Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

ఎదగడానికి.. ఏడు సూత్రాలు

* ఎంప్లాయబిలిటీ స్కిల్స్‌

నైపుణ్యాలంటే ఎక్కడో ఉండవు.. మనలోనూ.. మన చుట్టుపక్కలే ఉంటాయి. కొన్నింటిని చదివి తెలుసుకోవాలి. ఇంకొన్నింటిని చూసి నేర్చుకోవాలి. నిత్య జీవితంలోనూ, విద్యార్థి దశలోనూ తెలియకుండానే ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల స్కిల్స్‌ను ప్రదర్శిస్తుంటారు. వాటిలో ప్రధానమైన ఏడు నైపుణ్యాల కోసం నియామక సంస్థలు వెతుకుతుంటాయి. అవేమిటో తెలుసుకుంటే ఎలా అలవర్చుకోవాలో అర్థమవుతుంది. ఉద్యోగ సాధన సులువవుతుంది.

ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు, అనుభవం సరిపోతాయి. ఎంపిక కావడానికీ, విజయం సాధించడానికీ మాత్రం కొన్ని నైపుణ్యాలు అవసరమవుతాయి. నియామక సంస్థలు వీటిని ప్రత్యేకంగా ఉద్యోగ అర్హతల్లో పేర్కొనకపోవచ్చు. కానీ అవి అభ్యర్థిలో ఉన్నాయో లేదో తప్పక పరిశీలిస్తాయి. సాంకేతికంగా పట్టు, సబ్జెక్టు పరిజ్ఞానంతోపాటు నైపుణ్యాలున్నవారే విధులను ఉత్తమంగా నిర్వహిస్తారని సంస్థలు భావిస్తున్నాయి.

సాధారణంగా ఉద్యోగ సంబంధిత నైపుణ్యాలైన- మెషినరీ, సంస్థ ఉపయోగించే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌, టెక్నిక్‌లు వంటి వాటిపై సంస్థలే శిక్షణనిస్తాయి. ఇతర నైపుణ్యాలు అభ్యర్థిలో ఉన్నాయో లేదో ఎంపిక సమయంలో చూస్తాయి. అందుకే విద్యార్థి దశ నుంచే వాటిపై దృష్టి సారించడం మంచిది. విద్యార్థులు తమలో లేనివాటిని ప్రయత్నపూర్వకంగా నేర్చుకొని సానపెట్టుకోవాలి. వీటిని కోర్సులో భాగంగా, నిత్యజీవిత అనుభవాలతో నేర్చుకోవచ్చు.

1. భావ ప్రకటన
ఇది ఒక విషయాన్ని స్పష్టంగా, ఎదుటివారికి అర్థమయ్యే విధంగా చెప్పగల సామర్థ్యం. రాయడం ద్వారా, మాట్లాడటం ద్వారా విషయాన్ని చేరవేయవచ్చు. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం, దానికి అనుగుణంగా సరైన రీతిలో స్పందించడం కూడా ప్రధానమే.
విద్యాపరంగా: కళాశాలలో చేసే ప్రాజెక్టుల్లో గమనించిన అంశాలను పాయింట్ల వారీగా చెప్పవచ్చు. సంబంధిత లేఖల ద్వారా ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఎలా రాయవచ్చో సాధన చేయవచ్చు. పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లు, డిబేట్ల ద్వారా ఒక విషయాన్ని ఆసక్తికరంగా, ఎదుటివారికి అర్థమయ్యేలా వివరించడాన్ని ప్రాక్టీస్‌ చేయవచ్చు.
నిత్యజీవితంలో: బస్‌స్టాండ్లలో, రోడ్ల మీద ఎంతోమంది ఫలానా చిరునామా చెప్పమని అడుగుతుంటారు. సూటిగా, వాళ్లు తికమక పడకుండా ఎంతవరకూ సమాచారం ఇవ్వగలుగుతున్నారో చూసుకుంటే మీ భావప్రకటన సామర్థ్యాన్ని అంచనా వేసుకోవచ్చు.

2. చొరవ.. ప్రేరణ
ఏదైనా చెబితేనే చేస్తామనే ధోరణి కాకుండా చొరవ తీసుకుని చేయగలగాలి. కొత్త ఆలోచనలను చేయాలి. వాటిని ఇతరులతో పంచుకుంటుండాలి. ఇది ఎదుటివారికీ ప్రేరణగా పనిచేస్తుంది. వ్యక్తిలోని సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తుంది.
విద్యాపరంగా: సబ్జెక్టుల్లో నేర్పే పాఠాలు చాలావరకూ మన జీవితంలో సాయపడేవే. వాటిని ఇంకాస్త మెరుగ్గా ఎలా చేయవచ్చో ప్రయత్నించాలి. ఇంటర్న్‌షిప్‌, ప్లేస్‌మెంట్ల నిమిత్తం సొంతంగా సంస్థలను సంప్రదించడం వంటివి చేయవచ్చు.
నిత్యజీవితంలో: ఇంట్లో ఏవైనా పనులను ఇతరులు చెప్పక ముందే చేయడం, కొత్తవారితో ముందుగా మాట కలపడం, ఎన్‌జీఓలు, తరగతిలో వేడుకలకు సంబంధించి నిధులు జమ చేయడం లాంటివి.

