Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
నచ్చిన కోర్సు నిశ్చింతగా!

* స్టడీస్‌ విత్‌ స్టైపెండ్‌

పేనచ్చిన కోర్సు.. మెచ్చిన సంస్థ. చేరాలంటే అవసరమైన మార్కులు, ర్యాంకులు తెచ్చుకోగలిన తెలివితేటలు ఉన్నప్పటికీ అడుగడుగునా ఆర్థిక ఇబ్బందులు. వాటిని దాటి ముందుకెళ్లలేక అసహాయ స్థితిలో అస్త్ర సన్యాసం చేసేస్తున్న ఎందరో ప్రతిభావంతులు. వీరి కోసం కొన్ని సంస్థలు స్టైపెండ్‌ రూపంలో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. నెల నెలా ఖాతాలోకి సొమ్ము వచ్చేస్తుంది. యూజీ, పీజీ, పీహెచ్‌డీ.. ఏ కోర్సయినా నిశ్చింతగా చదువుకోవచ్చు.

పేరున్న సంస్థలో కోరుకున్న కోర్సులో సీటు రావాలంటే ఎంతో కష్టపడాలి. తీవ్రంగా శ్రమించి సీటు పొందినా ఫీజు భారం గుదిబండ అవుతుంది. ఇలా ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు మంచి చదువులకు దూరం కాకుండా భిన్న కోర్సుల్లో వివిధ సంస్థలు స్టయిపెండ్‌ చెల్లించి మరీ చదివిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌...ఇలా అన్ని కోర్సుల్లోనూ ఇలాంటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి.

విద్యాసంస్థలు
ఐఎస్‌ఐ
మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులు చదవాలనుకునేవాళ్లకు దేశంలో ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) మంచి వేదిక. దీనికి కోల్‌కతా, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్‌, తేజ్‌పూర్‌ల్లో శాఖలు ఉన్నాయి. ఈ సంస్థల్లో యూజీ, పీజీ కోర్సులు అందిస్తున్నారు.
ఈ సంస్థలో బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.3000 చొప్పున మూడేళ్లపాటు స్టైపెండ్‌ చెల్లిస్తారు. స్టాటిస్టిక్స్‌ కోర్సు కోల్‌కతా, మ్యాథ్స్‌ బెంగళూరు క్యాంపసుల్లో అందిస్తున్నారు.
రెండేళ్ల మాస్టర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ మ్యాథమాటిక్స్‌ కోర్సులో ప్రవేశం పొందినవాళ్లు నెలకు రూ.5000 చొప్పున స్ట్టైపెండ్‌ అందుకోవచ్చు. స్టాటిస్టిక్స్‌ కోర్సు దిల్లీ, చెన్నై; మ్యాథ్స్‌ కోల్‌కతాలో అందిస్తున్నారు.
క్వాంటిటేటివ్‌ ఎకనామిక్స్‌ పీజీ కోర్సు కోల్‌కతా, దిల్లీల్లో అందిస్తున్నారు. చేరినవారికి నెలకు రూ.5000 చొప్పున స్ట్టైపెండ్‌ అందుతుంది.
లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ రెండేళ్ల కోర్సు బెంగళూరు క్యాంపస్‌లో బోధిస్తున్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.5000 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.
పీజీలో క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సైన్స్‌ కోర్సు బెంగళూరు, హైదరాబాదుల్లో అందుబాటులో ఉంది. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు నెలకు రూ.5000 చొప్పున రెండేళ్లపాటు స్ట్టైపెండ్‌ అందుతుంది.
ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌, క్రిప్టాలజీ అండ్‌ సెక్యూరిటీ; క్వాలిటీ, రిలయబిలిటీ అండ్‌ ఆపరేషన్స్‌ కోర్సులను కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. వీటిలో చేరినవారికి నెలకు రూ.8000 చొప్పున స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు.
పై కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు 2019 ఫిబ్రవరి 5 నుంచి మార్చి 12 వరకు స్వీకరిస్తారు. పరీక్ష మే 12న నిర్వహిస్తారు.

ఇఫ్లూ
ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) లో యూజీ, పీజీ కోర్సుల్లో చేరిన ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున స్టైపెండ్‌ అందిస్తున్నారు. అలాగే వీరు హాస్టల్లో ఉండడానికి వసతి నిమిత్తం ఫీజు చెల్లించనవసరంలేదు. ఏడాదికి రూ.వెయ్యి చొప్పున బుక్‌ అలవెన్స్‌ కూడా చెల్లిస్తారు.

ఐఐటీ గాంధీనగర్‌
ఎంఏ సొసైటీ అండ్‌ కల్చర్‌, ఎమ్మెస్సీ కాగ్నెటివ్‌ సైన్స్‌ కోర్సులను ఐఐటీ గాంధీనగర్‌ అందిస్తోంది. ఒక్కో కోర్సులో 15 చొప్పున సీట్లు ఉన్నాయి. ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఖరి సంవత్సరం విద్యార్థులూ అర్హులే. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. డిసెంబరులో ప్రకటన వెలువడుతుంది. ఈ కోర్సుల్లో చేరిన అర్హులకు నెలకు రూ.5000 చొప్పున చెల్లిస్తారు.

