Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పాఠాలపై మనసు నిలవటం లేదా?

అధ్యాపకుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేదు.. ఇంటివద్ద నుంచి ఎవరికి వారు స్వీయబాధ్యతతో ప్రవేశ పరీక్షలకు తయారవుతున్న పరిస్థితి. అయితే చాలామంది విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ మెరుగ్గా సాగటం లేదనీ, పాఠ్యాంశాలపై మనసును నిమగ్నం చేయలేకపోతున్నామనీ చెప్తున్నారు. మరి పరిష్కారం ఏమిటి?

విద్యార్థులు తమ ప్రవేశపరీక్షల సిలబస్‌పైౖ, పునశ్చరణపై తగినంత ఏకాగ్రత చూపకపోవటానికి ఏ కారణాలున్నాయో మొదట గమనించుకోవాలి. పాఠ్యాంశాలపై మనసు నిలవటం లేదంటే వేరేవి అవరోధంగా నిలుస్తున్నాయని అర్థం. స్మార్ట్‌ఫోన్‌ వాడకం వాటిలో ఒకటి. చదివే సమయంలో దాన్ని స్విచాఫ్‌ చేసి, బీరువాలోనో, కబోర్డులోనో కనపడకుండా పెట్టేసెయ్యాలి. టీవీ కార్యక్రమాలు చూడటం మానివేయటం ఉత్తమం. వాటితో చదువుకు అంతరాయం కలగకుండా గట్టి శ్రద్ధ తీసుకోవాలి. లాక్‌డౌన్‌ అసౌకర్యాన్నీ, సమస్యలనూ అతిగా ఊహించుకుని, సమయం వృథా చేసుకోకూడదు.

‘ఎన్నోసార్లు ఇప్పటికే చదివివున్నా కదా, అర్జెంటుగా ఇప్పుడు చదవాల్సిన అవసరమేముంది?’ అనే ఆలోచనలు ప్రిపరేషన్‌ వాయిదాకు దారితీస్తాయి. ఎంత బాగా చదివిందైనా విరామం ఎక్కువైతే సంపూర్ణంగా గుర్తుండదు. అందుకే ప్రతిరోజూ తప్పనిసరిగా నిర్దిష్టంగా కొన్ని గంటలు చదవాలని నిర్ణయించుకుని, వెంటనే ఆచరణలో పెట్టెయ్యాలి. పరీక్షలు దగ్గరకొచ్చేశాయంటే ఏ విద్యార్థికైనా చదవటంపై దానికదే శ్రద్ధ వచ్చేస్తుంది. అందుకే ‘మరో 15 రోజుల్లోనే పరీక్షలు’ అని భావిస్తూ ఊహాత్మక డెడ్‌లైన్‌ను పెట్టుకోవాలి. ఇలా చేస్తే పునశ్చరణ వేగంగా సాగుతుంది.

మ్యాజిక్‌ సెషన్లు
గంటల తరబడి అదే పనిగా ప్రిపరేషన్‌ సాగిస్తూవుంటే ఏకాగ్రత నిలవటం కష్టం. మరి ఎక్కువ సమయం ప్రయోజనకరంగా చదవాలంటే స్వల్ప విరామాలు తప్పనిసరిగా తీసుకుంటుండాలి. శాస్త్రీయంగా చెప్పాలంటే.. మనిషి ఒక విషయమ్మీద దృష్టి కేంద్రీకరించగల సమయం గరిష్ఠంగా 25 నిమిషాలు మాత్రమే. మరేం చేయాలి? అందుకే చదివే వ్యవధిని 30 నిమిషాల మ్యాజిక్‌ సెషన్ల చొప్పున విడగొట్టుకోవడమే! ఇదెలాగంటే...
30 నిమిషాల పాటు చదివి, 5 నిమిషాల విరామం ఇవ్వాలి. ఈ 5 నిమిషాల సమయంలో చదువుకు సంబంధించినదేదీ ఆలోచించవద్ధు కాసేపు అలా నడిస్తే చాలు. చిన్నపాటి వ్యాయామాలు చేసినా మంచిదే. 5 నిమిషాల తర్వాత మరో 30 నిమిషాల సెషన్‌ మొదలుపెట్టండి. ఇలా రోజు మొత్తంలో 20 సెషన్ల వరకూ 10 గంటల సమయం ఏకాగ్రత చెడకుండా సులువుగా, విజయవంతంగా చదువుకోవచ్ఛు.

నిద్రమత్తు వస్తుంటే...
చదవాలంటే శారీరకంగా, మానసికంగా శక్తి అవసరం. చదివేటప్పుడు నిద్ర వచ్చినట్టు అనిపిస్తే కార్డియో వాస్క్యులర్‌ కసరత్తులు చేయాలి. అంటే మరేమీ లేదు. హృదయ స్పందన రేటు పెరిగే ఎక్సర్‌సైజులు! కాసేపు ఇవి చేస్తే నిద్రమత్తు పోయి చురుగ్గా చదువుకోవటం సాధ్యమవుతుంది.
నీళ్ల బాటిల్‌ దగ్గర ఉంచుకుని, ప్రతి అరగంటకో రెండు గుక్కల చొప్పున మంచినీరు తాగటం అలవాటు చేసుకోవాలి. ఇలా డీ హైడ్రేట్‌ అవకుండా ఉండటం ఏకాగ్రత పెరగటానికి వీలు కల్పిస్తుంది.

ఒకటికి మించి పనులు
ఏకాగ్రతను భగ్నం చేసే మరో విషయం.. ఒకే సమయంలో రెండు గానీ అంతకంటే ఎక్కువ గానీ పనులు చేయటానికి ప్రయత్నించటం. ఈ మల్టీటాస్కింగ్‌ వేరే సందర్భాల్లో మంచిదే గానీ పరీక్షల ప్రిపరేషన్లో సరైన ఫలితం ఇవ్వదు. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, టీవీ కార్యక్రమాల్లోకి తొంగిచూడటం లాంటివి చేస్తూ మధ్యలో చదువుకోవటం ఏమాత్రం సరికాదు. ఇలా చేస్తే ప్రిపరేషన్‌ మాత్రం సజావుగా సాగదు. పరీక్షలో రాయటానికి ప్రయత్నించినపుడు అరకొరగానే గుర్తొస్తాయి.

దిగులుకో సమయం
ఏదో ఒక సమస్య, అసంతృప్తి మనసులోకి వస్తూ పుస్తకాలు చదవలేకపోవటం చాలామంది విద్యార్థులకు అనుభవమే. ఇలాంటపుడు రోజూ పదిహేను నిమిషాల ప్రత్యేక వ్యవధిని దిగులుపడటానికి కేటాయించాలి. ఆ సమయం దాటితే ఇక ఏమాత్రం దిగులుపడకూడదని నిశ్చయించుకోవాలి. ఇలా చేస్తే... మిగిలిన సమయమంతా పాఠ్యాంశాలపై మనసును నిమగ్నం చేయవచ్ఛు అనుకున్నదానికంటే తక్కువసేపు చదవటం, సహజం. దీని గురించి బాధపడకూడదు. అది సమయం వృథా చేసుకోవటమే అవుతుంది.

Back..

Posted on 11-05-2020