Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆర్థికశాస్త్రంలో అవకాశాలు అపారం

బతుకుబండి ముందుకు కదలడానికైనా.. సెన్సెక్స్‌ దూసుకు పోవడానికైనా ఆర్థికాంశాలే కీలకం. ఉత్పత్తి, సరఫరా, వినియోగం, మిగులు, కొరత, షేర్‌ మార్కెట్‌ ... అన్నీ అర్థశాస్త్రం పరిధిలోనివే. మానవ మనుగడకు దిశానిర్దేశం చేసే శక్తి దీనికుంది. అభివృద్ధిని నిర్వచించడానికీ, దారిద్య్రాన్ని అంచనా వేయడానికీ ఎకనామిక్స్‌ ప్రామాణికమైంది. ఎన్నో రంగాలు, విభాగాలు దీనితో ముడిపడి ఉండడంతో ఈ సబ్జెక్టుపై గట్టి పట్టున్నవారికి డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, కన్సల్టెన్సీలు, బోధన రంగం- అన్నిచోట్లా వీరికి అవకాశాలు అందుతున్నాయి. ఐఐటీలతో సహా, పేరొందిన సంస్థలెన్నో ఎకనామిక్స్‌ కోర్సులు అందిస్తున్నాయి.

ఎకనామిక్స్‌ను ఆర్ట్స్‌ కోర్సుల్లో అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సబ్జెక్టు హైస్కూల్‌ సోషల్‌ పుస్తకాల్లో పరిచయం అవుతుంది. అయితే ఇంటర్మీడియట్‌ నుంచి దీన్ని ప్రత్యేకంగా చదువుకునే అవకాశం ఉంది. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ కాంబినేషన్‌ మనకు తెలిసిందే.
* మ్యాథ్స్‌పై పట్టుంటే ఇంటర్‌లో మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌లను ఎంచుకోవచ్చు.
* యూజీ స్థాయిలో మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్‌; మ్యాథ్స్, ఎకనామిక్స్, కంప్యూటర్‌ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌.. ఇలా ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లున్నాయి.
* కొన్ని సంస్థలు ఆనర్స్‌ విధానంలో బీఎస్‌ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి.
* మేటి సంస్థల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎకనామిక్స్‌ పీజీ కోర్సులున్నాయి.
యూజీ పూర్తయిన తర్వాత పీజీ ఎకనామిక్స్‌లో ఎంచుకోవడానికి ఎన్నో స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. ఇంటర్నేషనల్, క్వాంటిటేటివ్, అగ్రికల్చరల్, ఫైనాన్షియల్, లేబర్, ఇండస్ట్రియల్, మ్యాథమేటికల్, బిజినెస్, బ్యాంకింగ్, ఎన్విరాన్‌మెంటల్, డెవలప్‌మెంటల్, హెల్త్, రూరల్, అనలిటికల్, ట్రాన్స్‌పోర్ట్‌ ఎకనామిక్స్‌...ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దదవుతుంది.

పట్టు సాధించాలంటే...
* విస్తృతంగా చదవాలి. లోతైన అధ్యయనం అవసరం.
* గణితంలో ప్రావీణ్యం పెంచుకోవాలి. కాలిక్యులస్, ఆల్జీబ్రాలపై పట్టుంటే భవిష్యత్తులో ఎంతో ఉపయోగం.
* ఎకనామిక్స్, లాజికల్‌ థింకింగ్, రీజనింగ్‌ అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.
ఎకనామిక్స్‌ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఇందులో భవిష్యత్తును ఆశించేవారు యూజీలో ఎకనామిక్స్, మ్యాథ్స్‌లతో కలిసి స్టాటిస్టిక్స్‌ లేదా కంప్యూటర్‌ సైన్స్‌ కాంబినేషన్‌లో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