ఎన్‌బీహెచ్‌ఎం
మ్యాథ్స్‌లో పీజీ చేస్తున్న వారికి నేషనల్‌ బోర్డ్‌ ఫర్‌ హయ్యర్‌ మ్యాథమేటిక్స్‌ (ఎన్‌బీహెచ్‌ఎం) స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. ఇందుకోసం ఏటా పరీక్ష నిర్వహిస్తోంది. ఎంపికైనవారికి నెలకు రూ.6000 చొప్పున రెండేళ్ల పాటు అందిస్తున్నారు.

సీఎంఐ
గణితంలో మేటి చదువులకు చెన్నై మ్యాథమేటికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఐ) ప్రసిద్ధ సంస్థ. ఇక్కడ బీఎస్సీ (ఆనర్స్‌) మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; బీఎస్సీ (ఆనర్స్‌) మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ కోర్సులు ఉన్నాయి. ట్యూషన్‌ ఫీజు ఒక్కో సెమిస్టరుకు రూ.లక్ష. అయితే వీటిలో చేరిన విద్యార్థులు దీన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే కొంతమందికి నెలకు రూ.5000 చొప్పున కూడా చెల్లిస్తారు. ఈ సంస్థ ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను రెసిడెన్షియల్‌ విధానంలో అందిస్తోంది.
ఒక్కో సెమిస్టర్‌కు ట్యూషన్‌ ఫీజు రూ. లక్ష. వీటికి ఎంపికైనవాళ్లు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. అలాగే కొంతమందికి నెలకు రూ.6000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఏప్రిల్‌లో ప్రకటన వెలువడుతుంది. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ సంస్థలో ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కోర్సు సైతం అందిస్తున్నారు. సెమిస్టర్‌కి రూ.2 లక్షలు ఫీజు చెల్లించాలి. ఈ కోర్సులో చేరిన కొంత మంది విద్యార్థులకు ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది.

టీఐఎఫ్‌ఆర్‌...
గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ అడ్మిషన్స్‌ (జీఎస్‌) పేరుతో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌) వివిధ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తోంది. ప్రవేశాలు టీఐఎఫ్‌ఆర్‌తో పాటు దేశవ్యాప్తంగా పేరొందిన పలు పరిశోధన సంస్థల్లో ఉంటాయి. గ్రాడ్యుయేట్లు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో చేరవచ్చు. పీజీ పూర్తిచేసినవారికి పీహెచ్‌డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది రూ.16,000 ప్రతి నెలా స్టైపెండ్‌ చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.25,000; మూడో ఏట నుంచి రూ.28,000 చొప్పున అందుతాయి. వ్యవధి ఆరేళ్లు. ప్రస్తుతం వీటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. నవంబరు 12లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 9న పరీక్ష నిర్వహిస్తారు.

ఐఐఎస్‌ఈఆర్‌
మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సుల్లో నాణ్యమైన బోధన, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, వసతి సౌకర్యాలు అందించి విద్యార్థులను పరిశోధనల దిశగా నడిపించడానికి ఏర్పాటుచేసినవే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు. ఇవి దేశవ్యాప్తంగా ఏడు ఉన్నాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు. తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలో వీటిని ఏర్పాటు చేశారు.
బీఎస్‌-ఎంఎస్‌ పేరుతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. వీటిలో మూడు మార్గాల ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు సాధించినవాళ్లు, ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌కు ఎంపికైనవారు వీటికి నేరుగా పరీక్ష రాయకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రెండూ లేనివాళ్లు పరీక్ష రాసి ప్రవేశం పొందవచ్చు. సగం సీట్లు జేఈఈ ర్యాంకులు, ఇన్‌స్పైర్‌తో భర్తీ చేస్తారు. మిగిలిన అర్ధభాగం సీట్లు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నింపుతారు. ఏడు సంస్థల్లోనూ కలిపి 1300 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సంస్థల్లో చేరిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రతినెలా రూ.అయిదు వేలు అందిస్తారు.
బీఎస్‌ - ఎంఎస్‌ కోర్సులు: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌.

ఈ స్కాలర్‌షిప్పులు/ స్టైపెండ్‌/ ఫెలోషిప్పులను ఆ కోర్సు వ్యవధికి చెల్లిస్తారు. అయితే ముందు సెమిస్టరు లేదా వార్షిక పరీక్షల్లో చూపిన ప్రతిభ ద్వారా తర్వాత ఏడాదికి వాటిని కొనసాగిస్తారు. ప్రతిభ కనబర్చనివారికి ఆ సెమిస్టరు లేదా ఏడాదికి ప్రోత్సాహకాలు రద్దవుతాయి. అలాగే నిర్ణీత హాజరుశాతం, క్షమశిక్షణ తప్పనిసరి.

