Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 

అంచనా వేస్తే.. అన్నీ అవకాశాలే!

* ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌

ఆ పరిశ్రమ పెట్టొద్దు.. అదుగో ఆ గ్రామాలన్నీ దెబ్బతింటాయి. ఈ ప్రాజెక్టుతో ఇక్కడి అడవులు, ఇందులోని ఎన్నో రకాల చెట్లు, జంతువులు కనుమరుగైపోతాయి.. అంటూ రకరకాల ఉద్యమాలు జరుగుతుంటాయి. చిప్కో.. నర్మదా బచావో పోరాటాలు అలాంటివే. మన దగ్గర కూడా పర్యావరణంపై పోలవరం ప్రభావం.. మల్లన్న సాగర్‌ ముంపు పరిధి.. తదితరాలు ఇటీవల వార్తల్లో నలుగుతున్నవే. ఆ ప్రభావాలను, ఈ పరిధులను ఎవరు లెక్కగడతారు? ఎలా నిర్ణయిస్తారు? వాటికీ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. పర్యావరణంపై ప్రేమ ఉన్నవారు ఆ అవకాశాలను అందుకోవచ్చు.

అమ్మ అందరికీ ప్రాణాన్ని పోస్తే.. దాన్ని ప్రకృతి నిలిపి ఉంచుతుంది. అలాంటి ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రగతి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేయకూడదు. వీలైనంత వరకు ప్రకృతిని పరిరక్షిస్తూ.. ప్రత్యామ్నాయాలను ఏర్పాటుచేసుకొని అభివృద్ధిని సాధించాలని నిపుణులు చెబుతున్నారు. చెట్లను కౌగిలించుకొని ప్రకృతిని కాపాడమని ప్రార్థించిన చిప్కో ఉద్యమం.. ఆదివాసీల పునరావాస హక్కుల కోసం జరిగిన నర్మదా బచావో ఆందోళన.. పోలవరం.. మల్లన్న సాగర్‌.. ఇలా అన్నీ లక్షలాది నిర్వాసితుల బాధలే. వీటన్నింటినీ విని విశ్లేషించే ఉద్యోగాలు కొన్ని ఉన్నాయి. అవే ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ - ఈఐఏ (పర్యావరణ ప్రభావాల అంచనా). ఆధునిక యుగంలో అభివృద్ధితోపాటు ఈ రంగం కూడా కొత్తగా ఉపాధి కల్పనకు వేదికగా మారింది. వేగంగా విస్తరిస్తోంది.

ఒక ప్రాజెక్టులో ఉండే పర్యావరణ ప్రభావిత అంశాల్ని అంచనా వేసినప్పుడు దానిద్వారా ఏర్పడే దుష్ప్రభావాల్ని ఈ విభాగం తగ్గిస్తుంది. పరిశ్రమలు, థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులు, మైనింగ్‌ తదితరాలు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని కూడా వీరు అంచనా వేస్తారు.

పలు దశల్లో ...
నదీలోయ, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు, మెట్రో ప్రాజెక్టులు, అణువిద్యుత్తు, థర్మల్‌ విద్యుత్తు, ఓడరేవు ప్రాజెక్టులు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని పలు దశల్లో అంచనా వేస్తారు. ఆయా దశల్లో వివిధ రకాల ఉద్యోగులు పని చేస్తుంటారు. ప్రాజెక్టు రూపకల్పన, చట్ట సంబంధ అంశాల పరిశీలన, జీవ వైవిధ్యానికి కలిగే విఘాతం, ప్రత్యామ్నాయాల అన్వేషణ తదితర అంశాలతో నివేదిక సిద్ధం చేస్తారు. ఆ నివేదికలో ప్రభావానికి లోనయ్యే భౌగోళిక పరిధి, జనాభా, రవాణా సంబంధిత విషయాలు, జీవావరణ అంశాలను పొందుపరుస్తారు. ఇవి ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది భూమికి, రెండోది పర్యావరణానికి సంబంధించినవి.ఏదైనా ప్రతిపాదిత ప్రాజెక్టును ఈఐఏకి పంపినప్పుడు ఆ బృందం ఆ సమాచారాన్ని విశ్లేషిస్తుంది. తద్వారా ఆమోదించాలా లేదా అన్నది నిర్ధారించి సంబంధిత మంత్రిత్వశాఖకు పంపుతుంది.

