Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
భేషైన భాషా కోర్సులు!

* ప్రవేశాలకు ఇఫ్లూ ప్రకటన

ఇంగ్లిష్‌తో పాటు వివిధ భాషల్లో ప్రావీణ్యం సంపాదిస్తే విద్యార్థి దశలోనూ, ఉద్యోగ అన్వేషణ సమయంలోనూ ఎన్నో ప్రయోజనాలుంటాయి. ఆంగ్లంలో, విదేశీ భాషల్లో ప్రామాణిక బోధన అందించే విద్యాసంస్థ- హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ). లక్నో, షిల్లాంగ్‌ల్లో క్యాంపస్‌లున్న ఈ సంస్థ అండర్‌గ్రాడ్యుయేట్‌, బీఎడ్‌, పీజీ డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. వాటిలో ప్రవేశానికి ఇటీవల ప్రకటన వెలువడింది. అభ్యర్థులు జనవరి 19లోగా దరఖాస్తులు పంపుకోవాల్సివుంటుంది.

ఎక్కువ భాషలు నేర్చుకుంటే ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల వ్యక్తులతో సులువుగా అనుసంధానం ఏర్పరుచుకోవచ్చు. మెరుగైన భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. ఉపాధిని ఏర్పరచుకోవటంలోనూ ఇది మిగిలినవారికంటే ముందు నిలుపుతుంది. దీంతో భాషా కోర్సులు చేయటంపై యువత మొగ్గు చూపుతోంది.

విదేశీ భాషలపై ఆసక్తి ఉన్నవారు అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి నుంచే సంబంధిత కోర్సులను చేయవచ్చు. ఆనర్స్‌ విధానంలో ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, రష్యన్‌, జపనీస్‌, అరబిక్‌..తదితర భాషలు నేర్చుకోవచ్చు. మరింత ప్రావీణ్యం కోసం ఈ భాషల్లో పీజీనీ, పీహెచ్‌ డీనీ పూర్తిచేసుకోవచ్చు. ఆంగ్ల భాష ఎలా బోధించాలో వివరించడానికి పీజీ డిప్లొమా, ప్రత్యేకంగా ఆంగ్ల భాషలో బీఎడ్‌, ట్రాన్స్‌లేషన్‌ కోర్సులను ఇఫ్లూ అందిస్తోంది. వీటిని పూర్తిచేసుకున్నవారు మంచి అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

కోర్సులు.. సీట్లు.. అర్హతలు
యూజీ (బీఏ)
బీఏ (ఆనర్స్‌): ఇంగ్లిష్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 40, లక్నోలో 40, షిల్లాంగ్‌లో 20 సీట్లు ఉన్నాయి.
బీఏ (ఆనర్స్‌): అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ ఒక్కో కోర్సులో హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 చొప్పున సీట్లు ఉన్నాయి.
బీఏ: జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సు షిల్లాంగ్‌ క్యాంపస్‌లో నిర్వహిస్తున్నారు. 20 సీట్లు ఉన్నాయి.
అర్హత: పై కోర్సుల్లో ప్రవేశానికి జనరల్‌, ఓబీసీ అభ్యర్థులైతే ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులు ఉండాలి. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ (ఎంఏ)
ఇంగ్లిష్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 90, లక్నోలో 40, షిల్లాంగ్‌లో 30 సీట్లు.
ఇంగ్లిష్‌ లిటరేచర్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్‌లో 30 సీట్లు. లిటరేచర్స్‌ ఇన్‌
ఇంగ్లిష్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 సీట్లు.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌: హైదరాబాద్‌లో 20 సీట్లు.
కంపారిటివ్‌ లిటరేచర్‌: హైదరాబాద్‌లో 20 సీట్లు.
లింగ్విస్టిక్స్‌: హైదరాబాద్‌లో 20, లక్నోలో 20, షిల్లాంగ్‌ 20 సీట్లు.
జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20, షిల్లాంగ్‌లో 20 సీట్లు.
హిందీ, కంప్యుటేషనల్‌ లింగ్విస్టిక్స్‌, అరబిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, హిస్పానిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, రష్యన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున హైదరాబాద్‌ క్యాంపస్‌లో సీట్లు ఉన్నాయి.

