Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
చదువుకు పైకమేది!

* విద్యారుణాలకు బ్యాంకుల మొండిచెయ్యి
సరస్వతీ కటాక్షం ఉన్నా లక్ష్మీ కటాక్షం లేక వేలమంది విద్యార్థులు ఉన్నత చదువుల్ని అందుకోలేక పోతున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సమస్యలు ప్రతిబంధకం కాకూడదనే సమోన్నత లక్ష్యంతో తెచ్చిన విద్యా రుణ పథకం నీరుగారిపోతోంది. ఉన్నత చదువులకు బాసటగా నిలవాల్సిన బ్యాంకులు అరకొర రుణాలతో సరిపెడుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిస్తామని బ్యాంకులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఆచరణలో అది అమలు కావడం లేదు. ప్రతిభావంతులైన విద్యార్థులు పలువురు జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతున్నా... బ్యాంకుల నుంచి సహకారం లేక, ఫీజుల్ని చెల్లించలేక.. సీట్లను సైతం వదులుకుంటున్న వారున్నారు. విద్యా రుణాల చెల్లింపులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దేశంలోనే అత్యంత నిబద్ధత కనబరుస్తున్నా.. బ్యాంకులు మాత్రం వారికి పరిమితంగా రుణాలు ఇస్తున్నాయి. విద్యార్థుల చేదు అనుభవంపై ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
* విద్యా రుణాలకు దిక్కులేదు
* ప్రతిభ ఉన్న విద్యార్థులకూ మొండిచేయే
* మొహం చాటేస్తున్న బ్యాంకులు
* ఆస్తులు... డిపాజిట్‌ల పూచీకత్తు ఉంటేనే అప్పు
* నీరుగారుతున్న విద్యా రుణ పథకం
* ఉన్నత విద్య కోసం విద్యార్థులు ప్రైవేటుగా అప్పులు

విద్యా రుణాలు అందించడంలో బ్యాంకులు కనబరస్తున్న ఉదాసీనవైఖరి విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ప్రతిభ ఉన్న విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సమస్యలు ప్రతిబంధకం కాకూడదనే లక్ష్యంతో.. బ్యాంకులు వారికి ప్రాధాన్య రంగంగా, విధిగా రుణాలిచ్చే కార్యక్రమాన్ని 2001 సంవత్సరంలో కేంద్రం ప్రారంభించింది. రుణ నిబంధనల్నీ సరళతరం చేశారు. తక్కువ వడ్డీ, రూ.4 లక్షల వరకూ ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణం, పేద విద్యార్థులకు ప్రభుత్వమే వడ్డీ తిరిగి చెల్లించడం లాంటి కొన్ని నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ రుణ లక్ష్యాల్ని ఆర్‌బీఐ ఏటా సమీక్షిస్తూ ఉంటుంది. ఇంత ఘనమైన పథకం ఆచరణలో నిర్లక్ష్యానికి గురవుతోంది. నిబంధనల్ని గాలికొదిలి బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థులకు పరిమితంగానే రుణాలు అందుతున్నాయి. చివరికి చాలామంది విద్యార్థులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు.
ప్రతిభ ఉన్నా రుణాల్లేవు..
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏటా వేలమంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌, మెడికల్‌ కాలేజీలతో పాటు ప్రతిష్ఠాత్మకమైన సాంకేతిక, మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. కానీ బ్యాంకుల ఉదాసీనత కారణంగా, రుణాలు రాక, సొంతంగా ఫీజులు చెల్లించే స్థోమత లేక రాజీపడి అందుబాటులో ఉన్న తక్కువస్థాయి కాలేజీలో చేరిపోతున్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం 15932 మంది విద్యార్థులే విద్యారుణం పొందారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.731 కోట్లను విద్యా రుణాలుగా ఇవ్వాలని బ్యాంకులు లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. చివరకు రూ.525 కోట్లు మాత్రమే ఇచ్చాయి. లక్ష్యంలో ఇది 71 శాతం మాత్రమే. చిన్నస్థాయి లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోవడం విద్యా రుణాల్లోని వాస్తవికతను తెలియజేస్తోంది.
