Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
 
పరీక్షల వేళ... ఆప్‌లతో భళా !

విద్యార్థులకు ఎంతో కీలకమైన పరీక్షల కాలం వచ్చేసింది. ఇన్నాళ్లుగా చదివి నేర్చుకున్న పాఠాలు, విషయాల్ని పేపరు మీద పెట్టి మంచి మార్కులు సంపాదించే సమయమిది. ఎంత కాదనుకున్నా కాస్త ఒత్తిడి ఉంటుంది. అంతా చదివినా ఎక్కడో ఏదో వదిలేశామా అనిపించొచ్చు. పరీక్ష హాలుకు వెళ్తున్నప్పుడు ఫలానా పేరు అదేనా, టెక్స్ట్‌ బుక్‌లో ఏముంది? అనే అనుమానమూ వస్తుంది. ఫలానా ఫార్ములా కరెక్టా కాదా అనే ఆలోచనా వస్తుంది. పరీక్ష ఎలా రాస్తానో అనే ఆందోళనా కలుగుతుంది. ఇలాంటి అన్ని ఇబ్బందుల నుంచి తప్పించడానికి కొన్ని ఆప్స్‌, యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌, పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఆ ఆప్స్‌ సంగతేంటో ఓ లుక్కేసేయండి!

మోడల్‌ పేపర్ల కోసం...
పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు గత ప్రశ్నా పత్రాలను చూసుకోవడం విద్యార్థులకు అలవాటు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఫార్మేట్‌ ఏంటీ అనేది దీని వల్ల తెలుస్తుంది. దీని కోసం పాత పేపర్లను ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. గత పరీక్ష పత్రాలను ఆప్‌ రూపంలో అందిస్తోంది విక్రమ్‌. INTERMEDIATE EXAM PREPARATION ఆప్‌లో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంల మోడల్‌ పేపర్లు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విభాగాలకు సంబంధించి అన్ని సబ్జెక్ట్‌ల మోడల్‌ పేపర్లు ఇమేజ్‌ల రూపంలో ఇందులో ఉన్నాయి. అయితే వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవడం కుదరదు.
https://goo.gl/wIdIix

ఆంగ్లం కోసం...
ఇంగ్లిష్‌ పరీక్షకు సిద్ధమవుతున్నారా? అంతా చదువుకున్నారు కానీ గ్రామర్‌ విషయంలో ఇబ్బంది పడుతున్నారా? అయితే పరీక్షకు వెళ్లే ముందే ఒకసారి మీ జ్ఞానాన్ని బేరీజు వేసుకోండి. English Grammar Test ఆప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోని అందులో 1200 ఇంగ్లిష్‌ గ్రామర్‌ టాస్క్‌లు పూర్తి చేసేయండి. ఇందులో ఇంటర్మీడియట్‌, అప్పర్‌ ఇంటర్మీడియట్‌ వెర్షన్‌లున్నాయి. మీరు ఎంచుకున్న విభాగం ప్రకారం టాస్క్‌లుంటాయి. పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, టెన్సెస్‌ తదితర టాస్క్‌లుంటాయి. సులభంగా ఉండే ప్రశ్నలతో మొదలై లెవల్‌ పెరిగే కొద్దీ కష్టతరమైన ప్రశ్నలు వస్తాయి.
https://goo.glHt2DZs

ఫార్ములాల గని...
‘అంతా చదివేశాను కానీ... ఫార్ములాలే గుర్తుంటాయా లేదా అనేది అనుమానం' చాలామంది విద్యార్థుల నోటి నుంచి వచ్చే మాట ఇది. అందుకే పరీక్ష ముందు ఒకసారి ఫార్ములాలను చూసుకుంటే మంచిది అనుకుంటారు. అలాంటివాళ్ల కోసం Formula Deck ఆప్‌ ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఆప్‌లోకి వెళ్లాలంటే ముందుగా ప్రాథమిక సమాచారంతో రిజిస్టర్‌ అవ్వాలి. ఆ తర్వాత ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌... అంటూ కొన్ని విభాగాలు కనిపిస్తాయి. అందులోకి వెళ్తే అంశాల వారీగా ఆంగ్లంలో ఫార్ములాలు ఉంటాయి. ముఖ్యమైన ఫార్ములాలు అంటూ మరో జాబితా కూడా ఉంది.
https://goo.gl/ioMio2

ప్రశాంతత కోసం...
పరీక్షా పత్రం ఎలా ఉంటుందో, చదివినవన్నీ గుర్తుంటాయో లేదో, ఇన్విజిలేటర్‌ ఎలాంటివారు వస్తారో... పరీక్ష హాలుకు వెళ్లే ముందు విద్యార్థి మనసులో ఎక్కువగా తిరిగే ఆలోచనలు ఇవి. ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా కుదరని పని. అందుకే ఏదైనా శ్రావ్యమైన సంగీతం వింటే మంచిది. దీని కోసం రణగొణ ధ్వనులున్న పాటల కంటే ఏ సెలయేరు శబ్దమో, పైరు గాలి వీచిన శబ్దమో వింటే బాగుంటుంది. దీని కోసం Calmలాంటి కొన్ని ఆప్స్‌ ఉన్నాయి. హెడ్‌ఫోన్స్‌తో ఈ ఆప్‌లోని శబ్దాలు వింటే ఇంకా బాగుంటుంది.
https://goo.gl/2BGnSA

