Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
కెరియర్‌ గైడెన్స్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌

టెక్నాలజీతో ఎన్నో పనులు ఎంతో సులువుగా జరిగిపోతున్నప్పటికీ సమాచార భద్రత విషయంలో కొత్త ప్రమాదాలు ఎదురవుతున్నాయి. వెబ్‌సైట్‌లు హ్యాక్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు దోచేస్తున్నారు. సంస్థలకు, వినియోగదారులకు కొందరు సైబర్‌ దొంగలు పెద్దఎత్తున నష్టాలు కలిగిస్తున్నారు. ఈ ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలి... దీనికి సమాధానమే ఎథికల్‌ హ్యాకింగ్‌. మన సైట్‌ను మనమే హ్యాక్‌ చేయించుకోవడం, మన సొమ్మును దొంగిలించమని మంచి దొంగలకు మనమే చెప్పడం. అలా జరగడానికి ఉన్న అవకాశాలను గుర్తించి తగిన భద్ర]తా చర్యలు తీసుకోవడం. దీన్నే ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటారు. ఇప్పుడు ఈ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థలన్నింటిపై సైబర్‌ దాడులు పెరుగుతున్నాయి. విలువైన సమాచారాన్ని (డేటా) కొట్టేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫేస్‌బుక్‌, గూగుల్‌ లాంటి దిగ్గజ కార్పొరేట్‌ సంస్థలకూ ఇలాంటి ప్రమాదాలు తప్పడం లేదు.సోఫోస్‌ సంస్థ సర్వే ప్రకారం 2018లో భారత్‌లో 76 శాతం కంపెనీలు సైబర్‌ దాడులకు గురయ్యాయి. ప్రపంచంలో మెక్సికో, ఫ్రాన్స్‌ల తర్వాత మనదేశంలోనే ఈ దాడులు ఎక్కువని తేలింది. సైబర్‌ సెక్యూరిటీ పెద్ద సవాల్‌గా మారుతోంది. దీన్ని ఎదుర్కోడానికి సమర్థ మానవ వనరులు అందుబాటులో లేవు. దీంతో అన్ని సంస్థలకు హ్యాకింగ్‌ నిపుణుల సేవలు అవసరమయ్యాయి. ఇప్పుడు అన్నిరకాల లావాదేవీలు దాదాపు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. కొనుగోళ్లు, నగదు బదిలీలు తదితరాలన్నింటికీ మొబైల్‌ ప్రధాన ఆధారమైంది. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌పే, భీమ్‌ వంటి అప్లికేషన్లు లేని మొబైల్‌ లేదంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటికీ సైబర్‌ దాడుల ప్రమాదం పొంచి ఉంది. ఐటీ, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, రక్షణ రంగం, పోలీస్‌ సర్వీస్‌ మొదలైన విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికీ కొందరు సిద్ధంగా ఉంటారు. అందుకే ఆయా కంపెనీలు, విభాగాలు అలాంటి దాడుల నుంచి కాపాడుకోడానికి ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంటాయి. ఇలాంటి రక్షణ కార్యక్రమాలకే ఎథికల్‌ హ్యాకింగ్‌ నిపుణులు కావాలి.

ఎవరీ హ్యాకర్లు?
సాంకేతిక పరిజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని మంచి కోసం వినియోగించేవారు ఎథికల్‌ హ్యాకర్లు. హ్యాకర్లలో స్థూలంగా మూడు రకాల వారున్నారు. వైట్‌ హ్యాట్‌, గ్రే హ్యాట్‌, బ్లాక్‌ హ్యాట్‌ హ్యాకర్లు. వైట్‌ హ్యాట్‌ వాళ్లు సంస్థలపై సైబర్‌ దాడులు జరగకుండా కాపాడతారు. సైబర్‌ నిపుణులుగా సేవలందిస్తారు. వీరు ఉద్యోగం ద్వారా సంపాదిస్తారు. కొంత మొత్తం ఇస్తే సంస్థల నెట్‌వర్క్‌లో లోపాలను సరిచేసేవారు గ్రే హ్యాట్‌ హ్యాకర్లు. లేదంటే ఆన్‌లైన్‌లో వివరాలు బట్టబయలు చేస్తామని బెదిరిస్తారు. వీళ్లు ఉనికి చాటుకోవడానికి లోపాలను అన్వేషిస్తారు. సైబర్‌ దాడులు చేసి పెద్ద మొత్తంలో దోచుకోవడం లేదా డిమాండ్‌ చేసేవాళ్లు బ్లాక్‌ హ్యాట్‌ హ్యాకర్లు.

ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటే?
సంస్థల అనుమతితో వాటి వెబ్‌సైట్ల (నెట్‌వర్క్‌)లోకి ప్రవేశించి అందులోని లోపాలను గుర్తించడం, కుదిరితే వాటిని సరిచేయడం ఎథికల్‌ హ్యాకర్ల విధి. సైబర్‌ దాడులు జరగడానికి ఉన్న అన్ని అవకాశాలూ వీరు పరిశీలిస్తారు. ఆ వివరాలను సంస్థలకు అందిస్తారు. అందుకే సంస్థలే ముందుగా అందులోని లోపాలను గుర్తించమని ఎథికల్‌ హ్యాకర్లను కోరతాయి. వీరు తమకున్న సాంకేతిక నైపుణ్యంతో లోపాలను పట్టుకుంటారు. నెట్‌ వర్కింగ్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌లపై పట్టున్నవారు ఇలా చేయగలరు. పెనెట్రేషన్‌ టెస్టింగ్‌, సెక్యూరిటీ ఎనాలిసిస్‌, రివర్స్‌ ఇంజినీరింగ్‌, మాల్వేర్‌ ఎనాలిసిస్‌, సెక్యూరిటీ ఆడిటింగ్‌, సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌...తదితర విధానాలను ఉపయోగించి దాడి జరగడానికి అవకాశం లేకుండా చూస్తారు. ఇప్పుడు కొన్ని సంస్థలు కొత్త సాఫ్ట్‌వేర్‌ తీసుకొస్తున్నప్పుడు లోపాలు గుర్తించమని వినియోగదారులను కోరుతున్నాయి. ఇలా గుర్తించినవారికి పెద్ద మొత్తంలో పారితోషికం అందిస్తున్నాయి. వాళ్లు విడుదల చేసే తర్వాతి వెర్షన్‌లో ఆ లోపం లేకుండా చేసుకుంటున్నాయి. హ్యాకింగ్‌ పరిజ్ఞానం ఉన్నవారు ఈ సవాల్‌ స్వీకరించి డబ్బు, ఉద్యోగం, పేరు సంపాదించుకోవచ్చు. ఎథికల్‌ హ్యాకింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ కోర్సులు చదివినవారికి ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌, ఫోరెన్సిక్‌ అనలిస్ట్‌, కన్సల్టెంట్‌, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజర్‌, పెనెట్రేషన్‌ టెస్టర్‌, సెక్యూరిటీ ఎనలిస్ట్‌, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్‌, సెక్యూరిటీ కన్సల్టెంట్‌, ఎథికల్‌ హ్యాకర్‌ మొదలైన హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి.

ఎథికల్‌ హ్యాకర్‌ కావాలంటే...
కొన్ని సంస్థలు యూజీ, పీజీ స్థాయుల్లో సైబర్‌ సెక్యూరిటీ, ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సులు అందిస్తున్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, గణితం కోర్సులు చదువుకున్నవారు ఎథికల్‌ హ్యాకర్‌గా రాణించడానికి అవకాశాలున్నాయి. వీటితోపాటు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సృజనాత్మకంగా ఆలోచించగలగడం, ఒత్తిడిని అధిగమించడం ముఖ్యం. సీ++, జావా, పైథాన్‌, పీహెచ్‌పీ...మొదలైనవాటిపై పరిజ్ఞానం ఉండాలి. యునిక్స్‌, విండోస్‌, లైనక్స్‌, ఐవోఎస్‌ తదితర ఆపరేటింగ్‌ సిస్టంలపై అవగాహన ఉండాలి. కొత్త సాంకేతిక అంశాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలి. సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకునే, అనువర్తించుకునే నైపుణ్యం పెంచుకోవాలి. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ఇందుకోసం వర్చువల్‌ ల్యాబ్స్‌లో ఫేక్‌ వెబ్‌సైట్లపై సాధన చేయాలి. కొత్తగా వస్తోన్న సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధులై ఉండాలి. వీటిద్వారానే తమ ప్రావీణ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. హ్యాకింగ్‌ పరిజ్ఞానానికి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్లూ అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసినవారికి నియామకాల్లో ప్రాధాన్యం లభిస్తుంది. ఈసీ కౌన్సిల్‌ సంస్థ అందించే సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌ (సీఈహెచ్‌) మంచి గుర్తింపు పొందింది.

