Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
ఉద్వేగానికి పగ్గమేస్తే..ఉద్యోగం!

* ఈక్యూ - ఎమోషనల్‌ కోషంట్‌

ఉద్యోగాన్ని సాధించుకోవాలంటే చాలినంత ఐక్యూ (ఇంటలిజెన్స్‌ కోషంట్‌ - ప్రజ్ఞాసూచి) ఉంటే సరిపోదు. ఇప్పుడు ఈక్యూ (ఎమోషనల్‌ కోషంట్‌ - భావోద్వేగ సూచి)నీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆటోమేషన్‌ యుగంలో యంత్రాల మధ్య యాంత్రికంగా కాకుండా మనసుతో పనిచేయగలిగిన సామర్థ్యాన్ని లెక్కగడుతున్నారు. అందుకే అభ్యర్థులు ఆఫీసులో సమర్థంగా విధులు నిర్వహించడానికి అవసరమైన తెలివితేటలు, నైపుణ్యాలతోపాటు భావోద్వేగాలపైనా పట్టు సాధించాలి.

ఈక్యూ అంటే..!
సొంత భావోద్వేగాలపైనా, ఎదుటివారి ప్రతిస్పందనలపైనా కలిగి ఉండే సరైన అవగాహనకు కొలమానం.

రఘు, శ్రీను ఇద్దరూ డిగ్రీ విద్యార్థులు. బాగా చదువుతారు. వీరి మధ్య పోటీ తత్వం ఎక్కువ. ఈసారి రఘు ఎంతో కష్టపడ్డాడు. శ్రీను కంటే ఎక్కువ మార్కులు వస్తాయని ధీమాగా ఉన్నాడు. తీరా ఫలితాలు వచ్చేసరికి అంచనా తప్పింది. శ్రీనూకే ఎక్కువ మార్కులు వచ్చాయి! ఆఫీసు లేదా కళాశాల.. ప్రదేశం ఏదైనప్పటికీ ఇలాంటి పరిస్థితి దాదాపు అందరికీ ఎదురవుతుంది. అలాంటప్పుడు రఘు స్థానంలో ఎవరైనా ఉంటే ప్రవర్తన ఎలా ఉంటుంది? కోపం లేదా ఓడిపోయామనే ఫీలింగ్‌ కలుగుతుంది. సాధారణంగా ఈ సమయంలో రెండు రకాల భావాలు ఏర్పడతాయి. ఒకటి- ఎంత చదివినా వెనకబడిపోయాను, ఓడిపోయాను అని నిరాశ చెందడం. రెండు- మొదటి స్థానం సాధించిన వాళ్లకి అభినందనలు చెప్పి ఎప్పటిలా పోటీతత్వాన్ని కొనసాగించడం. మొదటి ప్రతిస్పందన ఎవరికైనా కలిగితే వాళ్లు ఈక్యూ పరంగా వెనకబడినట్లుగా భావించాలి.

ఒకరు తమ భావోద్వేగాలను తెలుసుకోవడం, ఎదుటివారివీ సరిగా అర్థం చేసుకొని తగిన విధంగా ప్రతిస్పందించడాన్ని ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ అంటారు. తరగతులకు హాజరవడం, ఆపై ట్యూషన్లు, కోచింగ్‌ క్లాసులు, అసైన్‌మెంట్లు, పరీక్షలు.. వీటన్నింటితో విద్యార్థి జీవితం బిజీబిజీగా సాగిపోతుంది. ఎంతసేపూ మార్కులు, ర్యాంకులు సాధించడంపైనే దృష్టి ఉంటోంది. దీంతో తమ మానసిక పరిస్థితిని, భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారనేది కొన్ని పరిశోధనల సారాంశం. ఐక్యూ పరంగా విజయం సాధిస్తున్నారు. కానీ ఈక్యూ విషయంలోనే విఫలమవుతున్నారు. పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌ దిశగా నడుస్తున్నాయి. ఈ సమయంలో యంత్రాలతో పోటీపడి నిలబడాలంటే అవి చేయలేని అంశాలపై దృష్టిపెట్టాలి. అలాంటి వాటిలో ఈక్యూ ప్రధానమైంది. పనిచేసే ప్రాంతాల్లో దీని ఆవశ్యకత పెరుగుతోంది. అందుకే విజయం సాధించాలంటే తెలివితేటలు, నైపుణ్యాలే కాదు భావోద్వేగపరమైన అవగాహనా ఉండాలని అభ్యర్థులు గమనించాలి.

