Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

కలల కొలువుకు కొన్ని ప్రశ్నలు..!

అందరూ దాదాపు కనెక్టయ్యే విషయం ఒకటుంది. అదేంటంటే ఉద్యోగం వచ్చే వరకూ ఉద్యోగం.. ఉద్యోగం.. అని కలవరిస్తారు. ఒకసారి ఉద్యోగంలో చేరగానే రోజూ ఏంటీ రొటీన్‌ వర్క్‌ అని రొద పెడతారు. ఈ పరిస్థితి అటు ఆర్గనైజేషన్‌కీ¨ ఇటు ఉద్యోగులకీ ఏ మాత్రం మంచిది కాదు. చేసే జాబ్‌ ఎప్పటికప్పుడు ఉత్సాహంగా, సృజనాత్మకంగా సాగాలంటే దానిపై ఆసక్తి, అభిరుచి ఉండాలి. అలా ఉండాలంటే ఉద్యోగాన్ని వెతుక్కునేటప్పుడే ఎవరికి వాళ్లు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.

అలారం మోగుతుంది. విసుగ్గా దాన్ని ఆపేసి, తల నిండుగా దుప్పటి కప్పేసుకుంటే.. ఇంకొకరు దాన్ని లాగేస్తారు. నిద్ర నుంచి అలా బలవంతంగా లేచిన వ్యక్తి నిరాశగా చూస్తుంటే రెండో వ్యక్తి వెళ్లమన్నట్లుగా సైగ చేస్తాడు. బాల్కనీలో ఎవరికీ కనపడని చోట నక్కిమరీ దాక్కుంటారు ఒకరు. ఇంకొకరు వారి కోసం వెతుకుతుంటారు. బస్‌స్టాప్‌లో పోల్‌ను పట్టుకుని గట్టిగా నిల్చుంటారు ఒకరు. వారి కాళ్లు పట్టుకుని బలవంతంగా లాగుతుంటారు ఇంకొకరు.

కొద్ది సమయానికి వీరే కాదు.. ఒకరు రానంటున్నా.. ఇంకొకరు బలవంతంగా లాక్కెళుతున్నవారితో రోడ్డు నిండిపోతుంది. ఈ సన్నివేశాలన్నింటిలోనూ మొదటి వ్యక్తీ, రెండో వ్యక్తీ ఒకరే! ఒకే ముఖకవళికలతో, దుస్తులతో ఉంటారు. నచ్చని ఉద్యోగం వైపు మనసు వెళ్లనంటుంటే.. మెదడు లాక్కెళుతోందని తెలియజెప్పేలా రూపొందించిన కమర్షియల్‌ ప్రకటన ఇది. ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ రూపొందించింది.

ఈ సన్నివేశాలు ఊహకు కొంచెం అతిశయోక్తిగా అనిపించినా...వాస్తవం అదే అని పరిశోధించి మరీ నొక్కి చెబుతున్నాయి కొన్ని సంస్థలు. అంతర్జాతీయ సంస్థ ఫోర్బ్స్‌ గత ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ కొలువులను మనస్ఫూర్తిగా చేస్తున్నారు. మిగతా అందరూ అయిష్టంగా, అన్యమనస్కంగా, అవసరం కొద్దీ, మారే మార్గం తెలియక, కొన్నిసార్లు వీలవక.. ఇలా రకరకాల కారణాలతో నచ్చని కొలువులో కొనసాగుతున్నారు. ఏదైనా కొలువే కదా అని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇక్కడ ఉద్యోగం పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల సంస్థ ప్రొడక్టివిటీ తగ్గడమే కాదు, ఉద్యోగిలోని ప్రత్యేక సృజనాత్మకతశక్తి సన్నగిల్లిపోతోంది. కాబట్టి, ఉద్యోగాన్ని అన్వేషించేటప్పుడే కాస్త సమయం కేటాయిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు.