కోర్సులందిస్తోన్న సంస్థలు
* యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌: ఎమ్మెస్సీ సైబర్‌ ఫోరెన్సిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ
* గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్సిటీ: ఎంఎస్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అష్యూరెన్స్‌
* మణిపాల్‌ యూనివర్సిటీ: ఎథికల్‌ హ్యాకింగ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీలో సర్టిఫికెట్‌ కోర్సు
* కేజే సోమయ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ అండ్‌ రిసెర్చ్‌: ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ పీజీ
* సీ డాక్‌, హైదరాబాద్‌: నెట్‌ వర్కింగ్‌ అండ్‌ సిస్టమ్‌ సెక్యూరిటీలో సర్టిఫికెట్‌ కోర్సు
* ఇగ్నో: పీజీ డిప్లొమా ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ
* ఐఐఐటీ- హైదరాబాద్‌: ఎంటెక్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ), అలహాబాద్‌: ఎంటెక్‌ సైబర్‌ లా అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ కోర్సు
* ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌ (ఐఐడీటీ), తిరుపతి: సైబర్‌ సెక్యూరిటీలో పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం అందిస్తోంది. ఇది 11 నెలల రెసిడెన్షియల్‌ కోర్సు. ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. డిగ్రీ స్థాయిలో కంప్యూటర్‌ సైన్స్‌ లేదా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సులు 60 శాతం మార్కులతో పూర్తిచేసినవారెవరైనా ఈ కోర్సులో చేరవచ్చు. ఫీజు రూ.5.25 లక్షలు (ట్యూషన్‌, వసతి, భోజనం, ల్యాప్‌టాప్‌...అన్నీ కలిపి). పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలు లభిస్తాయి.
* యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌), దేహ్రాదూన్‌: సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు అందిస్తోంది.
* సైబర్‌ సెక్యూరిటీ స్టడీస్‌ అండ్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ (సీఎస్‌ఎస్‌ఆర్‌ఎల్‌), పుణె: డిప్లొమా, సర్టిఫికేషన్‌ కోర్సులు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐటీఎం), త్రివేండ్రం: ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో సైబర్‌ సెక్యూరిటీ స్పెషలైజేషన్‌గా అందిస్తోంది.
* ఇంటర్నేషనల్‌ కాలేజ్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌, న్యూదిల్లీ: సైబర్‌ సెక్యూరిటీలో డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు

ఈసీ కౌన్సిల్‌ అందించే సర్టిఫికేషన్లు
సర్టిఫైడ్‌ ఎథికల్‌ హ్యాకర్‌ (సీఈహెచ్‌), కంప్యూటర్‌ హ్యాకింగ్‌ ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటర్‌ (సీహెచ్‌ఎఫ్‌ఐ), ఈసీ కౌన్సిల్‌ సర్టిఫైడ్‌ సెక్యూరిటీ ఎనలిస్ట్‌ (ఈసీఎస్‌ఎ), లైసెన్స్‌ పెనెట్రేషన్‌ టెస్టర్‌ (ఎల్‌పీటీ), ఆన్‌లైన్‌ మోసాలు గుర్తించడానికి కంప్యూటర్‌ హ్యాకింగ్‌ ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేటర్‌ (సీహెచ్‌ఎఫ్‌ఐ) సర్టిఫికేషన్‌ ఉంది. సర్టిఫైడ్‌ అప్లికేషన్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌ (సీఏఎస్‌ఈ) జావా, .నెట్‌ల్లో అందిస్తోంది. ఈ సంస్థ సిస్కోతో కలిసి సర్టిఫైడ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఐఎస్‌ఓ) కోర్సులో సర్టిఫికేషన్‌ అందిస్తోంది.

ఇతర సంస్థలు అందించే మరికొన్ని సర్టిఫికేషన్లు: ఎస్‌ఏఎన్‌ఎస్‌ జీఐఏసీ, సర్టిఫైడ్‌ వల్నరబిలిటీ అసెసర్‌(సీవీఏ), సర్టిఫైడ్‌ ప్రొఫెషనల్‌ ఎథికల్‌ హ్యాకర్‌ (సీపీఈహెచ్‌), సర్టిఫైడ్‌ పెనెట్రేషన్‌ టెస్టింగ్‌ ఇంజినీర్‌(సీపీటీఈ) వివిధ కార్పొరేట్‌ సంస్థలు, విద్యాలయాలు హ్యాకథాన్లు నిర్వహిస్తున్నాయి. టెడ్‌ఎక్స్‌, యూట్యూబ్‌ల్లో సైతం హ్యాకింగ్‌ సంబంధిత సమాచారం లభిస్తుంది.


Back..

Posted on 20-08-2019