Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
‘పోటీ’కి పనికొచ్చే పాఠం!

పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే అభ్యర్థుల దృక్కోణం వేరుగా ఉండాలి. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీ పరీక్షలెన్నో ముందుకు వస్తున్న తరుణమిది. ఈ సందర్భంగా అభ్యర్థులు సాధారణంగా వేసే తప్పటడుగులూ, వాటిని సవరించుకునే విధానం తెలుసుకుందాం!
‘ఒక అలవాటుగా మారనంతవరకూ ఓటమి మంచిదే’నన్నది డిస్నీ కార్పొరేషన్‌ సీఈఓ మైకెల్‌ ఐస్నర్‌ వ్యాఖ్య. పోటీ పరీక్షల్లో ఇది అక్షరసత్యం. కెరియర్‌కెంతో విలువైన ఈ పరీక్షల మెట్లు ఎక్కుతుంటే ఏదో ఒక మెట్టు దగ్గర పట్టు తప్పడం సహజం. దానికి చింతించకుండా జరిగిన తప్పులను సరిదిద్దుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.
1. కాంక్ష బలంగా లేకపోవడం: పోటీ పరీక్షల్లో విజయం సులభం కాదు. సాధారణంగా జేఈఈ నుంచి సివిల్స్‌, బ్యాంకులు, స్టాఫ్‌ సెలక్షన్స్‌, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ వరకు ఏ సంస్థ నిర్వహించినా పోస్టులు వేలల్లో ఉంటే పోటీపడేవారు లక్షల్లో ఉంటారు. ఉదాహరణకు- ఏపీపీఎస్‌సీ ప్రకటించిన గ్రూప్‌-2 కేటగిరీలో వెయ్యి పోస్టులుంటే పోటీపడేవారి సంఖ్య గడువు డిసెంబర్‌ 10 నాటికి ఏడెనిమిది లక్షలకు చేరడం ఖాయం. అంటే ప్రతి పోస్టుకూ 800 మంది తలపడే అవకాశం ఉంది. పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇంత పోటీని ఎదుర్కోవాలంటే బలమైన సంకల్పం, తృష్ణ ఉండాలి. అయితే చాలామందిలో ఇది కొరవడుతుంటుంది. కొంతమందిలో తొలిదశలో ఉన్నట్లు కనిపించినా క్రమేపీ ఆరిపోతుంది. అయితే ఆశ్చర్యకరంగా ఈ విషయాన్ని వారు గుర్తించరు. తాము చదువుతున్నామనే అనుకుంటారు కానీ ఫలితం మాత్రం ప్రతికూలంగా వస్తుంది.
2. అవగాహన లోపం: ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉద్యుక్తులయ్యేవారిలో సగానికి సగం మందికి సరైన అవగాహన ఉండదు. చేయబోయే ఉద్యోగం, రాయబోయే పరీక్ష విధానం, శ్రమించాల్సిన మార్గంపై తగిన స్పష్టత కొరవడుతుంది. తమకు ఇంటర్‌, డిగ్రీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయని, పోటీ పరీక్షలనూ వాటిలాగే తేలికగా రాసేయవచ్చు అన్న అపోహలో ఉంటారు. దీనివల్ల చేయవలసినంత శ్రమ చేయరు.
నిజానికి అకడమిక్‌ పరీక్షలు వేరు, పోటీ పరీక్షలు వేరు. ఉత్తర, దక్షిణ ధ్రువాల వంటి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గుర్తిచలేక చివరికి ఓటమినే ఆహ్వానిస్తారు.
3. పత్తాలేని ప్రణాళిక: పటిష్ఠ ప్రణాళికలేని విజయాలు కాగితాలకే పరితమవుతాయి. పోటీపరీక్షల్లో విజయం సాధించాలన్న ఆకాంక్ష ఉన్నా తగిన ప్రణాళిక ఉండదు. ఉదాహరణకు- తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురుకుల ఉపాధ్యాయుల ఎంపికకు ఉద్యోగ ప్రకటన వెలువరిస్తున్నా, లేక ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్ష నిర్వహిస్తున్నా ఇందుకో నిర్ణీత షెడ్యూల్‌ ఉంటుంది.
దీన్ని ఆధారం చేసుకుని పరీక్ష తేదీ వరకు ఉన్న వ్యవధి దృష్టిలో ఉంచుకుని దానిని ఎలా చేరాలన్న ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకోలేకపోతే విజయం దూరంగానే ఉంటుందనడంలో సందేహం లేదు.