ఏ కోర్సులు.. ఎక్కడ?
* కొన్ని ఐఐటీలు ఎకనామిక్స్‌ కోర్సును యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో బోధిస్తున్నాయి. నాలుగేళ్ల బీఎస్‌ - ఎకనామిక్స్‌ కోర్సు కాన్పూర్‌లో, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు ఖరగ్‌పూర్‌లో ఉన్నాయి. ఈ రెండింటిలో ప్రవేశం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా లభిస్తుంది. ఐఐటీ రూర్కీ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తోంది. ఐఐటీలు నిర్వహించే జామ్‌తో ప్రవేశం లభిస్తుంది. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ కోర్సులు కాన్పూర్, ఖరగ్‌పూర్, మండి, పాట్నా, గాంధీనగర్, ఇండోర్‌ ఐఐటీల్లో అందుబాటులో ఉన్నాయి.
* బెంగళూరు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (బేస్‌) అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ (ఆనర్స్‌), మూడేళ్ల బీఎస్సీ ఎకనామిక్స్‌ (ఆనర్స్‌) కోర్సులు అందిస్తోంది. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నమూనాలో దీన్ని నెలకొల్పారు. ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదువుకున్నవారు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎకనామిక్స్‌ను తమిళనాడు, కర్ణాటక సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎకనామిక్స్‌ను రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అందిస్తున్నాయి. తమిళనాడు, రాజస్థాన్, కాశ్మీర్, హరియాణ, జమ్మూ, కేరళ, పంజాబ్, కర్ణాటక, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ బీఎడ్‌ ఎకనామిక్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సు అందిస్తోంది. వీటన్నింటిలోకీ సీయూ సెట్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది.
* హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎంఏ ఎకనామిక్స్, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌ కోర్సులను విడిగా అందిస్తోంది. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సు కూడా ఈ సంస్థలో ఉంది. హెచ్‌సీయూ నిర్వహించే పరీక్ష ద్వారా ప్రవేశం లభిస్తుంది.
* మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (ఎంఎస్‌ఈ), చెన్నై అప్లైడ్‌ క్వాంటిటేటివ్‌ ఫైనాన్స్, యాక్చూరియల్‌ ఎకనామిక్స్, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్, జనరల్‌ ఎకనామిక్స్, ఎన్వైరాన్‌మెంటల్‌ ఎకనామిక్స్‌ అంశాల్లో పీజీ కోర్సులు అందిస్తోంది. ఈ సంస్థలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎకనామిక్స్‌ కోర్సు కూడా ఉంది.
మరికొన్ని: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్, ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ, గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ రిసెర్చ్‌ (ఐజీడీఆర్‌), సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ (సీడీఎస్‌).. తదితర సంస్థలు ఎకనామిక్స్‌ కోర్సులు అందించడంలో జాతీయ స్థాయిలో పేరొందాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల్లోనూ ఎకనామిక్స్‌ పీజీ కోర్సులు ఉన్నాయి.

క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌
ఎకనామిక్స్‌లో ప్రత్యేకతను సంతరించుకున్న అంశం క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌. అందువల్ల చాలా సంస్థలు ప్రత్యేకంగా ఎమ్మెస్సీ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ పేరుతో కోర్సు నిర్వహిస్తున్నాయి. ఈ కోర్సు చదివినవారిని కార్పొరేట్‌ ఉద్యోగాలు వరిస్తున్నాయి. ఎమ్మెస్సీ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ అందించడంలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) కోల్‌కతా, దిల్లీలను పేరున్న సంస్థలుగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.8000 చొప్పున స్ట్టైపెండ్‌ అందుతుంది. అర్థశాస్త్రానికి సంబంధించి వర్తమాన పరిస్థితులు, పరిష్కారాలు, ప్రత్యామ్నాయాల మేళవింపే క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌గా చెప్పుకోవచ్చు. వివిధ సంఘటనలను ఆర్థిక కోణంలో విశ్లేషించగలగడం, భవిష్యత్తుని ఊహించడం ఈ రెండూ క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌తో సాధ్యమవుతాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, సైంటిఫిక్‌ రిసెర్చ్, ఆడిటింగ్, కన్సల్టింగ్‌ సంస్థల్లో వీరికి ఉద్యోగాలు లభిస్తాయి. ఐఎస్‌ఐ విద్యార్థులు క్యాంపస్‌ నియామకాల ద్వారా సగటున ఏడాదికి రూ.15 లక్షలకు పైగా వేతనంతో పేరున్న బహుళజాతి సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌
కొన్ని బీ-స్కూల్స్‌ మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ (ఎంబీఈ) పేరుతో కోర్సు అందిస్తున్నాయి. ఉత్పత్తి, శ్రామికులు, క్యాపిటల్‌ మార్కెట్‌ అంశాలు ప్రధానంగా జోడించి ఈ కోర్సు అందిస్తున్నారు. ఎకనామిక్స్, కామర్స్, ట్రేడింగ్, ట్యాక్స్‌ స్ట్రాటజీ, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మొదలైనవి కోర్సులో ఉంటాయి. వీరికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్, ఫైనాన్షియల్‌ మేనేజర్‌..హోదాలతో ఉద్యోగాలు లభిస్తాయి. దిల్లీ యూనివర్సిటీ, లఖ్‌నవూ యూనివర్సిటీ, ఐఐఎం అహ్మదాబాద్, కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మొదలైన చోట్ల ఈ కోర్సును అందిస్తున్నారు.