కోర్సులు
ప్రత్యేక అవసరాలకు...
మైసూరులోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, స్పెషల్‌ బీఎడ్‌, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులను అందిస్తోంది. ఇవన్నీ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి) కోర్సులే. వీటిలో చేరినవారికి ప్రతినెలా స్టైపెండ్‌ అందిస్తున్నారు. డిప్లామాకు రూ.250, డిగ్రీకి రూ.800, స్పెషల్‌ బీఎడ్‌ రూ.400, స్పెషల్‌ ఎంఎడ్‌ రూ.650, పీజీ డిప్లొమా రూ.500, పీజీ రూ.1300 చొప్పున ప్రతినెలా అందిస్తారు. కోర్సుల్లో ప్రవేశానికి మేలో ప్రకటన వెలువడుతుంది. రాతపరీక్ష ద్వారా ప్రవేశాలుంటాయి.

హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌ టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సు అందిస్తోంది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపికచేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు 47 సీట్లు కేటాయించారు. కోర్సులో చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది రూ.1,000, రెండో సంవత్సరం రూ. 1,100, మూడో ఏట రూ. 1,200 ఉపకార వేతనంగా అందిస్తారు. కోర్సుల్లో ప్రవేశానికి మేలో ప్రకటన వెలువడుతుంది.

ఎంటెక్‌
‘గేట్‌’లో అర్హత పొంది ఎంటెక్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రతినెలా రూ.12,400 చొప్పునస్టైపెండ్‌ చెల్లిస్తారు.

పీహెచ్‌డీ
యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌లో జేఆర్‌ఎఫ్‌ అర్హులకు నెలకు రూ.25000 చొప్పున మొదటి రెండేళ్లు, రూ.28,000 చొప్పున తర్వాతి రెండేళ్లు చెల్లిస్తారు. హాస్టల్లో వసతి కల్పించకపోతే స్టైపెండ్‌లో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు. ఏడాదికి రెండుసార్లు నెట్‌ నిర్వహిస్తున్నారు.

బయోటెక్నాలజీ
ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి జేఎన్‌యూ, న్యూదిల్లీ ఏటా ఉమ్మడి పరీక్షను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 విశ్వవిద్యాలయాల్లో బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా యూనివర్సిటీల్లో బయోటెక్నాలజీ కోర్సులోకి ఈ పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తున్నారు. కోర్సులో చేరిన విద్యార్థులకు నెలకు రూ.5000 చొప్పున స్టైపెండ్‌ అందిస్తున్నారు. ఎమ్మెస్సీలో జనరల్‌, ఇండస్ట్రియల్‌, ఎన్విరాన్మెంటల్‌, మెరైన్‌, మెడికల్‌, న్యూరోసైన్స్‌, మాలిక్యులర్‌ అండ్‌ హ్యూమన్‌ జెనెటిక్స్‌, బయో రిసోర్సెస్‌ బయోటెక్నాలజీ కోర్సుల్లో ఈ పరీక్ష ద్వారా చేరవచ్చు.
జేఎన్‌యూ ఎమ్మెస్సీ అగ్రీ బయోటెక్నాలజీ, మాస్టర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశానికీ ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా ఎమ్మెస్సీ అగ్రి బయోటెక్నాలజీ కోర్సులో దేశవ్యాప్తంగా 11 సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. ఎంవీఎస్సీలో 3 సంస్థల్లో చేరే అవకాశం ఉంది. అగ్రీ బయోటెక్నాలజీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.7500, ఎంవీఎస్సీలో ప్రవేశం పొందినవారికి నెలకు రూ.12,000 స్టైపెండ్‌ చెల్లిస్తున్నారు.
వీటితోపాటు ఎంటెక్‌ బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి కూడా జేఎన్‌యూ ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో జనరల్‌, బయో ప్రాసెస్‌, ఫుడ్‌, మెరైన్‌, ఫార్మాస్యూటికల్‌, కంప్యుటేషనల్‌ స్పెషలైజేషన్లు ఉన్నాయి. పరీక్ష ద్వారా 7 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.12,000 స్టైపెండ్‌ చెల్లిస్తున్నారు. అన్ని కోర్సులకూ కేంద్రానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో స్టైపెండ్‌ అందుతుంది.

వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయలాజికల్‌ సైన్సెస్‌ బెంగళూరు ఎమ్మెస్సీ వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌ కోర్సు అందిస్తోంది. 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు, ఫైనలియర్‌ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. అయితే రెండేళ్లకు ఒకసారి మాత్రమే ఇందులో ప్రవేశాలు లభిస్తాయి. 15 మందికి అవకాశం ఉంటుంది. ఇందులో చేరినవారికి నెలకు రూ.12,000 చొప్పున స్టైపెండ్‌ అందిస్తున్నారు. వచ్చే అక్టోబరులో ప్రకటన వెలువడుతుంది.

Back..

Posted on 23-10-2018