పదోతరగతి పుస్తకాలు...
‘అంతా సిద్ధం... కానీ ఒక చిన్న డౌట్‌ ఉంది. కానీ ఎలా... టెక్స్ట్‌ బుక్‌ ఇంట్లో మరచిపోయానే'... అనిపిస్తుంది చివర్లో. చాలామందికి ఇలాంటి పరిస్థితి వస్తుంటుంది. అలాంటప్పుడు మీ చేతిలో మొబైల్‌ ఉంటే టెక్స్ట్‌ బుక్‌ ఉన్నట్లే. Telangana SCERT Books ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓపెన్‌ చేసుకుంటే సరి. అందులో తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, హిందీ భాషల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు పుస్తకాల పీడీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి. వాటిని ఎంచక్కా డౌన్‌లోడ్‌ చేసుకొని అవసరమైన సమాచారం పొందొచ్చు. ఆ తర్వాత ఎరేజ్‌ చేసేయొచ్చు.
https://goo.gl/NT02EM

వీడియో పాఠాలు..
పుస్తకాలతో ఎంతని కుస్తీ పడతారు... కాసేపు సరదాగా వీడియోలు చూడండి. అయితే అవి సినిమాలో, షార్ట్‌ ఫిల్మ్‌లో కాదు. అవి కూడా చదువుకు సంబంధించినవే. మీరు గతంలో చదువుకున్న పాఠాలు, కొత్త పాఠాలను వీడియోల రూపంలో అందించడానికి కొన్ని ఆప్‌లు ఉన్నాయి. అందులో Khan Academy ఒకటి. ఇందులో ప్రాథమిక అంశాల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ పాఠాలు వీడియో రూపంలో ఉన్నాయి. మ్యాథ్స్‌, సైన్స్‌, ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌, కంప్యూటింగ్‌... ఇలా వివిధ విభాగాల్లో వీడియో పాఠాలు ఈ ఆప్‌ ద్వారా పొందొచ్చు.
https://goo.gl2twftf

ఇంకా ఎంత
సమయం విలువ పరీక్షల ముందు బాగా తెలుస్తుంది. ఆ తేదీ, సమయం దగ్గర పడేకొద్దీ ఇంకాస్త కంగారు మొదలవుతుంది. దాని కోసం ఏ రోజు ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి అంటూ లెక్కలేసుకుంటుంటారా? మీ మొబైల్‌లో Exam Countdown ఉంటే... ఈ పని అది చేస్తుంది. ఎంచక్కా మీరు మీ చదువు కొనసాగించొచ్చు. ఈ ఆప్‌ ఓపెన్‌ చేయగానే పైన ప్లస్‌ గుర్తు కనిపిస్తుంది. దాన్ని ఒత్తితే పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలు అడుగుతుంది. ఆ విషయాలు నమోదు చేస్తే నిర్ణీత పరీక్షకు ఇంకా ఎంత సమయం ఉందనేది కౌంట్‌డౌన్‌ రూపంలో కనిపిస్తుంది.
https://goo.gl/cV8J2u

పాఠాలు చూస్తారా
పదో తరగతి పాఠాలను వీడియోల రూపంలో అందించడానికి యూట్యూబ్‌లో చాలా ఛానళ్లు ఉన్నాయి. వాటిలో Pebbles AP & TS Board Syllabus ఒకటి. యూట్యూబ్‌ సెర్చ్‌లో ఈ ఛానల్‌ పేరు ఎంటర్‌ చేసి చూస్తే వీడియోలు కనిపిస్తాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పదో తరగతి పాఠాలను అందిస్తారు. ప్రతి వీడియోలో బోర్డు మీద విషయాన్ని వివరిస్తూ దానికి బొమ్మలు జోడించి వీడియోలు రూపొందించారు. Digital Teacher కూడా అలాంటిదే.

మానసికంగానూ...
పరీక్షలు అంటే పాఠాలన్నీ చదివేయడం, విషయాలు అవగాహన చేసుకోవడమే కాదు... మానసికంగానూ సిద్ధమవ్వాలి. పరీక్షల ఒత్తిడిని పెంచుకోకుండా ఉండటానికి మీ వంతుగా కృషి చేయండి. దీని కోసం కొన్ని ఆప్స్‌ ఉన్నాయి. అనవసరమైన ఒత్తిడిని తొలగించి, మెలకువలు, కిటుకులు అందిస్తాయి. అలాంటివాటిలో IMPACT INDIA ఒకటి. ఇందులో మెమొరీ టెక్నిక్స్‌, నెగోషియేషన్‌ స్కిల్స్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి అంశాలకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ ఆప్‌ నుంచి అనుబంధ యూట్యూబ్‌ పేజీకి వెళ్లి ఆ వీడియోలు వీక్షించవచ్చు.
https://goo.gl/pNOawa

అర్థాలు చూసుకోండి
పరీక్షలకు సిద్ధమవుతోన్న వేళ పదాల అర్థాల కోసం నిఘంటవు పేజీలు తిప్పడం అంత మంచి ఆలోచన కాదు. తక్కువ సమయంలో పదాల అర్థాలు తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ నిఘంటువులు, ఆప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Dictionary - Merriam-Webster ఒకటి. ఇందులో ఆంగ్ల పదాల అర్థాలు తెలుసుకోవడమే కాకుండా, వాటిని పలికే విధానం కూడా ఉంటుంది. దీంతోపాటు మాదిరి వాక్యాలు కూడా ఉంటాయి. అలాగే ఆ పదం స్పెల్లింగ్‌ తెలియకపోతే... దాన్ని మైక్‌ ద్వారా చెబితే దాన్ని గ్రహించి ఆ పదాన్ని వెతికి అందిస్తుంది.
https://goo.gl/ka5eqD

Back..

Posted on 02.3.2017