Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
విష‌య వ్య‌క్తీక‌ర‌ణ‌కు విలువైన మార్గం!

సివిల్స్‌, గ్రూప్స్‌, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు వ్యాసరూప సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పరిజ్ఞానంతోపాటు భావవ్యక్తీకరణ తీరును, తార్కికమైన ఆలోచనా విధానాన్ని పరిశీలిస్తారు. తెలిసిందంతా రాసేయడం, పదాడంబరాన్ని ప్రదర్శించడం లాంటి పొరపాట్లు చేయకుండా తెలుగు మాధ్యమం అభ్యర్థులు వివరణాత్మక జవాబులను, వ్యాసాన్ని ప్రభావపూరితంగా ఎలా రాయాలో తెలుసుకుందాం.
పోటీపరీక్షల్లో వ్యాసరచన మంచి మార్కులు తెచ్చుకోడానికి ఒక చక్కని మార్గం. తెలుగు మాధ్యమంలో రాసేవాళ్లు కొంచెం జాగ్రత్త వహిస్తే ఎక్కువ మార్కులు సాధించుకోవచ్చు. అర్హత పరీక్షల్లోనూ వ్యాసరచన ముఖ్యమైనదే. వ్యాసం అంటే విస్తరించడం, వివరించడం అని అర్థాలు. ఒక అంశాన్ని వివరించి అంటే పెంచి రాయడం. అంశం ఏదైనా దానికి సంబంధించిన తగిన విషయ పరిజ్ఞానం ఉంటేనే మంచి వ్యాసం రాయడం సాధ్యమవుతుంది.
అర్థమయ్యేలా రాస్తే చాలు!
చక్కటి దస్తూరితో రాయడం మంచి వ్యాసం అనిపించుకోదు. రాతకు సంబంధించి అర్థమయ్యే విధంగా ఉంటే చాలు. వాక్యాల్లో వంకరటింకరలు ఉండకూడదు. కొందరు వాక్యాలను ఏటవాలుగా రాస్తారు. సమంగా రాయాలి. తెలుగు రాసేటప్పుడు భాషాదోషాలపై శ్రద్ధ వహించాలి. భాషాదోషాలంటే వ్యాకరణం ప్రకారం రాయడం కాదు. స్పష్టతతో అర్థభేదాలు లేకుండా రాయాలి.
ఉదాహరణకు- బావి అంటే నుయ్యి. చిన్న వత్తు ఇచ్చేశామంటే భావి అవుతుంది. దానికి అర్థం భవిష్యత్తు. శాకాహారం అంటే కూరగాయల ఆహారం. అదే శాఖాహారం అర్థం కొమ్మలతో ఆహారం. అలాగే పతకం రాయబోయి పతాకం రాస్తే చదివేవాళ్లు అయోమయంలో పడిపోతారు. ఇలా ఒకదాని బదులు ఇంకోటి రాస్తే వ్యాసం లక్ష్యం దెబ్బతింటుంది.
సాధారణంగా వచ్చే తప్పులను కొన్నింటిని పరిశీలిస్తే అవి ఎలా దొర్లుతాయో అర్థం చేసుకోవచ్చు. మొదటి పదం తప్పుగా రాసింది. బ్రాకెట్లో ఉన్నది సరైన ప్రయోగం. విధ్య (విద్య), స్వశ్చం (స్వచ్ఛం), భోదించు (బోధించు), శ్రేష్టం (శ్రేష్ఠం), శతృవు (శత్రువు), రాయభారం (రాయబారం), మహత్యం (మహాత్మ్యం), వర్నం (వర్ణం). కొంతమంది వత్తులు అక్షరాల పక్కన రాస్తుంటారు. దీని వల్ల కూడా అనర్థాలు జరుగుతాయి. అస్పష్టతలకు దారితీస్తుంది.
వాడుక భాషే వాడాలి
తప్పులు లేకుండా రాయాలన్నంత మాత్రాన వ్యాకరణ భాష లేదా మిత్రలాభం (చిన్నయ సూరి) భాష ఉపయోగించాలని కాదు. ఆ భాష రాయడం ఈ రోజుల్లో అనర్థం కూడా. వాడుక భాషలోనే వ్యాసం రాయాలి. అంటే పత్రికా భాష అని చెప్పవచ్చు. పోటీపరీక్షల్లో విషయమే అతి ముఖ్యం. ఆ విషయానికి స్పష్టతను ఇచ్చేది రాత. మనం మాట్లాడే భాషలోనే రాయాలి. కొందరు తమ ప్రాంతీయ భాషా పదాలు (మాండలిక పదాలు) వాడతారు. తప్పుకాదు కానీ ఎగ్జామినర్‌కి తెలియకపోతే మార్కులు తగ్గవచ్చు. అలాంటివి ఉపయోగించినప్పుడు బ్రాకెట్‌లో దాని అర్థాన్ని రాయాలి.
తక్కువగా ఆంగ్ల పదాలు
వీలైనంత వరకు ఆంగ్ల పదాలు రాకుండా చూడాలి. కొన్ని సాంకేతిక పదాలను ఆంగ్లంలో రాయవచ్చు. అయితే వాటికి అర్థాలు రాయడమో లేదా తెలుగు లిపిలో రాయడమో చేయాలి. కంప్యూటర్‌ అనే ఆంగ్ల పదాన్ని తెలుగులో రాయడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. కానీ ఇంటర్‌నెట్‌ వంటి పదాలకు ఇప్పుడు వాడుకలో ఉన్న ‘అంతర్జాలం’ ఉపయోగించవచ్చు.