తెలంగాణలో చెల్లింపుల్లో మెరుగ్గా ఉన్నా...
విద్యా రుణాలు తిరిగి చెల్లింపులో తెలంగాణ విద్యార్థులు నిబద్ధత పాటిస్తున్నా బ్యాంకులు మాత్రం వారి రుణాలు పెంచట్లేదు. విద్యారుణాల్లో డిఫాల్టర్‌గా మారుతున్న వారిలో దేశ సగటు 8 శాతం కాగా... తెలంగాణలో ఇది 3.32 శాతంగా ఉంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో విద్యా రుణాల ఎన్‌పీఏలు 3.56 శాతం ఉండగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇవి 3.32 శాతానికి తగ్గాయి.
అప్పులతో మొదలు...
బీటెక్‌ పూర్తిచేసిన విద్యార్థులు ఎంఎస్‌ చదవడం కోసం విదేశాలకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్యయంతో కూడుకున్న విద్య కావడంతో బ్యాంకుల్ని ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులు వారి విద్యార్హతలు, ప్రతిభ ఆధారంగా కాకుండా ఆస్తుల ప్రాతిపదికగానే రుణాలిస్తున్నాయి. అందువల్ల చాలామందికి రుణాలు అందట్లేదు. చివరికి తల్లిదండ్రులు రూపాయిన్నర, రెండు రూపాయల వడ్డీలకు అప్పులు తెచ్చి పిల్లల్ని పంపుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరం. వ్యవసాయ భూమిపై రుణాన్ని ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఆ భూముల విలువ తక్కువగా ఉండటంతో తిరస్కరిస్తున్నాయి. నగరం లేదా పట్టణంలో స్తిరాస్థి ఉంటేనే రుణాలు ఇస్తామని చెబుతున్నాయి.
లక్షల మందికి నామమాత్రంగా రుణాలు
తెలంగాణలో 2017-18లో సాంకేతిక, ఉన్నత విద్యలో చేరుతున్న విద్యార్థులు లక్షల్లో ఉన్నారు. ప్రధాన కోర్సుల్లో చేరుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి....
* ఇంజినీరింగ్‌లో...: 70,000 మంది
* మెడిసిన్‌, వెటర్నరీ, ఏజీ బీఎస్సీ సహా ఇతర కోర్సుల్లో: 4500 మంది
* ఐఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్‌: 4500
* విదేశాలకు వెళ్లే వారు: 25,000 నుంచి 30,000 మంది

ఫీజులకు, రుణాలకు పొంతన లేదు

కాలేజీల్లో ఫీజులు చూస్తే గుండె గుభేల్‌ మంటుంది. కనీసం రూ.ఐదు లక్షలైనా లేనిదే ఏ ఉన్నత విద్యనూ పూర్తిచేసే పరిస్థితి లేదు. మధ్యతరహా ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరితే బీటెక్‌ పూర్తి చేయడానికి రూ.5 లక్షలు, మొదటి శ్రేణిలోని ఇంజినీరింగ్‌ కాలేజీలు అయితే రూ.10 లక్షలు ఖర్చవుతోంది. సాంకేతిక విద్యకు సంబంధించిన డిగ్రీ, పీజీ కోర్సులు చేయాలంటే రూ.5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చవుతోంది. ఇక వైద్య విద్యలో బీ కేటగిరి సీటయితే రూ.50 లక్షల దాకా చెల్లించాల్సి వస్తోంది. కానీ బ్యాంకులు ఇస్తున్న విద్యారుణాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.
వడ్డీ రాయితీ
విద్యా రుణాలను ప్రాధాన్యరంగంగా భావించి అందచేయాలని రిజర్వ్‌ బ్యాంకు అన్ని బ్యాంకులను ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖలోని ఉన్నత విద్యా విభాగం బలహీన వర్గాల వారికి వడ్డీ రాయితీని ఇస్తుంది. రుణాలకు మారిటోరియం సమయంలో ఈ రాయితీని ఇస్తుంది. ఏటా నాలుగన్నర లక్షల రూపాయలలోపు ఆర్థిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. విద్యా రుణాలకు అర్హులైన వారు ఎవరినీ తిరస్కరించకూడదని కేంద్రం స్పష్టంచేసింది.