3. సమ్మతికి సంప్రదింపులు
ఒక విషయంలో ఇరువర్గాలూ లాభాన్ని పొందేలా చూడటం, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మీరు చూపిన పరిష్కారానికి ఎదుటివారు ఆమోదం పలికే విధంగా చేయడం లేదా ఇద్దరూ అంగీకరించేలా సంప్రదింపులు చేయడం వంటి వాటిని నెగోషియేషన్‌ స్కిల్స్‌ అంటారు.
విద్యాపరంగా: ఏదైనా ప్రాజెక్టు చేస్తున్నప్పుడు పనిని విభజించుకుని చేయాలి. ఆ విభజన అందరికీ ఆమోదనీయంగా ఉండాలి. ఒక్కోసారి కొందరికి సులువైనవీ, ఇంకొందరికి కష్టమైనవీ రావొచ్చు. అలాంటప్పుడు ఎవరూ నిరాశ పడకుండా కొన్ని మార్గాలు సూచించడం నెగోషియేషన్‌ స్కిల్‌ కిందకు వస్తుంది.
నిత్యజీవితంలో: దైనందిన కార్యకలాపాల్లో ఈ నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశాలు చాలా వస్తుంటాయి. చర్చల ద్వారా అందరికీ అంగీకారయోగ్యమైన పరిష్కారాలను, పని మార్గాలను సూచించడం తరచూ అవసరమవుతాయి. కొనుగోళ్లు జరిగే ప్రదేశాలను పరిశీలిస్తే ఈ నైపుణ్యాలపై మంచి అవగాహన వస్తుంది.

4. సమస్యా పరిష్కారం
పనిలో భాగంగా ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని సమర్థంగా ఎదుర్కొన్నవారే కెరియర్‌లో ముందుకు వెళ్లగలుగుతారు. ఇది ఒక క్రమపద్ధతిలో సాగాలి. సమస్యను అర్థం చేసుకోవడం, దాన్ని చిన్నచిన్న వాటిగా విభజించి, వాటిలోని కీలక అంశాలను గమనించి, ఆపై పరిష్కారాలను కనుక్కోవడం తెలుసుకోవాల్సిన నైపుణ్యమే.
విద్యాపరంగా: సబ్జెక్టుకు సంబంధమున్నది ఏదైనా సొంతంగా తయారుచేసే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు- ఇంజినీరింగ్‌ విద్యార్థి ఏదైనా వస్తువును రూపొందించడం, కోడింగ్‌ రాయడం వంటివి ప్రయత్నించవచ్చు. వాటిని ఉపయోగించేటప్పుడు సమస్యలు ఎక్కడ ఎదురవుతున్నాయో చూసుకోవడం, పరిష్కరించడం వంటివి ఈ నైపుణ్యాభివృద్ధి కిందకే వస్తాయి.
నిత్యజీవితంలో: ఇంట్లోని చిన్న చిన్న సమస్యల దగ్గర్నుంచి, మొబైల్‌లో, కంప్యూటర్‌లో తలెత్తే సాధారణ సమస్యల వరకూ పరిష్కార మార్గాలను వెతకడానికి ప్రయత్నించాలి. పనికిరాని వస్తువులను భిన్నంగా ఉపయోగించవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో ఆప్టిట్యూడ్‌, సైకోమెట్రిక్‌, ఎబిలిటీ టెస్టులూ సాయపడతాయి. కళాశాల పరంగా టూర్లకు వెళ్లినప్పుడు అక్కడ ఎదురయ్యే సమస్యలకు మెరుగైన పరిష్కారాలకు ప్రయత్నించవచ్చు.