4. కార్యాచరణ అమలు చేయకపోవటం: సివిల్స్‌ వంటి జాతీయస్థాయి పోటీ ఉన్న పరీక్షతోసహా కొంతమందికి ప్రణాళికకు కట్టుబడి ఉండలేకపోవడం, దాన్ని చిత్తశుద్ధితో అమలు చేయకపోవడంలో విఫలమవుతుంటారు.
కార్యాచరణ ప్రారంభంలో కొంత ఉత్సాహం ఉన్నా.. దీర్ఘకాలం దానిని నిలుపుకోలేకపోవడం వల్ల చివరికి సరైన పోటీ ఇవ్వలేరు. కొన్నిసార్లు సన్నద్ధతలో ఎదురయ్యే అవరోధాలను సమర్థంగా ఎదుర్కోలేరు. అసమంజసమైన ప్రణాళికలు రూపొందించుకోవడం, అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వల్ల కూడా ఓటమిని తప్పించుకోలేరు.
5. పోటీ పరీక్షల దృక్కోణం లోపించడం: పోటీ పరీక్షలు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను డిమాండ్‌ చేస్తాయి. రాయబోయే పోటీ పరీక్ష సిలబస్‌ ఏంటి? దాని నుంచి ఆశించే నైపుణ్యాలు ఏమిటన్న మౌలికప్రశ్నలను వేసుకుని పరీక్షలకు ఉద్యుక్తులు కావాలి. సన్నద్ధత దశ ఆద్యంతం అదే కోణంతో అధ్యయనం చేయాలి. పోటీపరీక్ష కోణాన్ని ఏ సబ్జెక్టు విషయంలోనూ విడువకూడదు.
అయితే చాలామంది ఈ విషయంలో విఫలమవుతుంటారు. అసలు ఈ కోణాన్ని గుర్తించకపోవడమో లేదా మధ్యలో ఆ ట్రాక్‌ నుంచి పక్కకు వచ్చేయడమో జరుగుతుంది. ఫలితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరలేరు.
6. పుస్తకాల ఎంపికలో లోపం: మంచి మెటీరియల్‌, పుస్తకాల ఎంపికతోనే పోటీపరీక్షల విజయయాత్ర ప్రారంభమవుతుంది. సిలబస్‌ స్వరూపం ఆధారంగా, అభ్యర్థి విద్యా నేపథ్యం ప్రాతిపదికగా నిర్దేశిత పుస్తకాలు, మెటీరియల్‌ ఎంపిక జరగాలి.
పోటీపరీక్షలకు సంబంధించి ప్రాథమిక పుస్తకాలు, రిఫరెన్స్‌ మెటీరియల్‌గా వర్గీకరించి ఎంపిక చేసుకోవడం, ఏ సమయానికి ఏది చదవాలన్న ప్రణాళిక ఎప్పటికప్పుడు చేసుకుంటూ, ఆయా మెటీరియళ్లను అనుసరించడం ద్వారా పోటీపరీక్షార్థి విజయానికి చేరువ కావాలి. అయితే ఇందుకు భిన్నంగా చాలామంది పుస్తకాలు, మెటీరియళ్ల ఎంపికలో పొరపాట్లు చేయడంతో అపజయం అనివార్యమవుతుంది.
7. మూల్యాంకీకరణకు విముఖం: పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారిలో ఎక్కువమంది తమ సన్నద్ధతను ఏ దశలోనూ పరీక్షించుకోరు. మూడు నెలలు చదివినా, ఆరు నెలలు చదివినా ఏకంగా నియామక సంస్థ నిర్వహించే పరీక్షకే హాజరవుతారు. పరీక్ష హాలులోనే తొలిసారి తాము చదివిన దాన్ని పరీక్షించుకుంటారు.
నిజానికి చదివినదాన్ని పునరుత్పత్తి చేయడమనే ప్రక్రియలో మధ్యలో మరో దశ ఉంటుంది. ఈ దశలోనే జ్ఞాపకం లేనివి బయటపడతాయి. ఎంత చదివినా అభ్యర్థి ధారణ శక్తిని బట్టి కొన్ని అంశాలు జ్ఞాపకం ఉండవు. దీన్ని పరీక్షహాలు బయటే, పరీక్షకంటే ముందే పరీక్షించుకుని ఉంటే పరాజయ ఉపద్రవం తప్పుతుంది. కానీ చాలామంది ఇందుకు ఇష్టపడరు.