తిరిగి.. తిరిగి...
నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి గత ఏడాది ప్రముఖ విద్యాసంస్థలో సీటొచ్చింది. ఎలాంటి రిజర్వేషన్‌ లేకపోవడంతో విద్యారుణం కోసం రూ.4 లక్షలకు స్థానిక జాతీయ బ్యాంకులో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి తండ్రికి రెండెకరాల పొలం, గామంలో చిన్న ఇల్లు మాత్రం ఉన్నాయి. బ్యాంకు మేనేజరు అతని దరఖాస్తును పరిశీలించి.. రుణం ఇవ్వడానికి ఇవి సరిపోవని స్పష్టంచేస్తూ.. స్థిరాస్తిని తనఖా పెడితే తప్ప రుణం ఇవ్వలేమని స్పష్టంచేశారు. లేదంటే గ్రామ బ్యాంకులో భారీగా డిపాజిటú ఉన్న వ్యక్తి పూచీకత్తు ఇస్తే రుణం ఇస్తానని తేల్చేశారు. తాను చదువు పూర్తిచేసి అప్పు చెల్లిస్తానని విద్యార్థి చెప్పినా.. బ్యాంకు మేనేజర్‌ రుణం ఇవ్వలేదు. ఆ విద్యార్థి పలుమార్లు ప్రయత్నించి, చివరకు రుణం లభ్యం కాకపోవడంతో.. బయట రెండు రూపాయల వడ్డీకి లక్ష రూపాయలు అప్పు తీసుకుని కోర్సులో చేరారు.
పూర్తిఫీజు చెల్లించలేక - మంచి కాలేజీని వీడిన రమేష్‌
హైదరాబాద్‌కు చెందిన రమేష్‌కు గత ఏడాది ఎంసెట్‌లో 12 వేల ర్యాంకు వచ్చింది. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మంచి కళాశాలలో సీటు వచ్చే అవకాశముంది. ర్యాంకు 10వేల కన్నా ఎక్కువగా ఉన్నందున పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అర్హతలేదు. ప్రభుత్వమిచ్చే సాధారణ ఫీజును మినహాయిస్తే మిగతా ఫీజు పూర్తిగా సొంతగా చెల్లించాల్సిన పరిస్థితి. బ్యాంకుల్లో రుణం తీసుకోవాలనుకుంటే కుటుంబం పేరిట స్థిరాస్తులేమీ లేవు. దీంతో నగరంలోని ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో సీటును వదిలిపెట్టి, శివారులోని బోధన ఫీజుల పథకానికి సమానంగా ఫీజు వచ్చే మామూలు ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరారు. ఇలాగే బ్యాంకులు సరైన సమయంలో రుణాలివ్వకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్తును ఫణంగా పెడుతున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చేరిన పేద విద్యార్థులకూ ఇదే సమస్యలు వస్తున్నాయి.
విద్యా రుణం ప్రయోజనాలేంటి?
* తక్కువ వడ్డీ
* ఆర్థికంగా వెనుకబడిన వారికి వడ్డీ మొత్తాన్ని కేంద్రం వెనక్కి చెల్లించే అవకాశం
* సులభమైన చెల్లింపు విధానం
* రూ.4 లక్షల వరకూ ఎలాంటి పూచీకత్తు ఇవ్వాల్సిన పనిలేదు
* 15 సంవత్సరాల వరకూ చెల్లింపునకు అవకాశం
* కోర్సు పూర్తయిన ఏడాదిన్నర తర్వాత నుంచి రుణ వాయిదాల చెల్లింపు
ఎవరికి.. దేనికిస్తారు?
