Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఆంగ్లానికి అందలం

* 1 నుంచి 10 తరగతులకు ఇంగ్లిషు బోధన
* వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
* జీవో జారీ చేసిన ప్రభుత్వం
* ప్రత్యేకంగా ఉపాధ్యాయుల నియామకం

న్యూస్‌టుడే, ముదినేపల్లి, గొడుగుపేట: ప్రభుత్వం విద్యావ్యవస్థలను, ప్రభుత్వ పాఠశాలలను పటిష్ఠం చేయాలనే ఉద్దేశంతో కీలకమైన ముందడుగు వేసింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆంగ్ల విద్యపై ఆసక్తితో కాన్వెంట్లకు పంపిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఒకటి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మోడల్‌ ప్రైమరీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టనున్నారు. వచ్చే సంవత్సరం ఆపై తరగతులకు విస్తరించనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మిగిలిన ప్రాథమిక పాఠశాలలకు కూడా ఆంగ్ల మాధ్యమానికి విస్తరించనున్నారు. ఈ మోడల్‌ పాఠశాలల్లో ఆంగ్లబోధనకు ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయుడిని నియమించనున్నారు. ఎస్‌ఎంసీ, గ్రామపంచాయతీ తీర్మానాలను ఈనెల 31లోపు డీఈవోలకు సమర్పించాల్సి ఉంది.

తెలుగుతో సమాంతరంగా..
ఒకటి నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్‌) వరకు తెలుగు తప్పనిసరిగా చదవాలని ఈనెల 2న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలియజేశారు. పొరుగునే ఉన్న తెలంగాణలో కూడా తెలుగును కచ్చితంగా చదివేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంపై మోజుతో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంతో సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం జీవో నం.78ను విడుదల చేసి అమలయ్యేలా తదుపరి చర్యలు చేపట్టాలని డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే సక్సెస్‌..
ఉన్నత పాఠశాలల్లో 2008 నుంచి సక్సెస్‌ పాఠశాలల పేరిట ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విజయవంతం కాగా, ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా కేటాయించాల్సి ఉంటుంది.

మౌలిక వసతులు మాటేమిటి?
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల అంతంత మాత్రంగానే ఉన్నాయి. కార్పొరేట్‌ పాఠశాలల్లో తరగతులకు ఒక గది, ఒక ఉపాధ్యాయుడు, ఇతర మౌలిక వసతులు, ప్రాజెక్టు పనులకు బయటకు తీసుకెళ్లడం వంటివి ఉన్నాయి. దీంతో బోధన చేసే ఉపాధ్యాయుడు కేవలం పాఠ్యాంశాలకే పరిమితమవుతుండటంతో ఆయా పాఠశాలల్లో విద్యాభివృద్ధి మెరుగ్గా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో రెండు తరగతి గదులు, ఇద్దరు లేక ఒక ఉపాధ్యాయుడు, అరకొర వసతులు మాత్రమే ఉండటంతో పిల్లలు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆంగ్ల మాధ్యమం ఎంత వరకు సఫలమవుతుంతో చూడాల్సిందే.

ప్రత్యేక నియామకాలు
ఆంగ్ల మాధ్యమం సెక్షన్లకు డీఎస్సీ ద్వారా 50శాతం పోస్టులను భర్తీ చేయనున్న అంతకు ముందుగా హేతుబద్ధీకరణలో మిగులు ఉపాధ్యాయులను ఆయా పాఠశాలల్లో నియమించి, వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో ఆంగ్ల మాధ్యమంలో చదువుకొన్నవారికి డీఎస్సీలో ఉపాధ్యాయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి.
హర్షణీయం: నవీన్‌బాబు, ఉపాధ్యాయుడు
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ఉపాధ్యాయులకు కూడా భాషపై పట్టు సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. తెలుగు భాషకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సమాంతర బోధన అందించాలి.
ఉపాధ్యాయులను నియమించాలి - వెన్నా వెంకటసుబ్బయ్య, విశ్రాంత ఎమ్యీవో
ఆంగ్ల బోధన అందించడం ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. కానీ ఇప్పటికే కొన్ని తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నారు. ఉపాధ్యాయులను నియమించకపోవడంతో ఆటు పోట్లను ఎదుర్కొంటోంది. ఇంగ్లిషు బోధించే సామర్థ్యమున్న ఉపాధ్యాయుల నియామకం చేపడితే ప్రభుత్వ పాఠశాలలకు తిరుగుండదు.
ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే.. -పాండురంగవరప్రసాద్‌, ఉపాధ్యాయ సంఘ నాయకులు
మోడల్‌ పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించిన తర్వాతే ఆంగ్లమాధ్యమం మిగిలిన పాఠశాలల్లో ప్రవేశపెట్టాలి. విద్యార్థుల నిష్పత్తితో సంబంధం లేకుండా వేర్వేరుగా ఉపాధ్యాయులను నియమించాలి. తగినంత మంది ఉపాధ్యాయులుఉన్నప్పుడే ఆంగ్లబోధన పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందుతుంది.
శుభపరిణామమే.. - సీహెచ్‌.చక్రధర్‌, ఉపాధ్యాయుడు
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. ప్రీప్రైమరీ కూడా పాఠశాలలకు అనుసంధానమైనపుడే ఇవి విజయవంతమవుతాయి. పాఠశాలలకు కావలసిన అన్ని మౌలిక అవసరాలు సమకూర్చితే కచ్చితంగా సఫలమవుతాయి. తల్లిదండ్రుల ఆసక్తి మేరకు ఆహ్వానించదగ్గ పరిణామమిది.

Back..

Posted on 09-10-2017