సాధారణంగా.. జాబ్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోయే వారందరూ రెజ్యూమెను ఎంతో అందంగా, ప్రభావపూరితంగా తయారు చేసుకోవడం, జాబ్‌ పోర్టళ్లలో నమోదు చేసుకోవడం, నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, కాంటాక్ట్‌లను ఉపయోగించడం వంటి వాటిపై దృష్టిపెడుతుంటారు. ఇవన్నీ ముఖ్యమైనవే! కానీ దీనికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉంది. అదే- మీ కలల ఉద్యోగం ఏమిటో కనిపెట్టడం. ఉద్యోగానికి సిద్ధమయ్యే ముందే ప్రతి ఒక్కరూ ముందు తమ గురించి తాము తెలుసుకోవాలి. అప్పుడే చేయబోయే ఉద్యోగానికి ఎంతవరకూ న్యాయం చేయగలరో అర్థమవుతుంది. అందుకు కొన్ని ప్రశ్నలను ఎవరికి వారు వేసుకోవాలి.

ఉత్సాహాన్నిచ్చేది ఏది?
డబ్బు ప్రధానాంశం కాకపోతే మీరు ఏం చేయాలనుకుంటారు? ఈ ప్రశ్నను ఒకసారి వేసుకోవాలి. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే.. ఉదాహరణకు- ఒక పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకున్నారనుకుందాం.. ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటారు. చూడాలనుకున్న ప్రదేశాలన్నీ చుట్టేస్తారు. బాగుంది.. తర్వాత? కొంత విరామం తీసుకున్నా.. బోర్‌ కొట్టే తీరుతుంది. ఆ పరిస్థితిని ఊహించి అప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుందో.. ఆలోచించాలి. ఆనందాన్ని ఇచ్చే పనేదో గమనించాలి.. గ్రహించాలి. పిల్లలతో కలిసి గడపడం, ఆర్ట్స్‌, మ్యూజిక్‌.. ఇలా ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్కరికీ చదివిన డిగ్రీకి సంబంధించిన ఉద్యోగంపైనే ఆసక్తి ఉండాలనేమీ లేదు. ఒక్కోసారి చదివిన విభాగంపై అనాసక్తి కలగవచ్చు. ఉదాహరణకు- కొందరు మామూలు డిగ్రీ చేసినా కంప్యూటర్‌కు సంబంధించి మంచి పరిజ్ఞానం, ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. కొందరు మ్యూజిక్‌.. ఇలా బలమైన ఆసక్తి ఉన్న దానిపై పట్టు సాధించేలా చేస్తుంది. అలా మీకు ఆనందం, ఆసక్తి కలిగించే రంగం లేదా పని ఏదో కనిపెట్టాలి.

ఏం ఆకర్షిస్తుంది?
ఒకసారి నచ్చినదేదో అర్థమైన తర్వాత.. అది నచ్చడానికి ఉన్న కారణాలను గమనించుకోవాలి. ప్రతి ప్రాథమిక అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు- మెకానికల్‌ విభాగం ఇష్టమైతే.. కొత్త వాటిని ప్రయత్నించడంపై ఆసక్తా? కొత్తదాన్ని రూపొందించడాన్ని ఆనందిస్తారా? మీరు చేసినదాన్ని ఇతరులు మెచ్చుకుంటే బాగుంటుందనుకుంటున్నారా..? ఇలా ప్రతి చిన్న విషయాన్ని గుర్తించాలి. దానిలో కెరియర్‌ను నిర్మించుకోవడానికి అవసరమైన పట్టు మీకుందో లేదో చూసుకోవాలి. విద్యా సంబంధమైన అర్హతలు ఏమేం కోరుతున్నారో, అదనంగా ఇంకా ఏమేం కావాలో తెలుసుకోవాలి. అవసరమైతే సంబంధిత సర్టిఫికేషన్లను చేయాలి. తర్వాత ఆశిస్తున్న ఉద్యోగాలను అందించగల సంస్థలు ఏమున్నాయో వెతకాలి.