ప్రవేశపరీక్ష ఎలా ఉంటుంది?
యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, బీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అన్ని పీహెచ్‌డీ కోర్సుల్లోనూ ప్రవేశానికి ఆన్‌లైన్‌ పరీక్షతోపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్ష 70 మార్కులకు, ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటాయి.

పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 50, ఓబీసీలు 45, ఎస్సీ, ఎస్టీలైతే 30 శాతం మార్కులు సాధించాలి. పీహెచ్‌డీ కోర్సులకైతే అన్‌ రిజర్వ్‌డ్‌, ఓబీసీ క్రీమీ లేయర్‌ అభ్యర్థులు 50; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌ వారు 45 శాతం మార్కులు సాధించాలి.

ప్రోత్సాహకాలూ అందిస్తారు: పీహెచ్‌డీ తప్ప మిగిలిన కోర్సుల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఇఫ్లూ మెరిట్‌ కం మీన్స్‌ ఫెలోషిప్‌, ట్యూషన్‌ ఫీజు మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకూ ప్రోత్సాహకాలు దక్కుతాయి. నెట్‌ అర్హతతో పీహెచ్‌డీలో చేరినవారికి యూజీసీ నిబంధల మేరకు (రూ.25,000) ఫెలోషిప్‌ అందుతుంది. నెట్‌ లేనివారికి నెలకు రూ.8000 చెల్లిస్తారు.

టీచర్‌ ఎడ్యుకేషన్‌
కోర్సు: బీఎడ్‌ ఇంగ్లిష్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌లో 50 సీట్లు.
అర్హత: బీఏ ఇంగ్లిష్‌ లేదా ఎంఏ ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
పీజీడీటీఈ: హైదరాబాద్‌లో 40, లక్నోలో 20 సీట్లు.
పీజీడీటీఏ: హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 సీట్లు.
అర్హత: పీజీ కోర్సుల్లో ప్రవేశానికి బ్యాచిలర్‌ డిగ్రీలో జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే సంబంధిత అంశాన్ని డిగ్రీ లేదా ప్రత్యేక డిప్లొమా స్థాయులో చదివుండాలి.

డిప్లొమా కోర్సు
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్‌లేషన్‌ కోర్సు హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు. మొత్తం 20 సీట్లు.

పీహెచ్‌డీ...
రష్యన్‌, జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, అరబిక్‌, హిందీ, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, కంపారిటివ్‌ లిటరేచర్‌, ఇండియన్‌ అండ్‌ వరల్డ్‌ లిటరేచర్స్‌, కల్చరల్‌ స్టడీస్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌, ఈస్థటిక్స్‌ అండ్‌ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్‌, ఫిల్మ్‌ స్టడీస్‌ అండ్‌ విజువల్‌ కల్చర్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌ అంశాల్లో ఇఫ్లూ పీహెచ్‌డీ కోర్సులు అందిస్తోంది. సంబంధిత విభాగంలో పీజీ లేదా సమానస్థాయి కోర్సు పూర్తిచేసినవాళ్లు వీటికి అర్హులు.

దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 19
ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250.
పరీక్ష తేదీలు: పీజీ కోర్సులకు ఫిబ్రవరి 29, పీహెచ్‌డీ కోర్సుల్లోకి మార్చి 1, యూజీ కోర్సులకు ఏప్రిల్‌ 12
వెబ్‌సైట్‌: http://www.efluniversity.ac.in/

దూరవిద్యలోనూ..
ఈ సంస్థ దూరవిద్య విధానంలో ఎంఏ ఇంగ్లిష్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ ది టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ (పీజీసీటీఈ) కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సులో ప్రవేశానికి గ్రాడ్యుయేట్లు అర్హులు. జనవరి 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. పీజీసీటీఈలో ప్రవేశానికి ఎంఏ ఇంగ్లిష్‌ లేదా లింగ్విస్టిక్స్‌ తదితర కోర్సులవారు అర్హులు. మార్చి 15లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Back..

Posted on 30-12-2019