Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఎన్ని చాలు? ఏవి మేలు?

* 25 ఇంజినీ రింగ్‌ ఎంట్రన్సులు... సరైనవాటి ఎంపిక కీలకం!
ఇంజినీరింగ్‌ విద్యను చదవాలనుకునేవారికి ప్రవేశ మార్గాలు ఎన్నో! జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పాతిక వరకూ ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలున్నాయి. దాదాపు ఇవన్నీ ఆన్‌లైన్‌ పరీక్షలే. సిలబస్‌ దాదాపు ఒకటే. మరి వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసి, రాయటం మంచిదేనా? ఏమాత్రం కాదు! ఇలా చేయటం విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఆర్థికంగా, మానసికంగా ఎంతో భారం! వ్యూహాత్మకంగా కూడా ఇది సరి కాదు! మరి ఏ విద్యార్థులు ఎన్ని ఎంట్రన్సులను, ఎలా ఎంచుకోవాలి? నిపుణులు సూచిస్తున్నదేమిటి?

ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఏర్పడిన తర్వాత ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలన్నీ ఒకే పరీక్షగా ఏర్పడతాయనుకున్నారు. కానీ ఇది తొలి సంవత్సరం కాబట్టి ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇంజినీరింగ్‌ ఆశావహుల ముందు 25 వరకు వివిధ రకాల ప్రవేశ పరీక్షలున్నాయి. వీటిలో ఏ పరీక్షలు రాయాలో ముందే నిర్ణయించుకుంటే వాటిపై నిర్దిష్టంగా శ్రద్ధ పెట్టి, మెరుగైన ర్యాంకు కోసం పూర్తిస్థాయిలో కృషి చేయవచ్చు. ఇదే ఆచరణీయం.

ఎంపీసీ విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలని ప్రారంభించినా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకునేటప్పటికీ కొంతమంది ఇతర రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. అంటే లా, సీఏ, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, డిజైన్‌, ప్యూర్‌ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటివారు తమ అభీష్టానికి తగ్గట్లుగా లా అయితే క్లాట్‌, సీఏ అయితే సీఏ ఫౌండేషన్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ అయితే ఐఐఎం, సింబయోసిస్‌; డిజైన్‌ కోర్సులు అయితే నిఫ్ట్‌; ప్యూర్‌ సైన్సెస్‌ అయితే నెస్ట్‌లో లేదా సెంట్రల్‌ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవటం ఉత్తమం. ఆ విధానంలో తయారయినప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు.

అధిక శాతం విద్యార్థులు తమకు ఇష్టం లేకపోయినప్పటికీ సహాధ్యాయులు చేస్తున్నారనో, అధ్యాపకులు చెప్పారనో కనిపించిన ప్రతి పరీక్షకూ దరఖాస్తు చేస్తున్నారు. దీనివల్ల తల్లిదండ్రులకు 25 వేల నుంచి 30 వేల రూపాయిల వరకు అదనపు ఆర్థిక భారం! విద్యార్థులు కూడా ఏ పరీక్షపైనా తగిన స్పష్టత, పట్టు లేక దేంట్లోనూ రాణించలేకపోతున్నారు. అందుకని తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని అందుకు తగ్గట్లుగా కొన్ని ఎంట్రన్సులను మాత్రమే ఎంపిక చేసుకోవడం మేలని నిపుణులు చెపుతున్నారు.

ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరాలనుకున్నవారు
ఐఐటీ, ఐఎస్‌ఐ, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఎస్‌టీ లాంటి సంస్థల్లో ప్రవేశం కోరే విద్యార్థులు జేఈఈ - అడ్వాన్స్‌డ్‌ లేదా సంబంధిత సంస్థ నిర్వహించే పోటీ పరీక్షలకు తయారవ్వాలి. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు పై సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఆ పోటీ పరీక్షలకు తోడుగా జేఈఈ - మెయిన్స్‌కి కూడా దరఖాస్తు చేసుకొని వాటికి సన్నద్ధమవటం మేలు. ఇంకా అదనంగా కావాలంటే రాష్ట్రస్థాయి ఎంసెట్‌కి కూడా దరఖాస్తు చేస్తే సరిపోతుంది. అంటే ఈ విద్యార్థులు గరిష్ఠంగా 4 పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే చాలు. ఉదా: జేఈఈ మెయిన్స్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌, ఐఎస్‌ఐ ఎంట్రన్స్‌, ఎంసెట్‌.