ఎందుకు ప్రాముఖ్యం?
* ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌ ఎక్కువగా ఉన్నవారు పోటీ ప్రపంచంలో సులువుగా మనుగడ సాగించగలుగుతారు. కష్టమైన పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎలాంటి మనస్తత్వం ఉన్నవారితోనైనా సులువుగా కలిసిపోతారు. ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
* మానవ సంబంధాలను తేలికగా ఏర్పరచుకోవడంలో, వాటిని కొనసాగించడంలో కీలకంగా ఉంటారు. బృందంలో పనిచేయడంలో, దాన్ని ముందుకు నడపడంలోనూ కీలకపాత్ర పోషిస్తారు. సంస్థ చిన్నదైనా, పెద్దదైనా పదులు లేదా వందల సంఖ్యలో ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. అది సులువుగా, సౌకర్యంగా సాగాలంటే ఈక్యూ ఉన్నవారు అవసరమవుతారు.
* భావప్రకటనలోనూ, భాషానైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలోనూ ఈక్యూ ఉపయోగపడుతుంది. ఆలోచనలను ఎలాంటి సంకోచం లేకుండా పంచుకోగలుగుతారు. కొత్త బంధాలను ఏర్పరుచుకుంటారు.
* ఈక్యూ ఉంటే మానసిక స్థితిపై పట్టు ఉంటుంది. ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవాలో అవగాహన ఉంటుంది. కుంగుబాటుకు ఆస్కారం ఉండదు.

ఏమేం చూసుకోవాలి?
స్వీయ అవగాహన: సొంత భావోద్వేగాలను గమనించుకోవాలి. అవి ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకోవాలి. ప్రతిరోజూ మానసిక స్థితి ఏమిటని ఆలోచించాలి. దానికి ఒక పేరు పెట్టాలి. కొన్ని గంటల తర్వాత మళ్లీ పరిశీలించాలి. ఆ భావోద్వేగానికి కారణమైన సంఘటన/ వ్యక్తి ఎవరో గుర్తించాలి. ఏయే సంఘటన ఎలాంటి ప్రభావం చూపుతోంది, దాన్ని నియంత్రించుకోవడానికి తోడ్పడేదేమిటి తెలుసుకోవాలి. దీంతో భావోద్వేగాలపై పట్టు కుదురుతుంది.
సహానుభూతి: ఏదైనా పరిస్థితిలో ప్రతిస్పందించడానికి ముందు ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకోవడం, ఎదుటివారి ఉద్వేగాలను గమనించడం అలవాటు చేసుకోవాలి. ఒక విషయంలో ఎదుటివారు ఎలా ప్రవర్తించాలని కోరుకుంటారో మీరూ అలాగే ఉండగలగాలి. ఉదాహరణకు- జ్వరం వచ్చినప్పుడు దగ్గరుండి చూసుకోవాలి, సమయానికి అన్నీ అందించాలి అని భావిస్తే, మీరూ అవసరమైన వాళ్లకి అలాగే చేయగలగాలి.
స్వీయ నియంత్రణ: వ్యతిరేక ఆలోచనలకు కళ్లెం వేయాలి. దుస్తులు, వాతావరణం, ఫ్యాషన్‌.. ఇలా ప్రతిదానిలోనూ మార్పు సహజం. కానీ అది ప్రారంభం కాగానే చాలామంది భయపడుతుంటారు. ఈ సమయంలోనే చొరవ తీసుకోవాలి. ఫలితం ఏదైనా బాధ్యత వహించాలి. భిన్నాభిప్రాయాలు ఎదురైనప్పుడు సహనం పాటించాలి.
స్వీయ ప్రేరణ: అంతర్గతంగా, బహిర్గతంగా ఎదురయ్యే అసంతృప్తులకు లొంగిపోకూడదు. పరుగు పందెంలో పాల్గొనేవారిని గమనించినప్పుడు బయటి నుంచి ప్రోత్సహిస్తుంటే మరింత ఉత్సాహంగా పరుగెడుతుంటారు. లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల వారిలో పెరుగుతుంది. అన్నిసార్లూ బయటి నుంచి మద్దతు ఆశించడం కుదరదు. కాబట్టి, స్వీయ ప్రేరణపై దృష్టిపెట్టాలి. ఏదైనా అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా తిరిగి దాన్ని సాధించేందుకు ప్రయత్నించాలి.
సాంఘిక నైపుణ్యాలు: ఎదుటివారి భావోద్వేగాలను గమనిస్తూ వాటికి తగిన విధంగా ప్రవర్తించడం సాంఘిక నైపుణ్యం. బాధ, సంతోషం, కోపం.. ఇలా ఏదైనా వినడానికి ఒకరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇదే అవసరం ప్రతి ఒక్కరికీ వస్తుంది. మాట్లాడటమే కాదు, ఓపికగా వినడమూ నేర్చుకోవాలి. నాన్‌వెర్బల్‌ కమ్యూనికేషన్స్‌ అంటే ముఖకవళికలు, సైగలు, శరీర భాషపైనా దృష్టిపెట్టాలి.

