్‌ మీడియా అసోసియేట్‌/ మేనేజర్‌: అన్ని సోషల్‌ మీడియా విభాగాలకు కంటెంట్‌ను రూపొందించాల్సి ఉంటుంది.
ఈవెంట్‌/ ప్రొడక్ట్‌ మేనేజర్‌: గేమింగ్‌ సంబంధిత ఈవెంట్లు, పోటీలు నిర్వహిస్తారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌/ ప్రొడక్షన్‌ సంబంధిత విద్యార్హతలున్నవారు అర్హులు. అనుభవం ఉన్నవారికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
బూత్‌ ప్లానర్‌/ విజువలైజేషన్‌ ఆర్టిస్ట్‌: ఈవెంట్లకు 2డి, 3డిల్లో బూత్‌లను, స్టేజ్‌లను ప్లాన్‌ చేస్తుంటారు. కాడ్‌, అడోబ్‌ ఫొటోషాప్‌, 4డి నైపుణ్యాలు ఉండాలి.
గేమ్‌ టెస్టర్‌/ క్యూఏ టెస్టర్‌: గేమ్‌, డాక్యుమెంట్లకు సంబంధించిన బగ్‌లపై పని చేయడం వీరి విధి. క్యూఏ టెస్టింగ్‌ అనుభవం ఉన్నవారికి ఆదరణ ఉంటుంది.
టీమ్‌ అనలిస్ట్‌: ఆటగాళ్ల బృందాన్ని, సోషల్‌ మీడియాను నిర్వహించటం, అడ్మినిస్ట్రేషన్‌ టాస్క్‌లు వీరి పనిలో భాగం. మేనేజ్‌మెంట్‌ డిగ్రీతోపాటు గేమింగ్‌ అనుభవం ఉంటే మంచిది.
ఇవేకాకుండా వీడియో గేమింగ్‌ కంపోజర్‌, వేర్‌హౌజ్‌ మేనేజర్‌, మార్కెటింగ్‌ మొదలైన కెరియర్లకూ ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయి.

Back..

Posted on 12-02-2020