మెయిన్స్‌లో వంద వరకే వస్తుంటే
జేఈఈ మెయిన్స్‌లో 360 మార్కులకు 100 మార్కుల వరకే వచ్చే విద్యార్థులు ఎంసెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1,70,000 వరకు సీట్లు ఉన్నాయి. అయితే వాటిలో యూనివర్సిటీ కళాశాలల్లో సీట్లు సాధించే దిశలో వారు సన్నద్ధమవ్వాలి. అంటే 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 120 మార్కుల వరకు సాధించే దిశలో ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఈ పరీక్షనే ముఖ్యంగా ఎంచుకునే విద్యార్థి రెండు రాష్ట్రాల్లోని ఎంసెట్‌ పరీక్షలతోపాటు గీతం, విట్‌, ఎస్‌ఆర్‌ఎం లాంటి రెండు డీమ్డ్‌ యూనివర్సిటీ పరీక్షలను ఎంపిక చేసుకోవడం మేలు.

అయితే అధిక ఫీజులు భారంగా భావించేవారు ఎంసెట్‌ పరీక్షలకు మాత్రమే పరిమితం కావొచ్చు. అధికంగా దరఖాస్తు రుసుములు చెల్లించి పరీక్షలు రాసి, తర్వాత ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యేకంటే ఎంసెట్‌ రెండు రాష్ట్రాల పరీక్షలను మాత్రమే రాసుకుంటే సులభంగా సీటు సాధించే అవకాశం ఉంటుంది.

ఐఐటీ సీటు రాదనుకున్నవారు
‘ప్రతిభావంతులమే కానీ ఐఐటీల్లో ప్రవేశం కష్టం’ అని భావిస్తే జేఈఈ-మెయిన్స్‌తో పాటు, బిట్‌శాట్‌, ఎంసెట్‌, మహి లాంటి ఏదో ఒక డీమ్డ్‌ యూనివర్సిటీకి దరఖాస్తు చేస్తే సరిపోతుంది. గతంలో బిట్స్‌ పిలాని, మణిపాల్‌ లాంటి సంస్థల్లో ఫీజు అధికంగా ఉండేది. ఇప్పుడు వాటి ఫీజు ఐఐటీలతో దాదాపు సమానంగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయిల వరకు ఉంటున్నాయి.

బీఆర్క్‌ లక్ష్యంగా ఉన్నవారు
ఆర్కిటెక్చర్‌ (బి.ఆర్క్‌) చేయాలనుకునే విద్యార్థులకు ఇప్పుడు సీట్ల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు ఉన్నాయి. అవికాకుండా ఎన్‌ఏటీఏ (నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌- నాటా) ద్వారా కూడా చేరవచ్చు. ఈ సంవత్సరం నుంచి ఎన్‌ఏటీఏ పరీక్షను కూడా ఎన్‌టీఏకు ఇస్తున్నారు. ఈ పోటీ పరీక్షలు కూడా సంవత్సరానికి రెండు సార్లు జరిపి వాటిలో ఉత్తమ మార్కు ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో బి.ఆర్క్‌ సీట్లు 1500 వరకు ఉన్నాయి. బి.ఆర్క్‌, బి. ప్లానింగ్‌ రెండింటికీ ఈ పరీక్షే ప్రాతిపదిక కాబట్టి విద్యార్థులు బాగా ప్రిపేరయితే సీటు సాధించవచ్చు. ఈ పోటీ పరీక్షలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు లేవు. కేవలం మ్యాథమేటిక్స్‌, లాజికల్‌ రీజనింగ్‌ మాత్రమే ఉన్నాయి. తెలుగు విద్యార్థులు మిగిలిన ఏ రాష్ట్ర విద్యార్థులతో పోల్చుకున్నా మ్యాథమేటిక్స్‌ పరంగా చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ పరీక్ష ద్వారా ఎక్కువమంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. బి.ఆర్క్‌ లేదా బి.ప్లానింగ్‌ మాత్రమే చేయాలనుకునే విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ రెండో పేపర్‌, నాటాలకు మాత్రమే దరఖాస్తు చేసుకొని డ్రాయింగ్‌లో కొద్దిగా తర్ఫీదు కాగలిగితే అత్యుత్తమ మార్కులు సాధించుకొని జేఎన్‌టీయూ లాంటి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరే అవకాశం ఏర్పడుతుంది.