ఎవరు అర్హులు
పర్యావరణ అంచనా విభాగాల్లో ఉద్యోగాలు సంపాదించాలంటే కొన్ని రకాల కోర్సులు చేయాలి. ఇంటర్మీడియట్‌ తర్వాత సాధారణ బీఎస్సీ; బయాలజికల్‌ సైన్సెస్‌ లేదా నేచురల్‌ సైన్సెస్‌లో బీఎస్సీ చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్విరాన్‌మెంట్‌, కెమిస్ట్రీ, జియాలజీల్లో పీజీ చేసినవారు; ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జియో ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, జియోఇన్‌ఫర్మేటిక్స్‌లో ఎంటెక్‌; జియో ఇన్‌ఫర్మేటిక్స్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అండ్‌ జీఐఎస్‌ల్లో పీజీ డిప్లొమా; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ తదితరాల్లో పీహెచ్‌డీ చేసిన వారు ఈఐఏ విభాగాల్లో పనిచేయడానికి అర్హులు. ఈఐఏకి అనువైన వివిధ కోర్సులను జామియా హమ్‌దర్ద్‌ యూనివర్సిటీ న్యూదిల్లీ, కురుక్షేత్ర యూనివర్సిటీ హరియాణ వంటి పలు విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (ఐఐఈఈ) (www.ecology.edu) లోనూ కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఉద్యోగావకాశాలు
ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ రంగానికి సంబంధించి పలు రకాల పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ ఉద్యోగాలు ఉన్నాయి.
ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజర్‌: కన్సల్టెన్సీ స్థాయిలో ఈఐఏ నిర్వహణకు వీరిని తీసుకుంటారు.
సైంటిస్ట్‌ లేదా అనలిస్ట్‌: ప్రభుత్వ, ప్రైవేటు పరిశోధనలకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్‌లు, సంస్థలు, టెస్టింగ్‌ ల్యాబొరేటరీల్లో ఈ అవకాశాలుంటాయి.
సైంటిఫిక్‌ ఆఫీసర్‌: ప్రభుత్వ సంబంధ సైంటిఫిక్‌ ఆర్గనైజేషన్‌లు, ఎన్‌జీఓల్లో వీరి సేవలు అవసరమవుతాయి.
ల్యాబ్‌ ఇన్‌చార్జ్‌: టెస్టింగ్‌ ల్యాబ్‌ల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.
అసిస్టెంట్‌ మేనేజర్‌: కార్పొరేట్‌ కంపెనీలు ఈఐఏ కన్సల్టెన్సీ సేవల కోసం ఈ హోదాతో ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి.
క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (క్యూసీఐ), నేషనల్‌ అక్రిడేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌ఏబిఈటీ) లాంటి సంస్థలు ఈఐఏలో ఉద్యోగాలను వర్గీకరించాయి. అవి
* ఈఐఏ కోఆర్డినేటర్‌ (ఈసీ)
* అసోసియేట్‌ ఈఐఏ కోఆర్డినేటర్‌ (ఏఈసీ- కేటగిరి ఏ)
* ఫంక్షనల్‌ ఏరియా ఎక్స్‌పర్ట్‌ (ఎఫ్‌ఏఈఎస్‌)
* ఫంక్షనల్‌ ఏరియా అసోసియేట్‌ (ఎఫ్‌ఏఏ)
* టీమ్‌ మెంబర్స్‌ (టీఎమ్‌)
* మెంటర్స్‌
ఈఐఏని విభాగాలను హైవేలు, ఎయిర్‌పోర్టులు, కాలువలు, డ్యామ్‌లు పవర్‌ప్లాంట్ల నిర్మాణాల్లో ఏర్పాటు చేస్తారు.

వివిధ రంగాలు: ఈఐఏ నిపుణుల సేవలు పలు రంగాలో అవసరమవుతాయి.
వాటిలో ప్రధానంగా
* సాయిల్‌ సైన్స్‌ ‌
* మెటీరియాలజీ ‌
* హైడ్రాలజీ ‌
* జియాలజీ
* ఎకాలజీ ‌
* వర్షపునీటి ఆధారిత పంటసాగు ‌
* పొల్యూషన్‌ కంట్రోల్‌ అండ్‌ వాటర్‌ కంట్రోల్‌ బోర్డు ఉన్నాయి.
ఈఐఏకి చట్టసంబంధ గుర్తింపును ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ ఇస్తుంది. ఎంత మొత్తంలో సహజవనరులను ఉపయోగిస్తుంది? జాతీయ, అంతర్జాతీయ సంపదకు ఏదైనా హాని జరిగే అవకాశాలున్నాయా అని విశ్లేషిస్తుంది. పర్యాటక ప్రదేశాలకు, చారిత్రక స్థలాలకు సాంస్కృతిక సంపదకు హాని జరగకుండా చూస్తుంది. విదేశాల్లో ఈ రంగానికి విశేష ఆదరణ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటిదేశాల్లో కూడా మంచి ఉద్యోగావకాశాలున్నాయి.


Back..

Posted on 10-05-2019