Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కొత్త తరం పాఠకులు - కొత్త తరం పాత్రికేయులు

మార్పు... మార్పు... మార్పు... మార్పు ఒక్కటే శాశ్వతమైనది! మార్పు అనేది లేకపోతే అభివృద్ధి అసాధ్యం అంటారు. జనజీవితాలతో పెనవేసుకుపోయిన పాత్రికేయ రంగమూ పెనుమార్పులకు లోనవుతోంది. ఎదుగుతున్న తరాల ఆసక్తులకు అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక ‘మల్టీమీడియా’ పాత్రికేయ శిక్షణను అందుబాటులోకి తెస్తోంది ‘ఈనాడు జర్నలిజం స్కూలు’. నవతరం సమాచారావసరాలను నెరవేర్చడంలో కీలకపాత్ర పోషించే రేపటి తరం పాత్రికేయులను తీర్చిదిద్దడానికి శ్రీకారం చుడుతోంది.
భారత దేశం ఇప్పుడు యువ దేశం. దేశ జనాభాలో దాదాపు 40 శాతం మంది 16 - 36 ఏళ్ల మధ్య వాళ్లే. వీళ్లందరూ ఈ ఇరవై ఒకటో శతాబ్దపు సాంకేతికావిష్కరణలకు స్నేహితులు. వీళ్ల అభిరుచులు, ఆకాంక్షలు వేరు. ఆనాడు యశోద కృష్ణుడి నోట్లో ఈ సమస్త విశ్వాన్నీ చూస్తే, వీళ్లు అరచేతుల్లోనే చూస్తున్నారు. వీళ్లకు ఏదైనా సరే, వేగంగా అందిపుచ్చుకోవడం ఇష్టం. వీలైనంత తక్కువ సమయంలో కుదిరినంత ఎక్కువ సమాచారాన్ని అందుకోవడం ఇష్టం. ఒకరితో ఒకరు ప్రత్యక్షంగా మాట్లాడుకుంటూ, చేతిలోని విజ్ఞానాన్ని విశ్లేషించుకోవడం ఇష్టం. ఈ ఇష్టాల నేపథ్యంలో చదివే, చూసే, పరిశీలించే పద్ధతులు పూర్తిగా మారిపోతున్నాయి. పత్రికలనూ అంతర్జాలంలో చదువుతూ, టీవీలనూ అంతర్జాలంలో చూస్తూ... వ్యాఖ్యల రూపంలో తమ అభిప్రాయాలను అప్పటికప్పుడు వెల్లడిస్తోంది ఈతరం. వీళ్లకి సంప్రదాయ పద్ధతుల్లో వార్తలు అందించడం వల్ల ప్రయోజనం లేదు. ‘మల్టీమీడియా’ మాత్రమే వీరి అవసరాలు తీర్చగలదు.

మల్టీమీడియా అంటే...
ముద్రణ, దృశ్య, అంతర్జాల, మొబైల్‌ మాధ్యమాల సంగమమే మల్టీమీడియా. ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి. ఆలంబనగా నిలుస్తాయి. ఓ సినిమాను థియేటర్‌లో చూడవచ్చు.. టీవీలో చూడవచ్చు.. అంతర్జాలంలోనూ చూడవచ్చు. సినిమా అదే అయినా మాధ్యమం వేరు. వార్తలైనా అంతే. ఎవరి అనుకూలతలు, అవకాశాల్ని బట్టి వారికి అనువైన మాధ్యమాన్ని ఎంచుకుంటారు. దినపత్రికలో వార్తలు చదువుకోవడం, టీవీలో వార్తలు వినడం పాత తరం అలవాట్లు. అవే దినపత్రికల్ని, అవే ఛానళ్లని అంతర్జాలంలో చూడటం నవతరం లక్షణం. దీనికి తగ్గట్టుగానే డిజిటల్‌ పత్రికలు, ఛానళ్లు, యాప్‌లూ వస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత మీడియా సంస్థలన్నీ ఆన్‌లైన్‌ బాటపట్టాయి. కొన్నయితే ముద్రణా పత్రికలను ఆపేసి మరీ ఆన్‌లైన్‌లోనే వెలుగుచూస్తున్నాయి. వాణిజ్య వార్తలను అందించే ‘మింట్‌’ పత్రికల్లాంటివి ముద్రణ, అంతర్జాల మాధ్యమాలకు సమ ప్రాధాన్యమిస్తూ పురోగమిస్తున్నాయి.