మేటి సంస్థల్లో ఉద్యోగాలు
సబ్జెక్టుపై విస్తృత పరిజ్ఞానం, ఆంగ్ల భాషపై పట్టు ఉన్న ఎకనామిక్స్‌ గ్రాడ్యుయేట్లు బహుళజాతి సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. పరిశోధకులు, విశ్లేషకులు, ఆర్థిక సలహాదారు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్, వెంచర్‌ క్యాపిటలిస్ట్, ఆడిటర్, స్టాక్‌ బ్రోకర్, మీడియా విశ్లేషకులు, బిజినెస్‌ జర్నలిస్ట్‌ తదితర హోదాలతో రాణిస్తున్నారు.
* బోధన రంగంలో రాణించాలని భావిస్తే బీఏ ఎకనామిక్స్‌ తర్వాత బీఎడ్‌ పూర్తిచేసి స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ పోస్టులకు పోటీ పడవచ్చు.
* ఎంఏ ఎకనామిక్స్‌ అర్హతతో జూనియర్‌ కళాశాలల్లో లెక్చరర్‌గా స్థిరపడొచ్చు.
* నెట్‌ అర్హతతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ఎకనామిక్స్‌ పోస్టులకు పోటీ పడొచ్చు.
* బీ స్కూళ్లు, ఎంబీఏ కళాశాలల్లోనూ ఎకనామిక్స్‌ పోస్టు గ్రాడ్యుయేట్లకు అవకాశాలుంటాయి.
* ఈ సబ్జెక్టులో డాక్టరేట్‌ పొందినవారు బోధ]న, పరిశోధన సంస్థల్లో, కన్సల్టెన్సీల్లో రాణించవచ్చు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్థిక రంగంలో పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఇంజినీరింగ్‌ కంపెనీలు, బీమా సంస్థలు, తయారీ సంస్థలు, ప్రకటన సంస్థలు, మీడియా, రిటైల్‌ ... ఇలా భిన్న రంగాలకు చెందిన సంస్థల్లోని వివిధ విభాగాల్లో అర్థశాస్త్ర నిపుణులు అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
యూపీఎస్సీ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ఏటా ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (ఐఈఎస్‌) పరీక్షను నిర్వహిస్తోంది. ఎకనామిక్స్, అప్లయిడ్‌ ఎకనామిక్స్, బిజినెస్‌ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్‌ వీటిలో ఎందులోనైనా పీజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఈ సర్వీస్‌ ద్వారా ఎంపికైనవారు గ్రూప్‌- ఎ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తారు. వీరు ఎకనామిక్స్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ, జాతీయ శాంపిల్‌ సర్వే, ప్రణాళిక విభాగాల్లో సేవలు అందించవచ్చు. అలాగే ఆర్‌బీఐలో గ్రేడ్‌- బి ఉద్యోగాల్లో కొన్నింటికి ఎకనామిక్స్‌లో పీజీ చదివినవారే అర్హులు. ఇందుకు సంబంధించిన ప్రకటనలు తరచూ వెలువడుతున్నాయి.

Back..

Posted on 08-09-2020