8. సమీక్షకు దూరం: రాయబోయే పోటీపరీక్షకు సంబంధించి చదివినదాన్ని పరీక్షించుకోవడం ద్వారా సబ్జెక్టుల రీత్యా ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో బహిర్గతం అవుతాయి. పరీక్ష పేపర్లు అన్నింటినీ ఇలా పరీక్షించుకోవడం ద్వారా పరీక్ష కంటే ముందే ఎక్కడెక్కడ సమస్యలు ఎదురవుతున్నాయో కూడా స్పష్టమవుతుంది. దీన్నే సమీక్షించుకోవడంగా పరిగణిస్తారు.
పోటీ పరీక్షల ప్రస్థానంలో కనీసం రెండు దశల్లో ఈ ప్రక్రియ జరగాలి. దీని ఆధారంగా సన్నద్ధతలో పునశ్చరణ ఎక్కడెక్కడ చేసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. కానీ ఎక్కువమంది అభ్యర్థులు ఈ ప్రక్రియను నివారించడం వల్ల ప్రతికూల ఫలితమే శరణ్యమవుతోంది.
9. పక్కదారి పట్టడం: విజయసాధకుడైన పోటీ పరీక్షార్థి తనకు ఆసక్తిగల పోటీపరీక్షను నిర్ణయించుకునే దశలోనే తగిన సమయం తీసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. తరువాత ఇక పరీక్ష పూర్తయ్యేంతవరకూ దానికే కట్టుబడి ఉంటాడు. కానీ అత్యధిక అభ్యర్థులు మధ్యలో చాపల్యానికి గురవుతున్నారు.
ఉదాహరణకు- సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా నిర్దేశించుకున్న అభ్యర్థి మధ్యలో సంబంధం లేని ఇతర పరీక్షలకు సిద్ధమవుతూ పక్కదారి పట్టడం ద్వారా ఏ లక్ష్యాన్నీ చేరలేకపోతున్నాడు.
10. చివరివరకూ స్ఫూర్తి కొరవడటం: పోటీపరీక్షల ప్రస్థానం సుదీర్ఘంగా ఉంటుంది. సివిల్స్‌ నుంచి రాష్ట్ర స్థాయి సర్వీసుల పరీక్షల వరకు కనీసం మూడు, నాలుగేళ్ల సమయం వెచ్చిస్తేనేకానీ ఫలితం అందదు. ఈ ప్రయాణంలో తొలి అడుగు నుంచి ఫలితం అందుకునే వరకూ ఒకేరకమైన ఉత్తేజాన్ని నిలుపుకోగలిగితేనే లక్ష్యాన్ని అందుకోగలరు.
కానీ చాలామందికి తొలిరోజుల్లో ఉన్న స్ఫూర్తి ఆపై కొరవడుతుంది. సహచరుల వ్యాఖ్యలు, సొంత అపజయాలు, మధ్యలో తారసపడే ఇతర పోటీ పరీక్షలు, తనపై తనకు నమ్మకం సన్నగిల్లడం వంటి కారణాలరీత్యా స్ఫూర్తిజ్యోతి మసకబారుతుంది. నిజానికి ఇది సహజం. కానీ ఎప్పటికప్పుడు ఆ జ్వాల ప్రజ్వరిల్లేలా చేసుకోవాలి. అదీ విజయయాత్రలో భాగమే.
కానీ మెజారిటీ అభ్యర్థులు ఈ విషయంలో వెనుకబడటం వల్ల ముందున్న ఉత్సాహం తగ్గిపోతుంది. దీంతో గమ్యంవైపు చేసే పరుగులో వేగం మందగిస్తుంది. క్రమేపీ చల్లబడిపోతుంది. పోటీపరీక్షల్లో ఎక్కువమంది పరాజయాలకూ, కొద్దిమంది విజయాలకూ ఇదే కారణం.
పోటీపరీక్షలు రాసే అభ్యర్థులు చాలామందికి ఈ పది మెట్లలో ఎక్కడోచోట పొరపాటు చేసి, ఓటమిని చవిచూస్తుంటారు. పూర్తిగా పోటీపరీక్షలకు కొత్త అభ్యర్థులైతే పొరపాట్లు చేసే అవకాశం ఉన్న దశలు ఇవే. అయితే అపజయాలు జీవితంలో భాగమైనట్టే పోటీపరీక్షల్లోనూ అనివార్యం.
అసలు ఓటమి ఎదురు కాకపోతే నేర్చుకోవాల్సిన అవసరమే రాదు. నేర్చుకునే అవసరమే రాకపోతే మార్పుకు అవకాశమే లేదు. ఇతర రంగాల్లోలా పోటీ పరీక్షల్లోనూ పరాజయం అనేది మళ్లీ కొత్తగా ప్రారంభించడానికి ఒక అవకాశం. అయితే ఈసారి మరింత తెలివిగా ప్రయత్నం మొదలుకావాలి. అప్పుడు ఓటమీ గెలుపు పాఠమే!