ఎంసెట్‌లో 80 లోపు వస్తుంటే
ఎంసెట్‌లో 80 మార్కులలోపే వస్తున్న విద్యార్థులు, ఆర్థికంగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయిల వరకు కట్టగల స్థోమత ఉన్నవారు ఏవైనా 3 డీమ్డ్‌ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడం మేలు. వీటిలో కొంతవరకు ఫీజు తక్కువగా ఉన్నది ఒరిస్సా రాష్ట్రంలోని కళింగ మాత్రమే.

ఎంసెట్‌లో 60 లోపు వస్తుంటే
ఎంసెట్‌లో 60 మార్కులలోపే వస్తున్నవారూ, ఆర్థికంగా సంవత్సరానికి ఏమంత ఖర్చు చేయలేనివారుంటారు. ఇలాంటివారు బేసిక్‌ సైన్స్‌లో ఎంఎస్సీ చేయడానికి సెంట్రల్‌ యూనివర్సిటీలు లేదా నెస్ట్‌ పరీక్షలకు మాత్రమే నియంత్రించుకొని వాటికి తయారవడమే మేలు. ఒక సాధారణ కళాశాలలో ఇంజినీరింగ్‌ చేసే విద్యార్థి కంటే సెంట్రల్‌ యూనివర్సిటీలో బేసిక్‌ సైన్సెస్‌ చేసే విద్యార్థికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది.

ఏ విధమైన ప్రణాళిక లేకుండా కన్పించిన ప్రతి పోటీ పరీక్షకూ విద్యార్థులు దరఖాస్తు చేస్తూ వెళ్తే తల్లిదండ్రులకు ఆర్థిక భారమే తప్పించి అనుకూల ఫలితం ఏమీ ఉండదు. ఈ పరీక్షలన్నీ 45 రోజుల కాలవ్యవధిలో జరుగుతాయి. అన్నింటికీ లేదా 10, 15 పరీక్షలకు దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రతి రెండు మూడు రోజులకో పరీక్ష రాయాల్సి ఉంటుది. పరీక్షా విధివిధానాల్లో కూడా స్వల్ప తేడాల వల్ల పరీక్షపై అవగాహన, పట్టులేక ఏ పరీక్షలో కూడా అనుకున్నవిధంగా రాణించలేక తుది గమ్యాన్ని చేరుకోలేక పోతున్నారు. కాబట్టి విద్యార్థి మొదట తన అభిలాష ఏమిటో, దాన్ని చేరుకోగలనో లేదో అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. గœరిష్ఠంగా 4 లేదా 5 పరీక్షలకు మాత్రమే పరిమితమై వాటికి నిర్దిష్ట ప్రణాళికతో తయారుకాగలిగితే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.
ఏ ప్రవేశపరీక్ష దరఖాస్తు ఎప్పుడు?
ముఖ్యమైన 21 ప్రవేశపరీక్షల వివరాల పట్టిక ‌

                                                                       - పి. అభిలేఖ్‌, డైరెక్టర్‌, మెలూహ

Back..

Posted on 21-01-2019