5. నిర్వహణ
ప్రాధమ్యాలను గుర్తించడం, సరైన విధంగా సమయాన్ని ఉపయోగించుకుంటూ సమర్థంగా, లాభదాయకంగా పనిచేయడం వంటివి నిర్వహణ నైపుణ్యాలను సూచిస్తాయి. గడువు ప్రకారం పనిచేయడం, సకాలంలో వాటిని పూర్తిచేయడం వంటివీ దీని కిందకే వస్తాయి.
విద్యాపరంగా: కళాశాలలో ఒకేసారి కొన్ని రకాల పనులు/ అసైన్‌మెంట్లను చేయాల్సి వస్తుంది. వాటిలో కొన్ని సులువుగానూ, కొన్ని కష్టంగానూ అనిపించవచ్చు. అలాగే వాటిని సమర్పించాల్సిన గడువులో తేడా ఉంటుంది. అలాంటప్పుడు ముందుగా దేన్ని చేయాలో ఆలోచించి నిర్ణయించాలి. ప్రణాళిక వేసుకుని, అన్నింటినీ సకాలంలో పూర్తిచేయగలగాలి.
నిత్యజీవితంలో: రోజూ ఉదయాన్నే ఆ రోజు చేయాల్సిన పనులను జాబితాగా రాసుకోవాలి. ఒక్కోదానికి ఎంత సమయం పడుతుందో పక్కనే నోట్‌ చేసుకోవాలి. వేటిని ఏ సమయంలోగా పూర్తి చేయాలో రాసిపెట్టుకోవాలి. దీని ద్వారా ముందుగా చేయాల్సినవి ఏవో తెలుస్తాయి. అయిపోయిన వాటిని ఎప్పటికప్పుడు టిక్‌ చేసుకోవాలి. ఇవన్నీ నిత్యజీవితంలో నిర్వహణ నైపుణ్యాలే.

6. ఒత్తిడిలో పనిచేయడం
ఒక వ్యక్తి నిజమైన పనితీరు ఒత్తిడి సమయంలోనే బయటపడుతుంది. సంస్థల్లో ప్రతి పనికీ నిర్ణీత సమయం ఉంటుంది. దానిని పరిమితుల్లో సక్రమంగా పూర్తి చేయడంపైనే అభ్యర్థి సామర్థ్యం ఆధారపడుతుంది.
విద్యాపరంగా: పరీక్షలు దగ్గర పడుతున్నాయన్నప్పుడు విద్యార్థుల్లో ఒత్తిడి సహజమే. చదవాల్సిన సిలబస్‌ కొండలా కనిపిస్తుంటుంది. దాన్ని ఒక టైం టేబుల్‌ ప్రకారం చదవడం, పూర్తి చేయడం వంటివి ఒత్తిడిలో సమర్థంగా పనిచేసే నైపుణ్యాలే. పరీక్షల తేదీలు దగ్గరవుతున్న కొద్దీ విద్యార్థులు కంగారు పడుతుంటారు. అప్పుడూ ప్రశాంతంగా ఉండగలగడం, ఉన్న సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయడం అలవాటు చేసుకోవాలి.
నిత్యజీవితంలో: ఏదైనా పని చేస్తున్నప్పుడు నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలి. ఆ విధంగా పూర్తి చేయాలి. ముఖ్యంగా ఎప్పుడూ నింపాదిగా, స్థిరంగా ఉండగల మనస్తత్వాన్ని అలవరచుకోవాలి.

7. నాయకత్వ లక్షణాలు
ఉద్యోగం ప్రారంభంలోనే మేనేజర్‌ స్థాయిని ఎవరూ అందుకోలేరు. కానీ ప్రతి ఒక్కరిలో నిర్వాహకుల లక్షణాలు ఉండటం తప్పనిసరి. సంస్థలో నలుగురితో కలిసి చేయాల్సి ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ అందరూ ఒకే ఉత్సాహంతో పనిచేయడం సాధ్యం కాదు. అలాంటప్పుడు వారిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, అవసరమైన సాయం అందించడం వంటివి నాయకత్వ లక్షణాలే.
విద్యాపరంగా: చదువులో భాగంగా ఇతరులతో కలిసి దేన్నైనా రూపొందించడం లాంటివి ఆసక్తికరంగా ఉంటాయి. ఎవరైనా వెనుకబడినా, చేసే క్రమంలో ఏదైనా పొరబాటు చేసినా దాన్ని సరిచేయగల సామర్థ్యం ఎవరి దగ్గర ఉందో గుర్తించడం, వారి సాయం తీసుకోవడం వంటివి చేయాలి. ఒకరితో పనిచేయించడమే కాదు, దాన్ని ఎవరు సరిగా చేయగలరో గుర్తించడమూ నాయకత్వ లక్షణం కిందకే వస్తుంది.
నిత్యజీవితంలో: ఆటలు, ఏదైనా కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తీసుకోవడం ద్వారా నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. నలుగురితో కలిసి పనిచేయడం ద్వారా నాయకులుగా ఎదిగే లక్షణాలనూ అలవర్చుకోవచ్చు.


Back..

Posted on 25-07-2019