భారతీయ మీడియా ఎదుగుదల
భారతీయ మీడియా దినదిన ప్రవర్థమానమవుతోంది. ముద్రణ, దృశ్య, అంతర్జాల మాధ్యమాలన్నీ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాయి. పెరుగుతున్న అక్షరాస్యత, కొనుగోలు శక్తి, అందుబాటులోకి వస్తున్న సాంకేతికత, వార్తల అందుబాటులో వేగం తదితరాలే దీనికి కారణం. వీటి దన్నుతో భారతీయ దినపత్రికలు గత ఎనిమిదేళ్లలో అయిదు శాతం ప్రగతిని నమోదు చేశాయి. టీవీ ఛానళ్ల సంఖ్య ఏటేటా వృద్ధి చెందుతూ 890కి చేరింది. అంతర్జాలం అన్ని మాధ్యమాల కంటే ఎక్కువగా గత ఏడాది 30 శాతం మేర ఎదిగింది. ఈతరం పాఠకాసక్తుల్లో వస్తున్న మార్పునకు ఇది సంకేతం. దీన్ని గమనించిన ‘ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌’ (ఏబీసీ) ఈ ఏడాది నుంచి వెబ్‌సైట్లకు కూడా రేటింగ్‌ ఇవ్వబోతోంది.

అవకాశాలు
దేశంలో ప్రజాస్వామ్య సంస్కృతి పెరిగే కొద్దీ, ప్రశ్నించే శక్తులు ప్రదీప్తమవుతున్న కొద్దీ మీడియాకు అవకాశాలు అపారమవుతుంటాయి. సమాచారం పట్ల మన సమాజంలో తృష్ణ పెరుగుతోంది. మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది... దానికి అనుగుణంగా మనల్ని మనం ఎలా మలచుకోవాలా అన్న ఆలోచన ఇనుమడిస్తోంది. తాజా, ప్రత్యక్ష వార్తలకు ప్రాధాన్యం ఎక్కువ అవుతోంది. వ్యక్తిగత అభిరుచులు కూడా వార్తల ప్రాధమ్యాల్ని నిర్ణయిస్తున్నాయి. వార్తలను అందిపుచ్చుకోవడంలో సంప్రదాయ పద్ధతులను వీడి డిజిటల్‌ మాధ్యమాల వైపు చూస్తోంది నేటితరం. దానికి తోడు రాబోయే రోజుల్లో దేశంలోని స్మార్ట్‌ఫోన్ల సంఖ్య 100 కోట్లకు చేరుకోబోతోందని అంచనా. అంటే ఆమేరకు కొత్త తరం పాఠకులు రాబోతున్నట్లే!

ఆచరణాత్మక శిక్షణ
పాత్రికేయ శిక్షణలో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ దేశంలోనే విలక్షణమైంది. నాలుగు గదుల మధ్య బోధన కంటే ఆచరణాత్మక శిక్షణకు పెద్దపీట వేయడం స్కూలు ప్రత్యేకత. ఇక్కడ విద్యార్థి సగం రోజులు స్కూల్లో ఉంటే, సగం రోజులు క్షేత్రంలో నేర్చుకుంటాడు. కాబట్టే, కోర్సు పూర్తయ్యే నాటికి నేరుగా వృత్తి బాధ్యతలను నిర్వహించగలిగిన స్థాయికి చేరుకుంటాడు. మన సమాజపు పాత్రికేయ దృక్పథాన్ని పునర్నిర్వచిస్తోన్న అంతర్జాల మాధ్యమానికి ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న పాత్రికేయులు అవసరం. డిజిటల్‌ జర్నలిజం మీద అవగాహన ఉన్న వాళ్లు మాత్రమే ఇందులో రాణించగలరు. అలాంటి వాళ్లను తయారుచేసేందుకు రూపకల్పన చేసిందే ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ మల్టీమీడియా జర్నలిజం కోర్సు. జర్నలిజం ఆనుపానులు, తెలుగు భాష, అనువాదం, సామాజిక, వర్తమాన వ్యవహారాల గమనింపు- విశ్లేషణలతో పాటు ఈ వృత్తికి అత్యవసరమైన సాంకేతిక నైపుణ్యాల వరకూ అన్ని విషయాల్లోనూ విద్యార్థికి సమగ్ర శిక్షణ అందించే కోర్సు ఇది.