లాభనష్టాలేమిటి?
ఏ కెరియర్‌ అయితే ఎంతటి రిస్క్‌కైనా సిద్ధపడతారో.. ఆలోచించాలి. దానికి సంబంధించి ఉన్న ఉద్యోగాలపై పరిశోధన చేయాలి. అలాంటి వాటిని ఎంచుకున్నవారి జీవితం ఎలా ఉందో పరిశీలించాలి. విజయవంతమైన వారికే పరిమితం కాకూడదు. అపజయాలనూ పరిశీలించాలి. అప్పుడే పూర్తి అవగాహన వస్తుంది. వార్తాపత్రికల్లో వచ్చే కథనాలు, ఇదివరకే అందులో చేస్తున్నవారి అభిప్రాయం ఇందుకు సాయపడతాయి. కోరుకున్న కొలువులో జీతభత్యాల వివరాలూ, మీ ఆర్థిక అవసరాల గురించీ అంచనా వేసుకోవాలి. అనుకున్న చోట ఆ ఉద్యోగం దొరకుతుందో లేదో చూసుకోవాలి. పనివేళలు అనువుగా ఉండటమూ ప్రధానమే. మొత్తం సమాచారం అందుబాటులో ఉండి, అవసరాలూ సరిపోతే ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.

ఎలా పరిశీలించాలి?
ఎంత నచ్చిన ఉద్యోగమైనా.. అర్హతలన్నీ మీకు ఉన్నా.. ముందుగానే పూర్తిస్థాయి ఉద్యోగంపై దృష్టిసారించొద్దు. కొన్ని అంశాలను పరిశీలించుకోవాలి. మొదట వాలంటీర్‌/ ఇంటర్న్‌గా చేరడం మంచిది. దీని వల్ల వాస్తవంగా ఉద్యోగం, పరిశ్రమ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీని వల్ల ఇంకా ఏమైనా నైపుణ్యాలు అవసరమైతే నేర్చుకోడానికి అవకాశం ఉంటుంది. అనుభవమూ వస్తుంది. రెజ్యూమెకి ఇది అదనపు లాభాన్ని చేకూరుస్తుంది. అక్కడ తోటివారితో నెట్‌వర్క్‌ పెంచుకోవాలి. భవిష్యత్తులో రెకమెండేషన్లకు వీరు సాయపడవచ్చు. ఆ రంగంలో జరిగే కాన్ఫరెన్సులు, జాబ్‌ ఫెయిర్‌లకూ హాజరవుతుండాలి. పని ప్రదేశంలో చొరవ తీసుకోవాలి. మీపై మీకు నమ్మకం వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యోగానికి ప్రయత్నించాలి.

సరైన సమయమేది?
చాలామందికి నచ్చినవి తెలుసుకోవడంలో, వాటిని నేర్చుకోవడంలో, మెరుగుపరచుకోవడంలో ఉండే ఆసక్తి, దానిపై పని చేసేటప్పుడు ఉండకపోవచ్చు. అందుకే దేన్నైనా ప్రత్యక్షంగా పరిశీలించడం ప్రధానం. తీరా ఆ పని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అంత ఆసక్తిగా అనిపించకపోయినా, కెరియర్‌లో వృద్ధి ఉండదని తెలిసినా నిర్ణయం మార్చుకోవచ్చు. కొంత సమయం వృథా అయినప్పటికీ అనుభవం వస్తుంది. వాస్తవం తెలుస్తుంది. కలల ఉద్యోగాన్ని కనుక్కోడానికి సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. విద్యార్థులు, ఇప్పటికే ఉద్యోగం చేస్తూ దాన్ని బోర్‌గా ఫీలవుతున్నవారు ఎవరైనా, ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు. విద్యార్థి దశలో అయితే ఎక్కువ సమయం అందుబాటులో ఉంటుంది. దీంతో ఒకటి విఫలమైనా, మరికొన్ని ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అదే డ్రీమ్‌ కెరియర్‌గా అనుకున్న దానిలో ఏవైనా లోపాలుంటే మళ్లీ పాత ఉద్యోగంలో కొనసాగే వీలుండటం ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి అనుకూలాంశం.

సాధారణంగా.. జాబ్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టబోయే వారందరూ రెజ్యూమెను ఎంతో అందంగా, ప్రభావపూరితంగా తయారు చేసుకోవడం, జాబ్‌ పోర్టళ్లలో నమోదు చేసుకోవడం, నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, కాంటాక్ట్‌లను ఉపయోగించడం వంటి వాటిపై దృష్టిపెడుతుంటారు. ఇవన్నీ ముఖ్యమైనవే! కానీ వాటికంటే ప్రధానమైనది ఇంకొకటి ఉంది. అదే- మీ కలల ఉద్యోగం ఏమిటో కనిపెట్టడం.


Back..

Posted on 15-08-2019