పోటీ పరీక్షలు కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను డిమాండ్‌ చేస్తాయి. రాయబోయే పోటీ పరీక్ష సిలబస్‌ ఏంటి? దాని నుంచి ఆశించే నైపుణ్యాలు ఏమిటన్న మౌలికప్రశ్నలను వేసుకుని పరీక్షలకు ఉద్యుక్తులు కావాలి. సన్నద్ధత దశ ఆద్యంతం అదే కోణంతో అధ్యయనం చేయాలి. పోటీపరీక్ష కోణాన్ని ఏ సబ్జెక్టు విషయంలోనూ విడువకూడదు.

ప్రత్యర్థులు లేని మైండ్‌గేమ్‌
క్రీడా మైదానంలో ఉండేవి ఆటలు అయితే మానసిక వేదికపై జరిగేవి మైండ్‌ గేమ్స్‌. ప్రత్యర్థులపై ఆధిపత్యం కోసం మానసికంగా వారిని చిత్తు చేయడం కోసం జరిగేదే మైండ్‌గేమ్‌. పోటీపరీక్షలు కూడా మైండ్‌గేమ్‌లో భాగం. అయితే ఇందులో ప్రత్యక్షంగా ప్రత్యర్థులుండరు. వేర్వేరు సొంత మానసిక స్థితులతో అభ్యర్థులకు అంతర్మథనం జరుగుతుంటుంది. ఇది మూడు దశల్లో ఉంటుంది.
తొలి దశ: ఈ దశలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలు, వాటి ద్వారా వచ్చే హోదా, వేతనం, సామాజిక గుర్తింపు యువతీ యువకులను ఉత్తేజపరుస్తాయి. మరోపక్క వివిధ పరీక్షల్లో టాపర్ల విజయాలు స్ఫూర్తిని కలిగిస్తాయి. తమలాగే సాధారణ తెలివితేటలు, సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారే విజయాలు సాధించినందువల్ల తామూ ఆ తరహా విజయాన్ని అందుకోగలమన్న ఆత్మవిశ్వాసం కొత్త లక్ష్యాలకు పురిగొల్పుతుంది. ఇది సానుకూల మానసికస్థితిని ప్రేరేపించే దశ.
మలి దశ: ఉత్సాహపూరిత వాతావరణంలో పోటీపరీక్షల కదన రంగంలోని దూకి సన్నద్ధమయ్యే దశ. పోటీపరీక్ష సిలబస్‌, పరీక్షవిధానం, రిఫరెన్స్‌ పుస్తకాలు, కాలవ్యవధి, ఎదురయ్యే పోటీ తదితర అంశాలపైనా సన్నద్ధత కొంత ప్రారంభించడంతో అందులోని వాస్తవికత అవగాహనకు వస్తుంది. కష్టనష్టాలు అర్థమవుతాయి. అప్పటివరకూ ఉత్తేజపూరితంగా ఉన్న మెదడుకు ప్రతికూల సంకేతాలు చేరతాయి. దాంతో ఇంత కష్టమైన గమ్యాన్ని అసలు చేరగలమా అన్న సందేహాలు మొదలవుతాయి. మెదడు ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తుంటుంది. ఈ దశలోనే చాలామంది పోటీ నుంచి నిష్క్రమిస్తారు. అంటే సదరు పోటీపరీక్షలకు దరఖాస్తుదారులు సంఖ్యాపరంగా ఉంటారు కానీ, పోటీకి మాత్రం స్వస్తి చెబుతారు.
ఫలప్రద దశ: మలిదశలోని ప్రతికూల మానసిక స్థితిని అధిగమించి పోరాటానికి సిద్ధపడే దశ ఇది. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే పరీక్షను బాగా రాసి ఫలితాన్ని పరీక్షించుకోవాలనే మానసిక స్థితి ఇది. మెదడుకు ఈ విధమైన సంకేతాలు అందగానే ఇక అన్ని సమస్యలకూ పరిష్కారాలు కన్పిస్తుంటాయి. కొన్నింటికి పరిష్కారాలు కనిపించకపోయినా, పోరాటపటిమ ఏర్పడుతుంది. ఇలా అంతిమ పోరుకు సిద్ధపడినవారి నుంచే విజేతలు అవతరిస్తారు.

Back..

Posted on 28-11-2016