ప్రవేశం ఎలా?
రాత పరీక్షలు, బృంద చర్చలు, ముఖాముఖిల్లో నెగ్గిన వాళ్లే ఈ కోర్సులో చేరడానికి అర్హులు. తొలిదశలో రాతపరీక్షలు ఉంటాయి. సామాజికాంశాల పట్ల స్పృహ, తెలుగు భాషా పాటవం, అనువాద సామర్థ్యం ఉన్న వాళ్లకు వీటిని అధిగమించడం పెద్ద కష్టం కాదు. అభ్యర్థి మానసిక, తర్క సామర్థ్యాలూ ఇక్కడ పరిగణనలోకి వస్తాయి. లఘు - వ్యాస రూప ప్రశ్నలతో రెండు రకాల పరీక్షలు ఉంటాయి. వాటిలో గెలిచిన వాళ్లు బృందచర్చలకు వెళ్తారు. పాత్రికేయ వృత్తికి బృందస్ఫూర్తి చాలా అవసరం. కలివిడిగా పనిచేయగలిగిన వాళ్లు, నలుగురితో కలిసి ఉత్తమ ఫలితాలను సాధించగలిగిన వాళ్లు, చొరవ, క్రియాశీలత కలిగిన వాళ్లు మాత్రమే ఈ వృత్తిలో రాణించగలుగుతారు. అభ్యర్థుల్లో ఈ లక్షణాలను పరిశీలించడానికి ఉద్దేశించినవే బృందచర్చలు. వీటినీ సమర్థంగా పూర్తిచేసిన వాళ్లు ముఖాముఖిలకు హాజరవుతారు. అభ్యర్థిలోని పాత్రికేయ స్ఫూర్తి, ఆకాంక్ష, నిబద్ధత, ఆలోచనా సరళిని ఈ సందర్భంగా పరిశీలిస్తారు. ఇందులోనూ విజయం సాధించిన అభ్యర్థులకు ‘ఈనాడు జర్నలిజం స్కూలు’తో అనుబంధం ప్రారంభమవుతుంది.
నేటి తరానికి సమాచారమే శ్వాస. వేగమే ఆరో ప్రాణం. విజయశిఖరాలను చేరడమే లక్ష్యం. అటువంటి ఆధునిక తరాన్ని సమసమాజ నిర్మాణంలో మరింతగా భాగస్వాముల్ని చేయాలి. పాత్రికేయం ద్వారా దీన్ని సాధించాలనుకునే యువతకు అత్యుత్తమ వేదిక ‘ఈనాడు జర్నలిజం స్కూలు’.

పీజీ డిప్లొమా కోర్సులు
మల్టీమీడియా, టెలివిజన్‌ విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మీడియాలో స్థిరపడాలనే బలమైన ఆకాంక్ష, డిగ్రీ ఉత్తీర్ణత, 1.1.2017 నాటికి 28కి మించని వయసు ఉన్నవారు www.eenadu.net, www.eenadupratibha.net ల ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తుల సమర్పణకు తుది గడువు: 10.11.2016
* రాతపరీక్షలు: 20.11.2016
* బృందచర్చలు, మౌఖిక పరీక్షలు: 5.12.2016 నుంచి
* కోర్సుల ప్రారంభం: 26.12.2016


Back..

Posted on 08-11-2016