ఇలాంటివి చేయవద్దు!
* దేన్నీ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. అలా తీసుకుంటే సరైన నిర్ణయాలు చేయలేరు. సాధారణంగా ఎవరైనా ఎందులోనైనా విఫలమైతే.. దానికి కారణం ఫలానా వారే అనే అభిప్రాయానికి వచ్చేస్తుంటారు. ప్రతి ఒక్కరికీ సొంత ఆలోచనలుంటాయి. కావాలని ఎదుటివారిని అపజయంపాలు చేయాలని ప్రయత్నించేంత సమయం ఎవరికీ ఉండదని గ్రహించాలి.
* పని ప్రదేశంలో/ తరగతిలో తెలివైనవారిగా, అధికారం చెలాయించే స్థానంలో/ ప్రముఖ వ్యక్తిగా ఉండాలనే కోరిక చాలామందికి ఉంటుంది. ఇలాంటి ఆలోచన ఉన్నవారు తరచూ దాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ దానివల్ల గుర్తింపురాదు. పైగా వ్యతిరేక భావన ఏర్పడుతుంది. ఎప్పుడూ సాయానికి ముందుండే వారికే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తించాలి.
* డిగ్రీలు, మార్కులను బట్టి ఎవరినీ చిన్నచూపు చూడటం, తక్కువగా అంచనా వేయడం సరైన పద్ధతి కాదు. ఇతరుల నుంచి సాయం, గౌరవం పొందాలంటే వారికి తగిన మర్యాద ఇవ్వాలి. విభేదాలుంటే సున్నితంగా చెప్పాలి.
* కెరియర్‌లో ముందుకు సాగాలంటే తమకన్నా మెరుగైనవారి నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఉదాహరణకు- ప్రాజెక్టు చేస్తున్నారు. చాలా కష్టపడి రిపోర్ట్‌ తయారు చేశారు. సంబంధిత వ్యక్తికి చూపించారు. ఆయనకు నచ్చలేదు. మళ్లీ వివరించారు. అయినా ఉపయోగం లేకపోయింది. అప్పుడు వాదనకు దిగకూడదు. విమర్శలనూ పరిగణనలోకి తీసుకోవాలి.
* కెరియర్‌లో గెలుపు దిశగా పయనించడానికి తోడ్పడే సాధనం విశ్వసనీయత. అది ఏర్పడాలంటే ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడినీ, భావోద్వేగాలనూ అదుపు చేయడం తెలియాలి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉద్వేగం ఉంటుంది. ఆశించిన గుర్తింపు రాలేదని పక్కవారిపై అసంతృప్తిని ప్రదర్శించడం మంచిదికాదు.

దరఖాస్తు చేశారా?
ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 188 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
చివరితేది: ఫిబ్రవరి 13, 2020.

యూపీఎస్సీలో వివిధ ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.
చివరితేది: ఫిబ్రవరి 13, 2020.

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 1273 ఖాళీలు
అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
చివరితేది: ఫిబ్రవరి 14, 2020.

సాయ్‌లో 347 స్పోర్ట్స్‌ సైంటిస్టులు, ఇతర ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.
చివరితేది: ఫిబ్రవరి 15, 2020.

Back..

Posted on 13-02-2020