విషయ విభజన అవసరం
ఇచ్చిన అంశాన్ని పలుకోణాల నుంచి విశ్లేషించాలి. అలా విశ్లేషిస్తున్నప్పుడు విషయాన్ని బట్టి పేరాలుగా విభజించుకోవాలి. అప్పుడే తెలియజేయాలనుకున్న అంశాన్ని పాఠకులు తేలిగ్గా గ్రహించగలుగుతారు.
జాతీయాలు, సామెతల వినియోగం
విషయం వ్యక్తీకరిస్తున్నప్పుడు సామెతలు, జాతీయాలను వాడవచ్చు. అయితే అవి సందర్భానికి అతికినట్లు ఉండాలి. వాటి అర్థాన్ని పూర్తిగా తెలుసుకొని వాడాలి. అప్పుడు భావానికి బలం వస్తుంది. పఠనానికి అనుకూలంగా ఉంటుంది.
ఉదాహరణకు పాకిస్థాన్‌ మనకి తలనొప్పిగా మారింది. ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. మనకి నష్టం కలిగిస్తోందని చెప్పడానికి ‘పాకిస్థాన్‌ మనకు పక్కలో బల్లెంలా ఉంది’ అంటే మరింత ప్రభావపూరితంగా ఉంటుంది. అలాగే ‘ప్రభుత్వాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదు’ అనే విషయాన్ని ‘చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా..’ అని చెప్పడం బాగుంటుంది.
ప్రారంభమే కీలకం
వ్యాసాన్ని ఎలా ప్రారంభించాలి. ఆంగ్లంలో ‘వెల్‌ బిగన్‌ ఈజ్‌ హాఫ్‌ డన్‌’ అంటారు. ఇచ్చిన అంశాన్ని బట్టి ప్రారంభం ఉండాలి. చక్కటి ఉపోద్ఘాతం లేదా ఒక సూక్తితో ప్రారంభించడం బాగుంటుంది. పూర్వ వివరాలు, ఆవశ్యకత, ఇచ్చిన అంశం ప్రాధాన్యం లేదా అవసరాన్ని గురించి తెలియజేస్తూ మొదలు పెట్టవచ్చు. ప్రారంభం బాగుంటే ఎగ్జామినర్‌ సానుకూల దృక్పథంతో మంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
ముగింపు జ్ఞానాన్ని మదింపు చేస్తుంది
విషయ విశ్లేషణ చేశారు. లోపాలను లేదా మంచి చెడులను వెల్లడించారు. అయినా చివరి పేరాలో ముగింపు కూడా చాలా ముఖ్యం. అభ్యర్థి అంచనా ఏమిటి? ఏ వైపు మొగ్గుతున్నాడు? కారణాలేమిటి? సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నాడా? వాటిని సమర్థించుకోగలుగుతున్నాడా అనే అంశాలు కూడా ఇతరుల కంటే ఎక్కువ మార్కులు సంపాదించి పెడతాయి. చివరకు తేలిందేమిటో స్పష్టంగా చెప్పాలి. అది అభ్యర్థి ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుంది. నిర్దిష్ట పదాల్లో రాయాల్సి వచ్చినప్పుడు నిబంధన అతిక్రమించకుండా సంక్షిప్తత పాటించాలి. ఒక ఇరవై పదాలు అటూ ఇటూ ఉన్నా ప్రమాదం లేదు. పూర్తి చేయకుండా వదిలేయకూడదు. ఇందుకోసం వ్యాసరచనను తప్పనిసరిగా సాధన చేయాలి.
తప్పులు లేకుండా రాయాలన్నంత మాత్రాన వ్యాకరణ భాష లేదా మిత్రలాభం (చిన్నయ సూరి) భాష ఉపయోగించాలని కాదు. ఆ భాష రాయడం ఈ రోజుల్లో అనర్థం కూడా. వాడుక భాషలోనే వ్యాసం రాయాలి. అంటే పత్రికా భాష అని చెప్పవచ్చు. పోటీపరీక్షల్లో విషయమే అతి ముఖ్యం. ఆ విషయానికి స్పష్టతను ఇచ్చేది రాత. మనం మాట్లాడే భాషలోనే రాయాలి. కొందరు తమ ప్రాంతీయ భాషా పదాలు (మాండలిక పదాలు) వాడతారు. తప్పుకాదు కానీ ఎగ్జామినర్‌కి తెలియకపోతే మార్కులు తగ్గవచ్చు. అలాంటివి ఉపయోగించినప్పుడు బ్రాకెట్‌లో దాని అర్థాన్ని రాయాలి.

- డాక్ట‌ర్ ద్వానాశాస్త్రి


Back..

Posted on 06-02-2017