* 16 నుంచి 35 ఏళ్లలోపు డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా సహా ఇతర కోర్సులు చదివేవారు
* రూ.7.5 లక్షలు దాటితే కొలేటరల్‌ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది
* రుణంలో కాలేజీ ట్యూషన్‌ ఫీజు వందశాతం. అకామిడేషన్‌ ఛార్జీలు, పరీక్ష, లైబ్రరీ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్‌ వంటి వస్తువులు, ప్రయాణ ఛార్జీలు, కోర్సు పూర్తికి అవసరమైన ఇతర వ్యయం చేరి ఉంటుంది
* దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో బ్యాంకులు రుణం మంజూరు
* మన దేశంలో విద్యకయితే గరిష్ఠంగా రూ.10 లక్షలు, విదేశాల్లో అయితే రూ.20 లక్షలు.
ఇప్పుడేం జరుగుతోంది?
* పూచీకత్తు లేకుండా విద్యా రుణాలివ్వడానికి బ్యాంకులు ముందుకు రావడంలేదు
* ఆస్తులు అది కూడా ఇల్లు, ఇంటి స్థలం(వ్యవసాయ భూములు కాకుండా)లాంటి స్థిరాస్తులున్న వారికే రుణాలందుతున్నాయి
* వడ్డీ రాయితీ ఉన్నా ఆచరణలో అది అమలు కావడంలేదు
* గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రుణాలే ఇవ్వట్లేదు
* ప్రముఖ విద్యాసంస్థల్లో అడ్మిషన్‌ పొందుతున్నా, ఆస్తుల్ని తనఖా పెట్టుకునే రుణాలిస్తున్నారు
* కేంద్రం వడ్డీ రాయితీ ఇస్తున్నా.. బ్యాంకులు మాత్రం దానిని విద్యార్థుల నుంచి రాబడుతున్నాయి
* జాతీయ బ్యాంకులు 10 నుంచి 13 శాతం వరకూ, ప్రైవేటు బ్యాంకులు 16 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తున్నాయి
* రుణాలు చెల్లించలేకుండా పోయిన వారి నుంచి వసూళ్లు చేయడం కోసం ప్రైవేటు వ్యక్తుల్ని వినియోగిస్తుండటం విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
విద్యా రుణాలకు విద్యాలక్ష్మి
విద్యా రుణాలు అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని గుర్తించి కేంద్రం ప్రభుత్వం విద్యా లక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించాయి. రుణాలు కావాల్సిన విద్యార్థులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని వివరాలు అందచేస్తే దరఖాస్తు ప్రాసెస్‌ చేస్తారు. ఇండియన్‌ బ్యాంకుల అసోషియేషన్‌ దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
సమస్యలున్నాయి...
- జనరల్‌ మేనేజర్‌, జాతీయ బ్యాంకు, హైదరాబాద్‌
విద్యా రుణాలు అందచేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. విద్య కోసం రుణాలు తీసుకుంటున్నవారు పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువమంది ఉంటున్నారు. బ్యాంకుల పరంగా కొన్ని సమస్యలున్నాయి. లక్ష్యం నిర్దేశించుకున్నా పూర్తిగా సాధించలేకపోతున్నాం. సర్టిఫికెట్లు, కాలేజీల అడ్మిషన్‌ లెటర్‌ల ఆధారంగా రుణాలు ఇవ్వడం పట్ల కొందరు బ్యాంకు మేనేజర్లు విముఖత వ్యక్తంచేస్తున్నారు. రుణాలు వసూలు కాకపోతే సంబంధిత బ్రాంచీలే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రుణాలు ఇచ్చేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మంచి కాలేజీల్లో సీట్లు వచ్చినవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాంటి వారు బ్యాంకులను సంప్రదిస్తే బ్యాంకులు సహకరిస్తాయి. జాతీయ బ్యాంకులు అయిన మేం విధిగా రుణాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే లక్ష్యాన్ని రెట్టింపు చేశాం. వచ్చే ఏడాది మరింత పెంచుతాం.


Back..

Posted on 19-07-2017